శుక్రవారం సాయంత్రం ... స్మరణ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సంధ్య ఇంట్లోనే ఉంది. అప్పటికే ఆమె ఆఫీస్ నుంచి వచ్చి, డిన్నర్ కి చపాతీ చేయడానికి పిండి తడుపుతోంది. స్మరణ వస్తూనే ఆవిడ చేతిలోంచి పిండి లాగి పడేసి, “గెట్ రెడీ... షాపింగ్ కి వెళ్దాము.. డిన్నర్ బయటే.. నువ్వు ఇప్పుడేమి ప్రిపేర్ చేయకు” అంది.
“పిండి తడిపేసానుగా ఇప్పుడిది ఏం చేయను...” విసుక్కుంది సంధ్య..
“అది కూడా సమస్యేనా .. ఫ్రిడ్జ్ లో పెట్టేయ్ ... రేపు శనివారం కదా తాతయ్య కూడా వస్తారు కాబట్టి పూరీ, పన్నీరు బట్టర్ మసాలా కూర చేద్దాం... నేను స్నానం చేసి వస్తా నువ్వు రెడీ అవ్వు” అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బాత్రూం వైపు వెళ్ళిపోయింది.
“మరి నాన్నో” అని అరుస్తున్న సంధ్యకి అదే స్థాయిలో “నేరుగా మాల్ కి వస్తారు” అని చెప్పి డోర్ వేసుకుంది.
“లేడికి లేచిందే పరుగు..” సణుక్కుంటూ తడిపిన పిండి బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి, చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్ళింది సంధ్య.
తల్లి, కూతుళ్ళు తయారై వచ్చేసరికి దీపక్ కూడా వచ్చేసాడు.
“అదేంటి నేరుగా మాల్ కి వస్తానన్నారని చెప్పిందిగా” అంది సంధ్య ఆశ్చర్యంగా.
“కొంచెం త్వరగా బయలుదేరి వచ్చేసా.. మళ్ళీ మీరటు, నేనిటు అయితే కష్టం కదా” అంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి మొహం కడుక్కుని వచ్చాడు. కాఫీ తాగుతారా టవల్ అందిస్తూ అడిగింది.
ఇవ్వు దీపక్ సమాధానం చెప్పే లోపలే స్మరణ కూడా “నాకూ కావాలి” అంది.
సంధ్య ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చేసరికి ఇద్దరూ ఏమేం కొనాలో చర్చిస్తూ, స్మరణ మొబైల్ లో నోట్ చేసుకుంటోంది.
“తాతయ్య కి పాంటు, షర్ట్ కొనమంటావా! ధోవతి, లాల్చీ కొనమంటావా” అడిగింది స్మరణ ఆవిడ చేతిలోంచి కాఫీ కప్పు అందుకుంటూ.
“ఆయన ఇప్పుడు దోవతులే ఎక్కువ కట్టుకుంటున్నారు పాంట్, షర్టు వద్దు” అన్నాడు దీపక్.
కాఫీలు తాగడం అవగానే బయలుదేరారు. దీపక్ కారు స్టార్ట్ చేసాడు.
స్మరణ ఆఫీస్ వేర్ నాలుగు జతలు కొనుక్కుంది. సంధ్యకి రెండు చీరలు, దీపక్ కి రెండు టీ షర్ట్స్, ఆంజనేయులు కి ధోవతులు, లాల్చీలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ లు మొత్తం షాపింగ్ అయేసరికి తొమ్మిది అయింది. రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి పదకొండు దాటింది. మర్నాడు శనివారం, స్మరణకి వీక్లీ ఆఫ్, అది రెండో శనివారం కావడం వల్ల దీపక్ కి, సంధ్య కి కూడా సెలవు.. తల్లి, తండ్రులకి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. దీపక్ కూడా డ్రెస్ మార్చుకోడానికి వెళ్తుండగా మొబైల్ మోగింది.
స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసి “నాన్నేంటి ఇప్పుడు ఫోన్ చేసాడు” అంటూ ఆన్సర్ బటన్ నొక్కి హలో అన్న దీపక్ మోహంలో అవతల వ్యక్తి మాటలకి మారుతున్న భావాలు చూస్తూ ఆందోళనగా అడిగింది “ఏమైంది..”
“సరే! బయల్దేరతాము.. ఈ లోగా జాగ్రత్తగా చూసుకో..” అని ఫోన్ పెట్టేసి, నాన్న పడ్డారుట.. మనం రాజమండ్రి బయలుదేరాలి” అన్నాడు హడావుడిగా లేస్తూ.
“అయ్యో.. ఎప్పుడు? దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నారుట? ఎవరు మాట్లాడారు బంగారయ్యేనా” కంగారుగా గబగబా అడిగింది సంధ్య.
“అవును...తలకి తగిలిందిట.. హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారుట ... వాడేమి సరిగా చెప్పడం లేదు.. ముందు బట్టలు సర్దు...” అని చెప్పి “స్మరణా” అంటూ స్మరణ గది తలుపు కొట్టాడు. స్మరణ తలుపు తీసింది... “తాతయ్య పడ్డారుట. నేను, అమ్మా రాజమండ్రి బయలుదేరుతున్నాము” అన్నాడు.
“అవునా.. అరె ఎలా... నేనూ వస్తాను డాడీ రేపు, ఎల్లుండి ఆఫ్ కదా!” అంది స్మరణ..
“రెడీ అవు.. బట్టలు సర్దుకో..” చెప్పి డ్రెస్ మార్చుకుని కుర్తా, పైజమా వేసుకున్నాడు.
సరిగ్గా అరగంటలో వాళ్ళు ఎక్కిన కారు బయలుదేరింది.
“అయ్యో! పెద్దాయన ఈ వయసులో పడితే ఎంత కష్టం! చిన్న గాయాలైతే పర్వాలేదు కానీ, పెద్ద గాయాలు తగిలితే ఓ పట్టాన తగ్గుతాయా! ఎప్పటి నుంచీ చెబుతోంది తను.. ఒక్కరే ఏం చేస్తారు ఇక్కడ.. మాతో వచ్చేయండి అని వింటేనా..” సంధ్యకి క్రితం సారి రాజమండ్రి వెళ్ళినపుడు ఆయనతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
“మీరు మాతో వచ్చేయండి మావయ్యా.. కాస్త మీరుంటే మాకు కొండంత అండగా ఉంటుంది.. స్మరణ కూడా కొంచెం భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకుంటుంది.”
“ఇంత ఇల్లు ఎవరూ లేకుండా ఎలా పాడు పెట్టనమ్మా ... వీడు ఉన్నాడుగా నన్ను కనిపెట్టి ఉండడానికి భయమెందుకు” బంగారయ్య వైపు ఆపేక్షగా చూస్తూ అన్నారు. ఆ మాటకి మురిసిపోతూ “ఆయ్” అన్నాడు బంగారయ్య..
“సర్లెండి.. వాడి మూతి వాడికే కడుక్కోడం రాదు.. మిమ్మల్నేం చూస్తాడు! చూడండి ఎలా ఉన్నాడో” అంది సంధ్య. బంగారయ్య మొహం నిండా అంటుకున్న సీతాఫలం గుజ్జు చూపిస్తూ వస్తున్న నవ్వు ఆపుకుంటూ..
ఆయన నవ్వి...” వాడికి సీతాఫలం తినడం రాదు.. వెళ్ళరా మొహం కడుక్కుని రా” అని చెప్పి, సంధ్యతో అన్నాడు. “నీకు ఏదన్నా అవసరం అయి రండి మావయ్యా అంటే రెక్కలు కట్టుకుని వాలతాను.. మీ ఆఫీస్ గొడవల్లో మీరు, దాని కాలేజ్ గొడవలో స్మరణ ఉంటే నేను వచ్చి ఏం చేయను! ఇక్కడైతే పుట్టిన దగ్గరనుంచి ఉన్నవాడిని అందరూ తెలిసిన వాళ్ళు.. నా గురించి నువ్వేం దిగులుపడకు”
సంధ్య మాట్లాడలేదు. నిజమే, పుట్టి పెరిగిన ఊరిని, ఆ ఊరితో ఆయనకున్న అనుబంధాన్ని, తండ్రి నుంచి సంక్రమించిన లంకంత ఇల్లుని, చుట్టూ అల్లుకున్న తోటని విడిచి ఎలా వస్తారు! ఆ ఇంటికన్నా తోట చాలా ఇష్టం సంధ్యకి. బోలెడంత ఖాళీ స్థలంలో రక,రకాల మొక్కలు, తీగలు, వేప, మావిడి, ఉసిరిగ చెట్లు.. పచ్చగా ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అడపా, దడపా పండిపోయాయి అని వంటగది గుమ్మం లోనుంచి విసిరేసిన దొండకాయ, ముదిరాయని పడేసిన బెండకాయలు.. అల్లిబిల్లిగా నేలంతా పరుచుకుంటే, వాటికి పాదులు కట్టి, పందిరివేసి, బోలెడు చాకిరీ చేస్తాడు ఆయన. తోట పనే ఆయన వ్యాయామం.. వంకాయలు, కాకరకాయలు.. వేసవి రాగానే విరగ కాసిన మావిడి చెట్టు కాయలే ఊరగాయకి.. సంధ్య వెళ్ళడం ఊరగాయ పెట్టడం చుట్టూ పక్కల అందరికీ పంచిపెట్టగా మిగిలింది తనతో తెచ్చుకోడం.. పెద్ద నుయ్యి, అవతల పెరటి గోడనానుకుని పశువుల కొట్టం.. ఆయనకి పశు సంపద లేకపోయినా, పక్క వాళ్ళ పశువులు ఆ కొట్టం లోనే ఉంటాయి.. ఆ ఇల్లంటే సంధ్యకి చాలా ఇష్టం. ఆ ఇంట్లో కొంతకాలం ఉండి హైదరాబాదు వచ్చాక అద్దె ఇళ్ళల్లో ఇమడలేక విసుక్కునేది. తరవాత మెల్లగా లోన్ తీసుకుని శ్రీనగర్ కాలనీలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఆంజనేయులు పదిహేను లక్షలు ఇచ్చాడు ఆ ఇంటికి. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో కచ్చితంగా కుటుంబంతో వెళ్లి పదిహేను రోజులు గడపడం సంధ్యకి చాలా ఇష్టం. ఆంజనేయులు రెండో కొడుకు దాదాపు ఇల్లరికం వెళ్ళినట్టే.. ఎప్పుడో మూడ్ వచ్చినపుడు మాత్రం ఒక్కడే వచ్చి రెండు రోజులు గడిపి వెళ్తుంటాడు. ఆయన్ని దూరం నుంచి కూడా కనిపెట్టి ఉండేది దీపక్, సంధ్య మాత్రమె. ఎప్పుడన్నా ఆ కొడుకు ప్రస్తావన వచ్చినా ఆయన పెద్ద మనసుతో స్పందిస్తాడు.. “ఎక్కడో అక్కడ వాడు బాగుంటే చాలమ్మా” అంటాడు.
ఆలోచనల్లోనే మంచి నిద్ర పట్టేసింది సంధ్యకి. దీపక్ సూర్యాపేట వరకు చేస్తే అక్కడి నుంచి రాజమండ్రికి తను డ్రైవ్ చేసింది స్మరణ. తెల్లారి ఏడున్నర దాటుతుండగా రాజమండ్రి చేరారు. వీళ్ళు వెళ్లేసరికి ఆంజనేయులు అరుగు మీద కూర్చుని బ్రష్ చేస్తుకుంటున్నాడు. తలకి కట్టుంది.. గడ్డం మీద ప్లాస్టర్ ఉంది. కారు ఆగిన శబ్దానికి గబుక్కున లేచి, తడబడుతున్న అడుగులతో గేటు దగ్గరకి వచ్చాడు. ఆయన్ని చూడగానే స్మరణ చెంగున కారు దిగి ఒక్క అంగలో ఆయన్ని చేరి తాతయ్యా అంటూ గట్టిగా వాటేసుకుంది..
ఆయన చేతిలో బ్రష్ జారవిడిచి మనవరాలిని ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాడు. కొడుకు, కోడలు దగ్గరగా వచ్చి ఎలా ఉన్నావు నాన్నా అని దీపక్ అడిగితే సంధ్య ఆయన పాదాలు తాకి కళ్ళకు అద్దుకుని “ఎలా ఉన్నారు మావయ్యా” అంది.
“మీకు బంగారయ్య ఫోన్ చేసాడా.. వీడి దుంప తెగ... ఒద్దని చెబితే విన్నాడు కాదు.. ఏం చెప్పాడు.. నాకు పెద్ద ప్రమాదం జరిగింది చావు బతుకుల్లో ఉన్నానని చెప్పాడా..” అంటూ వెనక్కి తిరిగి, లోపలికి తొంగి చూస్తూ గట్టిగా పిలిచాడు "ఒరేయ్ బంగారూ..”
అప్పటికే కారు శబ్దం, మనుషుల అలికిడి విని బయటకి రానా వద్దా అన్నట్టు తొంగి, తొంగి చూస్తున్న బంగారయ్య గబుక్కున “ఆయ్” అంటూ వచ్చాడు.
“ఏమని ఫోన్ చేసావురా! “
ఆయన మాట పట్టించుకోకుండా సంధ్య వెనక చేరి “తవరు లోపలికి రండి అమ్మగారూ.. పెట్టెలు నేనట్టు కోస్తాను..” అంటూ కారు దగ్గరకి వెళ్ళాడు.
“ఇదిరా వరస... వీడికి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది..”
సంధ్య, స్మరణ నవ్వేసారు. దీపక్ కూడా నవ్వుతూ “పోనీ నాన్నా.. వాడి భయం వాడిది.. నువ్వు పడగానే కంగారు పడి ఫోన్ చేసాడు. ఇంతకీ బాగా తగిలాయా దెబ్బలు..”
“కనిపిస్తోంది కదా.. ఇంకా అడుగుతారేం.. మావయ్యగారు అసలేమి తగల్లేదు అంటారు అంత కట్టు కట్టినా..”
సంధ్య మాటలకి ఆప్యాయంగా నవ్వి ఆమె తల మీద చేయేసి నిమిరాడు ఆంజనేయులు. “ వెళ్ళండి లోపలికి వెళ్లి, స్నానాలు, టిఫిన్లు అవీ చూసుకోండి..” అన్నాడు. సంధ్య, దీపక్ లోపలికి వెళ్ళారు.. స్మరణ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడిపిస్తూ “ఏంటిరా తల్లి విశేషాలు..” అని అడిగాడు.
“నాకు వేరే జాబు వచ్చింది తాతయ్యా. పాత దానికన్నా కొంచెం జీతం ఎక్కువ..పెర్క్స్ కూడా ఎక్కువ”
“కొంచెం జీతం ఎక్కువ అని ఇలా జాబులు మారుతూ ఉంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్... కొత్త మనుషులు ఎలా అడ్జస్ట్ అవుతావు?”
“కార్పోరేట్ ఉద్యోగాలు అంతే తాతయ్యా.. ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కడ ఉంటె అక్కడికి జంప్ అవుతూ ఉంటాము..అవకాశాలు వచ్చినపుడు క్యాచ్ చేయాలి.. నేను పట్టుకోకపోతే వేరే వాళ్ళు పట్టుకుంటారు.. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు.. నేను వెనకపడతాను. కాంపిటీటివ్ వరల్డ్ కదా... మేము పరిగెడుతూనే ఉండాలి.. లేకుంటే వెనకపడిపోతాము.
“పరిగెత్తి పాలు తాగే కన్నా...” ఆయన మాటలకి మధ్యలోనే అడ్డు వస్తూ అంది “చాలా పాత సామెత తాతయ్యా... పాలు అయినా, నీళ్ళు అయినా మేము పరుగు పెట్టాల్సిందే..” పక పకా నవ్వింది.
“అల్లరి పిల్లా!..” అంటూ నెత్తి మీద మొట్టికాయ వేసాడు ...” ఇంతకీ మీ మేనేజర్ మంచి వాడేనా.. నీకు అర్థం అయేలా చెప్తున్నాడా ప్రాజెక్ట్ గురించి..”
“వాడి మొహం వాడు చెప్పడం ఏంటి .. నేనే చెప్పగలను... నీకో విషయం తెలుసా.. ఈ కంపెనీలో ఇంటర్వ్యూ కి వెళ్ళినపుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు.. మీ పేరు బాగుంది ఎప్పుడు జాయిన్ అవుతారు” అని అడిగాడు.
“ఓ నీ పేరు చూసి ఇచ్చాడా జాబు...”
“అంత లేదులే తాతయ్యా... కంపెనీ కొత్తది.. సి ఇ వో చాలా మేధావి, డైనమిక్ అట.. బిగినింగ్లోనే పెద్ద, పెద్ద ప్రాజెక్ట్స్ పట్టాడు..అతను లండన్ లో చదువుకుని వచ్చాడుట. తెలివి, తేటలతో పాటు బాగా డబ్బు కూడా ఉందిట.”
“ట ట అంటున్నావు... నువ్వు కలుసుకోలేదా అతన్ని.”
“హెడ్ ఆఫీస్ బెంగుళూరు .. అతను అక్కడే ఉంటాడు. మా డైరెక్టర్ తో తప్ప ఇంక ఎవరితో మాట్లాడడు..”
“ఓహో... సరే... తరవాత బోలెడు కబుర్లు చెప్పుకుందాం స్నానం చేసిరా టిఫిన్ తిందాము.. అంటూ స్మరణ ని పంపించి ఆయన నూతి దగ్గరకు వెళ్లిపోయాడు.
సంధ్య స్నానం చేసి, వంటగదిలోకి వెళ్ళేసరికి పనమ్మాయి లక్ష్మి ఉల్లిపాయలు తరుగుతోంది. బంగారయ్య పెసరట్ల కోసం పిండి రుబ్బి గరిటతో కలుపుతున్నాడు. సంధ్య కొంగు నడుం చుట్టూ దోపి, “ఈ రెండు రోజులూ వంటగది నాకొదిలేసి నువ్వు వేరే పని చూసుకో వెళ్ళు” అంటూ బంగారయ్య చేతిలో గరిట అందుకుంది. బంగారయ్య సరే నమ్మ గారూ అంటూ పక్కకి తప్పుకున్నాడు.
“అదిసరేరా.. అంత రాత్రివేళ ఫోన్ చేసావు.. అసలు ఏం జరిగింది?” కుతూహలంగా అడిగింది సంధ్య.
“అయ్యగారు రోజూ లాగే యాప సెట్టు కింద రెండు గంటల సేపు కూసుని పాటలిన్నారండి.. ఆనక రేడియో సేతిలో అట్టుకుని కుర్సీ లోంచి లేవబోయి గబాల్న పడిపోనారు.. రత్తం బోట బోట కారుతుంటే నేను కంగారడ్డానండి.. లగేత్తుకుంటూ ఎల్లి మన డాట్రగారిని పిల్సు కొచ్చాను... ఆనక అయ్యగారికి ఫోను చేసినాను..”
సంధ్యకి అర్థమైంది.. సాయంకాలాలు పడక్కుర్చీ లో వేప చెట్టు కింద కూర్చుని పాత పాటలు వింటూ ఎంజాయ్ చేయడం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. అందులోనే ఆయనకీ ఆనందం.
లక్ష్మి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు ప్లేట్ అందించింది. “బాగున్నావా లక్ష్మి... పిల్లలు ఎలా ఉన్నారు? మీ ఆయన ఏమన్నా మారాడా!” ఆప్యాయంగా అడిగింది.
“ఆడు మారడం, పట్ట పగలు చుక్కలు పొడవడం జరిగేవి కాదులెండమ్మా”... నవ్వింది లక్ష్మి.
లక్ష్మి భర్త తాగుబోతు, పెళ్ళాం, పిల్లలని ఏ మాత్రం పట్టించుకోడు.. బంగారయ్య తల్లి నాంచారమ్మ పోయిన దగ్గర నుంచీ లక్ష్మే ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ, ఆంజనేయులు మంచీ, చెడు చూస్తోంది. లక్ష్మి, బంగారయ్య ఉన్నారు కాబట్టి తను నిశ్చింతగా ఉంది.. సంధ్య పెనం కోసం వెతుకుతుంటే లక్ష్మి తీసి ఇచ్చింది. వంటగది శుభ్రంగా ఉంది. కాకపొతే చుట్టూ గోడలకి దగ్గరగా నీళ్ళ బిందెలు, ఒక పాతకాలం చెక్కపెట్టే, దానిలో చిన్న, చిన్న పచ్చళ్ళ జాడీలు, కొన్ని పెద్ద జాడీలు, మరోపక్క పెద్ద పీట మీద దేవుళ్ళ విగ్రహాలు చూస్తూంటే ఈ పెద్దాయన అక్కడికి వచ్చేస్తే ఈ ఇల్లు రీ మోడల్ చేయించి అద్దెకి ఇవ్వచ్చు అనిపించింది సంధ్యకి. అది సాధ్యం కాని పని అనుకుంటూ కాలిన పెనం మీద నూనె వేసి సగం కోసిన ఉల్లిపాయతో పెనమంతా రుద్దింది.
బంగారయ్య పెద్ద తాటాకు బుట్ట నిండా లేత కాకరకాయలు, దొండకాయలు, టమాటాలు, పొట్లకాయ, కరివేపాకు, కొతిమీర తీసుకొచ్చాడు. ఇవన్నీ మన పెరట్లోవేనా అడిగింది సంధ్య విభ్రమంగా..
“అవునండమ్మగారు” గొప్పగా చెప్పాడు.
నవ్వి అయితే నువ్వు పెరటి పని బాగా చేస్తున్నావన్న మాట అని అందరినీ టిఫిన్ కి రమ్మని చెప్పు అంది.
సరిగా పది నిమిషాల తరవాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. “వేడి, వేడి పెసరట్లు, అల్లం చట్నీ, ఓహ్ ... సూపర్” అన్నాడు దీపక్. లక్ష్మి మంచినీళ్ళు పెట్టింది.
“నువ్వు కూడా కూర్చోమ్మా” అన్నాడు ఆంజనేయులు సంధ్యతో..
“వస్తాను మావయ్యా.. మీరు తింటూ ఉండండి మళ్ళీ చల్లారితే బాగుండదు” అంది అందరి ప్లేట్స్ లో మరో పెసరట్టు వేస్తూ.
టిఫిన్లు, కాఫీలు అయాక తల్లి సైగతో స్మరణ లేచి వెళ్లి ఆయన కోసం కొన్న పంచెల జత, లాల్చీలు, ఒక కండువా తెచ్చి, ఆయనకి ఇచ్చి పాదాలకు నమస్కరించింది.
“బంగారు తల్లిలా ఉద్యోగంలో ఉన్నత స్థానం పొంది, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని, పిల్లా, పాపలతో నూరేళ్ళు హాయిగా ఉండు” దీవించాడు.
ఆయనలా దీవిస్తుంటే ఎక్కడి నుంచో ఓ దివ్యమంత్రం తన తలమీద నుంచి శరీరమంతా వ్యాపిస్తున్నట్టు ప్రకంపనలు కలిగాయి. ఆయన పక్కన కూర్చుని ఆయన చేయి తన చేతిలోకి తీసుకుని మా మంచి తాతయ్య అంది.
“ఏంటి ఇవాళ మా స్మరణ కొత్తగా కనిపిస్తోంది” అన్నాడు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకుని.
“నేను నీ దగ్గర గారం చేస్తున్నానుట... అమ్మ నాకు ఈ మధ్య క్లాస్ పీకుతోంది... పెద్దదానివి అయావు .. బుద్ధిగా బిహేవ్ చేయి.. అంటూ.. నువ్వు చెప్పు తాతయ్యా.. నేనిలా ఉంటె బాగున్నానా.. ఎప్పట్లా అల్లరి చేస్తే బాగున్నానా” కొంటెగా తల్లి వైపు చూస్తూ నవ్వింది.
“నా తల్లి ఎప్పుడూ అల్లరి చేస్తూ, సంతోషంగా ఉండాలి” అన్నాడాయన.
ఆ తాత, మనవరాలి అపూర్వ బంధాన్ని చూస్తూ సంతోషంగా నవ్వింది సంధ్య.
“నేనలా మా ఫ్రెండ్స్ ని కలిసి వస్తాను నాన్నా” అంటూ లేచాడు దీపక్.
“నేను కూడా అలా ఊళ్ళో తిరిగిరానా మమ్మీ” అడిగింది స్మరణ.
“ముందా మమ్మీ అనే పిలుపు మానేసి తెలుగులో అమ్మా అని పిలువు.. ఇది పదహారణాల తెలుగుదేశం, కందుకూరి వీరేశలింగం గారు నడిచిన పవిత్ర క్షేత్రం” అంది సంధ్య.
“విన్నావుగా తాతయ్యా.. నేను నోరు తెరిస్తే చాలు ఇలా తెలుగు పాఠాలు చెప్పేస్తోంది ఈవిడ” అని నవ్వి “అలా వెళ్ళొస్తాను తాతయ్యా” అంటూ బయటకి వెళ్ళిపోయింది.
సంధ్య వంట గదిలోకి వెళ్లి కాకరకాయలు, కత్తిపీట తెచ్చుకుని మావగారి ఎదురుగా కూర్చుని కాకరకాయలు మధ్యగా చీలుస్తూ మనసులో మాట బైట పెట్టింది.