ఎప్పుడో తాగుబోతు లారీ
అతన్ని తినేసిన పాపానికి
ఇప్పటికీ ఆమె కడుపు సాయంత్రపు సద్దిగిన్నెగానే
మిగిలిపోతున్నది
తన నలుసుల కడుపులను ఉదయం సద్దిగిన్నెలుగా
మిగుల్చుతూ
ఆ నలుసులైన రేపటినాడు
ఆమెను ఉదయం సద్దిగిన్నెగా మార్చితే బాగుండు
అదేమి చిత్రమో
అతని గుండెలనిండా నిండిన
ఆవేదనను తీసే మందు
ఆమె ముఖంలో నవ్వై పరిమళిస్తున్నది.
చిన్నరాయి తగిలి
అతని చేతికి రక్తమొస్తుంటే
ఆమె కంట్లో నీళ్ళుస్తున్నాయి
అది మంగళసూత్రం చేసిన
మాయాజాలమట
ఎవరి మాటో విని
అలవాటు లేని అతను
మందు సీసా ఖాళీ చేశాడు
నిండుకున్న సీసా మహిమకు
డాక్టర్ సిరంజీలో మందు ఖాళీ చేశాడు
నిండుకున్న సిరంజీ మహిమకు
అతనే జేబు ఖాళీ చేసుకున్నాడు
ఇన్ని ఖాళీ అయినా ఆమె కంట్లో నీళ్ళు మాత్రం
ఖాళీ కావడం లేదు
ఎంతైనా మంగళసూత్ర మహిమ కదా
అందుకే ఆ కలత తప్పదు ఆమెకు
అతను
వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు
ఎంత వెతికిన
తన భుజం మీద కండువా ఇక దొరకదని తెలిసి
పాపం ఇప్పుడు
ఆమె ఉంటే బాగుండేది
అతన్ని ఓదార్చడానికి
ఆ దాంపత్య సముద్రంలో
ఆమె కెరటమై ఎగిసిపడటం
అతను తీరమై కోతకు గురికావటం
పిల్లలు పడవలై ఆత్మీయతకు దూరంగా నెట్టేయబడటం
వారి దయనందిన జీవితంలో సహజమైపోయింది
ఆమెకు అతను ఎప్పుడో అర్థమైయ్యాడు
అతనే ఆమెకు
నలుసులు పుట్టిన అర్థం చేసుకోలేక
అలుసుగానే చూస్తూ
పుట్టింటి పుత్తడివి కదా
పుత్తడిని తెమ్మని
చిత్తడి మాటలతో ఆమె మనసును తడిపేస్తున్నాడు
ఈ ఇత్తడి మనసును భరిస్తున్న ఆమె నిజంగా పుత్తడే మరీ..