ఆమెమో పెనంపై
మాడిపోయిన రొట్టై కూర్చుంది
అతనేమో నిప్పై మండుతున్నాడు
పిల్లలేమో కట్టెలై కాలిపోతున్నారు
ఆమె ఏడ్వకఏం చేస్తుంది
అతను అప్పులను కట్టలేక
బొటనవేళ్ళను కట్టుకున్నాడు మరి..
ఆ సూర్యుడు
ఏ మత్తు మబ్బుల్లో చిక్కుకొనిపోయాడో
గుడిసె గుడిలో
పొద్దుతిరుగుడు పువ్వై ఎదురుచూస్తున్నదామె
పొద్దుపోయిన కూడా
ఆమె ప్రవర్తన
టెంకాయపై పీచు
ఆమె మనసు పీచుకింద పెంకు
అతని ప్రవర్తన
పెంకు కింద కొబ్బరి
అతని మనసు
కొబ్బరి కింద తీర్థం
ఆ తీర్థపు మంచిపనులన్ని
మాయమైపోతున్నాయి
పెంకుకున్న గయ్యాళి తనం కిందపడి
అతను మందుసీసాను పగలగొట్టాడు
ఆమె చేతి గాజులు పగిలిపోయాయి
నలుసుల ఆశలూ పగిలిపోయాయి
తట్టలో రొట్టెలు అలాగే మిగిలిపోయాయి
పాపం ఆ గుడిసె తన పెద్దరికపు పరువుపోకూడదని
తలుపేసుకుంది
వారు డబ్బు కొరకే పుట్టినోళ్ళు
అతను ఆమె ఆ డబ్బు ఇవ్వనందుకే
నోట్లో మన్నేసి పడుకోబెట్టారు
ఎంతైన కుమారులు కదా..
ఆమె నా హక్కని
ఉక్కు సంకల్పంతో
కన్న మనసులను అరటితొక్కలా తీసి
అతన్ని కట్టుకుని ఆరడుగులేసి
మూడు మూరల మల్లెపూల ముచ్చట తీర్చుకుంది
దానికి ప్రతిఫలమేమో
అతను అదృశ్యమై
మరో పుత్తడిబొమ్మ మెడలో
ఇత్తడి మంగళసూత్రమై దర్శనమిచ్చాడు