Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-29 -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

బొట్టు

మాబుగాడు మామూలోడు కాడు. వాడు నన్ను బొమ్మన్ అంటాడు. వాడిని నేను నవాబా అంటాను. మా ఇద్దర్నీ చూసి అందరూ సన్నాసి నేస్తులు అనుకుంటారు. ఎందుకంటే ఇద్దరం సన్నగానే ఉంటాం.

మాబుగాడు మహా చమత్కారి. ఎవరూ చూడనివీ చూడలేనివీ వాడికి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరూ కనిపెట్టలేని విషయాలు వాడు కనిపెట్టినంతబాగా ఇంకెవరూ కనిపెట్టలేరు. అలాంటి వాడూ నేనూ కలిసి నడుస్తున్నాం. ఒక చోట కార్లంగడి కనపడింది. దాని బయట ఒక కారుంది. ఆ కారుకి ఓ అట్ట వేలాడదీసి ఉంది. ఆ అట్టమీద FOR SALE అని రాసుంది. దాన్ని నాకు చూపిస్తూ,"ఆ కారు మా సాలేగాడి కోసం" అన్నాడు. అబ్బో వాడికి వాళ్ళ బామ్మర్దంటే ఎంతిష్టమో అనుకున్నాను. ఇంకోచోట HOUSE FOR SALE అని కనపడింది. దాన్ని చూడగానే "ఈ ఇల్లు కూడా మా సాలేగాడి కోసమే" అన్నాడు. అమ్మో వాడికి బామ్మర్దంటే బో ప్రేమలే అనుకున్నాను. ఇంకోచోట ఒక ఖాళీ అంగడి కనపడింది. దానిక్కూడా FOR SALE అనే బోర్డుంది దాన్ని చూడగానే వాడికంటే ముందు నేనే ఉత్సాహపడిపోతూ"ఇదీ మీ సాలేగాడి కోసమేగా?"అని అడిగాను.

"ఎంతైనా మీ బొమ్మన్ గాండ్ల తెలివే తెలివిరా. ఇట్లా అందిస్తే సాలు అట్లా అల్లుకు పోతారు. ఇంతకీ అది మా సాలేగాడికనే సంగతి ఎట్లా కనిపెట్టావో నాక్కూడా చెప్పచ్చుగా అన్నాడు.

"ఏముంది ఎక్కడ FOR SALE బోర్డు కనిపించినా అది మా బామ్మర్దిగాడికోసమే అంటూ రిజర్వేషన్ చేసుకుంటున్నావు కదా? ఇది కూడా మా తమ్ముడు ఖాదర్ వల్లిగాడికోసమేలే అనుకుని ఓ రాయేసి చూశాను"

"ఊరికే రాళ్ళేస్తే సరిపోదు. ఆ రాళ్ళు రాల్చడానికి అక్కడ పండ్లూ కాయలూ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకుని వెయ్యాలి. ఏవీ లేకుండా రాళ్ళేస్తే అది నువ్వు బళ్ళో చెప్పే సదువు మాదిరే ఉంటుంది. అసలైన సదువు నేను చెబ్తా. నా పేరు "మాబు". అదే ఇంగ్లీషులో రాస్తే MA-మా..,BU-బు. అదే మాదిరి SA-సా.., LE-లె అంటే SA-LE = సా లె. HOUSE FOR SA-LE అంటే ఇల్లు సాలెగాడి కొరకు. SHOP FOR SA-LE అంటే అంగడి సాలెగాడి కొరకు. ఆ ఇంగ్లీషోడు ఏం అమ్మినా మన సాలెగాళ్ళ కోసమేగానీ మనకోసం కాదు. సాలెగాడంటే మనం చెయ్యడానికి ఇష్టపడని పనులు కూడా అక్క రెకమండేషన్ ద్వారా జరిపించ గలిగిన ప్రలోభంగాడు. ఇంగ్లీషు తెలివంటే అదేరా బొమ్మన్. ఆ తెలివితోనే వాండ్లు మనల్ని విభజించి పాలించినారు. ఇదెప్పుడైనా మీ చరిత్ర పాఠాల్లో చెప్పినారా? లేదు. దేనికంటే మీ సదువుల్లో లెక్కలు సైన్సు తప్పితే ఇంకేం ఉండవు. దేనికంటే మన బిడ్డలు అయితే డాక్టర్లు కావాల. కాకుంటే ఇంజనీర్లు కావాల. కానీ, మన బిడ్డలు అన్నింటికంటే ముందు మనుషులు కావాలనుకునే మనిషి ఒక్కడైనా ఉన్నాడా?"

ఎక్కడ మొలెట్టాడు-ఎక్కడికి తీసుకొచ్చాడు?

అదే మాబుగాడి చమత్కారం. వాడు ఏం చేసినా ఇలాగే ఉంటుంది.

ఈలోగా అజా వినిపించింది.

వెంటనే మాటలూ, నడకా ఆపేసి పక్కకి వెళ్ళి నమాజు ఆరంభించాడు. నేనూ వాడి పక్కనే కర్చీఫ్ వేసుకుని నమాజ్ చేశాను. నిశ్శబ్దంలోంచీ వినపడే అమృతవాక్కుల్ని ఆలకించాను.

నమాజు పూర్తి చేసి లేచేసరికి ఎదురుగా ఒక కుర్రాడు నావైపు విచిత్రంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. అతను నా విద్యార్థి. అతనంత విచిత్రంగా చూడటానికి కారణం నేను పెట్టుకున్న బొట్టు. నేను బ్రాహ్మడినని ఆ కుర్రాడికి తెలుసు. కానీ నమాజు చేస్తానని తెలీదు. అందుకే ఆ విచిత్రం.

*** *** ***

అందరికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ నా ఐడెంటిటీగా మారిపోయిన నా బొట్టు కథ సామాన్యమైనది కాదు.

ఒకసారి బడిలో క్రమశిక్షణ గురించి చెబుతున్నాను. అదే సమయంలో అటుగా వెళ్తున్నాడు మాబు. క్రమశిక్షణ పాఠం పూర్తయ్యేంతవరకూ అక్కడే నిలబడి నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అప్పటికి వాడికీ నాకూ ఇంకా స్నేహం కుదర్లేదు.

పిల్లలకి ఒంటిగంట కొట్టగానే నా దగ్గరకి వచ్చాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. తరవాత ఒకే మాట అడిగాడు. బడిలో క్రమశిక్షణ గురించి చానా బాగా చెప్పినావు బొమ్మన్. మరి వాళ్ళ నిజ జీవితంలో నైతిక క్రమశిక్షణ గురించి చెప్పేదెవరు? అంటూ నా మెదడులోకి ఓ ఆలోచన వదిలాడు.

ఆలోచన అనే తుమ్మెద నా తల్లో రింగురింగుమంటూ శబ్దం చేసుకుంటూ తిరగడం మొదలు పెట్టింది. ఆ విషయం నిర్ధారణ కాగానే సమాధానం చెప్పకుండా చక్కా పోయాడు మాబు. ఆ తరవాత అతనికి నేను కనిపించిన ప్రతీసారీ ప్రశ్న అనే భ్రమరాన్ని మరోరూపంలో సంధించి వెళ్ళిపోయేవాడు. కానీ, సమాధానం మాత్రం చెప్పేవాడు కాదు. అంటే అతను సమాధానం నన్నే అన్వేషించమని చెబుతున్నాడని అర్థమైంది. కానీ నైతిక క్రమశిక్షణ అలవర్చే పాఠాలెక్కడ దొరుకుతాయో ఎవరు చెబుతారో అర్థం కాక మాబు గుర్తొచ్చినప్పుడల్లా దానిగురించే ఆలోచిస్తూ ఉండేవాడిని.

ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి. అందుకే గుడికెళ్ళి సరస్వతీమాతకి అర్చన చేయించి వస్తూండగా ఎదురయ్యాడు మాబూ. ఇంక నైతిక క్రమశిక్షణ గురించి అడిగి నా బుర్ర తింటాడురా బాబూ అనుకుంటూ ఉండగానే నా బొట్టుని చూశాడు,"ఏం బొమ్మన్ ఇప్పటికైనా అర్థమైందా అసలైన క్రమశిక్షణ గురించి?" అన్నాడు. అతను దేన్ని చూసి ఆ మాట అన్నాడో అర్థం కాలేదు. కానీ ఆ విషయం బైట పడనివ్వకుండా గుంభనంగా నవ్వాను. ఆ తరవాత అతను చెప్పిన మాటలు అతన్ని నాకు ఆప్త మిత్రునిగా మార్చేశాయి.

"సూడు బొమ్మన్. ఎవరి పద్దతుల్ని వాండ్లు పాటించాల. అబ్బుడే ఎవురేందనే సంగతి తెలిసేది. బొట్టంటే పైకి కనిపించే కుంకం కాదు. ఎదుటివానిలో ఉండే మంచిని మాత్రమే చూపించే మూడో కన్ను. చూడు. మనిషిలోని మంచిని మాత్రమే చూడు. చెడుని చూసినా అందులోని మంచి గురించి అందరికీ అర్థమయ్యేలా పాఠాలు చెప్పు. చెప్పిందంతా విన్నారా లేదా? అర్థం చేసుకున్నారా లేదా? ఆచరిస్తున్నారా లేదా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం నీ పని కాదు. చెప్పడమే నీ పని. చెబుతానే ఉండు. చెబుతానే ఉండు. అట్లా చెబుతా చెబుతా ఉంటే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు నువ్వు చెప్పిందాని గురించి ఆలోచిస్తాడు. వాడు కూడా చెప్పడం మొదలు పెడతాడు..,"

ఎంత గొప్ప జీవిత సత్యాన్ని ఎంత చులాగ్గా చెప్పేశాడో..!

అట్లాంటి జిగ్రీ దోస్తు మా మాబుగాడు. ఈరోజు మీకు లేడని నాక్కూడా లేకుండా ఎట్లా పోతాడు?

నా బొట్టులోంచే ఎదుటివారి మంచిని తారాడతా ఉంటాడు.

సమయం - రాజేశ్వరి దివాకర్ల

అమ్మా! అంటూ చేతిలో పోస్ట్ తీసుకుని లోపలికి వస్తూ కేక వేసింది దివ్య. ఆరోజు వచ్చిన పోస్ట్ లోంచి ఎదురుచూస్తున్న దానిని గుర్తించి తీసి చదువుతూ వచ్చింది దివ్య. కూతురు పిలుపు విని కుట్టు మెషిన్ ను ఆపి గదిలోంచి బయటకొచ్చింది భారతి. సంగతి ఏమయి ఉంటుందో ఊహించింది. దివ్య "అమ్మా” నీకింక గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఇదిగో ముందుగా సిటి జన్ మెంబర్షిప్ కార్డ్ వచ్చింది అమ్మా వర్క్ పర్మిట్ కూడా వచ్చింది. నువ్విప్పుడిక్కడ నీకిష్టమైన పనిని కూడా చేయవచ్చు. ఎలాంటి అభ్యంతరం ఉండదు అంది దివ్య.

పనిచేయవచ్చునని కూతురు సరదాగా అందని తెలుసు, కాని భారతి నిజంగానే ఆవిషయాన్ని గురించి ఆలోచించింది. తనిప్పుడేమి పని చేయగలదు? బయటకు వెళ్ళి సమయ నియమాన్ని, ఇతర నిబంధనలను పాటిస్తూ చేసే పని ఎంత సులభమైనా ఇప్పుడు చేయదలచుకోలేదు. ఇంతకాలం బాధ్యతగా ఉద్యోగమూ, ఇల్లాలి తనమూ అన్నింటినీ నిర్వహించింది. నిజంగా తనకు ఇష్టమైనదేమిటి ..అనుకుంటూ ఇప్పుడేం పనే! అంది దివ్యతో.

అమ్మా శిశు సరక్షణ, బేబీ సిట్టింగ్ చేయచ్చు. ఒక్క బేబీని చూసుకుంటె నెలకు 1000 డాలర్లు సంపాదించచ్చు అంది దివ్య సరదాగానే మాటను పొడిగిస్తూ,
అబ్బా! ఆ పిల్లల గోల ఇప్పుడు నాకెందుకే మిమ్మల్ని, మీ పిల్లల్ల్ని పెంచాను చాలు అంది భారతి కూడా నవ్వుతూ.

అమ్మా ఏదైనా మాల్ లో చేరవచ్చు. నేను వెళ్ళేటప్పుడు నిన్ను దింపుతాను. అక్కడ బట్టల ట్రైల్ రూంస్ ఉంటాయికదా, అక్కడ తమకు,నప్పాయో లేదో చూసుకునే వాళ్ళకు ఎన్ని డ్రెస్స్ లిచ్చావో చూసుకుని తిరిగి వదిలేసిన వాటిని జోడించి పెట్టాలి చాలా సులభం అంది దివ్య.

పోవే నాకసలే తికమక, అలాంటివాటికి నాకు ఓపికలేదే, అంది భారతి.

అమ్మా! పోనీ ఇలాచేయి. నువ్వే మన కింద బేసెమెంట్ లో స్టిచింగ్ క్లాసెస్ మొదలుపెట్టు. ఇక్కడ అనేకమందికి భారతీయ శైలి బట్టలు కుట్టే వాళ్ళు కావాలి. ముందుగా నాకే కుడుదువుగాని అంది దివ్య.

ఇప్పుడు అందరూ డిజైనర్ బ్లౌజులు, ట్రెండ్ చుడీదార్లు వేసుకుంటారు. అయినా దివ్యా మనం అనుకుంటాం కాని డబ్బు సంపాదనకి కుశలత, చురుకుదనం, నిబద్ధత, క్రమశిక్షణ, ఆసక్తి, వీటన్నింటితో బాటు శక్తి కూడా ఉండాలే. నాకిప్పుడు లేనివన్నీ ఆపాదించుకుని సంపాదనకోసం ఎందుకే ఆరాటం హాయిగా తోచినప్పుడు ఏదైనా రాసుకుంటాను. ఆ రాసినదైనా ముందుగా నాకు నచ్చాలి! మీ అందరికీ వండి పెడుతున్నా అది చాలులే అంది.

అమ్మా! నీ సంగతి నాకు తెలీదా! అయినా ఇప్పుడు ఈ కష్ట సమయంలో బయటికెళ్ళే అవకాశం కూడా లేదులే. ఇలా ఎంతకాలం ఉంటుందో ఏమీ తెలియటంలేదు అంది దివ్య. ఇంత సేపూ మాట్లాడినదంతా ఉబుసుపోకకేనని ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఇంటినుంచే చేస్తున్నారు. పైగా నిరుద్యోగంతో ప్రస్తుతం అమెరికా రెట్టింపు సంక్షోభంలో ఉంది.

అది సరేకాని దివ్యా, మొన్న గూగుల్ లో ఆయుర్వేద ఔషధ పొడిని గురించి చదివాను. దానివల్ల దగ్గు, జలుబు రావట. శ్వాసకోశం గూడా శుభ్రపడుతుందట. మన రామం గారు, ఆంటీ, కూతురు ప్రసవానికి ఇక్కడకు వచ్చారు కదా. ఇక్కడ ఈ చలికి దగ్గు, జలుబు వస్తే ఎలా? పాపకూడా ఉంది కదా. అందులోనూ రామం గారికి వయసువల్ల దగ్గు ఆప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఆమాటే మొన్న నాతో ఫోన్ లో చెప్పారు. అందుకనే ఆ పొడిని తయారుచేసాను. సాయంత్రం వెళ్ళి ఇచ్చేసి రా. ఈ మాస్క్ లు కూడా కుట్టానే చూడు అంటూ తన గదిలోంచి ఒక ఇరవై మాస్క్ లను తెచ్చింది భారతి. వాటిని చూసి ఆశ్చర్యపోయింది దివ్య. అమ్మా! నిజంగా మళ్ళీ వాడుకునేటట్టు చాలా బాగున్నాయి. నేను "వాట్స్ ఏప్" లో పోస్ట్ చేస్తాను. అందరూ కావాలంటారు అంది. అందరి మాటా అలా ఉంచు. రామం గారికి, ఆంటీ కి ఇచ్చిరా. వాళ్ళు మనుమరాలిని ఎత్తుకుని ఆడించవలసి వచ్చినప్పుడల్లా కొంత ఇబ్బంది పడుతున్నారట. మాస్క్ లకు కూడా ఇప్పుడు కొరత వచ్చింది కదా, అంది.

అలాగేనమ్మా! సమయాన్ని సద్వినియోగం చేయడంలో నీకు నువ్వే సాటి అంది దివ్య. అమ్మా! ఆపొడిని ఎక్కువగానే చేసి పెట్టు. నాకూ, మా స్నేహితులకు కూడా ఇప్పుడు ఏ కొంచం దగ్గు జలుబూ వచ్చినా కొత్త అనుమానం పట్టుకుంది. అంది దివ్య అమ్మను ప్రశంసిస్తూ.

నేనున్నానని -- కాసాల గౌరీ

"శారూ!  మై ఫ్రెండ్" రైలు పూర్తిగా ఆగకుండానే కిందకి దూకి ప్లాట్ఫారం మీద ఎదురు చూస్తున్న శారదని కౌగిలించుకుంది కమల.

శారద చిరునవ్వుతో తనని పట్టుకుని పక్కకి తీసి
"ఎన్నాళ్ళయింది కదే..... ఎన్నాళ్లు ఏంటి నా మొహం ఎన్నేళ్లు" అంది చిరునవ్వుతో...

"అవును అదీ ఇలా నిన్ను ఒక చక్కని సందర్భంలో కలుసుకోవటం. వేర్ ఈజ్ యువర్ స్వీట్ హార్ట్ చిలిపిగా చూస్తూ అడిగింది.

శారద ఇబ్బందిని మనసులోనే దాచుకుంటూ “సుధీర్ బయట వెయిట్ చేస్తున్నారు రా...” .

ఇద్దరూ బయటికి వచ్చేసరికి కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న సుధీర్ కమలను చూసి రెండు చేతులు జోడించాడు. చిరునవ్వుతో ఫ్రంట్ డోర్ తెరిచాడు.

"అబ్బో మీ మధ్యన నేను ఎందుకండి పానకంలో పుడక" లాగ అంటూ వెనక్కి వెళ్ళబోయింది.

శారద సున్నితంగా కానీ స్థిరంగా కమలని ముందు సీట్లో కూర్చోబెట్టి తను వెనక సీట్లో కూర్చుంది.

దారిపొడవునా సుధీర్  గొప్పతనాన్ని శారద అదృష్టాన్ని వాళ్ళిద్దరూ కలిసి జీవించాలని అనుకోటంలో ఉన్న తెలివైన నిర్ణయాన్ని పొగుడుతూనే ఉంది  కమల.

సుధీర్ సీట్లో కాస్త ఇబ్బందిగా కదిలి వ్యూ మిర్రర్ లో నుంచి శారద వైపు చూశాడు. శారద అర్ధం చేసుకున్నట్లుగా
"అబ్బా కమలా కాసేపు ఆగవే తల్లీ! ఇంటికి వెళ్ళాక చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు” అంది.

కాఫీ తాగాక సుధీర్ కారు తాళం టేబుల్ మీద పెడుతూ
"ఓకే బై శారద నేను వెళుతున్నాను. డ్రైవర్ని పంపిస్తాను. హాయిగా ఎంజాయ్ చేయండి...”

శారద చిరునవ్వుతో సరే అన్నట్టు చూసింది.

"ఏంటి అలా దిమ్మలా కూర్చుండి పోయావు? నేనేం అనుకోను లే వెళ్ళు. వెళ్లి ప్రేమగా బై చెప్పిరా” అంది శారద వైపు చూస్తూ..

“అబ్బా ఆపవే తల్లి మేమేమన్నా చిన్నపిల్లలమా..”

“చిన్నపిల్లలు కాకపోయినా కొత్త దంపతులు కదా” సాగదీస్తున్న కమల నోరు మూసి
"ముందు నువ్వు వెళ్లి తయారై రా మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం" అంది.

ఆ రోజు రాత్రి కమల “చూడు శారద! నో మొహమాటం. నువ్వూ, సుధీర్ మీ బెడ్ రూమ్ లో పడుకోండి. నేను గెస్ట్ బెడ్ రూం లో పడుకుంటాను” అంది.

“సుధీర్ క్యాంప్ కి వెళ్లారు. నిన్ననే వెళ్లాల్సింది నువ్వు వస్తున్నావని. ఈరోజు వెళ్లారు.”

అలసటగా పక్కమీద వాలిపోయింది.

“ఓ అయితే ఓకే.... పొద్దున నుంచి నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను. మీ ఇద్దరూ కలసి ఉంటున్నారు కదా... సుధీరే ముందు అడిగారు అని అన్నావు. మంచి మూడ్ చూసి ఆ మూడు ముళ్ళు వేయించుకో... నీ దగ్గరే పడి ఉంటాడు.. అది సరేగాని ఎంత నేను వచ్చినా వారం రోజులు రాకపోవటం ఏమిటి. మొన్నామధ్య 15 రోజులు ఏదో క్యాంప్ లో ఉన్నాడని చెప్పావు. .. ఈ మధ్యనే కదా మీరు కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు.... అన్ని రోజులు అలా వదిలేయకే  తల్లీ..” తన ధోరణిలో తాను మాట్లాడుతున్నది కమల.

" ప్లీజ్" అనే గద్దింపు విని ఆగిపోయింది.

అప్పటికే శారద మొహం సిగ్గుతోనో కోపంతోనో ఎర్రగా కంది పోయింది.

“అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మమ్మల్ని గురించి... ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు...
పడి ఉంటాడని మూడు ముళ్ళు వేయించుకుని.. నేను పడి పోవడమూ.... మేమిద్దము పిల్లలను సెటిల్ చేయడానికి నానా పాట్లు పడిపోవడం.... అన్ని అయిపోయాయి... అందుకోసమే ఈ లోకం లోకి వచ్చినట్టు ఆయన వెళ్లిపోయారు.
ఇప్పుడు నాకు కావాల్సింది..మగడు కాదు. సామజిక భద్రతా కాదు... ఒక తోడు. ఏ బంధమూ అవసరమూ  లేకపోయినా ఒంట్లో బాగాలేనపుడు ఆప్యాయంగా పలకరించడానికి, ఆనందం గావున్నపుడు నీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎప్పుడో ఒకసారి.. సరిగ్గా విను ఎప్పుడో ఒకసారి....చీకటి మూసిన ఏకాంతములో...
నిద్రపట్టక భయం అనిపిస్తే....మీద చెయ్యి వేసి నేనున్నాను లే అనే భరోసా కలిగించటానికి...ఈ వయస్సులో అంతకుమించి ఏమీ ఉండదు.(ఉన్న తప్పు లేదనుకో), నువ్వు మాట్లాడిన మాటే చూడు
"పడి ఉంటాడు" అన్నావు. అంటే పెళ్లి లో ఉన్నది బంధం అనే కన్నా బైండింగ్ అనేది నీకు అర్థం అవుతుందా.
సగటు భారతీయ కుటుంబంలో పెళ్లి ఒక లీగల్ ఒప్పందం అనిపిస్తుంది నాకు. పెళ్లయిన కొత్తలో భౌతిక ఆకర్షణ భార్య భర్తల్ని సన్నిహితంగా ఉంచుతుంది. పిల్లలు, చదువులు, పెళ్లిళ్లు... పురుళ్ళు, పుణ్యాలు వాళ్లని కొట్టుకుంటూనే కలిసి ఉండేటట్లుగా చేస్తాయి. భార్య భర్తల మధ్య నిజమైన స్నేహభావం ఏర్పడేది బాధ్యతలన్నీ తీరిన ఈ వయసులోనే
వయసు పైబడి శక్తి తగ్గిన ఈ స్థితిలో భార్యాభర్తలు మానసికంగా దగ్గరవుతారు. ఆ సమయంలో భాగస్వామిని కోల్పోవటం దురదృష్టకరం. అందులోనూ ఒక్కరూ ఇద్దరు పిల్లల్ని కని, ప్రపంచీకరణ నేపథ్యంలో వాళ్లు ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నప్పుడు..తోడు ని కోల్పోయిన వారి స్థితి దయనీయమే ... కొందరు అదృష్టవంతులు మనవళ్లు, మనవరాళ్లు, కోడలు, అల్లుడు అనే తాపత్రయం లోనే కొట్టుకుపోతారు. అలా జీవించలేని వారు తనకంటూ ఒక జీవితం ఉండాలి అని అనుకున్న వాళ్ళు.... తోడు కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికొకరు ఆసరాగా మాత్రమే ఉంటూ, స్వేచ్ఛకు భంగం కలగకుండా... కలసి ఉండటమే.. కోరుకుంటారు. నేను సుధీర్ అలాంటి వారమే
అంతే తప్ప భార్య/భర్త బంధం కాదు. భౌతికమైన అవసరము అంతకంటే కాదు. కాలేజీ రోజుల్లో మనం ఇద్దరం ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళం. నువ్వు పెళ్ళితో లండన్ వెళ్ళిపోయావు. మన స్నేహ బంధం ఏమన్నా అయిందా....
నీకు ఇంకొక విషయం చెప్పనా. 15 రోజులు క్యాంపు వెళ్ళినప్పుడు తన మిత్రులకి నన్ను అప్ప చెప్పి వెళ్ళాడు. రోజు ఫోన్ చేసి కనుక్కొనే వాడు. చాలా ఏళ్ల తర్వాత నీతో నేను హాయిగా గడపాలని తను ఎప్పుడో వెళ్లాల్సిన క్యాంప్ ఇప్పుడు వేయించుకున్నాడు. నాకు కావలసింది ఇటువంటి వ్యక్తి. భార్య భర్త అనంగానే ఒకరి మీద మరొకరికి తెలియని అధికారము స్వార్థము వచ్చేస్తాయి. నేను చాలా హాయిగా స్వేచ్ఛగా నిండైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను కమలా నా గురించి వర్రీ అవ్వకు....”
మాటలు పూర్తి చేసి.... తనవైపే తదేకంగా విప్పారిన కళ్ళతో చూస్తున్న కమలతో ."పడుకో తల్లి రేపు గుడికి వెళ్దాం అనుకున్నాం మర్చిపోయావా” అంటూనే.....హాయిగా నిద్ర లోకి జారుకుంది.

“జీవితంలోనూ సార్థక నామధేయురాలివేనే తల్లీ...” మురిపెంగా అనుకుంటూ తను నిద్రకు ఉపక్రమించింది కమల.

Posted in December 2020, కథానికలు

1 Comment

  1. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రోజులు మారిపోయాయి.
    భార్యా..భర్తల అర్ధాలు మారిపోయాయి.
    కలిసి వుండడం అనే బంధం పాపులర్ అవుతుంది.
    యెదైనా మనుష్యులు..వారి మనస్త త్వాలు
    వ్య క్తి త్వాలు మీదే ఆధార పడివుంటుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!