గవీశపాత్రో నగజార్తిహారి
- వి. రావు పోతాప్రగడ
ఈ పద్యములో తొలి అక్షర భేదంతో శివ,కేశవులను ఇరువురిని స్తుతియించిన పద్య సృష్టికర్త పటిమకు నా హృదయపూర్వక జోహార్లు.
కుమారతాతః శశిఖండమౌళి
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాది పరమేశ్వరో నః
గవీశపాత్రః : గవాం ఈశః గవీశః -- ఆవులకు ప్రభువైన వృషభం - వృషభం వాహనముగ కలవాడు -- సదాశివుడు.
నగజార్తిహారి: నగజ అంటే పార్వతీదేవి -- ఆవిడ ఆర్తి పోగొట్టేవాడు -- సాంబశివుడు.
కుమారతాతః : తాతః అనే సంస్కృత పదానికి అర్ధము -- తండ్రి -- కుమారస్వామికి తండ్రి -- శివుడు.
శశిఖండమౌళి : చంద్రవంకను శిరస్సున ధరించేవాడు – శంకరుడు.
లంకేశ సంపూజిత పాదపద్మః : లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడు - ఈశ్వరుడు
అనాదిః : ఆది లేనివాడు -- ఆదిమధ్యాంత రహితుడు అయినవాడు -- మహాదేవుడు
పరమేశ్వరః న పాయత్ : పరమేశ్వరుడు మనలను కాపాడుగాక.
అనాదిః | -- ఆది లేనిది (తొలి అక్షరం) |
(గ)వీశపాత్ర | -- విః -- పక్షి ఈశః వీశః -- పక్షులకు రాజు -- గరుడుడు వాహనముగ కలవాడు -- విష్ణువు. |
(న)గజార్తి హారి | -- గజేంద్ర హారి -- గజేంద్రమోక్షము చేసిన విష్ణువు. |
(కు)మారతాతః | -- మన్మధుని తండ్రి అయిన విష్ణువు. |
(శ)శిఖండమౌళి | -- నెమలి పింఛమును ధరించిన విష్ణువు. |
(లం)కేశ సంపూజిత పాదపద్మ | -- క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు -- బ్రహ్మ, రుద్రేందాదులు పూజించిన పాదపద్మములు కలవాడు -- విష్ణువు. |
(ప)రమేశ్వరః న పాయత్ | -- విష్ణువు మనలను కాపాడుగాక |