నాకున్న బలం
నాకున్న ఫలం
నాకున్న ధనం
నాకున్న సంతోషం
నువ్వేనయ్యా ఈశ్వరా...
నీ నవ్వే నా బ్రతుకు నావ
నీలో చేరనీ శంకరా
ఆ మట్టి నీ ఆటదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
విశ్వాసం విలువెంత
నమ్మకం బరువెంత
మనసు తడి లోతెంత
బ్రతుకు బడి ఆశెంత
అంతా...
మా తపనంతా నీ భూది కణములో అణువంతా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎక్కడో కొలువైన నిన్ను చూడ
అడుగు తీసి అడుగు వేస్తున్నా...
ఆపదలో ఆదుకుంటావని కాదు తండ్రీ...
నీ ఆలింగ స్పర్శతో అంతులేని ఆనందం అందిస్తావని..
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నేనొక మాటల బొమ్మను
పొందాను జన్మను
అనుభవిస్తున్నాను కర్మను..
ఎట్టి పరిస్థితుల్లోను నన్ను నడిపించు ధర్మపు దారిలోనే
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ పూజకు పూలు పళ్ళు
అభిషేకమునకు నీళ్ళు తీసుకుని రాను శంకరా...
నా మనసు భావాలే పూలు
నా మాటలే పళ్ళు
నా తపనే నీ అభిషేకానికి నీళ్ళు
ఇట్టి నేను నీ భక్తుడనా కాదా శివయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ముంచడానికి వాడు ఎవడు
మునగడానికి నేను ఎవడు
నువ్వు తలచుకుంటే రెట్టింపు చేసి ఇవ్వవా....
నీ మాయా ముసుగులో నేనో మిణుగురు పురుగును...
నన్ను సూర్యకాంతిని చేయడం నీకెంత సేపు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఏమయ్యా ఎవరిచ్చారు నీకు
నన్ను బాధ పెట్టే హక్కు...
ఏమయ్యా ఎవరిచ్చారు నీకు
నన్ను ఏడిపించి ఎదుగుదలను ఇచ్చే హక్కు...
అంతా నీ ఇష్టమేనా...
నీ ఇష్టము కాదని నేను మనగలనా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఒకడు తండ్రి ఉచ్చులో
ఒకడు కొడుకు ఉచ్చులో
ఒకడు భార్య ఉచ్చులో
ఒకడు బాధ్యతల ఉచ్చులో
ఏంటైయ్యా ఈ సమాజం....
క్షణ క్షణం మారడం దాని నైజం
నేను ఏ ఉచ్చులో పడకుండా
నీ ఉచ్చులో పడేసి మెచ్చుకుంటివా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
శివయ్యా నా కథలో పాత్ర నువ్వే
ద్విపాత్ర నువ్వే....
నీ భావనల పులకింతలే... నాలో నవ్వులు...
నిన్ను మరచిన క్షణం నేను శవం నోట్లో పడిన నువ్వులు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎన్నెన్ని లీలలు చేశావు...
ఎన్నెన్ని మహిమలు చూపావు
ఎన్నెన్ని చోట్ల వెలిసావు
ఎన్నెన్నో ఆలోచనల కందిరీగతో కుట్టబడుతున్నా
నా మనసు కట్ట పై ఎప్పుడు కూర్చుంటావు శివా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...