గీతాంజలి (అనువాదకవిత)
ఎంత అందంగా ఉంది
రవ్వలతో, రంగురంగుల రత్నాలతో
నైపుణ్య యుక్తియుక్తంగా చెక్కబడిన
నీ నక్షత్ర కర కంకణం!
కాని
రౌద్రారుణ సాయం సంధ్యలో తళుకొత్తే
శంపాలతల వజ్రధారల వంటి
గరుడ గరుత్తుల వంపులు సొంపారిన
నీ కరవాలమే కమనీయం సుమా!
అది -
మరణం వేసిన చివరి వేటుకు
కంపిస్తున్న వైవశ్య విషాదంలా
ఝళిపిస్తుంటుంది !
దగ్ధమౌతున్న శుద్ధాత్మ కీలలా
భయానక కాంతిలా జ్వలిస్తుంటుంది!
అందమైనదే
నీ రత్నఖచిత నక్షత్ర కర కంకణం
కాని,
భయదనిర్భర ఊహాతీత రత్న రమణీయంగా,
అనితర అద్భుత అరుణ ద్యుతిలా ప్రజ్వలిస్తున్నది
ఓ పర్జన్య ప్రభూ ! నీ ఖడ్గం !
- (నా అనువాద సంపుటి "రవీంద్ర గీత: గీతాంజలి" నుండి).