Menu Close
Galpika-pagetitle
లాక్ డౌన్ వెతలు-22 - లాకర్ లో కరోనా -- అత్తలూరి విజయలక్ష్మి

“నాకు ఇంటి మీదకు మనసు వెళ్ళిపోయింది.. ఈ లాక్ డౌన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పొతే నేను నా ఇంటికి వెళ్తానా అని దిగులుగా ఉంది ...అక్కడ అమ్మా, తను ఎలా ఉన్నారో” దిగులుగా అంటున్న రామం కేసి సానుభూతిగా చూసింది స్వప్న..

“బాగానే ఉన్నారులే .... రోజూ నువ్వు మాట్లాడుతున్నావు... వారానికోసారి నేనూ మాట్లాడుతున్నాను. ఉన్నన్నాళ్ళు ఉన్నావు... ఇంకో పదిరోజులాగు వెళ్ళిపోదువుగాని... అంతగా బస్సులు, ట్రైన్స్ లేకపోతె మీ బావగారు నేను, పిల్లలని కూడా తీసుకుని వస్తాము అందరం కారులో వెళ్దాము నిన్ను డ్రాప్ చేసి మేము వచ్చేస్తాము” అంది ఓదార్పుగా స్వప్న.

“ఫ్రస్ట్రేషన్ వస్తోందక్కా.. అంబులెన్స్ లో, పాల వానుల్లో దాక్కుని వెళ్ళిపోతున్నారుట జనాలు.. మనకా ధైర్యం ఎందుకు ఇవ్వలేదో దేవుడు ..”

“ధైర్యం దేవుడిచ్చేది కాదురా.. మనకి స్వతహాగా ఉండాలి. అయినా దాన్ని ధైర్యం అనరు తెగింపు అంటారు.. అలాంటి దిక్కుమాలిన తెగింపు దేనికి? ప్రమాదం కొని తెచ్చుకోడానికా! సరేలే ఊరికే కూర్చుంటే ఇలాంటి ఆలోచనలు, దిగులు పుట్టుకొస్తాయి నేనో పని చెప్తా చేయి..”

“చెప్పు.. ఏంటి? “

“ఐదేళ్ళ క్రితం నాన్న పోయే ముందు నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చి ఇవే నీకు నేనిచ్చే ఆస్తి జాగ్రత్తగా దాచుకో అన్నాడు. ఆయన అన్నట్టే చాలా జాగ్రత్తగా అటకమీద పెట్టా. ఇంతవరకూ వాటి, అతి, గతి పట్టించుకోలేదు.. ఓ సారి నిచ్చెన వేసుకుని అటక మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, వాటి కండిషన్ ఎలా ఉందో చూద్దాం తీస్తావా!”

“ఓ” రామం వెంటనే వెళ్లి నిచ్చెన తెచ్చుకుని అటక ఎక్కాడు. దుమ్ముకి దగ్గుతోంటే “అవి చేదలే పట్టాయో, చినిగే పోయాయో... జాగ్రత్త.. ఇలా పడేయి నేను పట్టుకుంటా” చేతులు రెండూ పైకి చాపి అంది.

“నువ్వు జరుగు బాగా దుమ్ముంది.. కింద పడేస్తాను” అంటూ నాలుగేసి పుస్తకాల చొప్పున పేర్లు చదువుతూ, స్వప్న అందించిన బట్టతో తుడుస్తూ కింద పడేస్తున్న రామం ఒక్కసారిగా కెవ్వు మన్నాడు అతని చేతిలో ఉన్న పుస్తకం దూరంగా విసిరేశాడు.

“ఏమైందిరా!” కంగారుగా అడిగింది స్వప్న...

“అ ... అది చూడు.... ఆ పు... పుస్తకం” అన్నాడు కుడిచేయి చూపుడు వేలు పెట్టి చూపిస్తూ.

స్వప్న ఒంగి పుస్తకం తీసి అట్ట మీద పేరు చదువుతూ “గబ్బిలం ఏం ఏమైంది దీనికి?” అనడిగింది.

“ఏమయింది ఏవిటే ... మన కొంప కొల్లేరు చేసి, బతుకులు చిందర, వందర చేసిన మహమ్మారిని అటక ఎక్కించావు ... కరోనా ని లాకర్లో దాచినట్టు..”

“నీ తలకాయ ఇది జాషువ అనే గొప్ప కవి రాసిన కవిత్వం... కరోనాకి, కవిత్వానికి తేడా తెలియదు కాబట్టే నువ్వు అటక మీద ఈయన ప్రపంచ పటం మీద ఉన్నారు ... ఉద్దరించావు ఇంక దిగు..” విసుక్కుంది స్వప్న.

జాహ్నవి -- రాజేశ్వరి దివాకర్ల

అమ్మా! డాక్టరు కన్ఫార్మ్ చేసిందమ్మా, నువ్వు నాన్నమ్మవి కాబోతున్నావు, అన్నాడు నవీన్ .. డాక్టరు దగ్గరకు చెకప్ కని వెళ్లి వచ్చిన నీల, నవీన్, సరాసరి పైకివెళ్లి, కాళ్ళూ చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని కిందకు వచ్చారు. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం నవీన్ పుట్టినప్పటి సంగతి, ఆ తరువాత చంటి పిల్లల కేరింతలు ఇంట్లో విన్నది లేదు. నవీన్ చెప్పిన వార్తకు నోరు తీపి చేద్దామని లేవబోయింది జాహ్నవి. అమ్మా! నేను తీసుకొస్తాను అంటూ వెళ్ళి కిచెన్ కప్బోర్డ్ తెరిచి తేనె సీసాను, చెంచాను తెచ్చాడు నవీన్. జాహ్నవి ఇద్దరినీ గమనించింది. నవీన్ లో కొత్త ఆనందం చిందులు వేస్తోంది. నీలలో కొత్త అందం తొంగి చూస్తోంది.

జాహ్నవి ఆ రోజు వంట చేసి ఇద్దరినీ పిలిచింది. నీల ఇష్ట పడుతుందని నాలుగైదు రకాల వంట చేసింది. తను ఇక్కడకు వచ్చినప్పటినుంచి వంటింటి దగ్గరకు నీల రావటం లేదు. నీలను జాహ్నవి రానివ్వటంలేదనడం సబబు. కొడుకు ఇష్టాఇష్టాలన్నీ తెలుసును కనుక కావలిసినవి వండి పెడుతోంది. నీల కూడా అన్నీ బాగున్నాయంటూ తింటుంది. జాహ్నవి పిలుపుకు, నవీన్ ఒక్కడే కిందకు వచ్చాడు, జాహ్నవి నవీన్ తో అంది.

ఈ సమయంలో, నీల ప్రెగ్నెంట్ అవడం, ఒక విధంగా కలిసొచ్చినట్టే రా, చక్కగా ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చు, పైగా వర్క్ ఫ్రం హోం ఇంకా పొడిగిస్తారంటున్నారు కదా! అప్పటికి నెలలు నిండుతాయి. అమ్మ మాటలను నవీన్ అందుకుంటూ అవునమ్మా, ఇలా ఉద్యోగం అంటూ పరుగులు తీయకుండా ఇంట్లో తీరికగా పని చేసుకోడం, నీలకు రెస్ట్ దొరికిందమ్మా, అన్నాడు.

అది సరే కాని నీల ఇంకా రాలేదేమిటి? అని అడిగింది జాహ్నవి. నవీన్ కొంచం తట పటాయిస్తూ అమ్మ వండిన పదార్థాల వైపు చూసాడు. అమ్మా! నేను నీలకు స్పెషల్ వండి పెట్టాలని అనుకుంటున్నానే అన్నాడు. జాహ్నవి సూచనామాత్రంగా గ్రహించింది. కాని తను వచ్చాక ఇంట్లో అలాంటి ప్రస్తావన రాలేదు, నవీన్ అన్నాడు. అమ్మా మేము బయటకు వెళ్ళటం లేదు కదా, ఇప్పుడు ఇంట్లో చేసుకోక తప్పదు, నీల నీ మీద గౌరవంతో నువ్వు చేసినవి తింటోంది. కాని నీకు తెలుసుకదమ్మా, నీలకు మాంసాహారం ఇష్టం. వాళ్ళకది అలవాటు. మేము బయటకు వెళ్ళినప్పుడు, ఇష్టమైనవి తిని వచ్చేవాళ్ళం, నీకు ఇబ్బంది కలిగించలేదు, ఈ రోజు నీల తినాలనుకుంటోందమ్మా, నిన్ననే పట్టుకొచ్చాను, అన్నాడు నవీన్.

జాహ్నవి కొద్దిగా తెల్లబోయింది. కాని ఇలాంటి పరిణామం ఎప్పుడో ఒకప్పుడు రాక మానదని ఆమెకు తెలుసు. నవీన్ కులాంతర వివాహం చేసుకున్నాడు. తన భర్త పెద్ద ఉద్యోగం చేసినా గాయత్రిని జపంచేసి నైవేద్యం పెట్టకుండా భొజనం చేయలేదు. తను కూడా అందరితో కలసి మెలిసి కాలేజిలో పనిచేసినా, ఎప్పుడూ శాకాహారం తప్ప ముట్టలేదు. కొడుకు అమెరికాలో ఎం.ఎస్ కని వెళ్ళి చదువు అయ్యాక ప్రేమించానమ్మా అంటూ చెప్పాక, వాడి సుఖమే ముఖ్యమని రెడ్డి గారి అమ్మాయి, నీలతో వివాహానికి ఒప్పుకున్నారు.

ఇంతవరకూ, వాళ్ళు విదేశంలో తాము స్వదేశంలో ఎవరిమట్టుకు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు తను వాళ్ళతో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకూ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకని బయటకు వెళ్లి ఏం తినేవారో తను పట్టించుకునేది కాదు. ఇంట్లో మాత్రం అంతా తన ఇష్టమే సాగేది. ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చింది. కొడుకిప్పుడు స్వతంత్రుడు. ప్రత్యేకమైన అభిరుచులను పెంచుకున్నాడు. తను వాళ్ళకు అడ్డురాకూడదు.

జాహ్నవి కొద్దిగా తేరుకుంది. నవీన్ నేను నా గదిలోకెళ్ళి భోంచేస్తాను. నువ్వు నీలను కిందకి రమ్మని, మీకిష్టమైనది చేసుకోండి. అంది తన భోజనాన్ని పట్టుకెళ్తూ.

జాహ్నవి తన గదిలో కూచున్నా వంట చేస్తున్న ఆ వాసనలను తట్టుకోలేక పోయింది.

ఆ సాయంత్రం నీల నవీన్లతో కలసికూచున్నప్పుడు జాహ్నవి ఇలా అంది "నవీన్, నేను బేస్మెంట్ లో ఉంటానురా అక్కడ కూడా అంతా అనుకూలంగా ఉంది కదా అంది. నీల అదేమిటత్తాయ్యా ఒక్కళ్ళే ఎలా ఉంటారు? అంది.

ఫరవాలేదు నీలా, ఒక ఇల్లే కదా కొద్దిగా దూరం అంతే నువ్విప్పుడు కావలిసినవి తిని ఆనందంగా ఉండడం ముఖ్యం. నేనెలాగూ కిందే ఉంటానుగా పిలుపు దూరం అంతే. మనం అలవాట్ల దూరం పాటించి అభిమానంతో దగ్గరవుదాం. ఆచారాల దూరం పాటించి ఆత్మీయంగా దగ్గరవుదాం. రేప్పొద్దున్న నా మనుమడో మనుమరాలో మా అమ్మకిష్టమైనవి ఎందుకు తినవద్దన్నావు? అని ప్రశ్నించకూడదు కదా. రుచులు వేరైనా, నా అభిరుచి మీ కుశలమేరా. డిస్టెన్సెతో దగ్గరవుదాం. మీదండ నేను లేకున్నా, మీఅండ నాకెప్పటికీ ఉంటుంది. మీతోటి కలిసి తినకున్నా నాతోడు మీకెప్పటికీ ఉంటుంది అంది జాహ్నవి. ఈ సమస్యకు పరిష్కారం ఇదేనా? అన్నట్టుగా బేలగా చూసారు నవీన్, నీల.

సత్యం ... శివం... సుందరం (సన్మానం రద్దయ్యింది) -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

తనకి ఈ రోజు సన్మానం. ఉద్వేగం ఏమీ లేదు. కానీ సంతోషం అనిపించింది.

సమాజహితమైన ఆలోచనలను కూడా స్వాగతించే వారు కూడా ఉన్నారన్నమాట. అనిపించింది.

ఏ ఆర్భాటం లేకుండా అతి సామాన్యమైన దుస్తుల్లో బయల్దేరాడు సుందరం.

ఇంతలో సుందరాన్ని ఎవరో అడిగారు.

"ఏమోయ్! ఎక్కడికి?"

"సన్మానానికి"

"ఎవరికి?"

"నాకే"

"నాకే అంటే?"

"సుందరానికి"

"సుందరం అంటే ఎవరు?"

"నేను"

"*అహం* కారానివన్నమాట. సన్మానం అంటే ఏమిటోయ్?"

"సన్మానం అంటే తలమీద పన్నీరు, పువ్వులు జల్లుతారు. కంఠానికి గంధం వ్రాస్తారు. వంటిపై శాలువా కప్పుతారు. మెడలో పూలమాల వేస్తారు."

మరి నాకేదోయ్ సన్మానం?"

"నువ్వెవరు?"

"నీ కుడిచెయ్యి ని. కష్టపడి పదివేలపేజీల పుస్తకాన్ని వ్రాసిందెవరు? నేనే కదా!"

"సన్మానపత్రం, నగదు, స్మరణిక తీసుకునేది నువ్వే కదా?"

"ఆ బడాయి. నాకు చదువురాదు. నగదును నానుంచి తీసుకుని వెంటనే జేబులోకి తోసేస్తావు. స్మరణికను షోకేస్ లోకి నెట్టేస్తావ్. ఇక నాకు మిగిలిందేమిటి? శ్రమనాది. డాబు నీది. రేపటి నుంచి సన్మానం జరిగింది సుందరానికి అంటారు కాని *సుందరం కుడి చేతికి* అంటారా? ఇది *శ్రమ దోపిడి*.

ఇది నన్ను *అణగద్రొక్కడమే.*"

"అదేమిటి కుడిచేయి? నేను ఈ సుందరం బుద్ధిని. ఆ రచనకు కావలసిన ఆలోచన నాలో పుట్టిందే కదా!? నీకెందుకు సన్మానం?"

"చెయ్యి అనే నేను లేక పోతే నువ్వేం చెయ్యగలవోయ్! నువ్వు దుర్బుద్ధివి. నువ్వు *దుర్మార్గపు పెట్టుబడిదారువు*. నువ్వు మాట్లాడకు. *శ్రామికుడికీ పెట్టుబడిదారుకీ పడదు*."

"హలో! హలో! ఏంటి మీ ఇద్దరి గొప్ప? నేను నాలుకను. చిన్నదాన్నని ఈ నోరనే పెట్టిలో పెట్టి తాళం వేశాడు ఈ *బూర్జువా సుందరం*. నాకు ఘోషా ఏర్పాటు చేశాడు. అయితే వేదిక మీద తైతక్కలాడేది నేనే. ఎన్ని వేదికల మీద నేను తైతక్కలాడితే వచ్చిందీ సన్మానం? హుఁ నాకు గుర్తింపు లేదు."

"మీరందరూ ఆగండయ్యా! సామెత చెప్పినట్టు ఊళ్ళో పెళ్ళికి ఎవరిదో హడావుడిట. బుద్ధి ఆలోచించింది. నువ్వు వ్రాశావు. నాలుక చదివింది. సుందరానికి సన్మానం. మరి నేను లేకపోతే మీరందరూ ఆ సభకు ఎలా చేరుకుంటారు? నేను సుందరం కాళ్ళ విడదీయరాని జంటను (Siamese twins). నాకేం సంబంధం ఈ సన్మానం తో. నేను మొరాయిస్తున్నాను."

"అసలు నేను లేకపోతే సుందరానికి చూపు లేదు. నేను చూడకపోతే బుద్ధికేమీ తోచదు. చెయ్యేమీ వ్రాయలేదు. ఆ పిల్లనాలుకేమీ మాట్లాడలేదు. ఈ కాళ్ళజంట ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఈ సన్మానం లో నాకు దక్కేది ఏమిటి? ఒక జత గాజుకళ్ళు తప్ప.?"

అందరూ కలిసి....

"అవును. *ఈసుందరం ఒక పెద్ద కార్పొరేట్. మనందరి శ్రామిక శక్తి మీద ఆధారపడి బ్రతికే పరాన్నజీవి. మనలో మనకు సామాజిక అసమానతలను పెంచి వర్గపోరాటం సృష్టించిన పెత్తందారీ. విధ్వంసక కాముకుడు. మన శ్రమను మార్కెట్ చేసుకుంటూ లాభాలు గడిస్తున్నాడు. మన శక్తి యుక్తులను కొల్లగొడుతున్నాడు. పోరాడుదాం. పోరాడుదాం. కలిసి కట్టుగా పోరాడుదాం. ఈ సుందరం కుళ్ళు కంపు బయట పెడదాం. ఈ సన్మానం జరుగదు.*

ఫలితంగా నడిరోడ్డుపై కాళ్ళు నిలిచిపోయాయి. కళ్ళు మూసుకుపోయాయి. ఎదుటనుంచి ఒక లారీ వచ్చి సుందరాన్ని తొక్కేసి వెళ్ళిపోయింది. సన్మానం ఆగిపోయింది. హాస్పిటల్ లో  చేర్చారు.

కాళ్ళకి, చేతులికి, కళ్ళకు, బుద్ధికి ఏంజరుగుతోందో తెలియటంలేదు. నాలుక మాత్రం నేను ఈ నోటి పెట్టెలో ఉన్నాను కనుక బ్రతికి పోయాను. సుందరం మంచోడు. నన్ను కట్టడి చెయ్యలేదు. కట్టుదిట్టమైన భద్రత కల్పించాడు. లోపలినుంచి ఏవో మూలుగు వినబడుతోంది. "నా చెయ్యి. నా కాళ్ళు." అంటూ.

"మేం పని చెయ్యకుండా పోతే నీకెందుకు మూలుగు? ఎవరు నువ్వు?" అడిగాయి కాళ్ళూ, చేతులు.

*మీరు పెట్టుబడిదారు, కార్పొరేట్ అంటున్న సుందరం సమాజం. నేను సుందరం మనస్సును. అంటే ఆ సమాజం చైతన్యాన్ని.*

*మీరంతా ఆ సమాజంలో అవయవాలు*. మీలో ఏ ఒక్కరికి నొప్పి కలిగినా బాధపడేది నేనే.

ఇదీ *సత్యం*.

మనం అందరం మన మన కర్తవ్యాలను దోపిడీ అనుకోకుండా మన బాధ్యతగా గ్రహించి ఆచరిస్తే అందరికీ నిత్య కల్యాణమే.

ఇదీ *శివం*.

మనమంతా బాగుంటే సమాజ సౌష్ఠవం బాగుంటుంది.

ఇదీ *సుందరం*.

వాటి మధ్య ఈచర్చ జరిగిన తర్వాత *మనస్సు* అభిలాష మేరకు అవయవాలన్నీ నడుచుకోవడం మొదలు పెట్టాయి.

 

సుందరం తొందరగా కోలుకున్నాడు. ఆపైన సుందరానికి సన్మానాలే సన్మానాలు.

ముల్లు పోయి కత్తి వచ్చే... -- కాసాల గౌరి

"అమ్మాయ్... ఎంత సేపు తరుగుతావు.. మీ మామగారికి కోర్టు టైం అయిపోయాకా... కంగు మంది కాంతమ్మ గారి గొంతు వంటింట్లోంచి. 

"వస్తున్నా.. అత్తయ్యా ఇదిగో ఇదిగో".. గబగబా తరిగిన ముక్కలు వున్న గిన్నె అత్తగారి చేతికిచ్చింది పార్వతి. 

కోడలి చేతిలోంచి విసురుగా గిన్నెని అందుకుని, “గంటసేపు తరిగావు నాలుగు అరటి కాయలు" అంది ముక్కలు బాండీలో వేస్తూ ముక్కలతో పాటు మొహాన్ని చుయ్ మనిపించుకుంటూ.. 

"ఎలా అత్తయ్య జాగ్రత్తగా తరగాలి కదా ముక్కలు పెద్దవి చిన్నవి అయితే మళ్ళీ ఒప్పుకోరు మీరు..." నెమ్మదిగా అంది పార్వతి.

అందుకే కత్తిపీట తో నాలుగు ముక్కలు చేసి గుత్తులుగా తరిగేస్తే తొందరగా అయిపోతుంది అంటాను. నువ్వు వినిపించుకుంటేగా ఆ చాకు అతికించిన పీటతో టిక్కు టిక్కు అని కొట్టుకుంటూ కోస్తావు...సోకులు కాకపోతే.. ఈసడించి పారేసింది కాంతమ్మ." 

"అయ్యో అలా తీసిపారేయకండి అత్తయ్యా.. అంజలి అని చాలా మంచి పెద్ద కంపెనీ. చేతులు కోసుకోవు అని మీ అబ్బాయి మన కోసం ఎంతో సరదాగా తెచ్చారు. 

"ఆహా సరే.. సరే.. సంబడం... చేతులు తిప్పుతూ అంది కాంతమ్మ.

అత్తగారిని ఏమనలేక పక్క గదిలోకి వెళ్ళిపోయింది. సణుక్కుంది పార్వతి. 

*       *       *

కానీ... కానీ...కరుణా ఎంత సేపు చెప్పు.. మీకందరికీ క్యారియర్లు కట్టాలి. చాలా పని ఉంది తల్లీ నాలుగు అరటికాయలుకి ఇంత సేపా...

"అబ్బా ఏమిటంత తొందర తెస్తున్నాను కదా" విసుగుని దాచుకుంటూ వెజిటేబుల్ చాపర్ తో వంటింట్లోకి వచ్చింది కరుణ. 

"ఏమిటో కలికాలం అన్నిటికీ మిషన్ లే...సుబ్బరంగా పీటమీద చాకుతో చెక చెకా కోసి పారేయక చాపర్లు గీపెర్లు ఏమిటో.. " మళ్లీ పెద్ద ముక్కలు తరిగి చావాల్సిందే.. ఆ బ్లేడ్ సరిగ్గా కూర్చో పోతే మళ్ళీ పెట్టుకోవటం.."

మెల్లిగానే విసుక్కుంది సుజాత. కరుణ వినవే వినవే వింది. 

ఊరుకోండి అత్తయ్య చాపర్ తో చాలా సులువు అని అందరూ అంటూనే ఉన్నారు. చాలామంది వాడుతున్నారు కూడా. మీ పాత చింతకాయ పద్ధతులను మరచి పొండి. ఈసారి విసుగు దాచుకోలేదు కరుణ. కోడలు పక్క గదిలోకి వెళ్లి పోయాక మూతి  మూడు  వంకరలు తిప్పింది సుజాత. 

*     *      *

"అమ్మా స్వీటీ. ఇవాళ కూర ఏం చేద్దాం అనుకుంటున్నావ్. నాకు ఇచ్చేయి, తరిగి పెడతాను."

అక్కర్లేదు అత్తయ్య మొబైల్ మీదనుంచి చూపు తిప్పకుండానే అంది  స్వీటీ. 

"ఎంత సేపు ఊరికే కూర్చొని బోర్ కొడుతుంది. నాలుగు కాయలు తరిగితే చాపరుతో కొంచెం చేతులకి కదిలిక ఉంటుంది.. కాలక్షేపం కూడాను." 

కూరలు తరిగే అవసరంలేదత్తయ్యా.... అయ్యో...అదేమీ నేని ఛాపర్ లో చకా చకా కోసేస్తాను....  ఇంకా ఇప్పుడే వండవుకదా.

అందుకు కాదు అత్తయ్యా. కూరగాయలు తగినవే దొరుకుతున్నాయి. ఫ్రీజ్  చేస్తారు. వండుకోటానికి ఒక గంట ముందు తీసి బయట పెట్టుకుంటే సరి. ఇందాకనే పెట్టేసాను. మొబైల్ లో నుంచి తల ఎత్తకుండానే నిర్లక్ష్యంగా చెప్పింది.

అదేమిటీ ....  ఐసు గడ్డల్లా అయిపోయిన ఆ ముక్కలు ఏం బాగుంటాయి. చక్కగా నవనవలాడే కూరలు తెచ్చుకుని తరిగి వండుకుంటే ఆ రుచే వేరు... కొంచెం భయంగా ఇంకొంచెం సంకోచంగా అంది కరుణమ్మ. 

మీకెందుకు అత్తయ్య అవన్నీ నేను వండుతున్నాను మీరు తినండి అంతే. నేను వంట చేస్తే మీ అబ్బాయి మెచ్చుకుంటూ తింటారు. 

మీ రూమ్ లో కెళ్ళి ఏ టి వి యో చూసుకోండి. తోటలో ఎండిన ఆకులు పుల్లలు తీసేయండి. మంచి ఎక్సర్సైజ్. ఆవిడ కదలక పోవడంతో తనే లోపలికి వెళ్ళిపోయింది స్వీటీ..... 

కోడలి మాటలకి చిన్నబుచ్చుకుని పచార్లు చేయడానికి తోట లోకి వెళ్ళింది. పాత సామాన్ల కొట్టులోంచి కత్తిపీట., చాకు పీట, కరుణమ్మ వైపు జాలిగా  చూశాయి....

Posted in June 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!