Menu Close
Galpika-pagetitle
శేషపత్రం - డా.కోడూరు ప్రభాకరరెడ్డి

English Original: 'The Last Leaf' O Henry (WilliamSydneyPorter)
తెనుగుసేత: డా.కోడూరు ప్రభాకరరెడ్డి

వాషింగ్టన్ నగరంలోని పడమటి దిక్కున చిన్న ప్రాంతంలో వీధులన్నీ ఎంతో రద్దీగా, గందరగోళంగా వున్నాయి. ఆ వీధులు ఎన్నో దారులుగా చీలిపోతున్నాయి. అవి తిరిగి చిన్న చిన్న స్థలాలుగా విడగొట్ట బడ్డాయి. ఒకే వీధి నేరుగా ఒకటి, రెండు వీధులకు దారితీస్తున్నది. ఆ వీధి విషయంగా ఒక చిత్రకారుడు ఆసక్తికరమూ, ఆచరణీయమూ అయిన ప్రయోజనం కనుక్కున్నాడు. అదేమంటే-ఒకవేళ ఎవరైనా చిత్రకారుడు తన దగ్గర డబ్బులేక తాను కొన్న చిత్రసామగ్రికి అయిన అప్పు తీర్చలేక సంపాదన కోసం ఆ వీధికోస్తే అతనా వీధంతా తిరిగి తిరిగి ఒక్క సెంట్ కూడా సంపాదించలేక వెనక్కు వస్తాడు. ఆ నగరంలో ఆ ప్రాంతాన్ని గ్రీన్ విచ్ గ్రామమని పిలుస్తారు. ఆ పాత కాలపు గ్రీన్ విచ్ గ్రామానికి చిత్రకారులే మెండుగా వచ్చి చేరారు. ఎందుకంటే ఇక్కడ వాళ్లకు నచ్చిన, బాగా వెలుతురు-గాలి వచ్చే గదులు చాలా చవకగా అద్దెకు దొరికేవి.

స్యూ, జోన్సీలు మూడంతస్తుల భవనంలో పైఅంతస్తులో ఉండేవాళ్ళు. మైనె నుంచి స్యూ, కాలిఫోర్నియా నుంచి జోన్సీ వలసవచ్చి అక్కడ చేరారు. వాళ్ళు ఎనిమిదో వీధిలోని ఒక రెస్టారెంట్లో కలుసుకోవడం జరిగింది. వాళ్ళ మాటల సందర్భంలో ఇద్దరి చిత్రశైలి, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణల అభిరుచి ఒకటేనని తెలిసింది. అందువల్ల ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అది వసంతకాలంలో జరిగిన సంఘటన.

ఆ చలికాలంలో అతి చల్లని అపరిచిత వ్యక్తి గ్రీన్ విచ్ గ్రామంలో ప్రవేశించాడు. అతని నెవ్వరూ భౌతికంగా చూడలేరు. ఊరంతా కలదిరుగుతూ తన చల్లని వ్రేళ్ళతో ఇక్కడొక వ్యక్తిని, ఇంకోచోట మరో వ్యక్తిని తాకేవాడు. అతనొక చెడ్డ వ్యాధిని వ్యాపింపజేసేవాడు. డాక్టర్లు అతనికి 'న్యుమోనియా' అని పేరు పెట్టారు. నగరానికి తూర్పు దిక్కున చాలామందిని తాకుతూ ఎంతో వేగంగా పయనించాడు మిస్టర్ న్యుమోనియా. కానీ గ్రీన్ విచ్ ఇరుకు సందుల్లో అంత వేగంగా కదలలేక పోయాడు.

మిస్టర్ న్యుమోనియా గౌరవనీయ వృద్ధుడు కాడు. ఎందుకంటే గౌరవనీయుడైన వ్యక్తి అయితే ఎంతో బలహీనురాలైన జోన్సీ ని బాధించడు. కానీ మిస్టర్ న్యుమోనియా తన చల్లని వేళ్ళతో జోన్సీ ని ముట్టుకున్నాడు. పర్యవసానంగా ఆ యువతి చలనం లేకుండా మంచంపై పడుకొని తన కిటికీకి ఎదురుగావున్న గోడనే తదేకంగా చూస్తుండేది.

ఒకరోజు జోన్సీని పరీక్షించిన ప్రసిద్ధ వైద్యుడొకడు స్యూ ను బైటికి పిలిచి జోన్సీకి వినపడకుండా "జోన్సీ బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. కానీ బ్రతకడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. ఎవరైనా బ్రతకాలనుకోకుంటే నేను చేయగలిగినదేమీ లేదు. నీ ప్రియమైన స్నేహితురాలు తనకు బాగవుతుందనుకోవడం లేదు. ఆమె మనసును తీవ్రంగా బాధించే విషయం ఏదైనా వుందా?"

"జోన్సీ ఇటలీకి వెళ్లి 'బే ఆఫ్ నేపుల్స్' ను చిత్రించాలని ఎప్పుడూ అంటుండేది."

"చిత్రం విషయం కాదు, ఎవరైనా వ్యక్తి ఆమె మనసును చీకాకు పరుస్తున్నాడా?"

"పురుషుడా? లేదు డాక్టర్! పురుషు డెవ్వరూ జోన్సీ మనసులో లేడు."

"ఇదొక మానసిక బలహీనత. నాకు చేతనైనంతా చేస్తాను. రోగి తాను తప్పకుండా చనిపోతాననుకుంటే నా ప్రయత్నం సగం వ్యర్థమే! కొత్త చలి దుస్తులను గురించి నీ స్నేహితురాలిని అడిగి తెలుసుకో! భవిష్యత్తుపై ఆశ వుంటేనే ఆమె బ్రతికేదానికి అవకాశాలుంటాయ్."

డాక్టర్ వెళ్ళిపోయాక స్యూ డ్రాయింగ్ రూమ్ లో మనసుతీరా ఏడ్చి గుండె భారాన్ని కొంచెం తగ్గించుకొని జోన్సీ గదిలోకి నడిచింది. తన పెయింటింగ్స్ కొన్నింటిని వెంట తీసుకొని వెళ్లి కూనిరాగాలు తీయడం మొదలుపెట్టింది. జోన్సీ మౌనంగా ముఖం కిటికీవైపు తిప్పి మంచంపైన బలహీనంగా పడుకొని వుంది. జోన్సీ నిద్రపోయిందనుకొని కూనిరాగాలను ఆపేసింది స్యూ.

స్యూ తన పని చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంతలో జోన్సీ బలహీన స్వరం స్యూకు వినిపించింది. వెంటనే స్యూ జోన్సీ మంచం దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళు విప్పి కిటికీలో నుండి బైటికి చూస్తూ ఏదో లెక్కపెడుతుండడం చూసింది. మీద మీద 12,11,10,9,8,7 అంటూ లెక్కిస్తూ ఉంది జోన్సీ. స్యూ కిటికీ బైటికి చూసింది. లెక్కపెట్టడానికి అక్కడేముంది? దగ్గరలో ఎదురింటి ప్రక్కగోడ ఉంది. ఆ గోడకు కిటికీ లేదు. ఒక పాత చెట్టు గోడకు అడ్డంగా పెరిగింది. శీతకాలపు చలిగాలి దాన్నప్పుడే తాకింది. దాని గుబురు కొమ్మల్లోని ఆకులు దాదాపు అన్నీ రాలి పోయాయి.

"ఏమయ్యింది జోన్సీ?"స్యూ అడిగింది.

"ఆరు" అంది జోన్సీ మంద్రస్వరంతో.

"ఇప్పుడవి వేగంగా రాలిపోతున్నాయి. మూడు రోజుల క్రిందట వందదాకా వుండేవి. వాటిని ఎంచలేక నాకు తలనొప్పి వచ్చేది. ఇక ఇప్పుడు చాలా సులభం. అదిగో మళ్లీ ఒకటి రాలింది. ఇప్పుడున్నవి అయిదే!"

"అయిదా? అవేమిటి? నాకు చెప్పవా జోన్సీ!" అనునయంగాఅడిగింది స్యూ.

"చెట్టుమీది ఆకులు. ఆఖరి ఆకు రాలి పోగానే నేను కూడా రాలిపోవాలి. నాకా విషయం మూడురోజుల ముందే తెలుసు. డాక్టర్ నీకు చెప్పలేదా?" అంది జోన్సీ.

"అలాంటి సంగతి నేను వినలేదు ఇంతవరకెప్పుడూ. అటువంటి భావనకు అర్థమే లేదు. ముసలిదైన చెట్టుకు, నీకు ఏం సంబంధముంటుంది? నువ్వు కోలుకోవడానికి, దానికి లంకె ఏమిటి? ఆ చెట్టును నువ్వెంతగానో ప్రేమించేదానివి. పిచ్చిదానిలా మాట్లాడకు! నువ్వు కోలుకునే అవకాశాలున్నాయన్నాడు డాక్టర్. ఆ సంగతి ఈ రోజు ప్రొద్దుటే చెప్పాడు. ఇక ఇప్పుడింత ఎంగిలిపడు, ఆ తర్వాత నా పని మొదలుపెడతాను.

నా పెయింటింగ్ ను అమ్మి నీకు బలం కోసం తినడానికి ఏదైనా కొనుక్కుని వస్తాను." అంది స్యూ.

"నువ్వు నాకేమీకొనుక్కురానక్కరలేదు. అదిగో మళ్లీ ఒకటి రాలిపడింది. తినడానికి నాకేమీ వద్దు. ఇప్పుడు నాలుగాకులే చెట్టుకున్నాయి.ఈ రాత్రికంతా ఆఖరి ఆకు రాలిపోతుంది. నేనుకూడా వెళ్లిపోతాను." అంది జోన్సీ కిటికీలోంచి గోడవైపు చూస్తూ.

"జోన్సీ! కళ్ళు మూసుకుంటానని నాకు మాటివ్వు. నాపని పూర్తయినంతవరకు నువ్వు కిటికీలోంచి బైటికి చూడనని వాగ్దానం చెయ్! రేపటికంతా నేనొక పెయింటింగ్ పూర్తిచేయాలి. పెయింటింగ్ గీయడానికి వెలుతురుండాలి గదా? అందుకే కిటికీని మూసివెయ్యలేను." అంది స్యూ.

"మరో గదిలో నీ పని చేసుకోలేవా?" ప్రశాంతంగా అడిగింది జోన్సీ.

"నువ్వా ఆకులను అదేపనిగా చూస్తూ ఉండడం నాకిష్టం లేదు. అందుకే నేను నీ దగ్గరే వుంటున్నాను." అంది స్యూ.

"నీ పని పూర్తయ్యాక నాకు చెప్పు. ఎందుకంటే నేనా ఆఖరి ఆకు రాలిపోవడం చూడాలి. దానికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ విషయమై నేనెంతో ఆలోచించాను. ఆ ఆకుల్లో ఒకదానిలాగే నేనూ రాలిపోవాలనుకుంటున్నాను." అని జోన్సీ కళ్ళు మూసుకొని జీవచ్ఛవంలా పడుకొంది.

"నిద్రపోవటానికి ప్రయత్నం చెయ్! బెర్మన్ ను ఇక్కడికి పిలవాలి. నేను గీసే చిత్రం అచ్చం బెర్మన్ లాగే వుండాలి. ఒక్క నిముషంలో వచ్చేస్తా! నేను వచ్చేటంతవరకు కళ్ళు మూసుకొని పడుకో! ముఖ్యంగా ఆ కిటికీలోంచి చెట్టు ఆకులను అసలే చూడొద్దు." అంది స్యూ కఠినంగా.

అరవయ్యేళ్ళకు పైబడిన బెర్మన్ కూడా చిత్రాకారుడే! అదే భవనంలో మొదటి అంతస్తులో ఉంటాడు. చిత్రకారునిగా ఇంతవరకు ఏమీ సాధించలేకపోయాడు. నలభయ్యేళ్ళ నుండి పెయింటింగ్స్ వేస్తున్నా పేరు తెచ్చే ఒక్క చెప్పుకోదగ్గ చిత్రాన్ని కూడా గీయలేకపోయాడు. తనజీవితకాలంలో ఒక గొప్ప చిత్రకళాఖండాన్ని గీయాలని ఎప్పుడూ అంటుండేవాడు. కాని ఇంకా ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించలేదు. తానొక మోడల్ గా కూర్చొని ఇతర చిత్రకారులు గీయగా వారిచ్చే డబ్బుతో కొంచెం డబ్బు కూడబెట్టాడు. అతిగా మద్యం తాగేవాడు. ఇప్పటికీ తాను గీయబోయే కళాఖండం గురించే తరచు చెబుతుంటాడు. జోన్సీ,స్యూలకు సహాయపడడం తన విధ్యుక్తధర్మమని నమ్మేవాడు. వచ్చే వాసనబట్టి బెర్మన్ తన చీకటి గదిలో కూర్చొని ఒంటరిగా విస్కీ తాగుతున్నాడని స్యూ గ్రహించింది. జోన్సీ ఆరోగ్య పరిస్థితిని గురించి, కిటికీ నుంచీ ఎదురుగా కనపడే చెట్టు ఆకుల గురించి బెర్మన్ కు చెప్పింది స్యూ. జోన్సీ ఆరోగ్యం కూడా చివరికి ఆ ఆకుల లాగానే రోజు రోజుకు దిగజారిపోతున్నదని చెప్పింది. జీవితంపై జోన్సీ పట్టు తప్పిపోతున్నదని బాధపడింది స్యూ.

జోన్సీకి మనసులోవున్న అటువంటి భావనను ఖండిస్తూ గట్టిగా అరిచాడు బెర్మన్.

"ఏమిటి? ప్రపంచంలో అటువంటి పిచ్చివాళ్ళుంటారా? చెట్లపైన వున్న ఆకులు రాలిపోతే మనుష్యులు చచ్చిపోతారా? నేనింతవరకు అటువంటిది వినలేదు. నేను మీ గదికి వస్తే నువ్వు నా చిత్రం గీయడానికి ససేమిరా ఒప్పుకోను. అసలామెనా విధంగా ఆలోచించడానికి నువ్వెందుకు అనుమతించావ్? పాపం జోన్సీ!" తన బాధను వెలిబుచ్చారు బెర్మన్.

"జోన్సీ ఎంతో బలహీనంగా, అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆమె వ్యాధి ఆమెనలా ఆలోచింప జేస్తున్నది. బెర్మన్! నువ్వు రాకపోతే మానె, నువ్వొక మంచి మనిషివని నేననుకోను." అంది స్యూ నిష్ఠురంగా.

"ఇదీ ఒక స్త్రీ ఆలోచించే విధానం!" గట్టిగా అరిచాడు బెర్మన్.

"నేను రానని ఎవరన్నారు? పద నేనూ నీతో వస్తున్నాను. అరగంట నుండీ నేను నీతో వస్తాననే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జోన్సీ వంటి మంచి అమ్మాయి జబ్బుపడే స్థలం కాదిది. ఏదో ఒక రోజు నా కళాఖండాన్ని గీసి మనమంతా ఇక్కడినుండి వెళ్లిపోతాం. దేవునిమీద ఒట్టు!ఇది సత్యం!" అన్నాడు బెర్మన్ ఉద్వేగంగా.

వాళ్లిద్దరూ పైకి వెళ్ళేటప్పటికి జోన్సీ నిద్రపోతోంది. కిటికీ రెక్కలు మూసి బెర్మన్ ను ముందరి గదిలోకి తీసుకు వెళ్ళింది స్యూ. ఆ గదిలోనుంచి కనిపించే చెట్టును దాని ఆకులను భయం భయంగా చూసారిద్దరూ. మాటలుడిగిపోయి ఒక్క క్షణం ఒకరి ముఖాన్నొకరు చూస్తూ నిలుచున్నారు.

చలిగాలితో పాటు మంచు కూడా ఉధృతంగా కురుస్తోందప్పుడు. బెర్మన్ నిశ్చలంగా కూర్చొని వుంటే స్యూ అతని చిత్రాన్ని గీయడం మొదలు పెట్టింది. దాదాపు రాత్రంతా అలా పనిచేస్తూనే వుంది స్యూ.

ఒకగంట నిద్రపొయ్యాక ఉదయం జోన్సీ పక్క దగ్గరికి వెళ్ళింది స్యూ. జోన్సీ తన కళ్ళను విప్పార్చి కిటికీ వైపు చూస్తూ "నేను చూడాలి!" అని స్యూను అడిగింది. కిటికీ తెరను ప్రక్కకు జరిపింది స్యూ. రాత్రంతా నిర్విరామంగా వచ్చిన గాలి, వానలకు ఒక ఆకు చెక్కుచెదరకుండా ఎదురుగా గోడపైన కనిపించింది. అదే ఆ చెట్టుకున్న ఒకే ఒక్క ఆకు. అదింకా ముదురు ఆకుపచ్చ రంగుతో కొమ్మకు అంటుకొని వుంది. కానీ ఆకు చివర లేతపసుపు రంగుకు మారుతూ ఏ నిముషంలోనైనా నేల రాలిపోయే తన స్థితిని తెలుపుతూ వుంది. నేలకు దాదాపు 20 అడుగుల ఎత్తులో ఒక కొమ్మకు వ్రేలాడుతూ ఉందా ఆకు.

"ఇదే ఆఖరి ఆకు. పోయినరాత్రి గాలి, వానకు తప్పకుండా రాలిపోయి ఉండ వల్సింది. అది ఈ రోజు తప్పకుండా రాలిపోతుంది. అదే సమయానికి నేను కూడా చచ్చిపోతాను." నిర్వేదంగా స్యూతో అంది జోన్సీ.

"జోన్సీ! నా ప్రియమైన జోన్సీ! నీ గురించి కాకపోతే కనీసం నా గురించైనా ఆలోచించు. నేనేం చేయాలి?"అంది దీనంగా స్యూ.

ఆత్మ అంతిమయాత్రకు తయారవుతుండడమనేది ఒక ఏకాంత స్థితి. స్నేహబంధం, ప్రాపంచికబంధం-ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగిపోతున్నాయి.

ఆ పగలు బరువుగా గడిచి పోయింది. చీకటి క్రమ్ముకొంటున్నా గోడ మీది ఆ ఆకును వాళ్ళు స్పష్టంగా చూడగలుగుతున్నారు. రాత్రి కాగానే ఉత్తరపు గాలి ఉధృతంగా వీయడం మొదలయ్యింది. వర్షం కిటికీ రెక్కలను బలంగా తాకుతూ వుంది. మరుసటి రోజు ఉదయం వెలుతురు రాగానే తనను కిటికీలోనుండి బైటికి చూడనివ్వమని స్యూను కోరింది జోన్సీ. ఆ ఆకు చెక్కుచెదరకుండా ఇంకా అక్కడే గోడమీద వుంది. చాలాసేపు ఏకాగ్రతతో చూసి తన కోసం వండుతున్న స్యూను పిలిచింది జోన్సీ.

"నేను చాలా చెడ్డమ్మాయిని స్యూ. నేనెంత భయంకరమైన స్థితిలో ఉన్నానో తెలియజేయడానికి ఏదో అదృశ్యశక్తి ఆ ఆకును అక్కడ నిలబెట్టింది. చచ్చిపోవాలనుకోవడం ఘోరమైన తప్పు. ఇప్పటి నుండి నే నేదైనా తినడానికి ప్రయత్నిస్తాను. కానీ దానికంటే ముందు నాకొక అద్దం తెచ్చివ్వు-నా శరీరస్థితి ఎలావుందో చూసుకుంటాను. ఆ తర్వాత నేను లేచి కూర్చొని నీ వంటల కార్యక్రమాన్ని చూస్తుంటాను." అని మళ్లీ ఒక గంట తర్వాత-

"స్యూ! ఏదోఒకరోజు 'Bay of Naples' చిత్రిస్తాననే ఆశ, నమ్మకం నాకుంది." ఉల్లాసంగా అంది జోన్సీ.

ఆ రోజు మధ్యాహ్నం జోన్సీని డాక్టర్ పరీక్షించాడు. డాక్టర్ తో మాట్లాడడానికి గది బైటికి వచ్చింది స్యూ.

"అవకాశాలు మెరుగైనాయి!"అన్నాడు డాక్టర్ కంపిస్తున్న పల్చని స్యూ చేతిని పట్టుకొని.

"బలమైన ఆహారమిస్తూ జోన్సీని భద్రంగా చూసుకో, తొందరలోనే ఆమె ఆరోగ్యవంతురాలవుతుంది. మరి ఇప్పుడు ఈ భవనంలో మరో రోగిని చూడాలి. అతని పేరు బెర్మన్. అతను కూడా చిత్రకారుడే అనుకుంటాను. వయసుమళ్ళిన మైక్(బెర్మన్) చాలా బలహీనంగా ఉన్నాడు. దానికి తోడు పెద్ద వయసు, తీవ్రమైన జబ్బుతో బాధ పడుతున్నాడు. బ్రతికే అవకాశం తక్కువ. అతని వ్యాధి కూడా న్యుమోనియానే! అయినా అతన్ని హాస్పిటల్ కు ఈ రోజు తీసుకుపోవాలి. అతని చివరి ఘడియలు ఎంత సులభంగా వుండాలో అంత సులభంగా వుండేటట్లు చూద్దాం!"

'జోన్సీ విషయంలో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. స్యూ నువ్వు దాన్ని సాధించావ్! ఇకమీదట జోన్సీ ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా వుండాలంతే!" మరుసటి రోజు డాక్టర్ అన్నాడు. ఆ మధ్యాహ్నం స్యూ మంచం దగ్గరకొచ్చి జోన్సీ భుజం చుట్టూచెయ్యేసి,
“నీకో సంగతి చెప్పాలి. ఈ రోజు హాస్పిటల్ లో బెర్మన్ న్యూమోనియాతో చనిపోయాడు. రెండు రోజులు మాత్రమే జబ్బుతో బాధపడ్డాడు. మొదటి రోజు ఉదయం బెర్మన్ ను అతని గదిలో ఎవరో చూసారు. అప్పుడు బెర్మన్ బాధపడుతూ నిస్సహాయస్థితిలో వున్నాడు. అతని బూట్లు, దుస్తులు తడిగా ఐస్ లాగా చల్లగా ఉన్నాయి. వాళ్ళు మరికొన్ని వస్తువులు కూడా చూసారక్కడ. బైటికి తీసుకొనిపోయిన అతని లైట్, పెయింట్ చేయడానికి అవసరమైన కుంచెలు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులుకూడా వున్నాయి. మరి-కిటికీనుండి ఎదురుగా ఉన్న గోడపైనున్న ఆ ఆఖరి పత్రాన్ని(శేషపత్రాన్ని) చూడు! ఎంత పెద్ద గాలి వీచినా ఆ ఆకు ఎందుకు కదల్లేదో నీకు వింతగా అనిపించడం లేదూ? నా ప్రియ నేస్తమా, జోన్సీ! అది బెర్మన్ కళాఖండం-శేషపత్రం. ఆ రోజు రాత్రంతా చలిలో, వానలో మేలుకొని దాన్ని చిత్రించాడు బెర్మన్" అంది స్యూ గద్గదికంగా.

చదువుల బాబు - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

అది యలమంచిలి పట్నంలో కొత్తగా వెలసిన సాయినగర్ కాలనీ. అందులో కొత్తగా కట్టిన ఇంటిపేరు శ్రీకృష్ణ సదనం. బయట చిన్న పెరటితోట. అందులో ఒకవారగా పచ్చని తివాచీలా పరచినట్లుగా పెంచిన పచ్చని గడ్డి. దాని మధ్యలో కూర్చున్న అరడజనుమంది అమ్మాయిలు. వారికి పాఠాలు చెబుతున్న ట్యూషన్ టీచర్ మహాలక్ష్మి.

ఆ ఇంటి యజమాని కూతురు దివ్య. పదో తరగతిలోకి వచ్చింది. ఈ ఆంగ్లమాధ్యమ చదువుల కాలంలో తెలుగు మీడియంలో చదువుతున్న అతి కొద్దిమంది విద్యార్థినుల్లో దివ్య కూడా ఉంది. వాళ్ళు చదివే బడిలో ఉన్న కొద్దిమంది తెలుగు మాధ్యమం పిల్లల్నీ మిగిలినవాళ్ళు రెండవతరగతి పౌరుల్లా చూస్తూంటారు. సమయం దొరికినప్పుడల్లా వెక్కిరిస్తూంటారు. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్తులకి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు బైతు.

దివ్య తండ్రి పేరు పద్మనాభ తంత్రి. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి నుండి వచ్చినవాడు. సామాన్యంగా ఉడుపి హోటళ్ళంటే శుచికీ శుభ్రతకీ పేరొందినవి. కాబట్టీ ఇక్కడివారు కూడా అగ్రవర్ణాల వారిని ఆకర్షించడం కోసం తమ హోటళ్ళకి ఉడిపి భోజన ఫలహార శాల అని పేరు పెట్టుకోవడం జరుగుతూంటుంది. ఎవరైనా ఉడుపి హోటల్ అని కాకుండా ఉడిపి హోటల్ అని పెట్టారంటే వారు ఉడుపివారు కాదని అర్థం. ఎందుకంటే "ఉడిపి" అనేది తెలుగువారి ఉచ్ఛారణ. కన్నడంవాళ్ళు "ఉడుపి" అని మాత్రమే పలుకుతారు.

పద్మనాభ తంత్రి, యలమంచిలిలో పేరొందిన ఉడుపి హోటల్ యజమాని. తనకి ఆశ్రయమిచ్చి అన్నం పెడుతున్న తెలుగు నేలన్నా తెలుగు భాషన్నా ఆయనకి ఎంతో అభిమానం. అందుకే కూతురికి ఇష్టం లేకపోయినా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నాడు. దివ్య తండ్రిలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ చెబుతారుగానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఎవరూ తెలుగు మాధ్యమంలో చదివించరు. అలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏమాత్రం సంకోచం లేకుండా,"మీ ప్రభుత్వమే ఇంగ్లీషు మీడియంని ఎంకరేజ్ చేస్తూంటే మమ్మల్ని మాత్రం ఏం చెయ్యమంటారు"అంటూ తప్పంతా ప్రభుత్వం మీదకి తోసేస్తారు.

"ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి..,"పద్యాన్ని వివరించి చెబుతోంది లక్ష్మీమేడమ్.

"గంగ ఆకాశాన్నించీ శివుడి తలమీదకీ అక్కడినుండి హిమాలయాలకీ భూమిమీదకీ ఇలా దిగజారుతూ వచ్చి చివరికి సముద్రంలో కలిసి పాతాళానికి చేరినట్లుగానే వివేక హీనులు కూడా పతనం కాక తప్పదు" అని చెప్పింది. అంతే కాదు, "ఇందులో వివేక భ్రష్ట సంపాతములని గంగతో పోల్చడం జరిగింది. ఎంత చక్కటి ఉపమానమో చూడండి"అంటూ మేడమ్ చెప్పుకుపోతూనే ఉంది.

ఆవిడ పాఠం ముందుకు వెళ్ళిపోతున్నా దివ్య ఆలోచనలు మాత్రం గంగ అన్న పదం దగ్గరే ఆగిపోయి దానిచుట్టూనే గిరికీలు కొడుతున్నాయి. గంగ అంటే పరమ పావనమైనది. అన్నిరకాల పాపాల్నీ హరించేది. అలాంటి గంగని వివేక భ్రష్టుల చేష్ఠలతో పోల్చడం సరికాదనిపించింది.

అంతలోనే అందరికీ ఉడుపి హోటల్నించీ టిఫిన్లు తీసుకువచ్చాడు విద్యాసాగర్.

విద్యాబోధనకి అంతరాయం కలిగించడానికి మనసొప్పక అక్కడే నిలబడి వినసాగాడు.

"మేడం వివేక భ్రష్ట సంపాతముల్ అంటే మూర్ఖులు చేసే అవివేకంతో కూడిన పనులు కనక, వాటిని గంగతో పోల్చడం తప్పు కదా"అని అడిగింది దివ్య.

మహాలక్ష్మీ మేడమ్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది. నిజమే. అది సరైన పోలిక కాదు. ఎందుకంటే గంగంటే అన్నిరకాల మలినాలనీ తొలగించేది. అన్ని పాపాలనూ కడిగివేసేది. పరమ పవిత్రమైనది. అలాంటి గంగని వివేక భ్రష్టులతో పోల్చడం తప్పే. మరీ అనుమానం తనకి ఇంతవరకూ ఎందుకు కలగలేదు? అయినా ఈ పద్యం కొత్తదీ కాదు ఎవరికీ తెలియందీ కాదు. మరి ఎంతో కాలంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ పద్యాన్ని ఉదహరిస్తున్నా ఎవరికీ ఎందుకురాలేదీ అనుమానం? అనే కొత్త అనుమానం మొలకెత్తింది మహాలక్ష్మీ మేడమ్ లో. దాంతో అనుమానాల మీద అనుమానాలు పుట్టుకొచ్చి మెదడంతా కంగాళీ అయిపోయింది. ఫలితంగా తడుముళ్ళాటలో పడిపోయిందావిడ.

దివ్యకి విషయం అర్థం అయిపోయింది. ఇంక మేడమ్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకుంది.

కానీ వెనక్కాలున్న విద్యాసాగర్ ఊరుకోవాలి కదా?

"మేడం దాన్ని గుణోపమ అంటారు. ఇందులో పోలికని కేవలం పతనం కావడం వరకే తీసుకోవాలి. మిగిలిన ఏ విషయంలోనూ గంగని మూర్ఖులతోగానీ మూర్ఖులని గంగతోగానీ పోల్చకూడదు. గుణోపమ మాత్రమే కాదు, చేసే పనులతో ఉపమించే కర్మోపమం, ప్రయోజనాన్ని మాత్రమే పోల్చే ప్రయోజనోపమం కూడా ఉపమాలంకారాలే."అని చెప్పాడు. అతనివంక తీక్షణంగా చూసింది మహాలక్ష్మీ మేడమ్. అబ్బురంగా చూసింది దివ్య. విచిత్రంగా చూశారు మిగిలిన విద్యార్థినులు.

"మధ్యలో నిన్నెవరు కల్పించుకోమన్నారు? నేను చెప్పేలోగా నువ్వే చెప్పేసి అమ్మాయిలముందు పెద్ద హీరో అయిపోదామనా? హోటల్లో సప్లై చేసేవాడివి సప్లైర్ గా ఉండాలి. అంతేగానీ ఇలా ప్రతి విషయంలోనూ కలగజేసుకుని గొప్పలకి పోకూడదు. ఇందుకే అంటారు 'చెప్పు కాలికీ కిరీటం తలకీ' అని. దీన్ని దానికి వేసుకున్నా దాన్ని దీనికి పెట్టుకున్నా ఇదిగో ఇలాగే ఉంటుంది"అంటూ మొదలుపెట్టి ముక్క చీవాట్లేయసాగింది.

ఆవిడ చెప్పిన సామెత మాటెలా ఉన్నా,"ఆడలేక మద్దెల ఓడు"అనే సామెత ఎవర్ని చూసి పుట్టిందో మాత్రం అక్కడున్న అందరికీ స్పష్టంగా అర్థం అయింది.

ఆవిడ విద్యాసాగర్ ని తిడుతున్నకొద్దీ దివ్యలో అతని పట్ల అభిమానం పెరగ సాగింది. గౌరవం కలగసాగింది.

అంతలోనే పద్మనాభ తంత్రి రావడం, ఆయన్ని చూసి మేడమ్ గారు మాట మార్చడం చకచకా జరిగిపోయాయి.

కానీ దివ్యలో మాత్రం విద్యాసాగర్ పట్ల ఏర్పడిన మంచి అభిప్రాయం మారలేదు సరికదా, మరింత బలపడింది.

విద్యాసాగర్ ఆ ఉడుపి హోటల్లో సప్లయర్ గా చేరి పదిరోజులైంది.

ఈ పదిరోజుల్లోనూ అతని మంచితనం, అమాయకత్వాల గురించి అందరికీ తెలిసిపోయింది. అతను అక్కడ పని చేసే అందరికీ ఓ ముడివీడని చిక్కు ప్రశ్నలా కనిపిస్తూంటాడు. అతనిలాంటి విచిత్రమైన ప్రశ్నల్లాంటి వాళ్ళు అడపాదడపా ఎదురుపడుతూనే ఉంటారుగానీ ఇతను మాత్రం ప్రశ్నలకే మహావీర ప్రశ్న. ఉన్నట్టుండి ఇంగ్లీషు మాట్లాడతాడు. ఉన్నట్లుండి సంస్కృతం శ్లోకాలు చెబుతాడు. అంతలోనే ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి ఏవేవో వెతుక్కుంటూ ఉంటాడు. ఇంటర్నెట్ అంటే అతని సహచరులకి కేవలం సినిమా థియేటర్ కి వెళ్ళకుండా లోపలే కూర్చోబెట్టుకుని బూతు సినిమాలు చూపించే ఉపకరణం మాత్రమే. అలాంటి బూతుల నెట్లోకి వెళ్ళి బొమ్మలు చూడ్డం మానేసి ఏవేవో పనికిమాలిన నీతుల్ని వెతుక్కుంటూ కూర్చోవడం అతనొక్కడికే చెల్లు.

అతని వెనక ఏదో కథ ఉందనీ అది ఎవరికీ చెప్పడనీ అందరికీ అర్థమైంది. అందుకే అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎవరూ అతన్ని గతం గురించి అడిగేవారుకాదు. అంతేకాదు, తమలాగా బీడీ సిగరెట్లు కాల్చమనో కల్లో సారాయో తాగమనో బలవంతం చేసేవారు కూడా కాదు.

అక్కడ పనిచేసే వంట మాస్టర్ చేతన్ పక్కా మందు మహారాజు. రోజూ అందరి బేటాడబ్బులూ పట్టుకుపోయేవాడు. సారా తాగొచ్చేవాడు. తాగింది తలకి ఎక్కుతున్నకొద్దీ ఎప్పటికప్పుడు కొత్తకొత్త జీవిత సత్యాలు కనిపెడుతూ ఉంటాడు. అయితే పడుకునేలోపు కనీసం ఒకసారయినా నాగమ్మని తలుచుకోకుండా ఉండడు. నాగమ్మంటే అతని జీవితంలోకి ప్రవేశించి అర్ధాంతరంగా వదిలేసి ఏమాత్రం జాలీ దయా చూపించకుండా తనకంటే ఎక్కువ సంపాదించే డ్రైవర్ తో లేచిపోయిన అతని భార్య.

ముందుగా నాగమ్మంత మంచిమనసున్నదీ మంచి నడవడిక ఉన్నదీ మంచి అందమున్నదీ ఈ భూమ్మీద లేదు అంటూ మొదలు పెట్టి ప్రతి పదానికి ముందో మంచీ వెనకో మంచీ తగిలించి తెగ పొగుడుతాడు. మరికాసేపటికి తాగింది తలకెక్కాక ప్రతి పదానికీ ముందొక దానెమ్మ వెనకొక దానమ్మ తగిలించి బండబూతులు తిడతాడు. అక్కడితో ఆగకుండా రాత్రంతా పిచ్చిపిచ్చిపాటలు పాడుతూ ఎవరికీ నిద్దర్లేకుండా చేస్తాడు. అందరి నిద్రలూ పూర్తిగా చెడగొట్టాక తన దారిన తను హాయిగా గురక పెడతాడు.

అతన్ని చూస్తే విద్యాసాగర్ కి చాలా విచిత్రంగా అనిపించేది. మందుకి ముందూ మందు తరవాతా మనుషుల ప్రవర్తనలో అంత తేడా ఎందుకొస్తుందో అర్థమయ్యేది కాదు. మందు దిగిపోయాక చేతన్ కి రాత్రి చేసిన గొడవంతా వివరించి, "అలా ఎందుకు ప్రవర్తిస్తారు మాస్టారూ" అని అడిగేవాడు విద్యాసాగర్. ఆఫ్ట్రాల్ వంటమాస్టర్ అయిన తనని నిజంగానే స్కూల్ మాస్టర్ని పిలిచినంత గౌరవంగా మాస్టారూ పిలిచేసరికి చేతన్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయేవాడు. ఆనక నవ్వుతూ,"అది తెలియాలంటే సాయంత్రం నువ్వుకూడా నాతో వచ్చి సాయంత్రం కాసింత మందెయ్యి పంతులూ" అనేవాడు.

అతను తనమీద అభిమానం పొంగుకొచ్చినప్పుడల్లా "పంతులూ" అని ఎందుకంటాడో విద్యాసాగర్ కి అర్థం అయ్యేది కాదు. చేతన్ మాత్రమే కాదు. మిగిలినవాళ్ళు కూడా తనని అప్పడప్పుడూ ముద్దుగా పంతులూ అనే పిలుస్తూంటారు. ఆ ముద్దుపేరు తనకే ఎందుకు పెట్టారో విద్యాసాగర్ కి అర్థమయ్యేది కాదు. అదే మాట చేతన్ ని అడిగితే, "అదంతేలే పంతులూ" అంటూ గుండెలదిరేలా నవ్వేవాడు. ప్రేమ పగిలేలా వీపుమీద చరిచేవాడు. ఈ మధ్యన తనని స్నేహితులు మాత్రమే కాదు, రోజూ వచ్చే అతిథులు కూడా పంతులూ అనే పిలుస్తున్నారు. ఇప్పుడక్కడ తన పుట్టు పేరుకంటే పెట్టు పేరే బాగా చెలామణీ అవుతోంది.
***
ప్రతి రోజూ స్కూలు వదిలాక దివ్య వచ్చి గల్లాపెట్టె దగ్గర కూర్చునేది. తను మాత్రం ఎప్పుడూ పంతులూ అని పిలవదు. అభిమానంగా విద్యాసాగర్ అనే పిలిచేది. అంత మంచి పేరు పెట్టినందుకు అప్పుడప్పుడూ అతని పెద్దల్ని అభినందించేది కూడా. అంతే కాదు, తన తండ్రి పద్మనాభ తంత్రికి తెలియకుండా పదిరూపాయలు బేటాగా ఇచ్చేది. విద్యాసాగర్ అది తీసుకోవడానికి మొహమాట పడుతూ, "డ్యూటీ దిగేముందు మీ నాన్నగారు మళ్ళీ బేటా ఇస్తారు" అని చెప్పేవాడు. అయినా ఆమె వినేది కాదు. ఆ బేటా డబ్బులు చెల్లువెయ్యడానికి ఏ పద్యమో సంధో సమాసమో చెప్పించుకు వినేది.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు చేతన్.

దివ్య అలా కాష్ కౌంటర్లోంచి దిగి అవతలకి వెళ్ళగానే ఇలా తయారైపోతాడు. ఏదో ఒక కహానీ వినిపించి ఆ పదీ లాక్కుపోతాడు. విద్యాసాగర్ సంపాదించుకున్న అదనం బేటా అలా చేతన్ మందులో కరిగిపోయేది.

ఎప్పట్లాగే ఆ రోజుకూడా పద్మనాభతంత్రి గల్లాపెట్టెదగ్గర కూర్చుని డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. అదే సమయంలో ఎవరో ఒకతను వచ్చాడు. ఇడ్లీ సాంబారు తెమ్మన్నాడు. విద్యాసాగర్ వెళ్ళి గిన్నెలో ఇడ్లీలు పెట్టి అందులో సాంబారు పోసి ఇడ్లీలమీద కొంచెం చట్నీ వేసి ఆ గిన్నెని ఒక పళ్ళెంలో పెట్టుకుని దాంట్లో రెండు చెంచాలు వేసుకుని తీసుకువచ్చి ఆ అతిథి ముందు పెట్టాడు. అతను సాంబారిడ్లీ రుచిని ఆస్వాదిస్తూ యథాలాపంగా వంటగదిలోకి చూశాడు. అతనికి అక్కడ వంట చేస్తున్న చేతన్ కనిపించాడు. అతన్ని చూడగానే ఆ అతిథి భృకుటి ముడిపడింది. తింటున్న ఫలహారం పళ్ళాన్ని అలాగే వదిలేసి పైకి లేచాడు. అతనంత విసురుగా లేవడం చూసి ఇడ్లీలోగానీ సాంబార్లోగానీ ఏ ఈగో పడిందేమోనని భయపడుతూ, "సార్ సార్" అని పిలిచాడు విద్యాసాగర్. కానీ ఆ అతిథి పట్టించుకోలేదు. తిన్నగా వెళ్ళి పద్మనాభతంత్రితో ఏదో చెప్పాడు.

తన తప్పేం లేదనీ ఆయన ఊరికే ఎక్కువ చేస్తున్నాడనీ సంజాయిషీ చెప్పడం కోసం గల్లాపెట్టె దగ్గరకి వెళ్ళాడు విద్యాసాగర్.

ఆ అతిథి విద్యాసాగర్ వైపు తీక్ష్ణంగా చూస్తూ, "నీ తప్పేం లేదులే పంతులూ, వెళ్ళి నీ పని చూసుకో" అంటూ పద్మనాభతంత్రి వైపుకి తిరిగాడు. అక్కడినుండీ విద్యాసాగర్ని పంపించెయ్యమన్నట్లుగా సైగ చేశాడు.

ఆయన విద్యాసాగర్ వైపు తిరిగి, "అక్కడ కస్టమర్ పిలుస్తున్నాడు వెళ్ళు." అన్నాడు.

దాంతో మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు విద్యాసాగర్.

అక్కడ ఏదో జరిగింది. అదేమిటో తనకి చెప్పడానికి ఆ అతిథి ఇష్టపడటం లేదు.

కానీ అతడి కదలికలూ కవళికల్నిబట్టి పద్మనాభతంత్రికి చేతన్ మీద ఏదో పితూరీ చెబుతున్నాడని మాత్రం స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు, ఆ అతిథిని గొడవ చెయ్యద్దంటూ పద్మనాభతంత్రి ప్రాధేయపడటం కూడా తెలుస్తోంది. కానీ విషయం ఏమిటన్నది మాత్రం అంతు పట్టడం లేదు. గల్లా పెట్టె దగ్గర ఏదో వాగ్వాదం జరుగుతోంది. చివరికి ఆ అతిథికి ఏదో మాట ఇచ్చాడు పద్మనాభతంత్రి. చివరికి ఆ అతిథి తిన్నదానికి డబ్బులివ్వకుండా విసాడించుకుంటూ వెళ్ళిపోయాడు. విద్యాసాగర్ కుతూహలాన్ని చంపుకోలేక పద్మనాభతంత్రి దగ్గరకి వెళ్ళాడు."ఏమైంది సార్?"అని అడిగాడు.

"ఏమైతే నీకెందుకు వెళ్ళి నీపని నువ్వు చూసుకో" అంటూ కసిరాడాయన.

బిక్కమొగం వేసుకుని వెనుదిరిగాడు విద్యాసాగర్.

పద్మనాభతంత్రి చాలా సహనపరుడు. తను ఒక్కొక్కసారి బిల్లు తప్పు చెప్పినా కోప్పడడు. అలాంటిది అకారణంగా కసురుకున్నాడంటే జరిగింది మామూలు విషయం కాదు.

తన పనిలో పడిపోయినా అప్పుడప్పుడూ ఆయన వైపు చూస్తూనే ఉన్నాడు విద్యాసాగర్. ఆయనలో ఏదో అసహనం కనిపిస్తోంది. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఆ రోజు ఏదో ఒక అనర్థం జరగక తప్పదనిపించింది.

ఆనాటి సాయంత్రం రెస్టుకి వెళ్ళి తిరిగివచ్చిన తరువాత చూస్తే వంట మాస్టర్ చేతన్ కనపడలేదు.
అడిగితే అతను పని మానేశాడని చెప్పారు. ఆ రాత్రి పడుకున్నప్పుడు ఓ సప్లయర్, రహస్యంగా విద్యాసాగర్ చెవిలో చెప్పాడు. "ఆ చేతన్ అంటరానివాడు. కులాన్ని దాచుకుని ఇక్కడ పనిలో చేరాడు. మనసార్ మంచోడు కాబట్టీ సరిపోయింది. ఇంకొకడెవరైనా అయితే చేతన్ పంబ రేపేసేవాళ్ళు. ఇందుకే అంటారు కులం తక్కువోళ్ళనీ కుర్రనాకొడుకుల్నీ నమ్మకూడదని. నీకివన్నీ అర్థం కావులే పంతులూ పడుకో"అన్నాడు.

విద్యాసాగర్ పడుకున్నాడన్నమాటేగానీ అర్థరాత్రి దాటేవరకూ నిద్రరాలేదు. అంతవరకూ అతని మెదడుని తొలిచేసింది ఒకే ఒక ప్రశ్న, "కులమంటే ఏమిటి?"

***

ఒకరోజు సాయంత్రం గల్లా పెట్టె దగ్గర కూర్చుని ఉన్న సమయంలో విద్యాసాగర్ని దగ్గరకి పిలిచింది దివ్య. యథాప్రకారం పదిరూపాయల అదనపు బేటా ఇచ్చింది. దాంతోబాటుగా మరో కాగితం కూడా ఇచ్చింది. దాన్ని చదివి మర్నాడు అభిప్రాయం చెప్పమంది. ఆమె అలా ఏ వ్యాసమో ప్రసంగ పాఠమో విద్యాసాగర్ చేతికిచ్చి చదివి అభిప్రాయం చెప్పమనడం కొత్త కాదు. కానీ దాన్ని ఇప్పుడు చదవద్దనీ రాత్రి అందరూ పడుకున్నాక చదవమనీ చెప్పడం మాత్రం కొత్త. దాన్ని ఎవరికీ చూపించవద్దనే నిబంధన విధించడం కొత్త. ఒకవేళ అది నచ్చకపోతే చింపి పారెయ్యమని చెప్పడం కొత్త. ఇన్ని కొత్తల్ని తనలో ఇముడ్చుకున్న ఆ కాగితాన్ని మడిచి భద్రంగా జేబులో పెట్టుకున్నాడు విద్యాసాగర్.

ఆ తరువాత పద్మనాభ తంత్రి రావడం దివ్య, కాష్ కౌంటర్ డ్యూటీ పూర్తిచేసుకుని వెళ్ళిపోవడం యథాప్రకారం జరిగిపోయాయి. కానీ చేతన్ రావడం ఆ పదిరూపాయలూ పట్టుకుపోవడం మాత్రం జరగలేదు. ఎప్పట్లా, "పంతులూ కావాలంటే ట్రైనింగిస్తాగానీ లైన్లో పెట్టు. తను నువ్వంటే పడి చస్తోంది. అందుకే అడక్కపోయినా బేటాలిస్తోంది" అంటూ తన తలకాయ తినడం జరగలేదు. కానీ అతను కల్లో కూడా ఊహించని ఒక సంఘటన జరిగింది.

అదే.., కొండలరావు ఆ ఉడుపి హోటల్లోకి ప్రవేశించడం.

కొండలరావంటే విద్యాసాగర్ కి స్వయానా మేనమామ. ఆయన కంట పడితే తనని తీసుకుపోకుండా వదలడు. తనున్న పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళడం అంటే ఆత్మహత్యాసదృశమేననేది అతని అమాయకత్వంతో కూడిన అభిప్రాయం. అందుకే కొండలరావు కంటపడకుండా ఉడుపి హోటల్ వెనుకవైపు నుండి బయట పడ్డాడు. అటునించటే రోడ్డుకి అడ్డం పడ్డాడు. అయినా సరే కొండలరావు తరుముకు వస్తున్నాడేమోననే భయం వెంటాడుతూనే ఉంది. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా ట్రంక్ రోడ్డు వెంటపడి బస్టాండుదాకా వచ్చాడు.

అక్కడ నిలబడ్డానికి కూడా ధైర్యం చాలలేదు. అందుకే తిన్నగా రైల్వేస్టేషన్ చేరాడు.

అతని అదృష్టం బాగుండి ఏదో రైలు రావడం, కనీసం అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసుకోకుండా ఎక్కెయ్యడం వరుసగా జరిగిపోయాయి.

అప్పుడు గుర్తొచ్చింది దివ్య ఇచ్చిన కాగితం. జేబు తడిమి చూసుకున్నాడు. భద్రంగా ఉంది.

జీవన సూత్రం -- కాసాల గౌరీ

సాయంత్రం ఐదు గంటలు అవుతోంది. సీతాకాలం అవటం వల్ల సూర్యుడు తొందరగా నే వెళ్ళిపోతున్నాడు. గదిలో కూర్చుని కిటికీ లోనుంచి సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు సుందరమ్మ గారు. ఆకుపచ్చని ఆకుల మధ్య ఎర్రగా సూర్యుడు చూడటానికి ముచ్చటగా ఉన్నాడు.

అయితే సుందరమ్మగారి మనసు ఆ సౌందర్యాన్ని చూసే స్థితిలో లేదు. హుఁ సూర్యుడు అయినా వాడి బాబు అయినా కాలం కలిసి రానప్పుడు చల్లబడి కిందకి పోవాల్సిందే అనుకుంది. ఎదురుగా బల్లమీదకి చూస్తూ ఎదురుగా బల్లమీద ఒక అరటిపండు ఒక బ్రెడ్ ముక్క ఉన్నాయి ప్లేటులో వాటిని చూస్తూనే సుందరమ్మ గారికి ఏదైనా తినాలన్న కోరిక చచ్చిపోయింది. కోడలు అంతకుముందే "ఇదిగోండి అత్తయ్య సాయంకాలం టిఫిన్" అంటూ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది.

"ఇది టిఫినా? నా బొంద" అని పళ్ళు నూరుకున్నారు.

సుందరమ్మ గారు బాగా ఉన్న మనిషి అనే కన్నా బాగా తిన్న మనిషి అంటే సరిపోతుంది. వాళ్ల నాన్న గారికి ఉన్న భోజన ప్రియత్వం అంతా ఈవిడకి వచ్చింది.

అత్తవారిల్లు అలాంటిదే అవటంవల్ల ఆ బిడ్డ తిండి మహా యాత్ర ఏకచ్ఛత్రాధిపత్యంగా సాగిపోయింది.

పొద్దున్నే టిఫిన్ మినిమం మూడు రకాలు. మధ్యాహ్నం భోజనంలో రెండు కూరలు రెండు పచ్చళ్ళు సాంబారు, అప్పడాలు వడియాలు, ఊరమిరపకాయలు అన్ని విధిగా ఉండాల్సిందే. సాయంకాలం పంటికిందకి అంటూ జంతికలు, గవ్వలు, చేగోడీలు సున్నుండలు అంటూ ఎడమచేతితో ఓ నాలుగు రకాలు చేసి పడేసేవారు. అవికాక అయా రోజులను బట్టి చల్లగా ఉంటే, వాన పడితే, బజ్జీలు పకోడీలు పుల్ల పునుకులు ఉండనే ఉన్నాయి.

చరిత్రకారులు ఎవరైనా చూసి ఉంటే వారి ఇల్లు "రకరకాల వంటలు పిండి వంటలతో నిత్య సమృద్ధిగా ఉండేది." అని ప్రత్యేకంగా వ్రాయకుండా ఉండలేరు.

మధ్యమధ్యలో అవి తింటూ సుష్టుగా ఉండేవారు సుందరమ్మ గారు. కొడుకుని కూతుర్ని కూడా అలాగే పెంచారు. కూతురు అదృష్టంకొద్దీ అలాంటి ఇంట్లోనే పడింది. కొడుక్కి కూడా అలాంటి సంబంధమే తెద్దాం అనుకున్నారు గాని వాడు తన తోటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఆ అమ్మాయి మంచిదే పాపం.. హోమ్ సైన్స్ న్యూట్రిషన్ చదవటంవల్ల వంటలు కూరలు టిఫిన్లు అన్ని పద్ధతి ప్రకారమే. ఒక్క కూర వండినా అందులో అన్నీ లెక్క ప్రకారం ఉండాల్సిందే. అదే సుందరమ్మ గారికి ఇబ్బంది అయింది.

టీవీ చూస్తూ ప్లేటెడు జంతికలు పర పరా నమిలి పారేసే శక్తి ఆవిడది.

ఒకసారి చాల్లేక కొడుకు తో మొరపెట్టుకుంది. కొడుకు తల్లి గురించి భార్యతో ఆ విషయాన్ని ప్రస్తావిస్తే అమ్మాయి బోలెడు నొచ్చుకొని, తను ఆవిడ మీద చూపిస్తున్న శ్రద్ధ ప్రేమ ఇద్దరూ అర్థం చేసుకోలేదని, అత్త గారి ఆరోగ్యం కోసమే తాను అలా చేస్తున్నానని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఆరోజు సోఫాలో ముడుచుకు పడుకుని నానా యాగీ చేసింది.

కొడుకు ఇంక చచ్చినా భార్యని ఆ విషయం అడగకూడదు అనుకున్నాడు.

అలా జరిగిపోతున్న వాటిల్లో ఇవాళ ఒక రోజు. ఏమైనా సరే ఇవాళ చచ్చినా ఆ టిఫిన్ తినను కోడలు ఏమైనా అనుకోని అనుకుని నీరసంగా పడుకుంది సుందరమ్మ.

తలుపు చప్పుడు అయితే చూసింది. కొడుకు మెల్లగా తొంగి చూసి చేతిలో వున్న పొట్లాన్ని ఆవిడ ఒడిలోకి విసిరేసి వెళ్ళిపోయాడు.

ఆ పొట్లం కమ్మని వాసన కి గబుక్కున లేచి కూర్చుంది సుందరమ్మ. వేడివేడి పుల్ల పునుకులు, నంచుకోవడానికి పచ్చడి తో పాటు ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఎక్స్ట్రా జల్లాడు.

లేచి ప్లేటులో పెట్టుకుందామా అన్న ఆలోచన కూడా లేకుండా గబగబా రెండు చేతుల తోటి లాగిo చేసింది సుందరమ్మ.

"అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా హాయిగా ఉండు నాయనా” అని కొడుకుని పదిసార్లు దీవించేసింది. కొడుకు రోజూ వచ్చేటప్పుడు తల్లికి అలా ఏదో ఒక చక్కటి టిఫిన్ తెచ్చి పెట్టేవాడు.

అలా సాఫీగా రోజులు సాగి పోతే మనిషి సుఖ పడిపోతాడు కదా!! రోజూ సాయంకాలం రుచికరమైన టిఫిన్ తింటం ప్రారంభించిందేమో సుందరమ్మ గారి బుర్ర చురుకుగా పని చేయటం ప్రారంభించింది.

అవునూ.. ఇది నా ఇల్లు. ఇంకా నా పేరు మీదే ఉంది. నెల తిరిగే సరికల్లా విడో పెన్షన్ 20 వేల దాకా వస్తుంది.. సంతకం పెట్టడం తప్ప ఎప్పుడు డబ్బులు గురించి అడగలేదు తను.

మరి అలాంటిది తన ఇంట్లో తను ఎందుకు దొంగతనంగా తినాలి. కోడలు పెట్టిన ఆ బ్రెడ్ముక్కలు పీచు కూరగాయలు తిన్నట్టు ఎందుకు నటించాలి. వాటిని దాచడానికి ఎందుకు అవస్థ పడాలి. ఆవిడ లో అత్తగారు తత్వం వచ్చేసింది.

ఆ రోజు కొడుకు ఉల్లి చిట్టి గారెలు తెచ్చాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి. లొట్టలు వేసుకుంటూ తినేసింది. రాత్రిపూట మెత్తగా ఒక వేపుడు చారు.. సుందరమ్మ గారికి తిండి.

ఆ రోజు రాత్రి చారు అన్నం తింటూ "ఒరేయ్ సాగరూ.. నువ్వు చిట్టి గారెలు ఈ చారులో నంచు కుంటే బావుంటాయి అంది నవ్వుతూ..

సాగర్ మొహం పాలిపోయింది. కోడలు కళ్ళు చురుకుగా అయ్యాయి.

సుందరమ్మ ముసిముసినవ్వులు నవ్వుతు విజయకేతనం ఎగరేసింది కోడలు వైపు చూస్తూ...

ఆ రోజు రాత్రి షరా మామూలే. ఒక రాత్రివేళ బాత్రూం కి వెల్దామని లేచి వరండాలోకి వచ్చింది సుందరమ్మ.

వాకిట్లో నవారు మంచం మీద పడుకుని నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు సాగర్.

ఏంట్రా బుజ్జి కన్నా నిద్ర పట్టలేదా అంది సుందరమ్మ బాత్రూమ్ నుంచి వస్తూ చటుక్కున లేచి కూర్చున్నాడు సాగర్.

"ఎలా పడుతుంది అమ్మా... పెద్ద వయసులో జిహ్వచాపల్యం ఉంటుంది అని నీ కోడలికి తెలియకుండా ఏదో తెచ్చి పెడితే దాన్ని రాద్ధాంతం చేశావు. నీ కోడలు అలిగి కూర్చుంది.

"అవున్రా దానికి మనoలొంగి ఉండాల్సిన అవసరం ఏముంది?"

సాగర్ ముఖం ఒక్క క్షణం నల్ల బడింది. వెంటనే తేరుకుని "అమ్మ నేను ఒక మాట అడుగుతాను చెప్తావా" అని అడిగాడు.

ఓ బేషుగ్గా దానికేం భాగ్యం అడుగు... కొడుకు పక్కన మంచం మీద కూర్చుంది.

చిన్నప్పుడు నాకు పాకెట్మనీ సరిపోలేదు.. అంటే నువ్వు నాన్నకి తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చే దానివి కాదు.
అవును. నీకే సహాయం చేశాను కదా! మరి నువ్వు నాన్న ని మోసం చేసినట్టా ... భయపడినట్టా

"ఊరుకో పిచ్చి సన్నాసి ఎవరైనా వింటే నవ్విపోతారు. మీ నాన్న నాకు దైవంతో సమానం. ఆ మహారాజు బతుకి ఉన్నన్నాళ్ళు నా మాటకి విలువ ఇచ్చాడు. డబ్బుకి ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వంటింటి ఖర్చు ఎందుకు ఏమిటి అని ఎన్నడూ అడగలేదు.
మీ నాన్న అంటే నాకు చాలా గౌరవం రా అబ్బాయి."

మరి నాన్నతో అబద్ధం చెప్పి నాకు డబ్బులు ఇచ్చావు కదా

ఓరి వెర్రి సన్నాసి ఆయన భర్త అయితే నువ్వు కొడుకు. రేపు తలకొరివి పెట్టాల్సిన వాడివి నువ్వే. కాబట్టి ఆయన దగ్గర అబద్ధమాడినా కొడుకు కే కాబట్టి పరవాలేదు తిరుగులేని తర్కం చెప్పింది ఆవిడ.

... మరి నేను చేసింది అంతే కదమ్మా.

అది ఎలా అవుతుంది రా కోడలు పరాయి పిల్ల. మనది రక్త సంబంధo.

దీర్ఘంగా నిట్టూర్చాడు సాగర్.

"ఎంత మాట అన్నావు అమ్మా.. పరాయి పిల్ల అయితే మన ఇంట్లో ఎందుకు ఉంది.

తను కన్నవారిని, ఉన్న ఊరిని వదిలేసి కేవలం నన్ను ఒక్కడిని నమ్ముకుని వచ్చేసింది. పరాయి ఇల్లు అయినా మన ఇల్లు ని తన ఇల్లు గా భావించింది. తను పరాయిది అయితే తను కన్న పిల్లలు మీ వంశానికి వారసులు ఎలా అవుతారు. కాబట్టి తనని ఆదరించటం తన మాటను గౌరవించడం ప్రేమించడం నా ధర్మం. నువ్వు కన్న తల్లివి. నిన్ను బాగా చూసుకోవాలి నేను అందుకని నీ మార్గం నేను అనుసరించాను.

అప్పుడు నేను నీతిమంతుడు లాగా నాన్నతో చెప్పి ఉంటే నీ పని ఏమయి ఉండేది.

ఇక్కడ కోడలు కాబట్టి తన చెప్పుచేతల్లో ఉన్న కొడుకు కోడలికి లొంగిపోయాడు ఏమో అని అనుమానం నీకు వచ్చింది కాబట్టి హాయిగా సాగిపోతుంటే ఓ రచ్చ పెట్టావ్. అమ్మ నిజంగా చెప్తున్నాను. తల్లి భార్య ఇద్దరు మగవాడికి సమానమే. నాకు మీ ఇద్దరూ కావాలి. అందుకని నాకు తోచిన మార్గంలో నేను ఇద్దర్నీ సంతోష పెడుతున్నాను ఇదే సరైన మార్గమని నేను అనుకోను గాని..

నా మార్గం నాది. నువ్వు ఏమీ అనుకోనంటే ఇంకో రహస్యం చెప్పనా.....

చిన్నప్పుడు కొడుకు కోసం దేవుడులాంటి నాన్న తో అబద్ధమాడినా నీవు... ఇవాళ ఆ కొడుకు అబద్ధాన్ని ఎందుకు దాచలేక పోయావు. అప్పుడు నీది ఏకచ్ఛత్రాధిపత్యం. ఇప్పుడు నీ కొడుకు జీవితంలో ఇంకొక స్త్రీ సమాన స్థానం సంపాదించుకుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే సున్నితంగా కోడరికం.....

మనమంతా ఒక యూనిట్ అమ్మా. ఒక కుటుంబం. ఒకరి తప్పులు ఒకరు కాసుకుంటూ దాచుకుంటూ

ప్రేమ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కలసికట్టుగా ఉండాలి. కళ్లు మూసుకుని చెప్తున్న సాగర్ ఉన్నట్లుండి తల మీద నీళ్లు పడితే వాన పడుతుందేమో అని తల ఎత్తి చూశాడు సాగర్ తల దగ్గర కూర్చున్న తల్లి కళ్ళలో నుంచి టపటపా నీళ్ళు పడ్డాయి తలమీద.

గబాల్న లేచి కూర్చున్నాడు

"అమ్మా నిన్ను నొప్పించానా" అన్నాడు మెల్లగా.

“లేదు రా పిచ్చి కన్నా. అదే నువ్వు అన్నట్టు అత్తరికం అనే ఓ పురుగు అప్పుడప్పుడూ తలలో ప్రవేశిస్తూ ఉంటుంది. దాన్ని అక్కడికక్కడ చంపేస్తే కాపురాలు హాయిగా సాగుతాయి లోపలికి వెళ్ళి పడుకో” అంది.

ఇద్దరూ లేచి వరండా మెట్లెక్కుతుంటే ఎదురుగా గుమ్మంలో కోడలు.

ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పోరతో "సారీ" అంది. నేల వైపు చూస్తూ....

"అంత సారీ చెప్పేంత తప్పు నువ్వు ఏమీ చేయలేదులే తలఎత్తు" అంటూ సున్నితంగా ఆమె చుబుకం పట్టి తల ఎత్తాడు.

ఎదురుగా పున్నమి చంద్రుడు నవ్వుతూ కనిపించాడు ఆమెకి.

Posted in October 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!