Menu Close
Page Title

4. భారతావనికి మకుటాయమానం- సుందర కాశ్మీరం

India-mapSrinagarభారతదేశానికి కిరీటంలా నిలిచే జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం హిమాలయాల మధ్య రంగురంగుల పూలతోటలతో, మధురమైన పళ్ళతోటలతో, సుందర ఉద్యానవనాలతో, అందమైన మంచినీటి సరస్సులతో విరాజిల్లే చల్లని అందమైన ప్రదేశమే కాకుండా, అనేక సుగంధ ద్రవ్యాలతో, అందమైన పక్షి సమూహాలతో, చమరీ, కస్తూరి మొదలైన మృగాల అలజడులతో  కళకళలాడుతూ శోభాయమానంగా ఉంటుంది. మబ్బులతో సగం కప్పబడి, మంచు పింజలతో అలంకరించినట్లుండే పర్వతశిఖరాలు, దూరాన నగాలు మబ్బులలో మాయమై పోతున్నట్లుండి కాళిదాసు వంటి కవి శ్రేష్ఠులని ఉద్దేపింప చేసిన పర్వత సానువులతో ఆవరించుకున్న సుందర సీమ అది. అంతటి అందమైన ప్రదేశం కావడం వల్ల, దేశ విదేశ సందర్శకులకి అత్యంత ఆదరణీయ ప్రదేశంగా నిలిచింది. అత్యంత పురాతనమై ప్రపంచంలోనే గురుకుల పద్దతిని నడచిన మొదటి విశ్వవిద్యాలయం తక్షశిల లో ఈ ప్రాంతంలోనే ఉండేదట. అసమాన సంస్కృత, శైవ పండితులలతో విఖ్యాతి చెందిన కాశ్మీరం, వాయవ్య ప్రాంతాలనుంచి వచ్చిన మహమ్మదీయ దోపిడీ దారుల నెదుర్కొంటూ గత వెయ్యి సంవత్సరాలుగా అక్కడి ప్రజలు తమ ప్రశాంతతని పోగొట్టుకుని అక్కడే అస్తవ్యస్త జీవితాలని గడుపుతూ కొంతమంది, ఆబాధలు భరించలేక ప్రశాంత జీవనాన్ని వెదుక్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస పోయి కొంతమంది జీవితాలు వెళ్లబుచ్చుతున్నారు. అయినా పర్యాటకులకు కొదువలేదు. జమ్ములో ప్రసిద్ధమైన ‘వైష్ణవి దేవి ఆలయం’, ఉత్తర కాశ్మీరం లో ఉన్న ‘శారదా పీఠం’, ‘మార్తాండాలయం’ (శిధిలావస్థలో ఉన్నప్పటికీ), ‘శంకరాచార్య ఆలయం’ (శ్రీనగర్,- 'దాల్ లేక్' వద్ద), పవిత్రమైన అమరనాధుని ఆలయం, శ్రీనగర్ -లేహ్ మార్గంలో ఉన్న 'లామాయూరు' బౌద్ధ విహారం, శ్రీనగర్ లోని దాల్ సరస్సులో పడవపై ఆహ్లాదకర వినోదయానం గొప్ప ఆకర్షణగా ఉన్నాయి. Dal-lakeఇంకా అనేక సుందర ఉద్యానవనాలలో పూవుల తోటలలో, నీటి ఊటలలో విహారం, ప్రపంచం అన్ని మూలలనుంచి జనాలని ఆకర్షిస్తూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 1.25 కోట్లు, లింగ నిష్పత్తి: 889 స్త్రీ/ 1000 పురుషులు; వారిలో ముస్లింలు 63.3 %, హిందువులు 28.44% , సిక్కు మతస్తులు 1.9%, బౌద్ధ మతస్తులు 1%. రాష్ట్రం లో అక్షరాస్యత 67.2%. రాష్ట్ర జనాభా భారత దేశ జనాభాలో 1.05%. రాష్ట్ర వైశాల్యం 2,22,236 చదరపు కి.మీ. రాష్ట్ర వినోదయాత్రికుల సంఖ్య 2017లో ఒక కోటి నలభై ఐదు లక్షలు కాగా, వారిలో ఎనభై వేలమంది విదేశీయులు సందర్శించారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వైష్ణోవి దేవి ఆలయం

Vaishno-Deviimg-02ఈ సుప్రసిద్ధ ఆదిశక్తి ఆలయం జమ్మూ లో కాట్రా వద్ద త్రికూట పర్వతాలపైన 5,200 అడుగుల ఎత్తులో త్రేతాయుగంనుంచి విరాజిల్లుతోందని పురాణాలద్వారా తెలుస్తోంది. ఏటా ఎనభైఆరు లక్షలమంది భక్తులు దర్శించే ఈ ఆలయంలో మహాకాళి, మహా లక్ష్మి, మహా సరస్వతుల శక్తులు ఏకం అయి ఉన్నాయని భక్త జనం నమ్ముతారు. ఆదిశక్తి మాత రాక్షస శక్తుల్ని నాశనం చేసిన పిమ్మట, భక్తుల కోరికపై, వైష్ణోవి దేవిగా భూమిపై అవతరించిందని చెబుతారు. ఆమె చిన్నతనం నుంచి విష్ణు భక్తి తో తపోలీనమై యుండి సీతాపహరణం తరువాత సీత ని వెదుకుతూ అటువచ్చిన రాముణ్ణి పెండ్లి ఆడమని కోరుతుంది. దానికి రాముడు తాను ఏకపత్నీవ్రతుడనని సీతాన్వేషణలో ఉన్నానని చెప్పి కొంతకాలం తరువాత తిరిగి వచ్చి ఆమె కోరిక తీరుస్తానని చెప్పాడట. రామావతారం అనంతరం విష్ణుమూర్తి వృద్ధ బ్రాహణ రూపం లో రాగా ఆమె అతనిని రాముని గా గుర్తించక నిరాకరిస్తుంది. తరువాత నిజము తెలుసుకున్నా, విష్ణువు అంగీకరించక తాను తిరిగి కలియుగంలో కల్కి అవతారం ధరించి వచ్చినప్పడు వివాహమాడతానని చెప్పి అదృశ్యమయ్యాడట. ఆమె తిరిగి ఆ గుహలోనే తపస్సు చేస్తూ ఉండిపోయిందట. వైష్ణోవి దేవి భక్తజనుల సకల కోరికలు తీరుస్తుందని ప్రజల గాఢ విశ్వాసం.

img-01img-03ఢిల్లీ నుంచి రైలుమార్గంలో కానీ, విమానయానం ద్వారాగాని ‘కాట్రా’ కి చేరుకోవచ్చు. అక్కడనుంచి, ఆటో గాని టాక్సీ గాని తీసుకుని నడకదారి యొక్క ముఖద్వారం దాకా వెళ్లి అక్కడనుంచి 14 కి.మీ. నడచిగాని, గుర్రాలపై గాని (అందులో 3 కి.మీ. కొంచం నిటారుగా ఎక్కాలి) కొండపైన ఆలయానికి చేరుకోవచ్చు. ’కాట్ర’ నుంచి హెలికాప్టర్ లో కూడా త్రికూటపర్వతాలలో ఒక దానిపైన ఉన్న 'సంజిఛాట్'ని చేరుకొని అక్కడనుంచి నడకదారిని 3 కి.మీ. క్రిందకు దిగి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ దారిని కూడా గుర్రాలు కూడా ఉన్నాయి. హెలికాప్టర్ మార్గం ఖర్చయినదే కాకుండా ఒక ట్రిప్పు లో ఐదుమంది మాత్రమే కొండపైకి వెళ్లాడనికి వీలవుతుంది గనుక ఎక్కువకాలం పడుతుందని చాలామంది నడక మార్గాన్నే ఎంచుకుంటారు. శ్రీమాత దర్శనానికి కి పట్టే కాలం వాతావరణ స్థితిని బట్టి, పండుగలు, పిల్లల పాఠశాల శలవలని బట్టి మారుతూటుంది. ఆలయంలో ఫోటోగ్రఫీ కి తావులేదు. ఏ ఒక్క వస్తువు ని లోనికి తీసుకెళ్లనివ్వరు, ఆఖరికి పరుసు కూడా. కొండపైనుంచి 'కాట్రా' దృశ్యం మనోహరంగా ఉంటుంది.

అమర్నాథ్ గుహాలయం

Amarnath-Cave-templeశ్రీనగర్ నుంచి 141 కి మీ. దూరంలో వాయవ్యాన హిమాలయ పర్వతాల మధ్య నెలకొని ఉన్న అమర్నాథ్ గుహాఆలయం సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉండి, పురాణ కాలం నుంచి అశేష యాత్రికులనాకర్షిస్తూ పేరొందిన యాత్రాస్థలం. మొదట దీనిని కనుగొన్నది భృగు మహర్షి అని చెపుతారు. అక్కడికి చేరుకోవడం చాల శ్రమతో కూడినదైనా, ఏటా దాదాపు 6 లక్షల మంది యాత్రికులు (శ్రావణ మాసం లో అధికము) 'పహల్గాం' ద్వారా చేరి ఆ 130 అడుగుల గుహలోని ఆ అమర లింగాన్ని దర్శించుకుంటారు. ఆ లింగం పౌర్ణమివరకు పెరిగి ఉన్నత స్థితికి చేరుకొని క్రమంగా అమావాస్యకు క్షీణిస్తుందట. అధిక సంఖ్య గురు పూర్ణిమ శ్రావణ పూర్ణిమల మధ్య అక్కడికి చేరుకుంటారు. 'రాజతరంగిణి' గ్రంధంలో ఉదహరించిన ప్రకారం పదకొండవ శతాబ్దంలో రాణి సూర్యమతి త్రిశూలం, బాణలింగాలు అర్పించుకున్నదట. అవి ఇప్పటికి అక్కడనే ఉన్నాయి.

శారదా పీఠం

Sharada-peethశ్రీనగరికి ఈశాన్య దిశలో 130 కి.మీ దూరంలో 'శారది' లో నెలకొని ఉన్నఈ అతిపురాతన విద్యాపీఠం ఒకప్పుడు పండితసభలకి, శాస్త్రీయ చర్చలకు ప్రసిద్ధి చెందినది. ఆది శంకరులు అక్కడి పండితసభలలో మేధావులందరిని శృతుల (వేద, ఉపనిషత్తుల) ప్రమాణంగా అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించి, వాదనలో గెలిచి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన శారదాపీఠం ఇది. ఈనాడు శిధిలమాత్రమై ఉన్నా ఒకప్పటి చర్చావేదిక, ఆనాటి ఔన్నత్యానికి సాక్షిభూతంగా నిలిచి ఉండి మనలో విషాదాన్ని రేపుతుంది. ఇప్పటి భారత ప్రభుత్వం దాని పునర్నిర్మాణానికి పూనుకుంటుందని వినికిడి. మహమ్మదీయ విద్రోహులు అక్కడి పవిత్ర స్థలానికి హాని చేస్తారని దూరదృష్టి తో తెలుసుకుని ఆదిశంకరులు ఇక్కడి శారద దేవి దారు విగ్రహంలోని అంశ ని శృన్గేరి శారదాపీఠం లోని శారదావిగ్రహానికి ఆవహింప చేశారట.

కాశ్మీరానికి కి కలికితురాయి 'శ్రీ' నగరం

img-04సుందర ఉద్యానవనాలతో, నిర్మల ప్రశాంత సరస్సులతో, హిమ నగాలమధ్య స్వర్గాన్నే తలపించే ఆరాష్ట్రానికి రాజధాని నగరం శ్రీనగర్. అక్కడి ఉద్యానవనాల్లో పేరుగాంచినవి 'షాలిమార్ బాగ్ - మొఘల్' తోటలు, 'ఇందిరా గాంధీ మెమోరియల్ ట్యూలిప్’ తోటలు, 'ఛష్మసాహి' తోటలు. ఆ తోటల యొక్క ఫోటోలు కొన్నిటిని క్రింద చూడొచ్చు. 'డాల్' సరస్సు చాలా ప్రశాంతంగా ఉండే శ్రీనగర్ పరిసరాల్లోని పెద్ద సుందర సరస్సు. అందాల పరిసరాలలో బంధు మిత్రులతో పడవలో ఆ సరస్సులో విహార యాత్ర మరువలేని అనుభవం. అందమైన ఇళ్ల లాగ అన్ని సౌకర్యాలు కలిగిన 'షికారా' నౌకలో ఆహ్లాదకర వాతావరణంలో వెన్నెల రాత్రి గడపడం ఒక మరపురాని మధురానుభవం. దాని నావికుడే మంచి టీ, ఫలహార, భోజన సదుపాయం కలిగించి ఖరీదైన హోటలు నివాసాన్ని మరిపింపచేస్తాడు. అది ఒక వింత అనుభవం. అక్కడికే కొందరు వ్యాపారస్తులు చిన్నపడవలలో తమసామాన్లు తీసుకుని వచ్చి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తారు, అవి మరీ ఖరీదుగా ఉండవు. కాశ్మీర్ 113 రకాల ఆపిల్, 62 రకాల పేయర్స్, 31 రకాల ప్లమ్స్, 14 రకాల చెర్రీలే కాకుండా ఇంకా ఆప్రికాట్, లాంటి పళ్ళకి, బాదం, పిస్తా, వాల్నట్ వంటి పప్పులకి ప్రసిద్ధం. ఇక్కడనుంచి దేశమంతా ఆ వ్యవసాయ ఉత్పత్తులు లారీలలో పంపిణి చెయ్యడం జరుగుతోంది. ఏ రహదారిచూసినా వీటిని నింపుకుపోతున్న వాహనాలే కనిపిస్తాయి.

img-05img-06ఇక్కడి కుంకుమపువ్వు (saffron) కూడా చాలా ప్రసిద్ధం. వీటి పువ్వులలో ఎర్రని, పచ్చని కేసరములు తీపిపదార్ధాలలోను, రకరకాల వంటపదార్ధములలోను వాడితే వాటి రుచులని నాణ్యతని పెంపొందిస్తాయి. కాశ్మీర్ పట్టు కూడా ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే ఉన్ని రగ్గులు రంగురంగుల డిజైన్ల తో ఆకర్షణీయంగా నేయబడి విశ్వవిఖ్యాతి చెంది, వివిధ సంస్కృతుల వారి ఇండ్లని అలంకరిస్తున్నాయి. ఇక్కడి శాలువాలు, దుప్పట్లు- ఉన్నివి గాని నూలువిగాని, దేశవిదేశాలలో చాల ప్రాముఖ్యాన్ని సంపాదించుకుని, జ్ఞాపికగా కొనదలుచుకున్నవారికి వాటిపై ఆకాంక్షను పెంచుతాయి. ఇక్కడి 'రాజ్మా' మంచి రుచి గలిగి విశ్వ విఖ్యాతి ఆర్జించింది. ఇక్కడి 'బాస్మతి' బియ్యం సంగతి చెప్పనే అక్కర్లేదు. దానితో అన్నం వండితే విరవిర్లాడుతూ మంచి సువాసనలు వెదజల్లుతూ తినబోతున్న పదార్ధాల రుచులని పెంపొందిస్తూ నోరూరించేలా చేస్తుంది. 'సంవర్' లో తయారు చేసే 'షీర్ చాయ్' అని పిలువబడే పానీయం చాల రుచి కరంగా ఉండి కాశ్మీర్ కు చిహ్నంగా నిలిచింది. అక్కడి హస్త కళా ఖండాలు అనాదిగా వస్తున్న సంస్కృతి సంపదలనాధారంగా చూపరులని ముగ్ధులని చేస్తూ వాటిని తమస్వంతం చేసుకోవాలనే తపనని కలిగిస్తుంది. అందుకే కాశ్మీర్, దేశ కిరీటంలో మణిపూస అవడంలో ఆశ్చర్యం లేదు.

సాంస్కృతిక కళా నిలయం కాశ్మీర ధామం

Kashmir-Dhamam-01Kashmir-Dhamam-02ఏ ప్రాంత ఔన్నత్యాన్నైనా కలకాలం నిలబెట్టేది అక్కడ పరిఢవిల్లిన సంగీత, సాహిత్య, నృత్య కళలే. ‘కొషూర్' ఆ ప్రాంత భాష, సాహిత్యం అందులో అభివృద్ధి చెందడం వల్ల అది కాశ్మీరం అయింది. ఆ భాషనే హిందువులు మాట్లాడేటప్పుడు సంస్కృత పదజాలం అధికంగా వినిపిస్తుందట, అదే భాష ముస్లిం మతస్తులు మాట్లాడాడేటప్పడు ఉర్దూ పదాలని ఎక్కువగా వాడడం కనిపిస్తుందట. అనాదిగా కాశ్మీర్ విద్యాసంస్కృతులకి అలవాలమై, వాటి అభివృద్ధికి స్థానాన్ని సంపాదించుకుంది. శితికంఠాచార్య రచన 'మహానయప్రకాశ' కాశ్మీరీ సాహిత్యంలో మొదటి గ్రంధం గా కొనియాడబడితే, పన్నెండవ శతాబ్దపు కల్హణుని 'రాజతరంగిణి' మొదటి కాశ్మీరీ కావ్యముగా చాల మందిచే సూచింపబడింది. భాటవతార్ యొక్క 'బాణాసురకధ' మొదటి పురాణ కావ్యంగా ప్రఖ్యాతి గాంచినా, ఆ తరువాత చాలామంది రచయితలూ, కవులు కాశ్మీరీ సాహిత్యాన్ని ప్రకాశింపచేశారు (వాటిలో కొన్ని సంస్కృతంలో ఉన్నాయి). వారిలో పతంజలి (యోగసూత్ర, మహాభాష్య - పాణిని వ్యాకరణం పై వ్యాఖ్యానం), బిల్హణ (11వ శతాబ్దం), కల్హణ (12వ శతాబ్దం), లల్లేశ్వరి (1320-1362), గులాం అహమద్ మహజూర్  (1887-1952), జిందా కౌల్ (1884-1965), అమిన్ కమిల్ (1924-2014), ఫారూఖ్ నజకి చాలా ప్రసిద్ధులు. ఆయుర్వేద శాస్త్రానికి ప్రామాణికమైన చరక సంహిత, 2వ శతాబ్దాని కి ముందు అక్కడనే వ్రాయబడి నట్లు తెలుస్తోంది. మూడవ శతాబ్దపు విష్ణు శర్మ వ్రాసిన 'పంచతంత్ర' కూడా అక్కడిదే. 'ఉపమా కాళిదాసస్య' అని ప్రఖ్యాతి గడించిన ఐదవ శతాబ్దపు కవి శేఖరుడు కాళిదాసు కూడా కాశ్మీరుకి చెందినవాడే. పదకొండవ శతాబ్దపు 'చౌర పంచక శిఖ' అనే ప్రేమకవిత్వాన్ని ఒలికించి అనేక విదేశీ కవులకు కూడా ప్రేరణ కలిగించిన బిల్హణుడు అక్కడివాడే. వాళ్ళే కాక అనేక సంస్కృత రచయితలు అక్కడే ఉద్భవించి సంస్కృత భాషకి, కాశ్మీరానికి, భారత దేశానికీ ఖ్యాతిని ఆర్జించిపెట్టారు.

నాట్య కళ: ‘ధుమహల్' బహుళ ప్రచారం లో ఉన్న మగవాళ్ళు చేసేనాట్యం అయితే, 'రోఆఫ్'  స్త్రీలు చేసే జానపద నృత్యం.

విందు భోజనం: ప్రత్యేక విందు భోజనాన్ని 'వాజవాన్' అంటారు. ఇది ఆంధ్ర భోజనం లాగే మసాలా రుచులతో నాలిక చుర్రు మంటూ ఉంటుంది. ఆ మసాలాలు చాల మంది నచ్చి కొనుక్కుని తీసుకుని వెళ్తుంటారు.

శంకరాచార్య మందిరం

Sankaracharya-mandiramఇది మొదట క్రి పూ. 200 లో బౌద్ధ మందిరమని తెలుస్తోంది. అది మొదట కల్హణుని గ్రంధాలలో గోపాద్రి గా లిఖించబడింది. కొండ దిగువభాగం గోప (బ్రాహ్మణ) అగ్రహారం గా పిలువబడేదట. కాలాంతరమున అది గోపూర్ గా మారింది. కొండపైని  జ్యేష్ఠరుద్రాఆలయాన్ని (శివాలయాన్ని)  క్రి. శ. 371 లో గోపాదిత్య రాజు నిర్మించినట్టు కల్హణుడు గ్రంధస్తం చేసాడు. 243+9 మెట్లు గలిగి అష్ట భజాకారం గలిగి పైన చతురస్రాకారం గల ఈ ఆలయం శివ శక్తుల ఐక్యత యే  శ్రీచక్రముగా ఆవిర్భవించిందని శంకరులు నిరూఢపరచిన ప్రదేశం. ఇక్కడి శివ లింగాన్ని చుట్టిన సర్పము లింగంపై ఉంది. తొమ్మిదవ శతాబ్దంలో శంకరాచార్య కొంతకాలం అక్కడ తపస్సు చెయ్యడం వల్ల అయన పేరున కొండగా ప్రసిద్ధి చెందింది. అది శంకరులు ఇక్కడే ప్రఖ్యాత "సౌందర్య లహరి" వ్రాసినట్టు ఆధారాలున్నాయి. ఇక్కడనుంచే ప్రపంచఖ్యాతిని పొందిన 'కాశ్మీరీ శైవం' వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. అది బౌద్దులకు ఇప్పటికి కూడా పవిత్రస్థానం గానే గణతికెక్కింది. ఇది శ్రీనగర్ లోని దాల్ సరస్సు కి ఎదురుగ వుంది.

మార్తాండాదిత్య ఆలయం

Marthandadithya-templeఅనంతనాగ్ సమీపంలోఉన్న సూర్య భగవానునికి అంకితమైన ఈ ఆలయాన్ని 725 -756 ల మధ్య కర్కోట వంశానికి చెందిన లలితాదిత్య ముక్తపాదుడు నిర్మించినట్లు తెలుస్తోంది. కానీ దాన్ని మహమ్మదీయ రాజు 'సికందర్ బుత్శిఖం' ఆదేశాలపై పదిహేనవ శతాబ్దంలో పూర్తిగా నాశనం చేయబడింది. శిధిలావస్థలో ఉన్నా కూడా ఇప్పటికీ కనబడే శిల్ప సౌదర్యం ఆనాటి శిల్పుల కళానైపుణ్యాన్ని చాటి చెబుతుంది. ఆ సుందర ఆలయంనుండిచూస్తే క్రింద ప్రాంతమంతా మనోహరంగా ఉండి చూపరులని ముగ్ధుల్ని చేస్తుందట. ఈ సుందర దృశ్యాలని ఆధారంగా చేసుకుని చాల సినిమాలలో పాటలు చిత్రీకరించారు. అవి ఇప్పటికీ అజరామరాలు.

లామయూర్ బౌద్ధాలయం

Lamayur-templeశ్రీనగర్ - లేహ్ రహదారిలో ఉన్న 'ఫోటు లా' కి 15  కి.మీ దూరంలో ఉన్న ఈ పురాతన టిబెట్ పద్ధతులనాధారంగా నడుస్తూ ఉన్న బౌద్ధాలయం లేహ్ జిల్లా, లఢక్ లో వుంది. నరోపా అనే విద్వాంసుడు (956 - 1041) ఒక సరస్సుని తవ్వించి, అక్కడ ఈ బౌద్ధాలయాన్ని నిర్మించాడట. ఇది లఢక్ లో ఉన్న అతి పురాతనము విశాలమైన 'గొంపా'. దానిలో ప్రస్తుతం 150  స్థిర సన్యాసులు ఉన్నారట. ఒకప్పుడు 400 వరకు సన్యాసులు ఉండేవారట. ఇప్పుడు కొందరు చుట్టుపక్కల ఉన్న గొంపాస్ కి ప్రార్ధనలు నిర్వహించడానికి వెళ్లారట. ఇక్కడ ప్రతి సంవత్సరం రెండుసార్లు 'ముసుగు నాట్య పండుగ' టిబెట్ చాంద్రమానం ప్రకారం రెండు, ఐదు నెలలో జరుగుతాయి. అప్పడు చుట్టూ పక్కల అన్ని గొంపాల నుంచి సన్యాసులు వచ్చి ప్రార్ధనలు జరుపుతారు.

క్షీర భవాని మందిరం

Ksheerabhavani-templeక్షీర భవాని మందిరం శ్రీనగర్ కి 14 మైళ్ళ దూరంలో ‘తుల్ మూల్’ పల్లె దగ్గర చినారు అడవులలో ఉంది. కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు ఈ భవాని (మహారాజ్ఞి అని కూడా పిలుస్తారు) మాతని అతి పవిత్ర దేవి గా కొలుస్తారు. వసంత కాలంలో ఆ దేవి ని ప్రసన్నురాలిని చేసుకోవడానికి పూజలు సలుపుతారు. ఆమె ప్రసన్నురాలై దేశప్రజలని సంతోషంగా చూస్తుందని నమ్ముతారు.

మన దేశం లోనే ఉన్న కాశ్మీర్ ఒక చల్లని సుందర ప్రదేశమే కాకుండా విద్యా, సంస్కృతి, సంస్కారాలకి నిలయమై అందరు చూసి ఆనందించి ముగ్ధులై గర్వించదగిన ప్రాంతం.

-o0o-

Posted in February 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!