Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-36 - సెకండ్ థాట్ -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

చాలాకాలం తరవాత శర్మగారు మా ఇంటికి వస్తున్నారు. కాబట్టీ ఆయనకి ఏదో ఒక సర్ప్రైజివ్వాలి. మా ఇంట్లో దొంగతనం జరిగింతరవాత సీసీ కెమెరాలు పెట్టించాను. ఆయన మా ఇంట్లోకి ఎలా అడుగు పెట్టారో, ఆయన్ని నేనూ మా చింటూగాడూ ఎలా రిసీవ్ చేసుకున్నామో, ఆయన మా ఇంట్లోకి రాగానే అన్న మొట్టమొదటి మాటేమిటో అన్నీ సెల్లో చూపిస్తే ఆయన మేం అదంతా ఎప్పుడు రికార్డ్ చేశామో తెలీక కన్ఫ్యూజవుతూనే థ్రిల్ ఫీలవుతారు.

ఈ విషయం చింటుగాడికి చెబ్దామనుకునే లోపే కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా ఎంట్రీ ఇచ్చేశారు శర్మగారు. ఆయన్ని చూడగానే చింటూగాడు సంతోషంతో ఎదురెళ్ళాడు. ఉన్నట్టుండి ఆయన కాళ్ళమీద పడిపోయాడు. వాడలా పాదాభివందనం చేస్తాడని ఎంతమాత్రం ఊహించని శర్మగారు కంగారుపడి ఒక్కసారిగా వెనక్కి ఎగిరి దూకాడు. ఆ దూకడంలో ఎడమకాలు బాలన్సు తప్పింది. కుడికాలిమీద నిలబడటం కోసం చేసే ప్రయత్నంలో పక్కనే ఉన్న తలుపు ఊతం తీసుకోబోయారు. ఉన్నట్టుండి గట్టిగా గాలి వీయడంతో ఊతమివ్వాల్సిన తలుపు వెళ్ళి గోడకి కొట్టుకుంది. తలుపు చేతికందకపోవడంతో నిలదొక్కుకోలేక వెల్లకిలా పడిపోయాడు. ఎగదోసుకొస్తున్న నవ్వుని ఆపుకోవడానికి నానా తంటాలూ పడుతూ ఆయన్ని పైకి లేపి తీసికెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను. చింటూగాడు ఆయన్ని చూసి ఎక్కడ నవ్వుతాడో, ఆయనెక్కడ ఫీలవుతారో అని లోపల్లోపల భయంగానే ఉంది నాకు. కానీ వాడు సామాన్యుడు కాదు కదా, అందుకే రాముడు మంచిబాలుడిలాగా ఆయన పట్ల ఎక్కడ లేని సానుభూతీ చూపిస్తూ కాలికి ఆవనూనె తెచ్చిచ్చాడు. వాడిచ్చేదాకా ఆవనూనె నొప్పులకి మంచిదనే విషయం ఆయనక్కూడా తెలీదట. ఆ విషయం చెబుతూ వాణ్ణి చూసి ఎంతగా మురిసిపోయాడో!!

చూశారా? నేను శర్మగారికి సర్ ప్రైజివ్వాలనుకున్నాను. ఆ విషయం వాడితో అనలేదు. అయినా నా మనసులోని మాట చిటికెలో గ్రహించేశాడు. ఆయనకి దిమ్మతిరిగిపోయే సర్ ప్రైజిచ్చేశాడు. అదే వాడి ప్రత్యేకత. బడిలో కూడా అంతే. మేస్టర్లు చెప్పిన మంచి పనుల్ని నిజ జీవితంలో ఆచరించి చూపించే బుద్ధిమంతుడు. వాడు కొత్తగా చేరిన బడి ఔత్తరాహ్యులది. పెద్దలు కనిపిస్తే చాలు, వారికి పాదాభివందనం చెయ్యడం వాళ్ళ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని వాడు పాటించాడు. వాడు ఆ సంప్రదాయంతో ఆయనకి సర్ ప్రైజిస్తున్న విషయం పాపం శర్మగారు ఊహించలేకపోయారు. అందుకే ఈ తంటాలు.

చింటూకి ఈ స్కూలు ఆరోది. అంతకు ముందు ఐదేళ్ళలోనూ ఐదు స్కూళ్ళు మారాడు. అలా మారడం వల్ల వాడికి నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అయింది. కానీ గిట్టనివాళ్ళు మాత్రం వాడి అల్లరి తట్టుకోలేక ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు వాడిని తరిమేశాయని ప్రచారం చేస్తూంటారు. వాళ్ళ అక్కసు వాళ్ళది.

మా వాడి తెలితేటల గురించి నేను చెబితే అది గొప్పలు చెప్పుకున్నట్టవుతుంది. అదే శర్మగారు స్వయంగా తెలుసుకునేలా చేస్తే? అప్పుడాయనక్కూడా వాడి గొప్పదనం అర్థమౌతుంది.

అందుకే,"నువ్వెందుకు పాదాభివందనం చేశావో శర్మగారికి చెప్పరా"అన్నాను.

"మా కొత్తస్కూల్లో నేర్పిన ఫస్ట్ మోరల్ అదే"

"మరలా కాళ్ళకి దణ్ణాలు పెట్టడం నీకిష్టమేనా?"

"మనం దణ్ణాలు పెట్టించుకునే లెవెల్ కి డెవలప్పవ్వాలేగానీ, దణ్ణాలు పెట్టే స్టేజీలో ఉండకూడదు"

"వాడి సమాధానంలో ఎంతటి ఆత్మాభిమానం ఉందో చూశారా?" అని అడగ్గానే శర్మగారు ఏం మాట్లాడాలో తెలియక మాటలు తడుముకున్నాడు. ఆనక చింటూగాడిని మంచినీళ్ళు తెమ్మని లోపలకి పంపించాడు.

"అందరూ దణ్ణాలు పెట్టించుకునే స్టేజిలోనే ఉంటే పెట్టేవాళ్ళెవరుంటారు? వాడికి వాళ్ళ మేస్టారు చెప్పిన పని చెయ్యాలనిపించింది. చేస్తున్నాడు. చెయ్యనివ్వండి. ఎందుకు చేస్తున్నావని అడిగితే వాడిలో సెకండ్ థాట్ తలెత్తుతుంది. అప్పుడు వాడు ఆ సెకండ్ థాట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. ఫలితంగా స్కూల్లో మేస్టర్లు పాఠాలు చెబుతూంటే వీడు ఆ పాఠాలకి సంబంధించిన సెకండ్ థాట్స్ గురించి ఆలోచిస్తూంటాడు. దాంతో తను ఎక్కడో పాఠం చెబుతుంటే వీడింకెక్కడో ఆలోచిస్తున్నాడని మేస్టర్లకి మండుతుంది. వీడికి పనిష్మెంటివ్వడంతో క్లాసు ముగుస్తుంది. ఇప్పుడు మీరిచ్చిన సెకండ్ థాట్ వల్ల వీడిలో తన మేస్టర్లు తనకి ఇష్టంలేని పనులు చేయిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతుంది. అది మేస్టర్ల పట్ల చులకన భావాన్ని ఏర్పరుస్తుంది. పిల్లల్ని చెడగొట్టడానికి ఇంత తెలివి ఉపయోగించడం అవసరమా?" అంటూండగానే వాడు మంచినీళ్ళు తేవడం ఈయన మాటలు ఆపెయ్యడం జరిగిపోయాయి.

అయినా నాకు తెలీక అడుగుతానూ, దేనిగురించైనా అన్ని కోణాల్లోంచీ ఆలోచించేలా చెయ్యడానికేగా చదువు? మరీయనేంటి, సెకండ్ థాట్ పాడుచేస్తుందంటాడు?

అసంకల్పిత జ్ఞానోదయం -- గౌరీ కాసాల

గిరిజా కొంచెం కాఫీ ఇస్తావా! వంటింటి గుమ్మoలో నిల్చుని అడిగాడు ఆనంద్ బిక్కుబిక్కుమంటూనే.

గయ్ మంది గిరిజ. చూస్తున్నారు కదా అంట్లు తోముతున్నాను. కనిపించడం లేదా. పనిలో సాయం చేయడానికి బదులు గడి గడికి ఏదో ఒకటి అడుగుతారు....అన్నీ అక్కడే వున్నాయి పెట్టుకుని తాగండి. . ఒక్కఅంగలో హాల్ లోకి వచ్చి పడ్డాడు ఆనంద్... అయినా ఇంకా తిట్ల వర్షం కురుస్తుందేమో అని భయపడుతూనే ఉన్నాడు. ఆశ్చర్యంగా మళ్లీ గిరిజ నుంచి ఎప్పట్లాగా మాటల తూటాలు పేలలేదు.

ఆనంద్ మంచివాడే గాని గారాబం వల్ల పని అస్సలు అలవాటు లేదు. ఎప్పుడైనా గిరిజకి జ్వరం వస్తే ప్రేమగా క్రోసిన్ ఇచ్చి జ్వరం తగ్గగానే 'కొంచెం కాఫీ ఇస్తావా' అని బుగ్గలు నిమురుతూ అడిగే రకం.

అబ్బా... ఉష్ అంటూ వచ్చి ఆనంద్ పక్కన వున్న వాలు కుర్చీ లో కూలబడింది గిరిజ. ఇప్పుడు తీరిగ్గా తిడుతుంది ఏమో అని మరింతగా పేపర్ లోకి తల దూర్చేసాడు ఆనంద్. ఐదు నిమిషాలైనా ఏమి సడి లేకపోతే ఆశ్చర్యంగా పక్కకు తిరిగి చూశాడు.

కళ్ళకి అడ్డుగా పెట్టుకున్న చేయిని తీయకుండానే నీరసంగా మాట్లాడటం ప్రారంభించింది గిరిజ. అబ్బా అంట్లు తోమటం నిజంగా ఎంత కష్టమండీ.. అంతెందుకు ఒక్క పాల గిన్నె తోమితే చాలు పస తెలిసిపోతుంది. చక్కగా మీగడ కట్టటానికి చిన్న మంట మీద ఎక్కువ సేపు మరిగిస్తాను కదా పాల జిడ్డు గిన్నెకి అంటుకు పోయి ఒక అంతట వదలదు......అంది.

పల్నాటికూడు తినలేక శ్రీనాధుడు 'తింత్రిణీ పల్లవ సహిత ఉడుకు బచ్చలితో జొన్నకూడు ఒక్క ముద్ద తిని చూడు నీ పస తెలుస్తుంది అని కృష్ణుడిని సవాల్ చేశాడట...అలావుంది నీ పాలగిన్నె తోముడు ప్రహసనం.. నవ్వుతూ అంటూ గిరిజ వైపు చూశాడు ఆనంద్.

వెంటనే ఆశ్చర్యపోయాడు, గిరిజ కళ్ళ చివర చిన్న నీటి చుక్క.. ఆనంద్ మాటలని పట్టించుకోకుండానే తన ధోరణిలో తాను మాట్లాడసాగింది... పాపం మంగి జ్ఞాపకం వస్తోందండి..అది కొంచెం వేడి నీళ్లు పోయమనేది... చెయ్యి గట్టిగా అదిమితోము అదే పోతుంది నాజూకు పనికిరాదు అనేదాన్ని. పోనీ స్టీల్ పీచు తో తోముతానంటే గిన్నె గీతలు పడిపోతుందని ససేమిరా వద్దనే దాన్ని. పాపం ఆ గిన్నెకి జిడ్డు వదిలించడానికి ఎంత కష్టపదేదో... ఒక్క పిసరు జిడ్డున్నా మరక వున్నా తిట్టిపోసేదాన్ని.. అది గిన్నెలు తోముతున్నంత సేపు ఏదో ఒకటి సతాయిస్తూనే ఉండేదాన్ని. ఇందాకల మీరు కాఫీ అడిగితే నాకు అంత విసుగేసింది కదా ఆ పిచ్చిది ఎలా భరించెదో నా సణుగుడు... నస...

ఒకసారి "ఇలా అయితే ఎట్టా అమ్మా నాలుగిళ్ళు చేసుకునే వాళ్ళం అంది...". ఆ రోజు నేను చేసిన హంగామా అంతా ఇంతా కాదు..గిరిజ గొంతులో సన్ననిజీర...

నిశ్శబ్దంగా వుండిపోయాడు ఆనంద్.

ఐదు నిమిషాల తరువాత 'నిజం చెప్తున్నా నండి మంగి వస్తే ఒక్క మాటకూడా అనను. పాపం దాని పని అది నిశ్శబ్దంగా చేసుకుని వెళ్ళిపోతుంది. వందో రెండు వందలో జీతం కూడా పెంచుతాను.

...... "నాకు ఏమీ బాగాలేదండి మీరు అన్నం తినండి".... నాకు ఆకలేస్తే పాలు తాగుతాను తర్వాత అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.

ఆనంద్ నిశ్శబ్దంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అన్నం తింటానికి. ఒక్క క్షణం గిరిజ మాటలు మదిలో మెదిలాయి. నానా తంటాలు పడుతూ ఒక గ్లాసుడు పాలు వెచ్చచేసి గిరిజ రూములోకి వెళ్ళాడు.

లాక్ డౌన్ వెతలు – 5: ఎప్పుడు మళ్ళి? -- అత్తలూరి విజయలక్ష్మి

ఫోన్ మోగడంతో చేస్తున్న పని వదిలేసి వచ్చి మొబైల్ తీసుకుని ఆన్సర్ బటన్ నొక్కింది స్వప్న.

“హలో అక్కా ! ఎలా ఉన్నారు? అంతా బాగేనా...”

“ఆ ఆ, బానే ఉన్నామే ...మీరెలా ఉన్నారు"

“మేమూ బానే ఉన్నాం ఇంట్లోనేగా ఎక్కడికీ కదలడం లేదు..”

“మేమసలు తలుపు కూడా తీయడంలేదు పేపర్ తెప్పించడంలేదు... పాల పాకెట్ కింద ఒక బాక్స్ పెట్టారులే మా అపార్ట్ మెంట్ వాళ్ళు అందులో వేసి వెడతాడు.. నేను వెళ్లి తెచ్చుకుంటాను.”

“సుబ్బరంగా కడుగుతున్నావా పాకెట్స్..”

“ఏరియల్ సోప్ వాటర్ తో కడుగుతున్నా..”

“అబ్బే పాలు కంపుకోట్టడం లేదా..”

“నీ మొహం పాలు కడుగుతానా ఏంటి? పాకెట్ కదా కడిగేది...”

“మరి కూరలు, పండ్లు...”

“ఇంటి ముందుకి బండ్ల వాళ్ళు వస్తున్నారు. పెద్దాడిని కిందకి పంపించి తెప్పిస్తా.. ఆ కూరలన్నీ వేడి నీళ్ళల్లో వేసి ముప్పై సెకండ్లు అలా వదిలేసి తరవాత శుభ్రంగా కడిగేసి ఆర పెడతాను..”

“అయితే పనిమనిషిని కూడా మానిపించేసి ఉంటావుగా!"

“నేను మానిపించడం ఏంటి? లాక్ డౌన్ ప్రకటించగానే ఫోన్ చేసింది... తనకి ఆ నెల రావాల్సిన జీతం బ్యాంకు ఎకౌంటు లో వేయమని, లాక్ డౌన్ అయిపోయినా రెండు నెలలదాకా రానని..బ్యాంకు ఎకౌంటు నెంబరు వాట్సప్లో పంపించింది.”

“ఓ ... వెరీ గుడ్.. వాళ్ళే నయం మనకన్నా ఫాస్ట్. పోనీలే ఇప్పుడు వంటపనికి తోడు అంట్ల గిన్నెలు, పాచిపని, బట్టలు తయారయాయి.. నాకూ అంతేలే.."

“వంట మామూలు వంటా... ఈ నెల రోజుల నుంచీ చేసిన వంట చేయకుండా చేస్తున్నా.. ఏ పూట వంట ఆ పూటే ... మీ బావగారి సంగతి తెలుసుగా చాదస్తం .. ఉదయం చేసినవి మిగిలితే బయట పారేయమంటారు కానీ అన్నీ ఎప్పటికప్పుడు వేడిగా చేయమంటారు. ఆయనకీ ఇష్టమైనవన్నీ ఒక లిస్టు రాసిచ్చారు. అవన్నీ చేసి, చేసి అలసిపోతున్నానుకో. .. మళ్ళీ సాయంత్రం వంట... అడక్కు తల్లీ ఇదివరకు తొమ్మిది అయే సరికి ఎవరిదారిన వాళ్ళు కాలేజీలకు ఆఫీస్ కి వెళ్ళిపోయే వాళ్ళు... కాసేపు పేపర్ చదివి, కాసేపు టి వి చూసి పనిమనిషి వచ్చాక కాస్త కిచెన్ సర్ది దానికిస్తే దాని పది అది చేసుకునేది. బోలెడంత ఖాళీ... సాయంత్రం మీ బావగారు, పిల్లలు వచ్చిందాకా బిక్కు, బిక్కు మంటూ ఒక్క దాన్నే ఉండే దాన్ని..”

“అవును... బోర్ కొడుతోంది అంటూ గోల పెట్టే దానివి.. బావగారు అసలు ఇంట్లోనే ఉండరని, ఆఫీస్ అనీ, సాయంత్రం క్లబ్ కని వెళ్తారు నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడేదానివి.. ఈ కరోనా పుణ్యమా అని బావగారు ఇంట్లోంచి కదలడం లేదేమో!"

“ఇంట్లోంచి ఏవిటే తల్లి... శోభనం పెళ్లి కొడుకులా ఆ మంచం కూడా దిగరు.. ఆ మధ్య ఒక టి వి కొని బెడ్ రూమ్ లో పెట్టారు.. ఇప్పుడు అది విశ్రాంతి లేకుండా మోగుతూనే ఉంటుంది. మంచం మీదకే కాఫీ, టిఫిను, నీళ్ళు, బిస్కెట్లు...అడక్కు తల్లి... అస్తమానం ఆయన సేవలు చేస్తూ పిచ్చెక్కుతోంది..” కొంచెం గొంతు తగ్గించి చెప్పింది...” ఎందుకు అలా బాధపడేదాన్నా అని ఇప్పుడు తలబాదుకుంటున్నా. ఈ లాక్డౌన్ ఎప్పుడు అయేనో ... ఈయన  మళ్ళి ఎప్పట్లా ఎప్పుడు తిరిగెనో! సరేలే ఉంటా”

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ -- డా.సిహెచ్. సుశీల

తన డ్యూటీ అయిపోగానే అలసటగా కుర్చీలోకూలబడింది మేరీ. ఎప్పుడు ఇంటికి వెళ్తున్నామో ఎప్పుడు డ్యూటీకి వస్తున్నామో! షిఫ్టులువారీగా 24గంటలు డ్యూటీ చేస్తున్నాం. పొద్దుటినుండి అదేపనిగా 8గంటలు ఎండలో ఈ పోలీస్ యూనిఫారంతో పనిచేయడం అంటే నరకంలో ఉన్నట్టు వుంది. కరోనా భయంతో ప్రపంచమంతా వణికిపోతుంటే ఇండియా కాస్త నయం అనుకొన్నాం. కానీ ఇండియాలో కూడ విజృంభించింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర లలో కూడ పాజిటివ్ కేసులు ఎక్కువయ్యాయి. అందులోనూ విజయవాడలో మొదటి కరోనా సోకినవ్యక్తి మరణించడంతో సి.యం. సీరియస్ గా తీసుకొన్నారు. పోలీస్ బాస్ లు సైతం రోజూ నగరమంత పర్యటిస్తున్నారు. ఒక ప్రక్క మీటింగ్స్ అటెండ్ అవుతూ మళ్ళీ ఎండలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు. వారే విశ్రాంతిలేకుండా ఎండల్లో తిరుగుతుంటే క్రింది ఉద్యోగస్తులకూ తప్పడంలేదు.

ఇళ్ళల్లో సుఖంగా ఉండండి నాయనా అంటే ఇలా రోడ్లమీదకు వచ్చేస్తారేమిటో! ఎక్కడికక్కడ వారిని, బళ్ళను ఆపడం, ప్రశ్నించడం, కేసులు బుక్ చేయడం, ప్రక్కన పార్క్ చేయించి కీస్ తీసుకొని వారిని పంపేయడం పెద్దతలనొప్పి పని అయిపోయింది. ఒక్కోసారి ఒళ్ళుమండి చెడామడా తిట్టేస్తున్నాం, లాఠీలకు పని కల్పిస్తున్నాం. “పోలీసుల అత్యుత్సాహం” అని మీడియా గోల.

“జీసస్” అంటూ చెమట తుడుచుకొంటున్న మేరీ దగ్గరికి మైక్ పట్టుకొని ఒక యాంకర్ వచ్చింది. కెమెరామెన్, దూరంగా మీడియా వెహికల్. ఏవో ప్రశ్నలు అడుగుతోంది. కళ్ళలో నీరుతిరిగింది.

“మేం ఇంటికి దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నాం కాని ఇది తప్పనిసరి పరిస్తితి. ఇంత అలిసిపోయినా ఇంటికి వెళ్ళగానే యూనిఫారం, బూట్లు, మాస్క్, కర్చీఫ్ తో సహా అన్నీ వేడినీళ్ళలో వాష్ చేసుకునేవాళ్ళం. ఈమధ్య పాజిటివ్ కేసులు ఎక్కువకావడం, రెడ్ జోన్స్ లో డ్యూటీచేస్తుండడం వల్ల మా బాస్ లు, డాక్టర్ల సలహామేరకు నాలుగురోజుల నుండి ఇంటికి వెళ్ళడం మానేశాం. ఏమో మావల్ల మాఇంట్లో వారికి వ్యాధి సోకితే! ఊహించలేకపోతున్నాం. ఎప్పుడో ప్రభువు సన్నిధికి పోయేవాళ్ళమే కాని, ఇప్పుడు ఇలాంటి సమాజసేవలో మాప్రాణాలు అర్పించినా ఫరవాలేదు అన్న నిర్ణయం మాలో ఎలా కలిగిందో చెప్పలేం. ఈ పరిస్తితి మాలోఈ తెగింపుని తెచ్చిందేమో!” అంది.

వాట్సప్ కాల్ చేస్తారా అని యాంకర్ అనడంతో ఇంటికి వీడియోకాల్ చేసింది మేరీ. అమ్మని చూడగానే ఏడుపుమొదలు పెట్టాడు బాబు. కడుపులో ఏదో పేగు కదిలిన భావన. “అమ్మా ఇంటికి రా” అంటున్నాడు.

“డోంట్ వర్రీ డియర్. టి విలో చూస్తున్నాం. మీ కష్టం తెలుస్తోంది. మీ శ్రమ చూస్తుంటే గర్వంగా వుంది. కంగారుపడకు” అన్నాడు భర్త.

ఎప్పుడూ ఏదో విసుక్కునే అత్తమ్మ కళ్ళనీళ్ళతో పలకరించింది. “మేరీ, నీ కొడుకు అస్సలు మాట వినడం లేదు. వీడితో ఎలా వేగావో ఇన్నాళ్ళు. పనిమనిషి రాకపోవడంతో నేను, అబ్బాయి పనిచేసుకోలేక అల్లాడిపోతున్నాం. తల్లీ, ఇన్నాళ్ళూ ఎలా మానేజ్ చేసుకొన్నావో ఇప్పుడు అర్ధం అవుతోంది. వీడికి ఇంట్లో అస్తమానం వుంటే విసుగు. బైటికి పంపితే ప్రక్క ఫ్లాట్ల పిల్లలతో ఆడుకొంటాడు అనుకుంటే, కాసేపు ఆడుకొని కొట్టుకొంటున్నారు. ఈ గొడవలు, చాడీలతో పెద్దలు అందరం విసిగిపోతున్నాం. ఎప్పుడు ఈ కరోనారాక్షసి పీడా పోతుందో” అందామె.

ఫోన్లో చూస్తూ ఏడ్చేస్తోంది మేరీ. యాంకర్ కి కూడ కంటిలో నీరు తిరిగింది. లైవ్ చూస్తున్న పోలీస్, వైద్య, పారిశుద్ధ్యకార్మికుల కుటుంబాల వారి గుండెలు బరువెక్కాయి.

డోర్ –డెలివరీ -- రాజేశ్వరి దివాకర్ల

ఆంటీ, "ఇన్స్టా కార్ట్" డెలివరి విండో తెరిచారు, ఇంట్లోకి కావలసిన సమాను లిస్ట్ చెప్పండి, ఆర్డర్  చేస్తాను, అన్నాడు రాజేష్. ఆంటీ వచ్చినప్పటినుంచి, ఇంటికి కావలిసిన సరకుల విషయం అంతా ఆమె చూసుకుంటోంది. వంట బాధ్యత అంతా అమ్మ చూసుకోవడంతో సునంద కూడా ఇంట్లో ఆఫీసు పనికి కావలసినంత టయిం కేటాయించ గలుగుతోంది. రాజేష్ ఇంటికి కావలసిన వస్తువులను ఎప్పటికప్పుడు తెచ్చి పెడతాడు. ఇది లాక్ డౌన్ సమయం కనుక దుకాణాలకు తాను వెళ్ళడం లేదు. తామిప్పుడు ఉంటున్న వర్జినియాలో లాక్డౌన్ అమలుచేస్తున్నారు. కాని అవసరమైన సరకులు, సామాన్లను, "డోర్ డెలివరీ" అందించే వాళ్ళు ఇంటిముందు పెట్టి వెళ్తున్నారు. రాజేష్ ఈ మధ్య అడిగినప్పుడల్లా ఆంటీ పెద్ద లిస్ట్ చెప్తోంది. పది రోజుల కిందటే రాజేష్ తాజా కూరలూ, పళ్ళూ, ఫ్రోజెన్ కూరలూ తెప్పించాడు. ఇప్పుడేవీ పెద్దగా అవసరం ఉండవులే అనుకుంటూ అయినా ఆంటీని ఒకసారి అడుగుదాం అని అడిగాడు. అతడికి ఆశ్చర్యం కలిగేటట్లుగా సామాన్ల పట్టీ చెప్తూ ఈ సారి బియ్యం, నూనె వగైరాలు కూడా జత చేసింది. రాజేష్ "అదేమిటి ఆంటీ మొన్ననే కదా..." అని ఏదో అనబోయి, ఆంటీ మీద గౌరవంతో ఏమీ మాటాడక ఆ సామానంతా తెప్పించాడు. సామాను తెచ్చినట్టుగా వాకిలి బెల్లు మోగింది. ఈ మధ్య తెచ్చిన సామాన్లను అలాగే బయట పది గంటలు ఉంచి లోపల పెట్టుకుంటున్నారు.

అందరూ ఇంటినుంచే పని. పిల్లలకు బళ్ళు కూడా మూసి ఆన్లైన్ తరగతులు చెప్తున్నారు. భార్యా భర్తలిద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి ఇంటినుంచే అయినా మీటింగ్ ల మీద మీటింగులతో పూర్తిగా అలసి పోతున్నారు. పొద్దున్నే వచ్చిన సామానును ఇంట్లోకి తీసుకొద్దామని సాయంత్రం తలుపు తీస్తున్న రాజేష్ ను ఆంటీ వారించింది.

ఎందుకు అన్నట్టు చూసాడు రాజేష్. ఆంటీ ఇలా అంది. రాజేష్, ఆ బియ్యం, పప్పులూ, కూరలూ, పళ్ళూ నూనే, ఇతర సామానులన్నింటినీ బాబా గుడిలోని పూజారిగారి కోసం తెప్పించాను. గుడికి ఇప్పుడెవ్వరూ వెళ్ళటంలేదు ..ఇదివరకు భక్తులు రోజూ వచ్చి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడెవ్వరూ ఇంట్లో పూజలకు, కార్యక్రమాలకూ కూడా పిలవటం లేదు. పాపం ఆయనకెలా గడుస్తుంది. అందుకనే ఆయనను వచ్చి తీసుకెళ్ళమన్నాను అంది.

అవును రాజేష్ ఈమధ్య కొత్త సంక్షోభంలో గుడి విషయం పూర్తిగా మరచి పోయాడు. ప్రతి వారం ఆంటీని గుడికి తీసుకుని వెళ్ళే వాడు. ఆంటీ భక్తి తో పాటు పూజారి గారితో కొద్ది సేపు మాట్లాడి ఆయన కష్ట సుఖాలను కూడా తెలుసుకుని మంచి స్నేహితురాలయింది. ఆయన తన కుటుంబాన్ని భారత దేశంలో వదిలి దాతల ఆశ్రయంతో వచ్చి అర్చకునిగా విధి నిర్వహిస్తున్నాడు. తనకు భక్తులిచ్చే వ్యక్తిగతమైన కొద్ది ఆదాయంతో ఇక్కడ ఉంటూ కుటుంబాన్నీ, పిల్లల పోషణా వ్యయాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఇప్పుడు భక్తులెవ్వరూ గుడి వైపు వెళ్ళటం లేదు. నలుగురైదుగురు సాయం చేస్తే తప్ప ఇప్పుడాయనకు గుడిలో దేవుని నైవేద్యానికి జరుగు బాటు కాదు. ఆంటీ మంచి పని చేసింది అనుకుంటూ తన వంతు సహాయంగా పూజారి గారి ఖాతాకు కొంత డబ్బును పంపాడు.

బయట ఉన్న సామానును తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పూజారి గారు కారు దిగిన శబ్దాన్ని గమనించిన రాజేష్ తలుపు తెరిచి ఉన్న చోటునుంచే ఆదరంగా ఆయనను పలుకరించాడు.

Posted in September 2020, కథానికలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!