గడ్డిపూవు
నాదు సౌరభ మెవరి కెరుకౌ,
గడ్డి పూవును నేనుగావున
లోక మందున నాకు సుంతయు
ఘనత కానను దైవమా !
నేలబారున నేను పూయుచు
కాలి తాపుల నెన్నొ కాయుచు
బతుకు బరువును మోయుచుందును
కష్ట భరమున క్రాలుతూ...
చిన్నపూవుగ పూచి నానని
విన్నబోకనె విచ్చుకుందును
కనులవిందగు రూప సంపద
నేలతల్లికి ఇంపుగాన్!
చిట్టిపాపలు చేరి భువిపై
చిందులేసెడి వేళ లందున,
పసిడి మువ్వలు మ్రోయుచుండగ
పరుగు తీసే తావులో
పట్టు పరుపుగ మారి మురియుచు
వారి పదముల క్రింద నలుగుచు,
జన్మ ధన్యత గాంచె ననుకొను
చిన్ని పూవును నేనెగా!