Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

బలయుతుఁడైనవేళ నిజ | బంధుఁడు తోడ్పడుగాని యాతడే
బలము తొలంగెనేని తన | పాలిట శత్రు, వదెట్లు పూర్ణుడై,
జ్వలనుఁడు కానఁగాల్చు తరి | సఖ్యముజూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు | పట్టున నార్పదెగాలి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! నిండు బలము గలవాడై అగ్నిదేవుడు అడవిని గాల్చు సమయాన వాయుదేవుడు స్నేహితుడై సహకారము చేయుచూ ఉండును. ఆ అగ్ని చిన్న దీపముగా ఉన్నచో ఆ స్నేహితుడైన వాయుదేవుడే ఆ దీపమునకు విరోధియై వానిని ఆర్పివేయును. అట్లే మానవుడు ఆన్ని విధముల సంపన్నుడు, శూరుడై యున్నప్పుడే బంధువులు సహాయము చేయుదురు గాని, బలముపోయి లోబడినప్పుడు అందరూ అతనికి శత్రువులే అగుదురు.

భుజబల శౌర్యవంతులగు | పుత్రులఁగాంచిన వారికెయ్యడన్
నిజహృదయేప్సితార్థములు | నిక్కము చేకుఱుఁగుంతి దేవికిన్
విజయబలాఢ్యుఁడర్జనుఁడుఁ | వీర పరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రత | కార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! శూరుడు పరాక్రమవంతుడగు అర్జునుడు పుత్రుడుగా పుట్టుటచే, తల్లియగు కుంతీదేవికి వ్రతభంగము కాకుండా, తల్లి కోరికపై దేవలోకము నుండి ఐరావతమును తెచ్చి వ్రతమును క్రమ విధానమున ఆచరింప జేసెను. అట్లే బాహుబల పరాక్రమవంతులు పుత్రులుగా జన్మించుటచే తల్లిదండ్రుల కోర్కెలు తీరునని భావము.

భూనుతులైన దేవతలు | పూర్వము కొందఱు వావివర్తనల్
మాని చరింపరోయనుచు | మానవులట్ల చరింపఁబోల; దం
భోనిధులన్నియుం దనదు | పుక్కిటబట్టె నగస్త్యుఁడంచు నా
పూనిక కెవ్వడోపునది | పూర్వ మహత్వము సుమ్ము భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! పూర్వ మహత్తు గల యోగముచే అగస్త్యుడు సముద్రముల నీటిని పుక్కిటిగా పట్టెను. ఆ ప్రయత్నము సామాన్యులు చేయలేరు. యోగి వర్యులకే వీలగు పని అది. కావున పూర్వము దేవతలు చెడు మార్గముల సంచరించిరని వావి వరుసలు మరచి ప్రవర్తించిరని వారివలె మానవులు చెడ్డ పనులు చేయరాదు అని పూర్వమున వారికి గల మహత్వము వలననే జరిగినది అని భావము.

మదిఁదను నాసపడ్డ యెడ | మంచి గునోన్నతుఁ డెట్టి హీనునిన్
వదలఁడు మేలుపట్టున న | వశ్యము మున్నుగ నాదరించుఁగా
త్రిదశ విమాన మధ్యమునఁ | దెచ్చి కృపామతి సారమేయమున్
మొదల నిడండె ధర్మజుడు | మూఁగి సురావళి చూడ భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! పూర్వము గుణ నిధియగు ధర్మరాజు తాను స్వర్గమునకు పోవుచుండగా, తనను నమ్మి తన వెంటనే వచ్చుచున్న శునకమును ప్రేమతో దేవతలాశ్చర్యము పొందునట్లుగా తనకంటే ముందుగా దేవతా విమానమును ఎక్కించెను. సుగుణవంతుడు అనగా మంచి గుణములు గలవాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టి హీనులైననూ వదిలివేయడు పైగా తప్పకుండా మంచి సమయాన వారిని ముందుగా గౌరవించి సన్మానితుని చేయగలడు.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in July 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!