Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

గతసంచిక తరువాయి »

ఉలిక్కిపడి అతని వైపు బ్లాంక్ గా చూసింది. “ఏంటి అలా చూస్తున్నావు?” అడిగాడు.

“దీనికేమన్నా పిచ్చా!” అంది.

దీపక్ నవ్వాడు.. “నీ కూతురు మోడరన్ గర్ల్... ఫాస్ట్.. నీకన్నా ఫాస్ట్. యధా తల్లి తధా కూతురు..”

“నేను ఫాస్టా..”

“కాదా! పదిన్నరకి ఆఫీస్ అయితే తొమ్మిదింటికల్లా బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెడీ చేసి నన్ను రెడీ అవమని నువ్వు రెడీ అయి కూర్చున్నావు దీన్ని ఫాస్ట్ అనక ఏమంటారు?” ఆమె చెంప మీద చిటిక వేసి హుషారుగా అన్నాడు.

“ఇలాంటి కుళ్ళు జోకులకి లోటు లేదు..” విసుక్కుంది సంధ్య. “రేపు అది ఎవర్నో జోకర్ని ప్రేమించానని ఇంటికి తీసుకొస్తే తెలుస్తుంది..”

“చెప్పాగా డార్లింగ్ నీ కూతురు నీ పోలికే స్వభావంలో.. దాని దూకుడు నేనెక్కడ తట్టుకోగలను! దాన్ని నేను మార్చలేను.. అయినా పెళ్ళయి ఇన్నేళ్ళయింది నిన్ను మార్చగలిగానా!”

“చాన్స్ దొరికితే మార్చేసేవారే నన్ను. నేనా అవకాశం ఇవ్వలేదుగా! మీ సంగతి తెలిసే ఇవ్వలేదు” అంది అతని మార్చగలిగానా అనే మాటలో ద్వంద్వార్ధం గ్రహించి.

నవ్వుతూ అన్నాడు దీపక్ “నీలోని ఈ స్పిరిట్ నాకు చాలా ఇష్టం.. భలే క్యాచ్ చేశావు నా మాటని సరేలేగానీ దాన్ని  వదిలేయ్ తనకి నచ్చిన వాడినే చేసుకొనీ..”

“బాగుంది అది ఏదో అంటే మీరు తందానా అంటారా! మావగారికి ఏం  చెప్పను?”

“నేను చెప్తాలే నువ్వేం వర్రీ అవకు”

“ఏం చెప్తారో” చికాగ్గా అని డైనింగ్ టేబుల్ క్లీన్ చేయసాగింది.

నిన్న ఆఫీసులో లత చెప్పిన కథలు విన్న దగ్గరనించీ సంధ్యకి భయం వెన్నుమీద జరా,జరా పాకుతున్నట్టే ఉంది. ఆమె అన్నట్టు ఈ రోజుల్లో పిల్లలంతా వయసు వచ్చేయగానే అర్జంటుగా ప్రేమించేయాలి అని ప్రేమించేస్తున్నారు.. స్మరణ అలా చేయదని నమ్మకం ఏంటి? తనూ ఆడపిల్లే.. ప్రేమకి, ఆకర్షణకి అతీతురాలేం కాదు కదా! వాళ్లకి ఆ అవకాశం ఇవ్వడం తల్లిదండ్రుల తప్పేగా.. అసలు ఈ పాటికి పెళ్లి చేసేసి ఉంటే ఈ బాధ లేకపోనుకదా ..

ప్రేమలు, ఆకర్షణలు ఒక ఎత్తు అయితే, ఆడపిల్లలు బయటకి వెళ్ళిన దగ్గర నుంచీ ఇంటికి క్షేమంగా వచ్చేవరకు టెన్షన్ తో ప్రాణం పోతోంది.. నేరాలు మామూలుగా అవుతున్నాయా ఈ దిక్కుమాలిన సమాజంలో. నిట్టూర్చింది.

సగటు తల్లుల్లాగే సంధ్య కూడా ఆలోచిస్తూనే పని పూర్తీ చేసుకుని చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్తూ దీపక్ తో అంది.. “మావయ్యగారు పెళ్ళివాళ్ళకి చెప్పెసారేమో వాళ్ళు వచ్చేస్తే ఎలా? ఈ మహాతల్లి ఒద్దంది అని చెప్పెలేముగా మీరోసారి ఫోన్ చేసి తరవాత కబురు చేస్తామని చెప్పండి పెళ్లి వాళ్లకి”.

“రానీ సంధ్యా! వస్తే ఏమవుతుంది కాసేపు కూర్చుని కాఫీ తాగి వెళ్తారు..” అన్నాడు తేలిగ్గా.

సంధ్యకి అతని మాటల్లోని తేలికదనానికి చిరాకేసింది “మీ తండ్రి కూతుళ్ళకే తెలియాలి.. ఆ మాత్రం,  కూతురు మాట వినేలా చేయడం మీకు చేతకాదు..” అంటూ  లోపలికి  వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంది.

దీపక్ నవ్వుకున్నాడు.

పిచ్చి సంధ్య.. టి వి సీరియల్స్, చెత్త క్రైమ్ న్యూస్ చూసి లోకమంతా అలాగే ఉంటుంది అనుకుంటుంది.. ఎందుకుంటారు అందరు అలా.. స్మరణ ఎదిగిన పిల్ల.. టీనేజ్ లో లేదు.. దాని గురించి ఇంత టెన్షన్ ఎందుకు పడుతుందో అర్థం కాదు.. ఒకవేళ ప్రేమిస్తే ప్రేమిస్తుంది.. ఏమవుతుంది అదేమీ నేరం కాదె..

సంధ్య తల్లి తండ్రులకి ఒక్కతే  కూతురు... తండ్రి ఆమె చిన్నప్పుడు పోయాడు.. తల్లి ఆమె కొంచెం పెద్దది అయాక పోయింది. పెదనాన్న దగ్గర పెరిగింది. పెళ్లి కూడా వాళ్ళే చేసారు. ఇరవై ఏళ్ళు రాగానే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.. ఆ సంబంధమే దీపక్.

ఒకవిధంగా సంధ్య పెళ్ళికోసం ఎదురు చూసింది అని చెప్పచ్చు..కారణం పెదనాన్న ఎలా ఉన్నా పెద్దమ్మ దగ్గర ఆమెకి ఆశించినంత ఆదరణ లభించలేదు. ప్రేమకోసం తపించిన సంధ్య  కాపురానికి వస్తూనే అత్తగారిల్లు నాది.. వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంది. భర్తని, మావగారిని, చుట్టుపక్కల వారిని బంధువులని, పనివాళ్ళని అందరినీ ప్రేమించడం ఆమె స్వభావంగా మార్చుకుంది. స్మరణ పుట్టగానే స్మరణే లోకంగా బతికింది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేకపోడంతో వేరే ప్రపంచం లేకుండా పోయింది.

సంధ్య తయారై రాగానే ఆమెనే చూస్తూ “రోజు, రోజుకీ గ్లామర్ పెరిగిపోతోంది.. స్మరణ సంగతి పక్కన పెట్టి నిన్ను కాపాడుకోవాల్సి వచ్చేలా ఉంది నాకు...” అన్నాడు కొంటెగా..

“చాల్లెండి ...” మనసులో మురిసిపోతూనే పైకి ముద్దుగా విసుక్కుంది.

“నిజం చెప్తున్నా... ఎంత అందంగా ఉన్నావో తెలుసా” ఆమె భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు.

“వదలండి ఒళ్ళు మండుతోంది నాకు మీ రౌడి వేషాలు వేసి నన్నేం ప్రసన్నం చేసుకోలేరు” అంది కోపం ప్రదర్శిస్తూ..” అయినా దానికి అన్నీ మీ బుద్ధులే వచ్చాయి పోకిరి బుద్ధులు” అంది.

“పోకిరి బుద్ధులా.. నావా! అమాయకుడినైన నన్ను నీ చూపుల గాలంలో పడేసి, నీ పాటల ప్రవాహంలో ముంచేసి పెళ్లి చూపులకి వచ్చిన వాడిని పందిట్లోకి ఈడ్చి తాళి కట్టించుకుని ఏడాది కూడా తిరక్కుండా పిల్లని కని”

అతని మాటలు పూర్తి కాకుండా “ఆపుతారా” అంటూ కోపంగా అరిచింది.

“ఎందుకాపాలి? ఇందులో నిజం లేదా! నాకప్పుడే పెళ్లి వద్దు బాబోయ్ అని మొత్తుకుంటుంటే ఆ రోజు పెళ్లి చూపులు చూసి వద్దాం రా నీకిష్టం లేకపోతె పిల్ల నచ్చలేదని చెప్పేద్దాం” అంటూ బతిమాలి తీసుకొచ్చాడు నాన్న.. తీరా రాగానే తల వంచుకుని వచ్చిన దానివి తలవంచుకునే లోపలికి వెళ్ళిపోక కళ్ళెత్తి నా కళ్ళల్లోకి చూసి నవ్వడం దేనికి? నవ్వితివి పో... పాట పాడమ్మా అని మా సుబ్బారావు భార్య అనగానే ఏ మంగళహారతో పాడక పిలచిన బిగువటరా అంటూ కవ్వించడం నేను మర్చిపోయాననుకున్నావా.”

సంధ్య మొహం మందార పూవులా అయింది. ఉవ్వెత్తున లేచిన కోపం ఆ మాటతో ఎగిరిపోయింది.. అయినా కోపం నటిస్తూ “చాలు సోది పదండి అవతలికి ఇక్కడెందుకు” అంటూ అతన్ని తప్పించుకుని హాల్లోకి వచ్చింది.

ఆమె వెనకే వచ్చి చేయి పట్టుకుని సోఫాలో ఆమెని కూర్చోబెట్టి తానూ పక్కనే కూర్చుంటూ “అప్పుడు పడ్డ వాడిని ఇప్పటిదాకా లేవలేకపోయాను తెలుసా” అన్నాడు ఫిర్యాదుగా.

చెక్కిళ్ళలో ఎరుపు అతని కంట పడకుండా మొహం దించుకుని చేతి గాజులు సవరించుకోసాగింది. సందర్భం వచ్చినపుడల్లా ఆ విషయం గుర్తుకు చేస్తుంటే సంధ్యకి సిగ్గుతో పాటు నవ్వు వస్తుంది అందుకే వస్తున్న నవ్వు బిగపట్టుకుని మౌనంగా ఉండిపోయింది.

దీపక్ మళ్ళీ మొదలుపెట్టాడు “నేనేం తక్కువ తిన్నానా నువ్వు కవ్విస్తే తలవంచుకు పోడానికి.. నేనూ దెబ్బ కొట్టానుగా” అన్నాడు. సంధ్యకి ఆ రోజు అతను పాడిన పాట గుర్తొచ్చింది.

సంధ్య మేనత్త మహా గడుసుది. అప్పటికే ఆవిడ బి ఎ పాసవడం వలన కొంచెం ఆధునికంగా కూడా ఆలోచిస్తుండేది.. అందుకే నీకు వంట వచ్చా! పాటలొచ్చా! ముగ్గులొచ్చా అని అడుగుతున్న సుబ్బారావు భార్యని చూసి సంధ్య పాట పూర్తి కాగానే “మీ అబ్బాయి అసలు ఏమి మాట్లాడడం లేదు.. మాటలు రాకపోతే కనీసం అతన్ని కూడా ఓ పాట పాడమనండి“ అంది.

“పాడకేం, ఘంటసాల వెంకటేశ్వరరావులా పాడతాడు చక్కని కంఠం” అని “ఏది నాన్నా దీపూ! నువ్వు ఓ పాట చదవరా” అంది ఆవిడ. వెంటనే అందుకున్నాడు దీపక్ “ఎందుకే నీకింత తొందరా! ఓ చిలుక నా చిలుక” అంటూ తను అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోకుండా లోపలికి పారిపోడం అత్తయ్య “అమ్మో ఏమో అనుకున్నాను మీ అబ్బాయి చాల కొంటెవాడు అనడం” అందరూ నవ్వుకోడం ఇప్పటికీ గుర్తొస్తే ఒళ్ళంతా జివ్వుమంటుంది.

ఆమె కనుకొలకులలో సిగ్గుల మెరుపులు ఓరకంట చూస్తూ అన్నాడు “నిజం సంధ్యా! ఆరోజు లేత నీలం రంగు షిఫాన్ చీర, వదులుగా వేసుకున్న పెద్ద జడ, అందులోంచి రెండు చెంపల మీదకి జారి నన్ను చూసి పకపక నవ్వుతున్న మల్లెపూల మాల ఎంత అందంగా మనోహరంగా కనిపించావో తెలుసా! అప్పుడే పెళ్లి వద్దు అని భీష్మించుకున్న వాడిని నిన్ను చూసి వెళ్ళాక ఎప్పుడెప్పుడు ముహూర్తాలు పెడతారా అని ఎదురుచూసా..” చెవి దగ్గర మధుర, మధురంగా వినిపిస్తున్న అతని స్వరం మోహావేశం కలిగిస్తుంటే పారవశ్యంతో మైమరచి పోతున్న సంధ్య ఉలిక్కిపడి సర్దుకుని అంది.

“ఇప్పుడీ ఫ్లాష్ బాక్ అవసరమా! టైం ఎంతో తెలుసా! ఇవాళ ఆదివారం కూడా కాదు” అంది వెక్కిరింతగా.

“పోదూ వెధవ ఆఫీస్ రోజూ ఉండేదేగా” నిర్లక్ష్యంగా అన్నాడు.

“సరే మీరు లీవు పెట్టి కూర్చోండి నేను ఆటోలో వెళ్ళిపోతాను” అంటూ లేవబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపుతూ గోముగా అన్నాడు “పోనీ ఇవాళ ఇద్దరం లీవు పెట్టేద్దామా!”

“పెట్టి ....”

“ప్రైవసీ ఎంజాయ్ చేద్దాం”

చేయి విసురుగా లాక్కుని “దీన్నే బుద్ధులు భూములేలుతుంటే...”

“నా అదృష్టం మాత్రం గాడిదలు కాయడంలేదు” అని ఆమె మాట పూర్తి చేసి మళ్ళీ అన్నాడు “నువ్వు నా జీవితంలోకి రావడం తోటే నా అదృష్టం పంచకల్యాణి అయింది”.

“అవుతుంది ..అవుతుంది వదలండి” అంటూ గబుక్కున అతని చేయి తోసేసి గదిలోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భుజానికి తగిలించుకుని వచ్చి “పదండి” అంది.

“రాక్షసి.. నువ్వు పెళ్లానివి కావు.. శాడిస్ట్ వి” అన్నాడు కోపంగా లేచి షూస్ లాక్కుంటూ...

వస్తున్న నవ్వు ఆపుకుంటూ కిచెన్ వైపు డోర్ వేసి,  తాళం చేతిలోకి తీసుకుంది సంధ్య.

“పద మహాతల్లి” అన్నాడు కసిగా షూస్ వేసుకోడం పూర్తి చేసి..

సంధ్య గబుక్కున అతని దగ్గరగా నడిచి చెంప మీద ముద్దు పెట్టుకుని “ఇప్పటికి ఇది చాలు సర్దుకోండి” అంటూ చిలిపిగా నవ్వి బయటకి నడిచింది.

పట్టపగలే వెన్నెల కాసినట్టు అనిపించింది దీపక్ కి. సంధ్యలో కనిపించని చిలిపితనం, అల్లరి, ఉన్నాయి. అది దీపక్ కి చాలా ఇష్టం.

దీపక్ కి తల్లి నుంచి అందాల్సినంత ప్రేమాభిమానాలు అందలేదు.. అక్కగారు అతనికన్నా ఆరేళ్ళు పెద్దది.. తల్లి పోయిన ఏడాదికే ఆమె పెళ్లి చేసేయడంతో భర్తతో విదేశాలకు వెళ్ళిపోయింది. ఎప్పుడో మూడేళ్ళకు ఒకసారి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళడం తప్ప తమ్ముళ్ళతో ఆమెకి పెద్ద అనుబంధం లేదు.. ఇకపోతే తమ్ముడు కార్తీక్ ఉన్నత చదువులు పేరుతొ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవాడు.. పెళ్లి అయాక బెంగుళూరు వెళ్ళిపోయాడు.. బాగా చదువుకున్న, ఆస్తిపరులైన వాళ్ళ పిల్ల అవడంతో మరదలు ఎవరితో ప్రేమగా ఉండేది కాదు.. అందుకేనేమో దీపక్ జీవితంలో సంధ్య రాక వసంతం వచ్చినట్టు అయింది.. ఆ వసంతం నిరంతరం పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేరు అనుకుంటాడు దీపక్.

“హలో! ఏంటి ఎడ్లబండి నడిపిస్తున్నారా!” వీపు మీద చిన్నగా తట్టి చెవులో అరిచిన సంధ్య స్వరం విని ఆలోచనల నుంచి తెప్పరిల్లి బండి వేగం పెంచాడు.

 

****సశేషం****

Posted in June 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!