Menu Close
Page Title

భిన్నత్వంలో ఏకత్వం - అద్వైతానికి మూలమ్

'బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః' - అంటుంది ఉత్తర మీమాంస. అనగా 'బ్రహ్మమే సత్యము, జగత్తు బ్రహ్మము అనే దర్పణంలో కనబడే మిధ్యాబింబమే; బ్రహ్మము, జీవుడు వేరు కాదు'. ప్రతి ప్రాణిలోనూ- అంటే మానవులు, జంతువులూ మొదలైన భూచరములు, పక్షులు వంటి గగన విహంగములు, వివిధ చేపలు మొదలుగాగల జలచరములు, భూ స్థిరములైన వృక్ష సంపద, మొదలైన వాటన్నిటిలో ఇదమిద్ధ ప్రదేశంలో కాక అద్భుత చైతన్య శక్తి శరీరమంతా అంతర్లీనమై ఉండి తామున్న స్థితిని గ్రహించి వస్తున్న ప్రమాదాలనించి ఉపజ్ఞతతో తప్పుకోవడమే కాకుండా, చరజీవులను నడిపించడం మాట్లాడింపచేయడం (అరిపించడం), ఆలోచింపచేయడం, ఆహారం గ్రహించి  జీర్ణించుకోవడం, శరీరంలోని వ్యర్ధాలను విసర్జింపచెయ్యడం, ఎదుగుదల, పునరుత్పత్తి, రోగ నివృత్తి, మొదలైన వాటిని నెరవేర్చగలిగే అత్యవసర క్రియలనే కాకుండా ప్రతి ఒక్క శరీరంలో వాటి అన్ని భాగాల సక్రమ నిర్వహణకి అవసరమైన  ప్రాణవాయువుని రక్త ప్రసరణద్వారా సరఫరాచేసి, శక్తిని ప్రసాదిస్తోంది. ఆ చైతన్య శక్తినే విస్తృత అవగాహనలో మనం 'ఆత్మ' గా అర్ధంచేసుకుంటున్నాము. అది శరీరం నుంచి నిష్క్రమిస్తే వానిని విగత జీవుడని, ప్రాణం లేనివాడిని, చనిపోయినవాడని వ్యవహరిస్తుంటాము. ఇన్ని కోట్ల జీవులలో ఉండే ఆత్మ ఒక్కటేనా, లేక వివిధ ఆత్మలా అని సందేహం రాకమానదు. ఒక్కటే ఐతే, అన్నిటి వ్యవహార తీరు ఒక్కలా లేదే? ఒకదాని అనుభవం, అనుభూతి మరొక దానికి ఎటువంటి సంబంధము లేకుండా ఎలా ఉండగలుగుతుంది? దేనికి అదే భిన్నమైనదైతే వాటిమూలమేమై ఉండాలి? ఆ మూలమే ఉత్కృష్టమైన పరమాత్మా? ఆ పరమాత్మకీ వీటికి ఉన్న సంబంధం ఏ విధమైనదై ఉంటుంది? ఈ సందేహాలకి సమాధానం కోసమే జీవ శాస్త్ర వేత్తలు, విజ్ఞాన శాస్త్ర వేత్తలు, వైద్యశాస్త్ర వేత్తలు, తత్వశాస్త్ర వేత్తలే కాకుండా అటు దృష్టిని సారించిన జిజ్ఞాసువులంతా కూడా పరిశోధిస్తున్నారు. మన వేద విజ్ఞానం తెలుపుతున్న వివరణ ప్రకారం అనాదికాలం నుంచి ఋషులు దీనిపై చాలా పరిశోధన చేసి కొంత జ్ఞాన కాంతిని దీనిపై కేంద్రీకరించి వివరాలని మనకి అందించారు. అటువంటి వారిలో ముఖ్యుడు అది శంకరులు. ప్రస్థానత్రయము లో 'న్యాయప్రస్థాన' మైన వేద వ్యాసుని బ్రహ్మసూత్రాలకి; వేదాలలో అంతిమభాగంగాను, జ్ఞానకాండగాను, 'శృతిప్రస్థానం'గాను కొనియాడబడుతున్న వివిధ ఉపనిషత్తులకు మరియు పంచమ వేదమై, 'స్మృతి ప్రస్థానమై'న వ్యాస భారతంలోని భగవాన్ శ్రీ కృష్ణుని 'గీతోపదేశా'నికి - ఇచ్చిన భాష్యముల ద్వారా పండిత ప్రపంచానికే విస్పష్టత కలిగించి అద్వైత వేదాంతము లో సందేహ నివృత్తి గావించిన శంకరాచార్యులు ఉత్కృష్ట జగద్గురువు.

Adi Shankaracharyaప్రస్తుత కేరళలోని పూర్ణానదీ తీరాన గల 'కాలడి' లో నంబూద్రి బ్రాహ్మణులూ, శైవనిష్టా గరిష్టులైన ఆర్యాంబ, శివగురువులకు, ఏకైక శిశువుగా క్రీ. శ 788 లో వైశాఖ శుద్ధ పంచమినాడు, అంటే 1233 సంవత్సరాలక్రితం, శివాంశతో జన్మించిన కుమారునికి శంకరుడని పేరుపెట్టారు. దురదృష్టవశాత్తు అతడు మూడోయేటనే తండ్రిని పోగొట్టుకున్నాడు. కుమారుని అమోఘ మేధాశక్తిని గుర్తించి అతనికి తల్లి ఐదవయేటనే ఉపనయనం చేయించి గురుకులానికి పంపింది. అసమాన మేధాశక్తిగలిగి ఏకసంథాగ్రాహి అయిన శంకరుడు అనతికాలంలోనే వేద వేదాంగాలు, కావ్యాలు అధ్యయనం చేసి వాటిని కరతలామలకం చేసుకున్నాడు. చిన్నతనంలోనే అతడి కవితా పటిమ ఉదాహరణకి విద్యాభ్యాసం చేస్తూ బిక్షాటనకై ఒక బీద బ్రాహ్మణ స్త్రీ ఇంటిముందు నుంచుని 'భవతి భిక్షందేహి' అని అర్ధించినప్పుడు, ఆమె ఇంట్లో అన్నీ నిండుకున్నదై, ఇంట్లోఉన్న ఒకే ఒక ఉసిరిక కాయను సిగ్గుతో అతని బిక్షాపాత్రలో వేసినది. అప్పుడతడు ఆమె బీదరికాన్ని చూసి జాలిపడి ఆశువుగా లక్ష్మి దేవిని ప్రార్ధించగా ఆ తల్లి అక్కడే బంగారు ఉసిరికాయలు కురిపించింది. దేవీ అనుగ్రహపాత్రులైన వారి కుటుంబము, ఆ యిల్లు ఇప్పటికి అక్కడ ఉన్నాయి. ఆ స్తోత్రమే నేడు 'కనకధారా స్తవం' గా ప్రసిద్ధిచెందింది.

రోజూ పూర్ణానదిలో స్నానం చేసి పూజ చేసుకునే అలవాటుగల తల్లి ఆర్యాంబ ఒకరోజు నదీ స్నానానికి వెళ్ళలేక పోవడం చూసి చిన్నారి శంకరుడు నదీమ తల్లిని సహాయానికై ప్రార్ధించాడట. తెల్లవారి లేచి చూస్తే ఆశ్చర్యకరంగా పూర్ణా నది ఒక పాయ గతి మార్చుకుని, వారి ఇంటి ముందు నుంచే ప్రవహిస్తున్నదట. ఈ మధ్యకాలంలో వారింటి ముందు నది లోని ఇసుక ని 'కార్బన్ డేటింగ్' చేస్తే అది సుమారు క్రి. శ. 890 కి సరిపోయింది. తక్కిన పూర్ణానది లోని ఇసుక మాత్రం అదే 'కార్బన్ డేటింగ్' ప్రకారం కొన్ని వేల సంవత్సరాలక్రితందిగా కనుగొనబడినదట, ఆనదీ గతి మార్పు శంకరుల కాలంలోనే జరిగినట్లు ధృవపరుస్తూ.

చదువు పూర్తయిన పిమ్మట సన్యసింపవలెనను శంకరుల తీవ్ర వాంఛను ఏకైక కుమారుడు గల అతని తల్లి అంగీరింపకుండుటచే మార్గాంతరమన్వేషిస్తుండగా ఒకనాడు నదీ స్నానమందు మొసలి ఒకటి అతని కాలు పట్టుకుని వీడక పెనుగులాడుతున్నప్పుడు, ఒడ్డునే ఉన్న తల్లికి తన గోడు వినిపించి ఎటూ తన జీవితం కుచితమైనదే కావున తాను సన్యసించుటకు తల్లి ఒప్పుకుంటే మొసలి వదలి పెట్టవచ్చునని, అప్పుడు తన జీవితపు పరిమితి పెరగవచ్చునని అంగీకరించమని కోరగా ఆమె విధి లేక అంగీకరించినదట. తదుపరి సన్యసించి, తల్లికి పాదాభివందనం చేసి, ఆమె ఎప్పుడు తలంచితే అప్పుడు వచ్చెదనని తెలిపి సరైన గురువు ని అన్వేషిస్తూ దేశాటనకు బయలుదేరినాడట.

కాషాయ వస్త్రం ధరించి, దండం చేతబుచ్చుకుని, అనేకపుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, గురువాన్వేషణకై బయలుదేరిన శంకరుడు, చివరికి నర్మదాతీరంలోని ఓంకారేశ్వరం సమీపంలో ఒక చిన్న గుహలో జ్ఞాన తపస్సులో మగ్నమైయున్న గౌడపాదుల శిష్యులైన గోవిందపాదుల ఆశ్రమానికి చేరారు. ముమ్మారు ప్రదక్షిణంచేసి సాష్టాగం చేసి నమస్కరిస్తూ నిలబడ్డ కొత్త విద్యార్థిని చూసి ఆయన 'ఎవరు నాయనా నీవు' అని ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా

'మనోబుధ్యంకార చిత్తాని నాహం, నచశ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే|
నచ వ్యోమ భూమిర్నతేజో నవాయు, చిదానందరూప శివోహం శివోహం ||'

'జ్ఞానేంద్రియాలైన మనసు, బుద్ధి, అహం, చిత్తం, కర్మేంద్రియాలైన చెవులు, కళ్ళు, స్పర్శ కాని, భౌతిక ఆధారభూతములైన ఆకాశం, భూమి, గాలి, తేజస్సు, ఇవేమీకాను. చిదానంద అద్వైత మూర్తినైన శివుణ్ణి నేను, శివుణ్ణే నేను' అంటూ సమాధానంగా వరుసగా ఆరు శ్లోకాలు చెప్పి, గోవిందపాదులని తృప్తి పర్చి, ఆయన శిష్య బృందంలో చేరాడు, శంకరుడు.

ఆయన వద్ద వేద వ్యాసుని బ్రహ్మసూత్రాల ప్రజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాంశమైన ‘మహావాక్యాల’ లోని విశేషార్ధాన్ని గ్రహించాడు. ఆ సమయంలోనే నర్మదానది వరదలలో ఉప్పొంగి ముంచెత్తుతూ అపార సస్య, జన నష్టాలని ఎదుర్కొంటున్న సమయంలో శంకరులు జలాకర్షణ మంత్రంతో ఆ జలోత్పాతాన్ని నియంత్రించి తన కమండలంలో నిక్షిప్తం చేసి కాపాడారట. ఒకసారి వ్యాస మహర్షి నర్మదానదీ వరదలని అడ్డుకోగలిగినవాడే తన బ్రహ్మసూత్రాలకి భాష్యం వ్రాయగలడని విన్న గోవిందపాదులు శంకరుని కాశీ క్షేత్రం వెళ్లి అక్కడ ఆ కార్యం నిర్వర్తించమని ఆదేశించారట. కాశీ క్షేత్రంలో ఆపని చేస్తున్న సమయంలో వ్యాసులవారు వృద్ద బ్రాహ్మణరూపంలో అక్కడికి వచ్చి శంకరులతో అద్వైత సిద్ధాంతంపై వాగ్వివాదానికి దిగి అతి సూక్ష్మ వివరణలతో వాదిస్తుంటే శిష్యుడైన పద్మపాదుల జోక్యంతో ఆ వచ్చినవారు వ్యాసమహర్షిగా గుర్తించి, మోకరించి నమస్కరిస్తే, అయన శంకరులు అనుసరిస్తున్న వాదంలోని తీరు సరైనదేనని ధృవీకరిస్తూ, దానినే గ్రంధస్తం చెయ్యమని ఆశీర్వదించారట. ఆవిధంగా ఆరంభమైన అయన 'ప్రస్థానత్రయ' వివరణ ప్రయాణము పండిత, వేదాంత నిపుణుల విమర్శనాత్మక మెప్పుని పొందుతూ కొనసాగింది..

ఒకనాడు గంగాస్నానం చేసి శిష్యులతో వస్తుండగా ఒక పంచముడు నాలుగు కుక్కలతో దారి కడ్డంగా వస్తుంటే, శంకరుడు 'తప్పుకో తప్పుకో' అని గద్దించగా, వెంటనే అతడు 'అయ్యా, ఆ తప్పుకోమంటున్నది అన్నమయమైన ఈ శరీరాన్నా, చైతన్య మయమైన ఆత్మనా?’ అని ప్రశ్నించగా శంకరుడు విచలితుడై, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అద్వైతాన్వితమైన 'మనిషా పంచకం' వినిపించగా ఆ పంచముడు తన ‘పరమశివుని’ నిజ రూపాన్ని ధరించి ఆశీర్వదించి మాయమయ్యాడట. ఆ రోజుల్లోనే ప్రజాబాహుళ్యానికి 'మోహముద్గర' గా సుపరిచితమైన 'భజగోవిందం' శ్లోకాలని ఆశువుగా చెప్పడం జరిగినది.

తరువాత అదే కాలంలో కొందరు మేధావులు పూర్వమీమాంస ప్రభావంవల్ల అనుచితంగా ఉత్తేజితులై, క్రమంగా కర్మ కాండకు ప్రాధాన్యత పెంచి, యజ్ఞ, యాగాది క్రతువులకే పరిమితమై తద్వారా ఛాందసం, దాని ఫలితంగా మూఢ ఆచార నియమాలు పెరిగి, సామాన్య ప్రజానీకాన్ని సనాతన ధర్మపథంనుండి వేరు చేసి ఆచార నియమావళిలోను క్రమంగా చార్వాకం వైపు, బౌద్ధ, జైన మతాలవైపు ఆకర్షితులచేయడం, జన బాహుళ్యం పై వాటిప్రభావం అధికతర మవ్వడం శంకరులు చూసి, జ్ఞానమార్గం వైపు వారి దృష్టిని మళ్లించేందుకు మార్గాన్వేషణ చెయ్యడం ఆరంభించారు. ఒకవైపు నిర్గుణబ్రహ్మారాధన ప్రాముఖ్యత నొక్కి చెబుతూ, సగుణోపాసనని తక్కువ చెయ్యక, సామాన్యులు అంతకుపూర్వం అవలంబిస్తున్న భక్తిమార్గాన్నే వారు పయనించి మోక్ష మార్గాన్ని సాధించే దిశగా వివిధ దేవతామూర్తులపై ప్రార్ధన శ్లోకాలు వివిధ ఆకర్షణీయ ఛందస్సులలో, కవితా రీతులలో ఆశువుగా చెప్పి, ఉద్బోధించి వారిని తిరిగి తాము అంతకుముందు అనుసరిస్తుండే సనాతన ధర్మం వైపు దృష్టిని మళ్లించగలిగారు. ఆవిధంగా మత మార్పిడుల ఉప్పెనకు ఆనకట్ట వేసి నిరోధించగలిగారు. 23 భాష్య గ్రంధాలని, 54 ప్రకరణ గ్రంధాలని, 76 స్తోత్ర మాలికలని వ్రాసి వైదిక మత ప్రాశస్త్యాన్ని పునరుద్ధరణ చేశారు. తదుపరి అనేక ముఖ్య ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు వ్రాసి వాటి ముఖ్యోద్దేశాలని వివరించి, క్రమంగా ముముక్షువులుగా మార్చి వేద ఆలంబన సులభతరం చేసి అందరికి అందించారు. ఆ విధంగా శంకరులు సనాతన ధర్మాన్ని బౌద్ధ, జైన మత తాకిడులనుంచి హైన్దవాన్ని సంరక్షించారనే చెప్పాలి. ఆ పద్ధతిలోనే దిగ్విజయ యాత్రలను సాగించి ఛాందస పండితులను వేదప్రమాణిక వాదనలతోనే ఓడించి, వారి ప్రభావము క్రమంగా పరిమితం చెయ్యడంలో కృతకృత్యుడయ్యారు.

కాశీనగరం లో 'బ్రహ్మ సూత్ర భాష్యం' లిఖించి శిష్యులకు వివరణ యిస్తున్న సమయంలో శ్రీ వ్యాసమహర్షి వృద్దబ్రాహ్మణ రూపంలో వచ్చి మూడవ అధ్యాయంలో 'తదంతర ప్రతిపత్తౌ..' అన్న సూత్రానికి  వివరణ కోరగా ఏకాగ్రత తో వివరణ ఇవ్వటం దానిని వృద్దబ్రాహ్మణుడు శత విధాలుగా ఖండించడం  చూసి, అక్కడున్న శిష్యులు, విద్వద్వరేణ్యులు ఆశ్చర్యపోతుండగా ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు ఆ వచ్చింది శ్రీ వేదవ్యాసునిగా గుర్తించి శంకరులకు సూచించగా వాదనాశ్రేణిలో నిమగ్నుడైయున్న శంకరులు మేలుకొని ఆ వేదవ్యాస మునిశ్రేష్టులకి నమస్కరించి ప్రార్ధించి, తన వివరణ ఆయనచేత సరైనదేనని అనిపించుకుని,  తరువాత తనతో మణికర్ణికా ఘట్టం వరకు విచ్చేసి తనకు కైవల్యప్రాప్తి కలిగించమని కోరగా దానికి శ్రీ వ్యాసమహర్షి 'నీవు చేయవలసినది చాలా ఉన్నది, ఎటువంటి పాండిత్యంలేని గర్వితులైన అనేకులు పండితులుగా చెప్పుకొంటూ వారు వేదాంతవిరుద్ధ ప్రచారం చేస్తూ విజ్రంభిస్తున్నారు గనుక వారిని నియంత్రించి, వారిని వేదాంత పరిధులని అతిక్రమించేలా చేసి, సరైన బ్రహ్మవిద్య ప్రచారం చేయడము అవసరం, నీ వాదనా పటిమతో వారందరిని జయించి ఆత్మజ్ఞానాన్ని వ్యాపింపచెయ్యాలి, అది నీ వల్లనే జరుగుతుందని' చెప్పి శంకరులని కార్యోన్ముఖులని చేసి నిష్క్రమించారు.

శ్రీ శంకరులు, జైత్ర యాత్రలకు ముందు కుమారస్వామి అవతారంగా కొనియాడబడుతున్న కుమారిలభట్టు ద్వారా తన భాష్య గ్రంధానికి వార్తికాలు వ్రాయ సంకల్పించి ప్రయాగ తో తన ఉద్యమాన్ని ఆరంభించి, మాహిష్మతి (బీహార్) లో నెలలు తరబడి జరిగిన ప్రసిద్ధ వాగ్వివాదంలో మండనమిశ్రుని ఓడించి, సురేశ్వరాచార్యులు నామంతో అయనను  శిష్యునిగా స్వీకరించి, శ్రీశైలంలో 'సౌందర్య లహరి' రచించి, రామేశ్వరంలో దిగ్విజయయాత్ర ప్రారంభించారు. కర్మిష్ఠి అయిన ప్రభాకరుని కుమారుడు మూగవాడైనా ఆత్మజ్ఞానం గల మేధావి గా గుర్తించి దేవి ప్రార్ధనతో అతనికి వాక్కుని తెప్పించి హస్తామలకునిగా తన శిష్యబృందంలో చేర్చుకున్నారు.

భారత దేశం ఆసేతు హిమాచలమ్ అనేక పర్యాయాలు కాలినడకనే సనాతనధర్మము అందునా అద్వైత పునరుద్ధరణకై తిరిగి అనుకున్నది సాధించగలిగిన దైవాంశసంభూతుడు, శంకరాచార్యులు.

తుంగా నదీ తీరాన్న గల శృంగగిరి లో ప్రసవించబోతున్న ఒక కప్పకు పాము పడగవిప్పి ఎండనుంచి రక్షణ కల్పించడం శంకరాచార్యులు చూసి ఆ స్థలమాహాత్మ్యాన్ని గుర్తించి అక్కడే మొదటి 'అహంబ్రహ్మాస్మి' ఆధారిత యజుర్వేద పీఠాన్ని'భూరివల' సాంప్రదాయంలో స్థాపించి సురేశ్వరాచార్యుని ఆ దక్షిణ పీఠానికి అధిపతి గా నియమించి; పిమ్మట పశ్చిమాన గుజరాత్ లోని ద్వారక వద్ద హస్తమాలకాచార్య ఆధ్వర్యంలో 'తత్వమసి' మహావాక్య ఆధారిత సామవేద 'కిటవల' సాంప్రదాయంలో ద్వారకాపీఠాన్ని స్థాపించి, ఉత్తరాన ఉత్తరాఖండ్ బదరికాశ్రమం వద్ద  తోటకాచార్యుల అధిపత్యములో 'అయం ఆత్మానం బ్రహ్మ' అనే వాక్యాధారిత అథర్వవేద 'నందవల' సాంప్రదాయంలో జ్యోతిర్ మఠ్ పీఠాన్ని, తూర్పున ఒడిశా లోని పూరి వద్ద పద్మపాదుల అధీనంలో 'ప్రజ్ఞానం బ్రహ్మ' అనే వాక్యాధారంగా 'భోగవల' సాంప్రదాయంలో గోవర్ధన ఋగ్వేద పీఠాన్ని స్థాపించి దేశపు నలుమూలల అద్వైత ప్రచారానికి నాంది పలికారు. ఆ ఆమ్నాయ పీఠాలు ఆదినుంచి ఆచార్యత్వం వహించి ముముక్షువుల సందేహ నివృత్తిలో ముఖ్య పాత్ర వహిస్తూ అద్వైత ప్రాశస్త్య పెంపుకై కృషిచేస్తున్నాయి. తమిళ నాడు కంచి లోని కామకోటి పీఠం కూడా శంకరాచార్యులే స్థాపించారని ప్రసిద్ధి కాని పూర్తి వివరాలు అందుబాటులోలేవు. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యాలు, ఉపనిషద్భాష్యాలే కాక 'వివేకచూడామణి', 'ఉపదేశ సహస్రి', 'ఆత్మబోధ', 'అపరోక్షానుభూతి', 'తత్వబోధ', 'పంచీకరణ' మొదలైన అనేక ప్రకరణ గ్రంధాలుకూడా జిజ్ఞాసులకి మార్గ దర్శకాలవుతున్నాయి.

సర్వజ్ఞ పీఠాధిరోహణం: శ్రీ శంకరులు న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, పూర్వమీమాంస, పంచదర్శక, నాస్తిక, బౌద్ధ, జైన, సౌగత మత ప్రముఖులని వాదాలలో తన అద్వైత సిద్ధాంత వాదనతో గెలిచి, తన పరమ సిద్ధాంతమైన అద్వైత తత్వాన్ని స్థాపించిన పిమ్మట, వారందరు అంగీకరించి సాగిలపడి నమస్కరించి శ్రీ శారదా పీఠద్వారాన్ని తెరిచారు. వారందరు దారిచూపుతూ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించమని కోరగా శ్రీ శంకరాచార్య యతీంద్రులు కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠాని అధిరోహించ బోతుండగా సరస్వతి దేవి ఆపి నీ ఆత్మశుద్ధిని నిరూపించుకొమ్మని సవాలు చెయ్యగా ఆపరివ్రాజ శ్రేష్ఠుడు, తాను ఎటువంటి పాపకర్మచేయ్యలేదు, ఆమెతో వదనాంశమైన కామకలాప నిష్ణాత్వ నిరూపణకై తన దేహంతోకాక అమరిక మహారాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి దానిని సంపాదించినడవడం వల్ల, అది అశరీరానికే పరిమితమై, అశరీర దహనంతో తీరిపోయినందువల్ల తాను పరిశుద్దుడనని ఆ మాలిన్యాలు ఈశరీరానికి అంటవని నిర్ధారించినపిమ్మట శ్రీ శారద దేవి మందహాస వీక్షణాల మధ్య శ్రీ పద్మపాదులు పీఠం వరకు తోడు రాగా, జయ జయ ధ్వానాలమధ్య ఠీవిగా, నెమ్మదిగా ఆపీఠాన్ని అధిరోహించారు.

శంకరుల అద్వైత పునరుద్దీకరణ పూర్తైన తరువాత, దైవనిర్దేశిత కర్తవ్య పాలన పూర్తయినదని తలంచి కేదారము నుంచి హిమాలయాలవైపు పయనించారని తరువాత వారిని ఎవ్వరు చూడలేదని అక్కడి శిష్య పరమాణువులు వివరించారట. అయన ఆ నిష్క్రమణ 32 ఏట జరిగినది. ఆ శంకరుని అవతార రూపుడైన శంకరాచార్యులు ఏ మానవుడు చేయలేని ఉత్కృష్ట సేవ వేద సంస్కృతికి, హైందవ జాతికి  చేశారు.

ప్రాతః స్మరామి హృది సంస్ఫుర దాత్మతత్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం |
యస్స్వప్న జాగర సుషుప్త మవైతినిత్యం
తద్బ్రహ్మ నిష్కల మహమ్ నచ భూత సంఘః ||
'విదితాఖిల శాస్త్ర సుధా జలధే
మహిషోపనిషత్కథితార్థనిధే,
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్'

-o0o-

Posted in June 2021, సాహిత్యం

2 Comments

  1. నాగ శ్రీనివాస్ దేవర్సు

    చాలా చక్కగా శంకరాచార్యులు వారి చరిత్ర మరియు అద్వైత సిద్ధాంత ప్రాముఖ్యతను వివరించారు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!