“బీతోవెన్ మళ్ళా పుట్టాడా...? మొజార్ట్ మళ్ళీ పుట్టేడా...?
ఎక్కడో దూరంగానున్న ఆళ్ళ గురించొద్దుగానీ ద గ్రేట్ ఘంటసాల మళ్ళీ పుట్టారా...?
వీరిలో ఎవరైనా పుట్టొచ్చు గానీ...శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ఇహ మళ్ళీ పుట్టడం జరగదు.”
ఎందుకంటే - అసలాయన పోతే గదా పుట్టడానికి...?
కొందరి మరణాలు నమ్మబుద్ధి కాదు. అందుకే వారు గొప్పవారు.
పైన చెప్పినవి నా మాటలు కావు, ఒక్క చివరి రెండు వాక్యాలు తప్పించి. సినిమా దర్శకుడు వంశీ, బాల సుబ్రహ్మణ్యం గురించి చెబుతూ, ఇహ లేరన్న తన బాధని దిగమింగుకుంటూ, పొలమారిన జ్ఞాపకాలు పుస్తకంలో రాసినవి.
దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగువారికి పరిచయం చెయ్యనవసరం లేని పేరు. గత అయిదు దశాబ్దాలుగా ప్రతి కుటుంబాన్నీ అలరించిన గళం. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అభిమానించిన పాటగాడు బాలు. బాలూ పాటని కూనిరాగం తీయని వ్యక్తి ఒక్కరుకూడా ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు.
శంకరాభరణం చిత్రాన్ని కంఠాభరణంగా ధరించి యావత్తు భారతదేశానికి తెలుగు పాట గొప్పదనాన్ని అందించిన తెలుగువాడు.
00000 00000
నా చిన్నతనమంతా బాల సుబ్రహ్మణ్యం పాటలతోనే గడిచింది. బాలూ పాటతో పాటే పెరిగాను కాబట్టి ఆయన పాటంటే గౌరవం వుంది. అప్పుడప్పుడు కొన్ని పాటలను తిట్టుకున్నా, వినీ విననట్లు దాటేసుకుంటూ, మరలా ఒక మంచి పాట వినగానే, చెవిన పడగానే అంతే ఇష్టంగా తలచుకున్నవీ వున్నాయి. వయసు పెరిగే కొద్దీ బాలూ పాటలంటే ఇష్టం తగ్గినా అభిమానం మాత్రం తగ్గ లేదు. తిట్టుకున్న పాటల వరస (ట్యూన్) బాగోలేక తప్ప బాలూ పాడడం వలన కానే కాదు. సంగీతంలో నాకున్న కొద్దిపాటి అవగాహనా, బాలూ మీద అభిమానమే ఈ పరామర్శ. వెరశి - ఒక చిన్న జ్ఞాపకాల దొంతర.
00000 00000
దాదాపు పదేళ్ళ క్రిందటి సంగతి.
ప్రముఖ విద్వాంసుడు బాలమురళీ కృష్ణతో కొన్ని గంటలు గడిపే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా నేనొక వీడియో ఇంటర్వ్యూ చేసాను. (దురదృష్టవశాత్తూ ఆ వీడియో నా కళ్ళముందే చెరిపివేయబడింది.)
ఆ ఇంటర్వ్యూలో - "మీరూ సినిమా పాటలు పాడారు కదా? మీకు నచ్చిన లేదా మెచ్చిన తెలుగు సినిమా గాయకులెవరు?" అని అడిగాను.
నన్ను ఆశ్చర్యపరుస్తూ - "బాల సుబ్రహ్మణ్యం" పేరు చెప్పారు.
నిజానికి నేను ఆశించిన జవాబు - ఘంటసాల లేదా పి.బి.శ్రీనివాస్. సంగీతం వచ్చిన జేసుదాస్!
నా రియాక్షన్ గమనించి, - "సాధన చేసి బాల సుబ్రహ్మణ్యం నాలాగ పాడగలడు; కానీ నేను అతనిలా పాడలేను. యుగళగీతాలకి కావల్సిన జోరూ, హుషారూ నా గొంతులో పలికించాలని ప్రయత్నం చేసినా రాదు," అన్నారు.
ఆయన జవాబు ఒప్పలేదు నాకు.
"మీరూ యుగళగీతాలు పాడారు కదా...? వసంత గాలికి వలపులు రేగా పాట యుగళ గీతమే కదా…?" అని ఎదురు ప్రశ్న వేసాను.
"అది యుగళగీతమే - కానీ ఇద్దరు సంస్కారవంతులైన ప్రేమికుల సరసంలా ఉంటుందా పాట. అందరి గొంతులూ అన్నిటికీ నప్పవు. అంతెందుకూ - ఘంటసాల కూడా చివర్లో - చెంగావి రంగు చీర - అంటూ పాడారు. వినడం వరకూ బాగానే ఉంటాయి…” అన్నారు.
“పాట చెవిలో కాదు; నాలుక మీద నర్తించాలి.. మనసుచేత పాడించాలి,” అని గట్టిగా అనేసరికి మౌనంగా ఉండిపోయాను.
"అతను పాడిన - మబ్బే మసకేసిందిలే - లాంటి పాట నేను అంత హుషారుగా పాడలేను. అది తమిళంలోనూ ఉంది. అంత గొప్పగా అనిపించదు. తెలుగులో బాలు పాడిన పాట భలే బావుంటుంది..." అని చెప్పారు.
"సినిమాపాటలు పక్కన పెట్టండి. క్లాసికల్ సంగీతం పాడి బాలు మెప్పించారని అనుకోను..." అని అంటే గూగుల్ చెయ్యమని ఒక కన్నడ పాట చెప్పారు.
అది అక్కడే విన్నాం - నాకు బాలు పాడాడంటే నమ్మబుద్ధి కాలేదు.
“ఉమండ్ ఘుమండ్ ఘన ఘర్ జే బదరా…” అనే పాట.
“సంగీత సాగర గానయోగి పంచాక్షర గవై” (1995) అనే కన్నడ సినిమాలోది. పాట వినగానే భీమ్సేన్ జోషీ వయసులో ఉండగా పాడినట్లనిపించింది. తాన్సేన్ స్వరపరిచిన పాటకి, సినిమాలో హంసలేఖ సంగీతం కూర్చారు. ఆ పాటకి బాలూకి 1995లో బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది. ఆ పాట వింటే ఏ హిందూస్తానీ విద్వాంసుడో పాడేరని అనుకుంటాం. అవకాశమొస్తే తానూ శాస్త్రీయ సంగీతం పాడగలడూ, మెప్పించగలడూ అని నిరూపించిన పాట.
బాలూకి తీరని కోరికల్లో ఒకటి - శాస్త్రీయ సంగీత కచేరీ.
00000 00000
సినిమా పాటకి ఒక బాణీనీ, ఒరవడినీ తెచ్చింది ఘంటసాల గాత్రం. ప్రజల నోళ్ళల్లో నానేట్లా సినిమా పాటకి ప్రాచుర్యం తెచ్చిన వారిలో ఘంటసాల ప్రముఖుడు. ఆయనకి ముందు నాగయ్య, ఎం.ఎస్.రామారావు ఇంకా ఎంతో మంది పాడినా ప్రజల దగ్గరకి సినిమాపాటని తీసుకెళ్ళింది ఘంటసాల. ముఖ్యంగా పద్యాలు. రాగయుక్తంగా పద్యాలు పాడుకోవచ్చు అనేట్లా పద్యాలు పాడి ఒక సరికొత్త బాణీని అందించారు. బాలు సినిమారంగానికొచ్చేసరికే ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరున్న వ్యక్తి.
ఒకసారి 1964లో, మద్రాసులో (ఇప్పటి చెన్నై) ఒక తెలుగు కల్చరల్ అసోసియేషన్ పాటల పోటీ నిర్వహించారు. ఆ పోటీకి జడ్జీలుగా వున్నది సంగీత దర్శకుదు కోదండపాణి, గాయకుడు ఘంటసాల. అప్పటికే ఘంటసాల సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసారు.
ఆ పాటల పోటీలో బాలూకి మొదటి బహుమతి వచ్చింది. ఆ విధంగా కోదండపాణి దృష్టిలో పడ్డాడు బాలూ.
సినిమాల్లో పాడటానికి అవకాశాల కోసం అన్ని స్టూడియోలూ కాళ్ళరిగేలా తిరిగితే, చివరకి ఒక పాటకి అవకాశం వచ్చింది. అదీ పి.బి.శ్రీనివాస్ తమిళ చిత్రానికి ట్రాక్ సింగర్‌గా. ఆ తరువాత "శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న" చిత్రంలో పూర్తిగా పాడటానికి అవకాశమిచ్చింది సంగీత దర్శకుడు కోదండపాణి.
"అహో ఏమి ఈ వింత మోహం" అన్న యుగళ గీతం. సుశీల, బాలూ కలిసి పాడినపాట. రెండో పాటకి ఒక కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. కొన్ని కారణాల వలన మర్యాదరామన్న చిత్రం విడుదలకి ఏడాది పైనే పట్టింది. ఈ మధ్యలో "కాల చక్రం" అనే సినిమాలో పాట పాడాడు. దీనికి సంగీతం కూర్చింది ఎం.ఎస్. వైద్యనాథన్. మర్యాదరామన్నా, కాల చక్రమూ ఒక్క నెల తేడాలోనే విడుదలయ్యాయి. ఆ తరువాత ఒకటీ, అరా పాటలు పాడినా బాగా గుర్తింపు వచ్చింది, ఏకవీర చిత్రంలో - "ప్రతీ రాత్రి వసంత రాత్రి" పాట. ఘంటసాలతో కలిసి పాడాడు.
ఇంకా "ఏ పారిజాతములియ్యగలను సఖీ" అనే పద్యం కూడా పాడాడు. ఇదే చిత్రంలో - "ఎంత దూరమూ, అది ఎంత దూరమూ" అనే విషాద గీతాన్ని సుశీలతో కలిసి పాడాడు. చిత్రం ఏవిటంటే, ఎన్.టీ. రామారావుకి బాలూ పాడిన మొదటి పాట కూడా ఇదే.
సోలోగా ఒక సినిమాలో అన్ని పాటలూ పాడిన సినిమా "జాతకరత్న మిడంతం భొట్లు". ఈ సినిమా హాస్య నటుడు పద్మనాభం నటించి, నిర్మించింది. ఈ సినిమాలో - “దయ చూడవే గాడిదా” - అని హిందోళ రాగంలో ఒక పాటుంటుంది. అందులో లేత గొంతుకతో బాలూ సంగతులు కూడా వేస్తూ పాడుతాడు. హాస్యం తీరున నడిచే పాట అవడం వలన అది అంతగా ఎవరికీ ఎక్కలేదు.
ఆ తరువాత 1970లో వచ్చిన "సంబరాల రాంబాబు" సినిమాలో "మామా, చందమామా" పాట బాగా హిట్ అయ్యింది. సుశీల కూడా ఇదే పాట పాడినా, బాలూకే మంచి పేరొచ్చింది. నిజానికి బాలూ పాట బదులు వేరే ఇంకో పాట అనుకున్నారట. సుశీల పాడిన పాట రికార్డింగ్‌లో విని ఆ పాటే పెట్టమని బాలూ అడిగితే ఆయన కోరిక మీద పెట్టారని చదివాను.
ఎన్.టి.రామారావు నటించిన "శ్రీకృష్ణ సత్య" సినిమాలో కూడా బాలూ, ఘంటసాల పాటలున్నాయి. అందులో బాలూ "చందన చర్చిత నీల కళేబర" జయదేవాష్టపది పాడాడు. కథానాయిక మొల్ల సినిమాలో కూడా ఘంటసాల, బాలూ పాడారు. బాలూ పాడిన - "మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా", పాట మంచి ప్రాచుర్యం పొందిన పాట.
బాలు సినిమారంగానికొచ్చేసరికే ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరున్న వ్యక్తి. ఘంటసాల సంగీత దర్శకత్వంలో "ఆలీబాబా నలభై దొంగలు" సినిమాలో ఒక పాట పాడాడు బాలు. రామరాజ్యం సినిమాలో, "ఏమండి లేత బుగ్గల లాయరు గారు" పాట కూడా ఘంటసాల దర్శకత్వంలోదే.
ఘంటసాల సంగీతంలో పాడిన మరో మంచి పాట - "సెలయేటి గల గల, చిరుగాలి కిలకిల". ఈ పాట "తులసి" - సినిమాలోనిది.
ఇవన్నీ 1973కి ముందు వచ్చిన సినిమాలు. ఆ తరువాత సంవత్సరం 1974లో ఘంటసాల చనిపోయారు. అలా ఆయన శకానికి తెర పడింది. బాలూ శకం మొదలయ్యింది.
00000 00000
దాదాపు 1975 వరకూ బాలూ సినీ సంగీత ప్రయాణమేమీ అంత సాఫీగా లేదు. రామకృష్ణ గొంతు ఘంటసాలకి దగ్గరగా వుందనీ, చాలా సినిమాల్లో ఆయన చేతే పాడించారు.
బాలూ పాటలకి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన సినిమా "అడవి రాముడు". ఆ సినిమాతో ఎన్.టీ.ఆర్ కీ, “ఆలుమగలు” సినిమాలో నాగేశ్వరరావుకీ పాడటంతో ప్రేక్షకులూ బావుందిలే అనుకున్నారు.
అంతవరకూ కృష్ణా, శోభన్ బాబులకే పరిమితమైన బాలు, మిగతా పెద్ద హీరోలకీ పాడటం మొదలయ్యింది. ఆ వరసలోనే బాలూకి చాలా పెద్ద పేరు తీసుకొచ్చిన సినిమా - "సిరి సిరి మువ్వ". అంతకు మునుపు "చెల్లెలి కాపురం"లో "చరణ కింకిణులు" అనే హిట్ సాంగ్ పాడినా, ఈ చిత్రంతో కె.విశ్వనాథ్ సినిమాలకి బాలూ ఆస్థాన గాయకుడిగా మారిపోయాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన సోగ్గాడు, వెనువెంటనే రిలీజ్ అయిన సీతామాలక్ష్మీ ఇవన్నీ బాలూ పాటలకి ఒక స్థాయినీ, పాపులారిటీనీ తీసుకొచ్చాయి.
ఆ క్రమంలోనే బాలూ పాటకి లభించిన కంఠాభరణం లాంటి సినిమా "శంకరా భరణం". అంత వరకూ, శాస్త్రీయ సంగీత పరంగా వచ్చిన పాటలు పాడలేడన్న అపప్రధ కాస్తా తుడిచిపెట్టుకు పోయి, బాలూ పాటకి తిరుగు లేకుండా పోయింది. శంకరాభరణం పాటలతో యావత్తు భారత దేశమూ బాలూ పాటలతో మారుమ్రోగి పోయింది.
00000 00000
చాలామంది పాటలు పాడుతారు. పాటకి శ్రుతి, లయ రెండూ ముఖ్యం. ఇవి కాకుండా ప్రతి గాయనీ గాయకులకి ఉండాల్సిన లక్షణం "మాధుర్యం" గా పాడడం. ఇక్కడ మాధుర్యం అంటే కేవలం గొంతు మాత్రమే కాదు. పాట పాడే పద్ధతి. ఏ పాటైనా ఒక తాళానికనువుగా లయ వుంటుంది. ఏదో ఒక రాగం లేదా రెండు, మూడు రాగాలు కలిపి ఒక పాటకి వరస కట్టచ్చు. ప్రతీ రాగానికి కొన్ని రాగ లక్షణాలు ఉంటాయి. స్వరాల పొందిక, గమకాలు ఇలా కొన్నుంటాయి.
మనందరి చెవిని చేరేది సాహిత్యమే అయినా దాని వెనుకుండేది స్వర విన్యాసమే. పాట వరసని (ట్యూన్‌ని బట్టి) గమకాలుంటాయి. వాటిని నిర్దిష్ట కాలంలో లయ చెడకుండా, శృతి తప్పకుండా పాడగలిగితే వినడానికి సొంపుగా వుంటుంది. రెండు స్వరాల స్థానంలో నాలుగూ లేదా ఆరు స్వరాలు పలికించడం, అదీ లయ తప్పకుండా పాడటం అంత తేలిక వ్యవహారం కాదు. ఒక్కోసారి ఏకధాటిన పాడుతూ ఊపిరి తీసుకోడానిక్కూడా అందదు. గొప్ప గాయకులు పాడేటప్పుడు ఈ సూత్రాలన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. కాబట్టే వారి పాటలు వినసొంపుగా వుంటాయి.
ఒక త్యాగరాజ కృతి మామూలు గాయకులు పాడే పాటకీ, మాధుర్యంతో బాలమురళీ కృష్ణ లాంటి వారు పాడిన దానికీ మధ్య గల తేడాను మన చెవులు ఇట్టే పసిగట్టేస్తాయి. ఏవిటి తేడా అని చెప్పలేకపోవచ్చు గానీ, వినసొంపుగా ఉంటుంది. మరలా మరలా వినాలనిపిస్తుంది. తమపాటని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళాలంటే గాయకులు చాలా కృషి చెయ్యాలి. దోషరాహిత్యంగా పరిపక్వతతో పాడగలగాలి. మనం టీవీల్లోనూ, సినిమాల్లోనూ ఎంతో మంది గాయకుల పాటలు విన్నా అవి ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయి అని ప్రశ్న వేస్తే కనిపించే కారణాలు ఇవే.
ఆ మాధుర్యం రావాలంటే సాధన కావాలి. అందుకే చాలా మంది గాయకులు ఒక స్థాయిదాటి పాడలేక చతికిలబడతారు. బాలూ వచ్చిన కాలంలోనే, రామకృష్ణ, జి.ఆనంద్ ఇలా కొంతమంది కొత్త గాయకులు వచ్చి సినిమాల్లో పాడారు. రామకృష్ణకి అనునాసిక స్వరాలు (nasal touch) వినిపిస్తాయి. జి.ఆనంద్కీ ఈ సమస్య ఉంది. వీరు పాడిన పాటలు ఒక శ్రుతిలో పాడితే బావుంటాయి. ఏ మాత్రం శ్రుతి స్థాయి పెరిగినా మాధుర్యం కోల్పోతాయి.
బాలూకి ఈ సమస్య లేదు. గొంతు బొంగురుపోవడం, ముక్కుతో పాడటం వంటివి లేకపోవడం గొప్ప వరం. బాలూకున్న ఒక ప్రత్యేకత ఏవిటంటే, పాట పాడుతూంటే ప్రతీ అక్షరం స్పష్టంగా వినిపిస్తుంది. పాడేటప్పుడు అక్షరాలు మింగేయడం లేదా దాటు వేయడం కనిపించదు. అందుకే ఎన్నో ఏళ్ళూ అప్రతిహతంగా పాడగలిగాడు.
00000 00000
సినిమా పాట పాడడం తేలిగ్గా తేసేసే వ్యవహారం కాదు. శాస్త్రీయ సంగీతం పాడేవారు సినిమాపాటంటే కాస్త చులకనగా చూస్తారని అందరికీ తెలుసున్నదే. శాస్త్రీయ సంగీత కచేరీలు సాధారణంగా ఒక వర్ణమూ, రెండు మూడు త్యాగరాజు, దీక్షితార్ కృతులూ, ఇలాంటి కీర్తనలతోనే వుంటాయి. వీటిని సాహిత్యంతోనే పాడినా రాగమూ, స్వరమూ అన్నీ నిర్దిష్టంగా వుంటాయి. కొంతమంది చరణాల దగ్గర ఆ సదరు రాగంలోనే స్వరకల్పన చేసి పాడతారు. ఒక్కోసారి కీర్తన ఎత్తుకోవడమే ఆలాపనతో మొదలవుతాయి. ఇక్కడ ఆలాపనా, స్వరకల్పనలు విద్వాంసులు వారి వారి పాండిత్యం చూపిస్తూ పాడతారు. ఆ రకంగా గాయకుల ప్రతిభ శ్రోతలకి తెలుస్తుంది.
కానీ సినిమా పాటవరకూ వచ్చేసరికి చాలా నిబంధనలుంటాయి. ముందుగా పాట ఒక సన్నివేశానికి రాయబడుతుంది. ఆ సన్నివేశంలో సందర్భానికీ, భావానికీ అనుగుణంగా రచయితలు పాటలు రాస్తారు. తరువాత పాటకి వరస (ట్యూన్) కడతారు. చాలా సార్లు ట్యూన్కే రాయబడతాయి కూడా. పలానా రాగమే ఉండాలన్న నియమం లేదు కాబట్టి, ఒక్కోసారి రెండు మూడు రాగాలు కలగాపులగం చేస్తూ వరసలు కడతారు.
సినిమాల్లో గాయకులకి పాట ఇవ్వగానే సాధన చెయ్యాలి. పాడేటప్పుడు ఆ పాత్రల భావావేశనికనుగుణంగా గొంతులో పలికించాలి. పాటలో ఉండే గమకాలూ, విరుపులూ ఇవీ పట్టించుకోవాలి. ఇదంతా ఒక రెండు మూడు గంటల్లో అయిపోతుంది. ఎందుకంటే సంగీత దర్శకుడు వాయిద్యకారులకి (ఆర్కెస్ట్రా) ఏ ఏ స్వరాలు వాయించాలో (arrangement) ముందుగానే చెబుతారు. సోలో పాటలయితే ఒకరితోనే వుంటుంది. యుగళ గీతాలయితే ఇద్దరు గాయనీ, గాయకులు సాధన చేసి పాడుతారు.
మిగతా గాయకులతో పోలిస్తే బాలూ పాట వరస ఇట్టే పట్టేస్తాడు. గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ. సంగీత దర్శకుడు చెప్పినట్లు అచ్చుగుద్దినట్లు అతి తక్కువసమయంలో పాడేస్తాడు. పైగా ఒకే రోజు అయిదు పాటలు పాడితే రికార్డింగ్ స్టూడియో ఖర్చూ, ఇవన్నీ కూడా కలిసొస్తాయి. ఈ రకంగా వారికి కాలమూ, ఖర్చూ రెండూ తగ్గించేవాడు బాలూ. కన్నడంలో ఒక సినిమాకి ఒకే రోజులో 14 పాటలు పాడి రికార్డు చేయించాడు. వినడానికి సంఖ్య బాగానే అనిపించినా, 14 పాటలు రికార్డింగ్ ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే సంగీతదర్శకులూ, నిర్మాతలూ బాలూ చేత పాడించడానికే మొగ్గు చూపేవారు.
తూర్పు-పడమర అనే ఒక సినిమా వచ్చింది డెబ్బైల్లో. "శివరంజని నవరాగిణి" పాటని కేవలం రెండు గంటల వ్యవధిలో బాలూ పాడినట్లు ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రమేష్ నాయుడు అన్నారు. ఆ పాట సూపర్ హిట్ అయ్యి బాలూకి ఎంతో పేరు తెచ్చింది. ఈ పాటకంటే ముందు "ప్రతీకారం"(1969) అనే సినిమాలో "నారీ రసమాధురీ" అనే పాట పూర్తి శాస్త్రీయ సంగీత బాణీలో సత్యం స్వరపరిస్తే బాలూ పాడాడు. కానీ ఆ పాట ఇప్పుడు ఎక్కడా లభ్యం కాలేదు.
శంకరాభరణం చిత్రంలో "శంకరా నాద శరీరాపరా" పాట పెద్ద హిట్ అయినా, "రాగం తానం పల్లవి" పాట గమకాలూ, విరుపులతో సశాస్త్రీయంగా పాడాడు బాలూ. అలాగే "దొరకునా ఇటువంటి సేవ" పాటలో శంకరశాస్త్రి పాత్రలో దూరి బాలూ పాడాడా అన్నట్లుగా పాడాడు.
అలాంటిదే సాగర సంగమంలో పాడిన "నాద వినోదము" పాట కూడా. సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో "సమయానికి తగు పాట పాడెనే", సప్తపదిలో "అఖిలాండేశ్వరీ" (ఇది సుశీలతో కలిసి పాడారు), ఆనందభైరవి చిత్రంలో "బ్రహ్మాంజలీ", స్వాతికిరణం సినిమాలో "శివాణీ, భవానీ", ఓ పాపా లాలి సినిమాలో "మాటే రాని చిన్నదాని ఊసులూ" - పాటా ఇలాంటివన్నీ సశాస్త్రీయంగా పాడిన పాటలు. “పిబరే రామరసం” - పడమటి సంధ్యా రాగం సినిమాలో చెల్లెలు శైలజతో కలిసి బాలూ పాడిన మరొక మంచి పాట.
ఇంకా పెద్ద పట్టీ ఇవ్వచ్చు గానీ, ఇవన్నీ బాలూ ప్రతిభకి మచ్చుతునకలు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం ఆధారంగా కూర్చిన పాటలు. జాగ్రత్తగా వింటే అన్ని పాటల్లో గమకాలు స్పష్టంగా తెలుస్తాయి.
"పాడటం దైవదత్తం. అది సాధనతో ద్విగీణీకృతమవుతుంది. ఇన్నేసి తర్ఫీదులు అవసరం లేదు. సంగీతాన్ని అవలోకనం చేసుకోపోతే ఏ పాటైనా పాడచ్చు. మన బాల సుబ్రహ్మణ్యమే దీనికి పెద్ద ఉదాహరణ"
ఒక బాల విద్వాంసుడు మరో బాలూకిచ్చిన కితాబు. మొదటి బాల విద్వాంసుడు - బాలమురళీకృష్ణ. రెండో ఆయన మనందరికీ సుపరిచితులే.
00000 00000
బాలూకి ఉన్న మరో పెద్ద టాలెంటు. మిమిక్రీ. ఇది సినిమా పాటలకి బాగా ఉపయోగపడింది. రాజబాబుకీ పాడగలడు. అల్లురామలింగయ్యకీ పాడగలుడు. మాడాకీ గొంతు సవరించుకో గలడు.
ముగ్గరమ్మాయిలు సినిమాలో "ఆకాశం నుండి నాకోసం వచ్చావా?" పాట వుంది. అది సినిమాలో రాజబాబుపై చిత్రకరించారు. బయట పాట వింటే అచ్చు రాజబాబు గొంతులో విన్నట్లే వుంటుంది. అలాగే - "అంతులేని కథ" సినిమాలో "తాళికట్టు శుభవేళ" ఆ పాటలో పక్షుల కూతలూ, విమానం ఎగిరిటప్పుడు ధ్వనీ ఇవన్నీ మిమిక్రీ చేసాడు. "సూడు పిన్నమ్మా పాడు పిల్లడు" - అంటూ చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రంలో మాడా వెంకటేశ్వర రావు పాడినట్లు అచ్చుగుద్దేసాడు బాలూ. ‘ఇది కథ కాదు’ సినిమాలో "అటు ఇటు కానీ హృదయంతోటీ ఎందుకురా తొందర నీకు" - పాట కమలహాసన్ పాడినట్లే అనిపిస్తుంది. "ముత్యాలూ వస్తావా? - అడిగింది ఇస్తావా?" - అచ్చు అల్లురామలింగయ్య గొంతుని దింపేస్తూ పాడాడు బాలూ - మనుషులంతా ఒకటే చిత్రంలో. జమిందారు గారి అమ్మాయి సినిమాలో - "మంగమ్మా, నువ్వు నడుస్తుంటె అందం" అంటూ రాజబాబులా గొంతు మెలికలు తిప్పుతూ పాడతాడు. కట్టు కథలు చెప్పి నేను నవ్విస్తే (పదహారేళ్ళ వయసు) – సినిమాలో విషాదంలో వున్న శ్రీదేవిని నవ్వించడం కోసం పాడే పాట. వింటూంటే మనకీ నవ్వొచ్చేట్లా పాడాడు. ముఖ్యంగా గాడిద అరుపులకి తాళం వేసే చరణంలో. ఇంత వైవిధ్యం ఉన్న గాయకుడు తెలుగు చిత్ర సీమలోనే కాదు, ఇండియాలో ఏ భాషా చిత్రంలోనూ మరొకరు కనిపించరు. ఇలా అందరి పాటలూ తానే పాడేసి మరికొంతమంది గాయకుల అవకాశాలు అపహరించాడన్న అపప్రథ బాలూకి వుంది. ఎంత నొక్కేద్దామనుకున్నా ప్రతిభ ఫీనిక్స్‌లా పైకి తన్నుకొస్తూనే ఉంటుంది. ఏ పాట పాడినా దానికి పూర్తి న్యాయం చెయ్యగలడని అటు దర్శకులూ, సంగీత దర్శకులూ విశ్వసించారు కాబట్టే బాలూ చేత పాడించారు.
00000 00000
హాస్య గీతాలకే బాలూ పరిమితం కాలేదు. ఎన్నో విషాద గీతాలూ పాడాడు. కొన్ని పాటలు వింటూంటే గుండె దొలిచేస్తాయి కూడా.
పూర్వం సినిమాల్లో ఒక సంతోషమైన గీతం, అదే సాహిత్యంతో విషాద గీతం రెండూ ఉండేవి. ఇటువంటి పాటలు ఘంటసాల ఎన్నో సినిమాల్లో పాడాడు. సంగీత దర్శకుడు మహదేవన్ ఇలాంటి పాటలకి పెట్టింది పేరు.
"నాలాగ ఎందరో?" అనే సినిమాలో - "అనుభవాలకు ఆది కావ్యం" అనే ఒక పాట వుంటుంది. సంతోష గీతం సుశీల పాడితే, విషాద గీతం బాలూ పాడాడు. ఆ పాటకే బాలూకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి మొదటి నంది అవార్డు వచ్చింది. ఈ క్రింది పాటలు కొన్ని ఇలాంటివే:
"మామ చందమామ" (సంబరాల రాంబాబు), "ఏ తీగ పూవునో"(మరో చరిత్ర),"గీత"(పూచే పూల లోన), "నీవుంటె వేరే కనులెందుకు"(స్నేహం), అమ్మను మించి దైవమున్నదా? (20వ శతాబ్దం),
ఈ విషాద గీతలు ఎంతో హృదయవిదారకంగా పాడతాడు బాలూ. సినిమా చూడకపోయినా పాటవింటే చాలు మనసుని పిండేస్తాయన్నట్లుంటాయి. ఇవి కాకుండా - సినిమాల్లో కేవలం విషాద గీతాలు నాకు నచ్చినవి.
"ఎవరికి ఎవరు - చివరకి ఎవరు..."(దేవదాసు),"తకిట తధిమి తందానా"(సాగర సంగమం), "ఒక హృదయంలో నా హృదయం","ఏత మేసి తోడినా"(ప్రాణం ఖరీదు),"శ్రీదేవి సింగారి సిలకా"(గృహాప్రవేశం), "కొబ్బరాకు గాలి మబ్బు కేసింది"(నాలుగుస్థంభాలాట),"నేనొక ప్రేమ పిపాసిని"(ఇంధ్రధనస్సు), సిరిమల్లె నీవే (పంతులమ్మ).
కేవలం సోలో పాటలు చెప్పాలంటే - ఏ దివిలో విరిసిన పారిజాతమూ, శివరంజని(తూర్పు-పడమర), నిదరోయే నదులన్నీ(నాగమల్లి) కూడా మంచి పాటలు. ప్రత్యేకంగా పాటల పట్టీ ఇవ్వడానికి కారణం, ఏ యూట్యూబులోనో వినే అవకాశం వుంది కాబట్టి.
బాలూ కొన్ని వేల పాటలు పాడాడు. అన్ని పాటలూ చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పైన ఉదహరించిన పాటలు సాహిత్య పరంగానూ, సంగీత పరంగానూ మంచి పాటలు. ఇంకా చెప్పాలంటే - బాలూ మరింత మనసుపెట్టి పాడిన పాటలు.
00000 00000
బాలూ వట్టి గాయకుడేనా? కానే కాదు - సంగీత దర్శకుడు కూడా. బాలూ సంగీత దర్శకుడిగా అంతగా రాణించలేదని నా అభిప్రాయం. బాలూకి ఏదైనా ఫెయిల్యూర్ ఉందంటే ఇదొక్కటే అని చెప్పాలి. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా, వ్యాఖ్యాతగా ఇలా ఎన్నో విభాగాల్లో తనదైన ముద్ర వేసినా, సంగీత దర్శకత్వం వరకూ వచ్చేసరికి చతికిలబడినట్లే అనిపిస్తుంది.
ఆ విషయానికొస్తే, ఘంటసాల ఎన్నో చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించాడు. సంగీత పరంగా విజయవంతమైన సినిమాలు చాలా వున్నాయి. లవకుశ సినిమాలో అన్ని పాటలూ ఈ నాటికీ గొప్ప పాటలు.
సంగీత దర్శకుడిగా బాలూకి మొదటి అవకాశం ఇచ్చింది దాసరి నారాయణ రావు - ఆ సినిమా, కన్య-కుమారి. అందులో, "తొలి సంధ్యకు తూరుపు ఎరుపు" మినహాయించి, మిగతా పాటలన్నీ ఒక మోస్తరు పాటలుంటాయి. ఆ తరువాత చేసిన సినిమా - కేప్టన్ కృష్ణ. నిజానికి ఈ సినిమా మొదట రిలీజయ్యింది. ఈ సినిమాలో, "కలకాలం ఇదే సాగనీ" అని ఒక శ్రావ్యమైన పాటుంది. ఇదొక్క పాటే బావుంటుంది. ఆ తరువాత సంగీతం చేసిన సినిమా “తూర్పు వెళ్ళే రైలు” అది తమిళంలో భారతీరాజాకి పెద్ద హిట్ సినిమా.
"తూర్పు వెళ్ళే రైలు" సినిమాకి దర్శకుడు బాపు. ముందుగా తమిళంలో సంగీతం చేసిన ఇళయరాజానే అనుకున్నారు. ఎందుకో ఆయన సంగీతం చేయలేదు. ఈ సినిమాలో బాలూ గురించి ఆరుద్రని నేను పాతికేళ్ళ క్రితం కలిసినప్పుడు నాకు చెప్పిన ఒక టుమ్రీ.
తమిళ సినిమాలో హిట్ పాటకి దీటుగా ఆరుద్రని పాట రాయమని అడిగారట బాపూ. ఆరుద్ర పాట లేకుండా బాపూ సినిమా వుండదు. ఆ సన్నివేశ పరంగా - "చుట్టూ చెంగావి చీరా కట్టావే చిలకమ్మా..." పాట రాసారు ఆరుద్ర. ఇళయరాజా తప్పుకునేసరికి ఎవరా అనుకుంటూంటే బాలూ నేను చేస్తాను అన్నారట. అలా పాటలన్నింటికీ సంగీతం సమకూర్చారు. బాలూ సంగీతమని తెలిసి ఆరుద్ర కంగారు పడ్డారట. ఎందుకంటే ఆయన రాసిన పాటకి ట్యూన్ సరిగా లేకపోతే మంచిగా వచ్చిన పాట పాడైపోతుందని ఆయన బాధ. బాలూ కట్టిన ట్యూన్ వినేవరకూ ఆయనకి స్థిమితం లేదనీ, బాపూతో చెప్పగానే వెంటనే వినిపించారనీ, ఆ పాట విన్నాక - "హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. బాలూ చాలా మంచి ట్యూన్ ఇచ్చాడు," అని చెప్పారు. ఆ పాట హిట్ అయ్యింది, సినిమా ఫట్ అయ్యింది.
ఎంతైనా పాడటం వేరు; వివిధ రాగాలతో పాటలు కట్టడం వేరూ. ఆ తరువాత ఒకటి రెండు సినిమాలు చేసినా సంగీత దర్శకుడిగా బాలూ రాణించలేదు. శాస్త్రీయ సంగీతంలో లోతైన అధ్యయనం లేకపోవడం ఒక కారణం కావచ్చని నా అంచనా. సినిమాలు విజయవంతం అయితే అవకాశాలు వచ్చుండేవేమో?
00000 00000
బాలూ ధరించిన మరో అవతారం - నటుడు. సినిమాలకొచ్చిన కొత్తలోనే అతిథి నటుడిగా చేసాడు. నటుడిగా మొదటి సినిమా - పెళ్ళంటే నూరేళ్ళ పంట. ఆ సినిమా విడుదలకి నోచుకో లేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ - రెండో సినిమా. అందులోనూ అథిధి పాత్రే.
తరువాత ఘంటసాల చనిపోవడంతో పాడే పాటల సంఖ్యా పెరిగింది. అడవిరాముడు పెద్ద హిట్ కావడమూ, తమిళంలో ఇళయరాజా ప్రభంజనం మొదలవడంతో నటించే ఖాళీ దొరికుండక పోవచ్చు.
సంగీత దర్శకుడు చక్రవర్తితో కలిసి 1981లో "పక్కింటి అమ్మాయి" చిత్రంలో పూర్తి నిడివి కల పాత్ర చేసాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా నడిచింది. నటుడిగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో చేసాడు.
తమిళంలో - కేలడి కన్మణి చిత్రం విజయవంతం అవడంతో దాన్ని "ఓ పాపా లాలి" సినిమాగా డబ్బింగ్ చేసారు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ సినిమాలో "మాటే రాని చిన్న దాని ఊసులు" పాట చాలా మంచి పాట. నటుడిగా కూడా పేరొచ్చింది. ఆ తరువాత కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసాడు. కాస్త గుర్తుండే పాత్రలో “పవిత్ర బంధం” సినిమాలో నటించాడు. ఈ మధ్య తెలుగులో మంచి పేరొచ్చిన సినిమా - మిథునం. ఇది కూడా ఆడలేదు.
కేవలం నటన మాత్రమే కాదు, ప్రత్యక్షంగా కాకపోయినా సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు కూడా.
00000 00000
దక్షిణాదిన దాదాపు అన్ని భాషలూ రావడంతో సినిమాల్లో డబ్బింగ్ కూడా చెప్పాడు. నటుడు కమలహాసన్‌కి ఆస్థాన డబ్బింగ్ ఆర్టిస్ట్ బాలూ. కమలహాసన్ మాట్లాడుతున్నట్లే ఉంటుంది. రజనీ కాంత్, రఘువరన్, సుమన్ ఇంకా కొంతమందికి తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. గొంతు కంచు కంఠం కాబట్టి చాలామంది హీరోలకి నప్పేది. దానికితోడు మిమిక్రీ వెన్నతో పెట్టిన విద్య కావడంతో డబ్బింగ్ బాగానే అమిరేది.
ఒకటి మాత్రం నిజం - తన వృత్తి పరంగా ఏభయ్యేళ్ళలో ఎప్పుడూ ఖాళీగా లేడు. ఏదో ఒకటి చేస్తూ తనని తాను మార్చుకుంటూ వచ్చాడు. ఆఖరికి పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో టీవీ వైపుకూడా పనిచేసాడు, పాడుతా తీయగా కార్యక్రమంతో ప్రతీ ఇంటా బాలూ పేరు మార్మోగింది. గతంలో తాను పాడిన పాటల సందర్భాలూ, అనుభవాలూ ఎంతో శ్రద్ధగా వివరాలతో చెప్పడంతో అందరూ ఉత్సాహంగా విన్నారు కూడా.
నిజానికి బాలూకొచ్చిన అవకాశాలు ఏ గాయకుడికీ రాలేదు. వచ్చిన అవకాశాలన్నీ తన విజయ పథాలుగా మార్చుకున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో దాదాపు అందరి సంగీత దర్శకుల దగ్గరా పాటలు పాడాడు. నిజానికి బాలూ తమ సంగీత దర్శకత్వంలో పాడడం వారికి గర్వకారణం అని సంగీత దర్శకులు చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఇంకా- తెలుగులో ప్రతి పాటల రచయిత పాటలూ బాలూ పాడాడు. ఒక్క తెలుగనే కాదు, మిగతా భాషల్లో - కన్నడ, తమిళ, మళయాళంలో కూడా.
బాలూ దగ్గర మెచ్చుకోదగ్గ గొప్ప అంశం ఒకటుంది. - ముఖ్యంగా డబ్బింగ్లో, ఏ భాషలో చెబుతున్నా ఉచ్చారణలో ఎక్కడా పొరబాట్లు దొర్లేవి కాదు. తెలుగు సరే మాతృభాష. మిగతా తమిళ, కన్నడ, మళయాల భాషల్లో కూడా ఆయా భాషల నుడికారాన్ని నేర్చుకుని అలాగే డబ్బింగ్ చెప్పేవాడు. నాకు పరిచయమున్న కన్నడ, తమిళ స్నేహితులూ అదే చెప్పేవారు. తమ వృత్తి పట్లా, చేసే పని ఎడలా ఎంతో శ్రద్ధ వుంటే కానీ ఇలాంటివి సాధ్య పడవు.
ఎదుటి వారి ఎడల వినయమూ, కళ పట్లా గౌరవం చూపించడంలో బాలూ ముందుంటాడు. ఇది బాలుకున్న ఉత్తమ లక్షణం. అందుకే బాలూకి ఎంతో మంది అభిమానులు. వారిలో గాయకులూ, సంగీత దర్శకులూ మొదటుంటారు. వయసుపైబడినా తన చివరి శ్వాస వరకూ పనిచేస్తూనే ఉన్నాడు, ఒక కర్మయోగిలా!
00000 00000
పాడుతా తీయగా - అంటూ తెలుగునాట సినిమా పాటలతో ఒక కొత్త కార్యక్రమం చేబట్టాడు బాలూ. గోల్డెన్ హ్యాండ్ కదా - ఇదీ సూపర్ హిట్టే! మొదట తెలుగులో మొదలై అన్ని భాషల వారూ ఈ కార్యక్రమాన్ని చేబట్టారు. ఈ ప్రోగ్రాము దాదాపు ఇరవయ్యేళ్ళుగా నడిచింది.
వీటిలో తన అనుభవాలూ, సంగీత దర్శకుల ముచ్చట్లూ, సినిమా పాటలు పాడేటప్పుడు జరిగిన అరుదైన సంఘటనలూ ఇలా ఎన్నో విషయాలు చెబుతూ ఆ కార్యక్రమానికి వన్నె తెప్పించాడు.
ఎంతో మంది కొత్త గాయనీ గాయకుల్ని పరిచయం చేసాడు. ఈ కార్యక్రమం ఫైనల్స్‌లో ఎక్కువగా ఘంటసాల పాటలే పాడేవారు; పాటల క్లిష్టతా, మాధుర్య పరంగా. ఒక్కోసారి బాలూ ఘంటసాల మీద ఛలోక్తులు వేయడం, ఆయన గంటల గంటల సేపు సాధన చేస్తారని చెప్పడం కొందరికి నచ్చలేదు. ఘంటసాల గొప్పదనం ఆయనదీ. ఆయనతో పోల్చుకోవాల్సిన అవసరం లేనంత పేరొచ్చింది బాలూకి. ఎక్కడో ఓ మూల ఘంటసాల మీద కినుకుంది. ఇలాంటివే కొన్ని పంటి క్రింద రాళ్ళల్లా అనిపించేవి.
పిల్లలకి ఎక్కడ ఎలా పాడాలి, పాడేటప్పుడు సంగతులు ఎలా పలకాలి, ముఖ్యంగా పాడేటప్పుడు ఎక్కడ, ఎలా ఊపిరి తీసుకోవాలి, ఉచ్చారణ ఎలా వుండాలి ఇవన్నీ సుస్పష్టంగా చెప్పడం చాలా గొప్ప విషయం. ఎవరికి వారు బాగా పాడేను అనుకోవడం సర్వ సాధారణం. కానీ తప్పుల్ని సవరించుకునేలా చెప్పడం, ఇవన్నీ బాలూ అలవాటు చేసాడు, పిల్లలకి.
అలాగే ఎంతో మంది సంగీత దర్శకులనీ, నటుల్నీ అతిధులుగా పిలుచుకొచ్చి వారి అనుభవాల గురించి చెప్పడం, సినిమాపాటల వెనుకున్న కృషినీ, శ్రమనీ విపులంగా వివరించడం ఇవన్నీ గొప్ప విషయాలు. ‘నభూతో నభవిష్యతి’ - అన్నట్లుగానే ఇరవయ్యేళ్ళు నడిపించాడు బాలూ.
00000 00000
మా చిన్నప్పుడు గుళ్ళల్లో ఏవైనా తీర్థాలూ, పుణ్యదినాలూ వస్తే లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వేసేవారు. అప్పుడు రేడియో, టేప్ రికార్డర్ తప్పించి సినిమా పాటలు వినే అవకాశమే లేదు. ఆ గుళ్ళల్లో ఘంటసాల భగవద్గీత, కుంతీ విలాపం లాంటి ప్రైవేటు రికార్డులు వేసేవారు. ఘంటసాల చనిపోయాకా బాలూ కూడా కొన్ని ప్రైవేటు రికార్డులు చేసాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి - శివాష్టకం, బిల్వాష్టకం వంటివి. అలాగే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలూ ఇలాంటివి వచ్చేవి.
సంగీత దర్శకుడు రమేష్ నాయుడు - దర్శకుడు జంధ్యాలా "అన్నమయ్య" సినిమా తీద్దామని స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నారు. సినిమా నిర్మాణంలో చిత్రీకరణ కంటే ముందు పాటలు రికార్డింగ్ చేయడం ఒక ఆనవాయితీ. అలా రమేష్ నాయుడు - ఓ పన్నెండు పాటలకి పైగా రికార్డ్ చేసారు.
ఆ పాటలు వింటే బాల సుబ్రహ్మణ్యం సశాస్త్రీయంగా పాడిన అన్నమయ్య కీర్తనలు వినడానికి హాయిగా ఉంటాయి. కొన్ని కీర్తనలు అద్భుతంగా పాడాడు. మనసు పెట్టి కాదు; గుండె పెట్టి పాడిన పాటలివి. ఆ సినిమా ఎందుకో షూటింగ్ కాలేదు. ఈలోగా జంధ్యాల పరమపదించాడు. లేకపోతే తరువాతొచ్చిన అన్నమయ్య పాటల కంటే ఇవే అందరి నోటా నానుండేవి.
బాలూ కూడా భగవద్గీత చేసారుగానీ, ఘంటసాలది విన్నాక ఎవరిదీ వినబుద్ధి కాదు. బాలూ అయ్యప్ప పాటలూ, క్రైస్తవ గీతాలూ వినదగ్గ పాటలు.
00000 00000
ఒకానొక సందర్భంలో బాలూ గురించి చెబుతూ, ప్రఖ్యాత దర్శకుడు బాల చందర్ - "మరో జన్మ వుంటే నన్ను బాలూలా పుట్టించమని దేవుణ్ణి కోరుకుంటాను" - అన్నారు.
కన్నడ వాళ్ళయితే దేవుళ్ళా ఆరాధిస్తారు. తమిళులు సరేసరి.
ఎటొచ్చీ - మన తెలుగువారే. అభిమానాన్నీ, ఆప్యాయతనీ నోటికే పరిమితం చేసారనిపిస్తుంది.
శంకరాభరణంతో బాలూ భారతదేశమంతా తెలిసినా, గాయకుడిగా హిందీలో అవకాశాలు అంతగా రాలేదు.
బాలచందర్ "మరో చరిత్ర" సినిమాని "ఏక్ దూజే కే లియే" పేరుతో హిందీలో తీసాడు. బాలూ హిందీలో పాడడం అదే మొదటిసారి. సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ ఏడు "బెస్ట్ సింగర్" అవార్డు దక్కింది బాలూకి. ఆ తరువాత "మైనే ప్యార్ కియా" మరో పెద్ద హిట్. హిందీలోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. లెక్కలేనన్ని అవార్డులూ వచ్చాయి.
బాలూ దాదాపు అందరి గాయనీమణులతోనూ సినిమాల్లో పాడాడు. సుశీల, జానకి, వాణీ జయరాం, ఎల్.ఆర్ ఈశ్వరి, లతామంగేష్కర్, ఆశాభోంశ్లే, అనూరాధా పుద్వాల్, చిత్ర, అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషాల్ ఇలా పాతతరం వారితోనూ, ఇప్పటి తరం వారితోనూ పాడాడు. ఏ గాయకుడుకీ దక్కని పెద్ద రికార్డ్ ఇది. అందరిలోకీ జానకీ, సుశీల, చిత్రలతో ఎక్కువ పాటలు పాడాడు.
అందరి గాయనీ మణులతో బాలూ పాడిన నాకు నచ్చిన పాటలు చాలా వున్నాయి. అందులో కొన్ని ఎప్పటికీ ఇష్టమైనవి ఇక్కడ ఇస్తున్నాను.
తనువా హరిచందనమా, ఈ రేయి తీయనది, ఓ బంగరు రంగుల చిలకా, శ్రీ చక్ర శుభ నివాసా, ఏ తీగ పూవును, చీకటి వెలుగుల కౌగిలిలో, కొమ్మ కొమ్మకో సన్నాయి, మావి చిగురు తినగానే, శ్రీరస్తు శుభమస్తు, కలకాలం ఇదే సాగనీ, ఏ కులమూ నీదంటే, మౌనమేల నోయి, తెలుసా నీకు తెలుసా, సిరిమల్లె పూవల్లె నవ్వూ, మనసు పలికే మౌనగీతం, సామజ వర గమనా, మానస సంచరరే, మిన్నేటి సూరెడు, ఎన్నెన్నో జన్మల బంధం, మనిషికో స్నేహం, మనసుకో దాహం, ఓ పాపా లాలీ, ఓ నమః, మలరే మౌనమా(తమిళ్), హుం తుం దోనో జబ్ మిల్ జాయే (హింది).
అన్ని భాషల్లోనూ కొన్ని వేల పాటలు పాడడం, అదీ అయిదారు దశాబ్దాలుగా, బాలూకి మాత్రమే ఉన్న ఏకైక రికార్డు. ప్రతిభావంతుడైన బాలూ ఈ విధంగా అదృష్టవంతుడు; ధన్యుడు.
దక్షిణాది వారికి ఒకే ఒక బాల సుబ్రహ్మణ్యం.
ఇలాంటివారు ఇంకొకరు పుట్టబోరు.
పుట్టినా వీరంత ఎత్తు ఎదగలేరు.
ఎదిగినా - అన్ని భాషల వారినీ అలరించనూ లేరు.
పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం,
ఇది అందరూ ఆప్యాయంగ పిలుచుకునే బాలూకి మాత్రమే సొంతమైన - గోల్డెన్ డిస్క్!
నిజానికి బాలూ మనింట్లో మనిషి. అందుకే అందరం బాలూ అని పిలుచుకుంటాం. ‘బాలూ’ అన్న పిలుపు మనసుకి దగ్గరగా వుంటుంది.
బాపూ, రమణలు తాము గీసి/రాసిన "లీలా జనార్థనమ్" పుస్తకాన్ని బాల సుబ్రహ్మణ్యానికి అంకితం ఇస్తూ, ఇలా అన్నారు:
“గాయకుడిగా జీనియస్
మనిషిగా అజాతశత్రువు
మాకు ఆయన పరిచయం కలగడం
భగవంతుడిచ్చిన వరం”
ఇద్దరు గొప్పవారు గొంతెత్తి మరో గొప్ప వ్యక్తిని స్తుతించారు. ఈ ముగ్గురూ తెలుగువారవ్వడం మనందరికీ గర్వకారణం.
00000 00000
(అభిరుచి వున్న పాఠకులు మరలా వింటారన్న వుద్దేశ్యంతో ఈ వ్యాసంలో కొన్ని పాటల సూచికలు ఇచ్చాము. - రచయిత)
kotla mandi abhimanulu cheppedi okkate mata”balu lanti vallu malli puttaru”
ayanapatalu evariki ela anipiste alavuntaie.”rasagulikalu amrutadharalu muripinche muvvalu!