సత్యాన్వేషణ – 2
క్రితం వ్యాసంలో మానవ జీవితంలో పూర్తి సంతోషం ఎందుకు కలగడం లేదు, దానికి ఉన్న అడ్డంకులూ, వగైరా చూసాం. సత్యం అనే ఒక్కటి మాత్రమే పూర్తి సంతోషం ఇవ్వగలదు అనేది కూడా తెలిసింది కనక ఇప్పుడు ఈ సత్యం కనుక్కోవడం ఎలా అనేది ఆలోచించవల్సిన విషయం. ఈ రెండో వ్యాసం మొదలుపెట్టేముందు అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది కనక ఓ మూడు ముక్కలు చెప్పనివ్వండి. మొదటిది, ఈ వ్యాస పరంపర రాసేటపుడు మొత్తం అంతా తెలుగులో రాద్దామనే ఉద్దేశ్యం కానీ కొన్ని కొన్ని ఆంగ్ల పదాలు దొర్లక తప్పకపోవచ్చు. ప్రత్యేకించి కొన్ని విషయాలలో – అణువులు పరమాణువులు అనేవి చెప్పడం సులభం అయినా కొన్ని సాంకేతిక పదాలు చెప్పడానికి ఆంగ్లం వాడడం తప్పకపోవచ్చు. అటువంటి ఆంగ్ల పదాలకి కొత్త కొత్త తెలుగు పదాలు కనిపెట్టి పాఠకులని భ్రమ పెట్టడంకంటే వాటిని ఆంగ్లంలోనే వాడడం ఉభయతారకం అని నా ఉద్దేశ్యం.
రెండోది, నేను శ్రీ శంకర భగవత్పాదుల, శ్రీరామకృష్ణుల, వివేకానందుల, రమణుల, స్వామి శివానందుల జీవితాల గురించి చదివి ప్రభావితుడైనవాడిని. అందువల్ల నేను రాసేవాటిల్లో చాలామటుకు వీళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉంటాను. వివేకానందులు మహాసమాధి పొంది వంద ఏళ్లకు పైబడినా ఈ నాటికీ భారత దేశంలో ఏ కుర్రాళ్ళైనా ఒక సంఘం, సమితి ఏర్పాటు చేసుకుందామనే ఆలోచన రాగానే వాళ్ళకి తట్టేది, “స్వామి వివేకానంద యువ సంఘం” అనో, లేదా “వివేకానంద సమాహారం” అనో. ఎందుకలా అని ఆలోచిస్తే మనకి తెలిసేది ఆయన చేసిన ఉత్తేజితమైన ప్రసంగాల వల్ల, ఆయన తన జీవితంలో చేసిన సేవ వల్లా. ఆశ్చర్యం ఏమిటంటే మనం ఎప్పటికైనా “స్వామి వివేకానంద యువ సమితి” అని పేరు పెట్టుకోవడానికి సందేహించం కానీ డబ్బున్న “అంబానీ సంఘం” అని కానీ రాజకీయ పలుకుబడి ఉన్న “మోడీ సంఘం” అని కానీ పేరు పెట్టుకోము. ఎందుకనేది ఒకసారి ఆలోచించి చూడండి. అంబానీలకీ మోడీలకీ పేరు ప్రఖ్యాతులున్నాయి, డబ్బు ఉంది కానీ ఆ పేరు వందల ఏళ్ళు ఎందుకు ఉండదు? ప్రపంచ కుబేరులని సైతం మనం మర్చిపోతాం కానీ సర్వసంగ పరిత్యాగి అయిన వివేకానందుల గురించి ఎప్పటికీ మరవలేము. తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి సరైన దుస్తులు లేక కలకత్తా వీధుల్లో భిక్షమెత్తిన వివేకానందులకి ఇటువంటి శక్తి ఎలా వచ్చింది? స్వామిజీ కొద్దిరోజుల్లో మరణిస్తారనగా ఎవరో అడిగారుట – ప్రపంచానికి ఏమి సందేశం ఇస్తారు అని. దానికి ఆయన సమాధానం మనం నివ్వెరపోయేలా ఉంటుంది. “నేను రాబోయే పదివేల సంవత్సరాలకి ఇవ్వవల్సిన సందేశం ఇచ్చేశాను.” ఆయన మహాసమాధి చెంది నూట పద్ధెనిమిది సంవత్సరాలైంది కానీ ఈ నాటికీ ఎవరూ మర్చిపోలేరు ఆయన చేసినది. హిందూ మతం దాదాపు అంతరించి పోయే స్థితిలో, భారత దేశాన్ని ఆక్రమించుకున్న విదేశీ నేతలు ప్రజలని కుక్కలుగా, పశువులగా చూస్తున్న దశలో ఒకాయన వచ్చి మనని తట్టి లేపి నించోపెట్టి మనం అంటే ఏమిటో, మనమీద మనకి నమ్మకం ఎందుకుండాలో చెప్పి, హిందూ మతాన్ని వంటి చేత్తో సగర్వంగా నించోపెట్టిన ఘనుడు స్వామిజీ. దీనికంతటికీ కారణం, మూల స్థంభం ఎవరో తెలుసా? రామకృష్ణులు. మరి ఆ రామకృష్ణులు ఎటువంటివారు? ఏమి చదువుకున్నారు? ఎంత డబ్బు సంపాదించారు? ఆయన ఏనాడూ పాఠశాలలో చదువుకున్నవారు కాదు, సరైన అక్షరజ్ఞానం ఉన్నవారూ కాదు. ఏనాడూ ఒక్క పైస సంపాదించినదీ లేదు. సంపాదన మాట అటుంచి, ఒక పైస/డబ్బు/కాసు తాను పడుకునే చాప కింద పెడితే వళ్ళు మంటలెక్కి లేచిపోయిన మనిషి రామకృష్ణులు. అటువంటి వారు తాను సంపాదించిన తపశ్శక్తిని వివేకానందులకి ఉచితంగా ధారపోసి మరీ తాను పక్కకి తప్పుకున్నారు. వివేకానందుల మాటలకీ, ప్రసంగాలకీ, ఉత్తేజితమైన వాక్యాలకీ అటువంటి శక్తి వచ్చేది రామకృష్ణుల నుండి అని తెలిస్తే మనకి ఆయన ఎటువంటివారో అర్ధమౌతుంది. ఇటువంటి రామకృష్ణుల శిష్యులైన వివేకానందుల సేవా భావం ఎటువంటిదంటే, “ఆకలితో అలమటించే కుక్క కైనా సరే అన్నం పెట్టడానికి నేను వేయి జన్మలు ఎత్తడానికైనా సిద్ధం“ అనే ఆయన మాటలే చెప్పక చెబుతాయి. ఇటువంటి వివేకానందులు మన మధ్య బతికినది కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే.
మరి శంకర భగవత్పాదులో? వేదాలకి భాష్యం రాసి, అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన ఘనుడు ఆయన. ఈ రోజుకీ కూడా ఏ మంత్రం కానీయండి, ఏ శ్లోకం కానీయండి దాదాపు అన్నింటికీ చివర మనం చూసేది, “శ్రీశంకర భగవత్పాద విరచితం” అనే. మరి రమణుల, శివానందుల సంగతో? వీరు కూడా సర్వసంగ పరిత్యాగులు. గమనించారా? వీళ్లలో ఎవరికీ కూడా డబ్బు సంపాదనలో కానీ, మరోదారి ద్వారా పేరు సంపాదించడంలో కానీ ఏమీ కోరిక లేదు. వాళ్ళ పేర్లు, వాళ్ల ప్రసంగాలూ ఇప్పటికీ అజరామరమై నిలవడానిక్కారణం వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు. ఇదే మొదటి వ్యాసంలో చెప్పిన కోరిక విడనాడడం అనేది. ఎప్పుడైతే వాళ్ళాకోరిక విడనాడారో అప్పుడే సత్యాన్ని కనుక్కోగలిగారు. ఈ సత్యం ఎటువంటిదనేది శివానందులు చెప్తారు, “ఏది తెలుసుకుంటే ఈ ప్రపంచంలో అన్నీ తెలుస్తాయో, ఏది తెలుసుకుంటే ఇంకేదీ తెలుసుకోనక్కర్లేదో అదే సత్యం, బ్రహ్మం. అది తెలుసుకోవడమే మానవ జీవితానికి పరమావధి.” వాళ్ళు అలా తెలుసుకున్నారు కనకే వాళ్ళెప్పటికీ చిరంజీవులు.
రామకృష్ణా మఠం గుమ్మం పైన ఫలకంలో రాసి ఉంటుంది స్వామి వివేకానంద గారు చెప్పిన విషయం – “ఆత్మనో మోక్షార్ధం జగత్ హితాయచ.” ప్రపంచానికి హితం చేయాలి, ఆ చేసే దారిలో బతకడం ఎందుకంటే, ఆత్మని తెలుసుకోవడానికి. ఇదే మరో విధంగా చెప్పాలంటే – ఆత్మార్ధే పృధ్వీం త్యజేత్. ఆత్మ/మోక్షం కావాలంటే ప్రపంచాన్ని త్యజించాలి/విడనాడాలి. అలా విడనాడినవారే జనన మరణ చక్రంలోంచి తప్పించుకున్న చిరంజీవులు. వీళ్లనే ప్రపంచం గుర్తుంచుకుంటుంది కానీ తన జీవితంలో అత్యంత డబ్బు సంపాదించి కోట్లు కూడబెట్టుకుంటూ దాచుకున్నవాళ్లని కానీ పేరు, పరపతి కోసం పాకులాడేవాళ్లనీ కాదు.
మూడో విషయం. నేను, తీరిక సమయంలో ఏవో కొన్ని కధలూ కాకరకాయలూ రాసుకునే అతి మామూలు మనిషిని. నేను రాసినవాటిలో కొన్ని సంపాదకులకి నచ్చితే వేస్తారు. మరికొంతమంది సంపాదకులు నేనెంత చెత్తగా రాస్తానో, అసలు నాకు తెలుగు భాష రాదనో, ఇంకా నేర్చుకోవాలనో చెప్తారు. పన్నెండో తరగతి తర్వాత ఏనాడూ తెలుగు దేశంలో ఉండకపోవడం వల్ల, ఈ సంపాదకులు చెప్పేది పూర్తిగా నిజం కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను వీలున్నప్పుడు. “భగవంతుడి మీద ఇలా రాస్తాడు ఈయన అందువల్ల ఈయన కూడా ఓ పెద్ద స్వామి గారిలా ఉపన్యాసం ఇచ్చేస్తున్నాడు,” అనుకుంటే తప్పు నాది కాదు. ఇది రాయడానిక్కారణం భగవద్గీత లో చెప్పిన భగవంతుడి విభూతి – నాకు అర్ధమైనంతలో – చెపుదామని. ఇది మీకు నచ్చితే సంతోషం. నచ్చకపోతే ఒక వ్యాఖ్య రాయండి కిందన. అదీ కుదరకపోతే నేరుగా సంపాదకులకి చెప్పండి. వీటన్నింటికన్నా మరి కాస్త సులభమైన పద్ధతి ఈ వ్యాస పరంపర అసలు చదవకపోవడం. తెలుగు చదవడం, రాయడం అనేవి మన తెలుగువాళ్లకి ఎలాగూ పనికిరాని విషయాలు, గొప్పలు చెప్పుకోవడానికీ పనికొస్తాయి కనక ఈ మూడో పద్ధతే మంచిది కావొచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యాసంలోకి వద్దాం. సత్యం తెలుసుకోవడమే సంతోషానికి కారణం కనక ఇప్పుడీ సత్యాన్వేషణ ఎలా అనేది ఒక్కొక్కటిగా చూద్దాం.
ముందు చెప్పుకున్నట్టూ, కోరిక లేకుండా పనిచేయాలి. ఆ చేసే పనివల్ల వచ్చే ఫలితాలని – అవి ఎటువంటివైనా - ఆశించకూడదు. అలా కోరికలు విడనాడాలి. చెప్పుకోవడానికి చాలా సులభంగా, సరదాగా ఉంది గానీ నిజంగా ఇలా చేయగలమా? రెండు ఉదాహరణలు చూద్దాం. మీరొక చోట పనిచేస్తున్నారు. మీ పైవారికి మీరంటే ఇష్టమే. మీరు పనిచేసే చోట అందర్నీ సమానంగా చూస్తారు. మీరు బాగా పనిచేసి ఏదైనా కొత్తగా కనిపెడితే ఏదో కొంత డబ్బో మరో చిన్న బహుమతో ఇవ్వడం ఆనవాయితీగా ఉంది చాలా కాలంగా. కానీ ఒక సారి మీరు కొత్తగా కనిపెట్టినది ఏదో పైవాళ్ళు గమనించినా మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ మీ పక్కనే కూర్చుని పనిచేసే ఆయనకి ఏదో మొత్తం/బహుమతి ఇచ్చారు. లేదా మీకు తప్ప అందరికీ ఇచ్చారనుకుందాం. మీకేమనిపిస్తుంది? వెంఠనే పైవారి దగ్గిరకి వెళ్ళి “ఇలా అయిందేం? నేనేం తప్పు చేసాను, నన్నెందుకు వేరుగా చూస్తున్నారు” అని అడుగుతారా? లేదా మీరు లోలోపల కుమిలిపోతూ ఊరుకుంటారా? “అదేమిటయ్యా ఫలితాలని పట్టించుకోకూడదు ఈ మధ్యనే నిర్ణయించుకున్నారు కదా?” అని అడిగితే, “సరేలే, నేను మాత్రం ఉప్పూ కారం తినే మనిషిని కాదా?” అని సమర్ధించుకుంటారా? సరే ఏదో ఒకటి అయిందనుకోండి, ఈ విషయం ఎంతకాలం మనసులో ఉంచుకుంటారు? లేదా ఇలా జరిగినందుకు మనసులో ముల్లులా గుచ్చుకుంటూంది కనక ఈ ఉద్యోగం వదిలేసి మరోటి చూసుకుంటారా? ఇది మొదటి సంఘటన.
ఇప్పుడు రెండోది చూద్దాం. మీరు ఓ వీధిలో నడుస్తుంటే లేదా బండి నడుపుతుంటే ఒక ముసలాయన వీధి అటునుంచి ఇటు దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ వచ్చే పోయే వాహనాల రద్దీ వల్ల కుదరడంలేదు. మీరు బండి ఆపి ఆయనకి వీధి దాటడానికి సహాయపడ్డారు. ఆయన అటువేపు జేరాక మీ పనిమీద మీరు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రమో, మర్నాడో మళ్ళీ ఓ సారి గుర్తొచ్చింది ఈ సంఘటన. మీరు బండి ఆపాల్సిన అవసరమూ లేదు, ఆ ముసలాయనికి సహాయం చేయాల్సిన పనీ లేదు. అయినా ఆగి సహాయం చేసారు. ఆ చేసిన సహాయం పెద్ద గుర్తుంచుకునేది కాదు. పుణ్యం వస్తుందనో మరొకటనో కూడా కాదు. ముసలాయన వెళ్ళలేకపోతున్నాడు, మానవ ధర్మంగా ఎంచి మీరు సహాయం చేసారు. అంతే తప్ప ఆ ముసలాయన మీకు పదో పరకో డబ్బులు ఇస్తాడని కాదు కదా? ఈ సంఘటన మీరు వారంలోపు మహా అయితే ఒక నెల లోపు మర్చిపోతారు. ఎందుకంటే మీరు సహాయం చేసింది, “ఈయనకి తోటిమానవుడిగా సహాయం చేద్దాం” అనిపించి మాత్రమే తప్ప ఏదో ఆశించి కాదు.
ఈ రెండు సంఘటనల్లో మీకేది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? మొదటి దానిలో నిజంగా మీకు మీ యజమాన్యం డబ్బులిచ్చినా ఆ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది? రెండో సంఘటన ఇచ్చినంత సంతోషం అది ఇవ్వగలదా? ఇదే నిజంగా చెప్పాలంటే కోరిక విడనాడడం, ఫలితాలని పట్టించుకోకపోవడం. దీనిమీద రెండు చిన్న కధలు చెప్పుకుందాం.
రమణులు అరుణాచలంలో ఉన్నప్పుడు, ప్రతీ రోజూ కొండమీద నడుస్తూ ఉండేవారు. ఓ రోజు పొద్దున్నే ఏదో పని ఉన్నట్టూ చేతిలో ఓ చాకు తీసుకుని నడవడం మొదలుపెట్టారు. ఓ వెదురు పొద దగ్గిర ఆగి ఓ కర్రని కొట్టాక దాన్ని చెక్కడం మొదలుపెట్టారుట తనకి చేతిలో ఊత కర్రగా ఉండడం కోసం. చాలాసేపటివరకూ అదే పని. చెక్కడం, నున్నగా చేయడం, కర్ర చివరలో చేత్తో పట్టుకునే చోట ఒక పిడిలా చెక్కడం వగైరా వగైరా. దాదాపు నాలుగైదు గంటలకి ఆ కర్ర తయారైంది. అది ఆయన పట్టుకుని నడుస్తుంటే ఊతంగా పనికొస్తోంది కూడా. వెనక్కి వచ్చేస్తున్నారు ఇంక ఆ రోజుకి నడక చాలించి. దారిలో ఎదురుగా ఓ పశువుల కాపరి ఆవులనీ గేదెలనీ తోలుకుంటూ వస్తున్నాడు. అవి అటూ ఇటూ పోతూంటే వాటిని అదుపులో పెట్టడానికి చేతిలో కర్రా ఏమీ లేక అవస్థ పడుతున్నాడు. వెంఠనే రమణులు తన చేతిలో కర్ర, వాడికి ఇచ్చేసారు. ఆ తర్వాత మనం వినే కధ ఆ సమయంలో రమణుల కూడా ఉన్న శిష్యుడు చెప్పినది – “అయిదారు గంటలు కష్టపడి తన కోసం తయారు చేసుకున్నారు ఆ కర్రని. కానీ దాన్ని పశువుల కాపరికి ఇచ్చాక రమణుల మొహంలో కనిపించేది ఎంతటి సంతోషమో!” ఎంత సేపు పని చేసారు ఆ కర్ర తయారు చేయడానికి? ఎంత ఇష్టంగా చేసారు చేసే పని? అంత చేసాక ఎవరికో ఆ కర్ర నిజంగా పనికొస్తుంది అనిపించగానే ఒక్క క్షణంలో దాన్ని ఇచ్చేసారు. ఇదే కర్మ ఫల త్యాగం అంటే. “ఆ, సరేలే కర్ర అయితే నేనూ ఇచ్చేయగలను,” అంటున్నారా? అయితే సర్వసంగ పరిత్యాగులైన రమణులకి ఆ కర్ర ఎటువంటిదో మనకి మన ఇంట్లో మనం ఇష్టంగా పోగేసుకున్న సరుకులు అటువంటివి. ఓ సారి చుట్టూ ఇంట్లో చూసి చెప్పండి – ఏ ఒక్కటైనా మనం రమణులలా మనఃస్ఫూర్తిగా మనం ఇవ్వగలమా? మనకి అక్కర్లేనివి ఇవ్వడం కాదు, అవతలి వారికి కావాల్సినవి ఇష్టంగా ఇవ్వడం.
రెండో కధ స్వామి వివేకానందులు చెప్పినది. ఓ దొంగ ఉండేవాడు; రోజూ దారి కాసి జనాలని చంపడం, డబ్బూ అదీ దోచుకోవడం ఇదే అతని పని. చాలామందిని చంపాక ఓ ముని అటువైపు వస్తూంటే ఆయన్ని చంపబోయేడు. ఈ ముని సన్యాసి, వంటిమీద గోచీపాతర తప్ప ఏమీ లేనివాడు. ఆయన దొంగతో చెప్పాడు వీడు చేసే పనులవల్ల వచ్చే పాపం అనర్ధాలూ అవీను. కళ్ళు తెరుచుకున్నాయి. ముని కాళ్లమీద పడ్డాడు. మరి ఇంతకాలం ఇంతమందిని చంపిన పాపం పోవడం ఎలా? దొంగ వంటిమీద నల్లటి గుడ్డ ఉంది. ముని అందులో చిన్న ముక్క చింపి దాన్ని మంత్రించి ఇచ్చి చెప్పాడు దొంగతో, “ఈ నల్లటి గుడ్డ జేబులో పెట్టుకుని దేశంలో ఉన్న అన్ని నదుల్లోనూ స్నానం చేయి. స్నానం అయిన ప్రతీసారి తీసి చూడు. ఏ రోజు ఈ గుడ్డ నల్ల రంగు లోంచి తెలుపు రంగులోకి మారుతుందో అప్పుడు నీ పాపాలన్నీ పోయినట్టు. అలా తెల్లగా అయిన గుడ్డ పట్టుకుని మళ్ళీ నా దగ్గిరకి రా ఓ ఏడాది తర్వాత.”
ఇది విన్నాక దొంగ పూర్తిగా మారిపోయాడు. ఈ నల్ల గుడ్డ ముక్క జేబులో పెట్టుకుని ప్రతీ చోటకీ వెళ్లడం, కనిపించిన నదుల్లో, చెరువుల్లో స్నానం చేయడం. తర్వాత జేబులో గుడ్డముక్క తీసి చూడడం, ఇదే తతంగం. గంగ యమునా, సరస్వతి, కావేరీ, గోదావరి అలా ఏ పేరున్న నదిలో స్నానం చేసినా గుడ్డ నల్లగానే ఉంది. మరో వారంలో ఏడాది గడిచిపోతుందనగా ఇంక తన పాపం తీరదు కాబోలనుకుని దొంగ మళ్ళీ ముని దగ్గిరకి వస్తూంటే దారిలో ఏదో అరుపు వినిపించింది. జాగ్రత్తగా వింటే ఏవరో ఒకావిడని దోచుకుని మానభంగం చేయబోతున్నాడు. ఆవిడ రక్షించమని అరుస్తోంది. ఏం చేస్తే మంచిదో ఆలోచించాడు దొంగ. తాను వెళ్ళి ఏదైనా చేయాలంటే ఆ మానభంగం చేసేవాణ్ణి ఇవతలకి ఈడ్చి కోపంలో చంపుతాడు. ఇప్పటికే తాను అనేకమందిని చంపి పాపం మూటకట్టుకున్నాడు. అందుకే కదా తన జేబులో ఉన్న ఈ గుడ్డ ఇంకా నల్లగానే ఉంది? ఇప్పుడు ఇన్ని నదుల్లో స్నానం చేసినా పుణ్యం రాలేదేమో. ఇప్పుడు మరొకణ్ణి చంపితే ఈ ఏడాదిలో ఇన్ని నదుల్లో స్నానం చేసి ఏదైనా పుణ్యం అంటూ సంపాదించి ఉంటే అది కూడా పోయినట్టే. మరో కోణంలోంచి చూస్తే ఇప్పుడు ఈవిడని రక్షించకపోతే, తాను పనికిమాలినవాడికింద లెక్క. ఆపదలో ఉన్నవాళ్లని తనకి చేతనై ఉండీ రక్షించలేకపోతే పాపం చుట్టుకోదూ? ఈ రెండు ఆలోచనల్తో మనసులో కాసేపు సంఘర్షణ. సమయం మించిపోతోంది. ఏదో ఒకటి చేయాల్సిన స్థితిలో దొంగకి ఏమి తట్టిందంటే – తాను అనేక హత్యలు చేసాడు ఇప్పటికే. ఆ పాపం ఏ పవిత్రమైన నదీ కడగలేనంత పెద్దదై ఉంది. ఇప్పుడు మరో హత్య చేస్తే ఆ పాపం పెరుగుతుంది సరే కానీ మరీ అంత పెద్దగా పెరగడానికేవుంది? ఇప్పటికే అది హిమాలయాలంత పెరిగి ఉంది కదా? మరో హత్యతో ఆ పాపం ఇంకో అంగుళం ఎత్తు పెరిగితే పెరగనీయ్ పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు కష్టంలో ఉన్న ఈవిడకి సహాయం చేయకపోతే తన మనసులో ఉత్తరోత్తరా జరిగే సంఘర్షణ తాను ఎన్నటికీ తట్టుకోలేడు. అలా అనిపించగానే దొంగ పులిలా ముందుకి ఉరికి ఆ మానభంగం చేయబోయే ఆయనని లాగి చితక్కొట్టేడు. వాడి ప్రాణం తీసాక ఆవిడకి సహాయం చేసి దొంగ మళ్ళీ ముని దగ్గిరకి బయల్దేరాడు. ఈ మానభంగం జరగడానికి ముందు తనకి మనసులో ఉన్న వ్యాకులత – తన పాపం దేశంలో ఏ పవిత్రమైన నది వల్లా కడగబడలేదు, అనే విషయం – ఇప్పుడు లేదు. ఎందుకంటే తాను పాపం కడుక్కోవడానికి బయల్దేరి మరో హత్య చేసి ఆ పాపం పెంచుకున్నాడు. ఏదో ఒకటి అయింది; ఆ పాపం ఎలాగా పోయేది కాదు కానీ ఒక కనీసం ఓ స్త్రీకి సహాయం చేయగలిగాడు కదా; సంతోషం, అదే చాలు.
అలా ముని దగ్గిరకి వచ్చి జేబులో గుడ్డ తీసి ఆయనకి ఇస్తూ చెప్పాడు, “నా పాపం ఏ నదీ కడగలేకపోయింది, పోతే పోనీయండి.” అయితే జేబులోంచి బయటకి తీసిన గుడ్డ ఇప్పుడు తెల్లగా మారి ఉంది. దొంగ ఆశ్చర్యపోయి అడిగాడు మునిని, “ఇన్ని నదుల్లో చేసిన స్నానం వల్ల గుడ్డ నల్లగానే ఉంది కానీ హత్య చేసినందుకు తెల్లగా ఎలా అయింది? నదీ స్నానం ఇప్పటికి అక్కరకి వచ్చిందంటారా?” ముని చెప్పాడు, “కాదు, నువ్వెప్పుడైతే కర్మ ఫలత్యాగం చేసావో అప్పుడు ఆ కర్మ నీకు బంధనం కలిగించదు. మానభంగం ఆపడానికి ముందు నీ మనసులో ఏమనుకుని ఆపావు? ఆవిడని రక్షించాలనే ఆలోచన తప్ప ఆవిడని రక్షించాక నాకేం వస్తుందని ఆలోచించావా? ఆవిడని రక్షించడానిక్కారణం ఏమిటి? ఆవిడకి సహాయం కావాలని చేసావు తప్ప, ఆ సహాయం వల్ల నాకేం ఒరుగుతుందని అనుకున్నావా? ముందు నువ్వు చేసిన హత్యలకీ ఇప్పుడు చేసిన హత్యకీ తేడా గమనించు.”
ఈ రెండు కధలూ చదివితే తెలుస్తోంది కదా, కర్మ ఫలత్యాగం అంటే ఏమిటో? చేసే పని అత్యంత ఇష్టంగా చేయడం. ఎందుకలా చేయడం? ఒక పని చేయడం ఆ పని చేయాలనుకుని చేయడం కోసమే తప్ప దానివల్ల నాకేం లాభం, నష్టం, అనేవి ఆలోచించకపోవడం. అలా చేసే పనుల వల్ల బంధనం అంటుకోదు. ఎప్పుడైతే కర్మ ఫలం, బంధనం అంటుకోవో అప్పుడు కోరిక కలగదు. అలా ఒక్కోసారీ ప్రయత్నం చేస్తూ, మెల్లిగా సత్యం వైపు ప్రయాణించగలం. అసలు కోరిక ఎందుకు కలుగుతుంది, అందులోంచి మనం ఎప్పుడూ కిందపడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాం అనేదానికి భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూ పజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోబి జాయతే
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి [భగవద్గీత సాంఖ్య యోగం 62, 63]
విషయాలని, అదే పనిగా ఆలోచిస్తూంటే, వాటిమీద – అవి స్వంతం చేసుకోవాలనే, అవి కావాలనే – కోరిక కలుగుతుంది. మనకున్న కోరికలన్నీ తీరడం అసంభవం కాబట్టీ, కోరిక తీరినా మరోసారీ మరోసారీ కోరిక కలుగుతుంది కాబట్టీ, లేదా కోరిన కోరిక తీరకపోవడం వల్లా క్రోధం/కోపం జనిస్తుంది. క్రోధం వల్ల సమ్మోహం/అవివేకం – మంచీ చెడూ గుర్తించలేకపోవడం; ఆ సమ్మోహం వల్ల బుద్ధి నాశనం. దానితో అధః పాతాళంలోకి ప్రయాణం.
అయితే, ప్రతీసారీ ఇలా కిందా మీదా పడుతున్నాం కదా ఎప్పటికైనా దీనిలోంచి బయటకి వచ్చి మనసుని జయించగలమా? దీనికి సమాధానం, మిగతా సత్యాన్వేషణ గురించి వచ్చే వ్యాసంలో చూద్దాం.