॥ శ్రీలక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్॥
కం.
శ్రీలక్ష్మీనృపతి కృపను
మైలవరపు వరసుపూజ్యమహతీయుతులన్
శ్రీలౌ గురుపదరజమును
మేలౌ రీతిని దలవవె మిక్కిలిగ సిరీ!
ఆ.వె.
తపుని తాపమంత తాల్మిగ గ్రహియించి
చలువ పంచునెపుడు కలువఱేడు ...
చదువు నేర్పు గురుడు సరిజూడనాతీరు
చిరము సత్యమెఱుగు సిరుల తల్లి!
ఆ.వె.
నీటి కూటములిట కోటులే కానిమ్ము
సూరి పీల్చు బొట్టు సుంత గాదె!
మంచి గురుడు కోరు మించు వటువుగమ్ము
స్థిరము ప్రగతి గల్గు సిరుల తల్లి॥
ఆ.వె.
అరుణ భానుతేజమరయుచు నానాడు
దినము మొదలు పెట్ట ధృవము ప్రగతి!
కిరణ కిరణమందు గెలుపు కదలుచుండు
చిరము సత్యమెఱుగు సిరుల తల్లి!!
ఆ.వె.
బాధనున్న నీవు బాగుండునపుడైన
నీడ నిన్ను జగతి వీడలేదు|
ప్రాణమిత్రుడుండు ప్రక్కనే యీరీతి
చిరము సత్యమెఱుగు సిరుల తల్లి॥
ఆ.వె.
తెలుగు భాష మేటి తెరపి లేక నుడివె!
పాటలెన్ని పాడి పరిఢవిల్లె!!
వేల పాటగాండ్ర వెల్లడించె! నతని
నెరుగు బాలుడండ్రు సిరుల తల్లి ...
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేయు మహానుభావులలో మా సాయికృష్ణ ఒకడు.
మీ ఆత్మీయవచనములకు కృతజ్ఞుడను 🕉🙏