పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
బ్రాహ్మణుడు – పేలపిండి
అనగనగా ఒక పట్టణంలో రామశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకనాడు తన స్నేహితుని ఇంటిలో జరిగిన కార్యక్రమానికి భోక్తగా (భోజనం చేసేవాడిగా) వెళ్ళాడు. అక్కడ గారెలు, బూరెలు మొదలైన పిండివంటలు ఎక్కువగా తినివేయడంతో పొట్ట బరువై ఆయాసం వచ్చింది.
అలా ఆయాసపడుతూ నెమ్మదిగా నడిచి వెళుతుండగా దారిలో మరొకరు పిలిచి, ఒక కుండనిండా పేలపిండి(Corn Flour) పోసి రామశర్మకి దానం ఇచ్చారు.
అసలే ఇబ్బందిగా నడుస్తున్న రామశర్మకి తలపై కుండ బరువు తోడై, కొంచం దూరం నడచేటప్పటికి అలసటగా అనిపించి, దారిలో ఒక కుమ్మరి చావడి చూసి రెండు నిమిషాలు అలసట తీర్చుకుందామని అటుగా నడిచాడు.
‘అయ్యా! నేనిక్కడ కాసేపు కూర్చోవచ్చా?’ అని చావడిలో కుండల దగ్గర కూర్చున్న వ్యక్తిని అడిగాడు.
‘కూర్చోండి’ అని ఆ వ్యక్తి ఆసనం ఒకటి చూపించాడు.
‘దాహంగా ఉంది కొంచం మంచి నీళ్ళు ఇస్తారా?’ అని రామశర్మ ఆ వ్యక్తిని మళ్ళీ అడిగాడు.
కుమ్మరి వ్యక్తి ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, పేలపిండి కుండని కాళ్ళ దగ్గరగా పెట్టుకుని చావడిలో ఒక ప్రక్కగా వెల్లకితలా పడుకుని చేతులు తలక్రింద పెట్టుకుని ఆలోచనలలో మునిగిపోయాడు రామశర్మ.
‘ఈ పేల పిండిని బజారులో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఒక మేకని కొని బాగా మేపుతాను. ఆ మేక రెండు పిల్లల్నిపెడుతుంది. ఆ మేక పిల్లలు పెద్దవై అవీ పిల్లలు పెడతాయి. అలా 10 మేకలు 100 మేకలయ్యక వాటన్నిటినీ అమ్మి ఆవులను కొంటాను. ఆ ఆవులు ప్రతి సంవత్సరమూ దూడలను కంటాయి. ఆ ఆవుల పాడి ........పాలు, పెరుగు, వెన్న అమ్మగా వచ్చిన డబ్బుతో పొలం కొంటాను. పొలాన్ని కౌలుకి ఇస్తాను. పొలంలో పండిన ధాన్యం అమ్మి బంగారం కొంటాను.
తరువాత ఆ ఆవులన్నిటినీ అమ్మి ఒక పెద్ద భవనం కొంటాను. నా డబ్బు చూసి ఎంతో మంది నాకు తమ పిల్లనిచ్చి పెళ్ళి చేస్తామని నాచుట్టూ తిరుగుతారు. అప్పుడొక చక్కటి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటాను. కొన్నాళ్ళకి నాకు ఒక కొడుకు పుడతాడు. వాడికి ‘సోమలింగం’ అని పేరు పెడతాను. పిల్లవాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతాను. పిల్లాడు ఏడుస్తుంటే ఎత్తుకోమన్నప్పుడు నా భార్య నా మాట వినకపోతే ఒక్క తన్ను తంతాను ........’ అనుకుంటూ ఒక్క తన్ను తన్నినట్లుగా గాలిలో కాలు జాడించాడు.
ఆ కాలు జాడింపు రామశర్మ కాళ్ళ దగ్గరగా పెట్టుకున్న పేలపిండి కుండకి తగలడంతో అది ఎగిరి చావిడిలో పేర్చి ఉన్న కుండలపై పడింది.
ఇటు రామశర్మ కుండ పగిలి పేలపిండి నేలపాలై మట్టిలోకలిసిపోయింది. అటు కుమ్మరి వ్యక్తి కుండలన్నీ కూడా పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి.
ఆ చప్పుడికి అప్పటిదాకా ఆలోచనలలో మునిగిపోయి ఉన్న రామశర్మ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
కుమ్మరి వ్యక్తి వచ్చి తన కుండలన్నీ పగిలిపోవడం చూసి బ్రాహ్మణుడి వద్దనుంచి కుండల ఖరీదు వసూలు చేసాడు.
ఇటు పేలపిండీ పోయి అటు చేతిలో ఉన్నకొంచం పైకం కూడా పోయి దుఃఖించాడు రామశర్మ.