దైవనిర్ణయం
తాత గారింటికి వేసవి సెలవులకు వచ్చారు కమల్, విమల్.
అది ఒకప్రశాంతమైన పల్లె. పక్కనే వున్న చెరువుగట్టున వున్న మామిడి తోటకు రోజూ ఉదయం, సాయంకాలం తాతగారితో వెళ్ళి అనేక అనుమానాలను నివృత్తి చేసుకుంటారు వారిద్దరూ. ఈ సెలవులు వారిపాలిట వరాలయ్యాయి. ఎంతో అనుభవమూ, ఉపాధ్యాయవృత్తిలో నైపుణ్యతా గలిగి విశ్రాంతి పొందిన తాతగారు చెప్పే మాటలు, కధలూ వారికి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నాయి.
ఆరోజు ఉదయాన్నే తూర్పు తెల్లవారుతుండగా వారు ఉదయపు నడకకు బయల్దేరారు. కొద్ది దూరం వెళ్లగానే వారికి రోడ్డు చిమ్ముతున్న వారూ, అందరి మురికీ బయట వేయగా ఎత్తుతున్నవారూ, మురికి కాలువలు శుభ్రపరుస్తున్నవారూ, బట్టలు చెరువుకు తీసుకెళ్ళి ఉతికే రజకులూ కనిపించారు. కొద్ది దూరం వెళ్లగానే మట్టి తొక్కి కుండలు చేసే కులాలుడు కూడా కనిపించాడు. సిధ్ధార్ధునికి నాలుగు దృశ్యాలు కనిపించగా జీవితంపై రోసి అంతఃపురం వదలి వెళ్ళి తపస్సు చేసుకుని బుధ్ధుడైనట్లుగా కమల్, విమల్ ఆ దృశ్యాలు చూసి 'అయ్యో పాపం, వీరంతా అందరి మురికినీ శుభ్రపరిచే పని చేస్తున్నారే పాపం, ఆ కులాలుడు ఎంత కష్టపడుతున్నాడు, వేసవిలో అందరూ వాడుకునే కుండలూ, బానలూ చేయను చెమటలు కక్కుతూ మట్టి తొక్కుతున్నాడే పాపం' అని అనుకున్నారు.
అంతటితో ఊరుకోక "తాతగారూ! పాపం వీరంతా ఇంత శ్రమపడుతున్నారే! ఎవరి వీధులు వారు చిమ్ముకుని, ఎవరి పనులు వారు చేసుకుంటే సరిపోదా! వీరెందుకూ అందరికోసం కష్టపడాలి?" అని అడిగాడు కమల్.
విమల్ "తాతగారూ! వారికీ మనలా మంచి ఇళ్ళూ, ఆవులూ, పొలాలూ ఉంటే బావుంటుంది కదా! ఇలా కష్టపడకుండా" అని అడిగాడు.
"బావున్నాయిరా మీ ఆలోచనలు. ఐతే అంతా పల్లకీ ఎక్కితే మోసేవారెవరూ? అన్నట్లు, పల్లకీ అంటే మీకు తెలీదు కదా! అంతా కారో, బస్సో విమానమో ఎక్కితే వాటిని నడిపేవారు లేకుండా అవి ఎలా వెళతాయి చెప్పండీ! అందరూ అన్ని పనులు వారు చేస్తేనే అంతా సవ్యంగా వుంటుంది." అని చెప్పారు.
"ఏమో తాతగారూ వారలా కష్టపడటం మాకు బాగాలేదు." అన్నారు ఇద్దరూ ఒకేమారు.
ఇంతలో వారు మామిడి తోట చేరారు."రండర్రా! ఈ చెట్టుక్రింద అరుగుమీద కూర్చుందాం. మీ కొక కధ చెప్పాలనిపిస్తున్నది. మీ సంశయమూ తీరుతుంది." అని తాత అంటుండగానే తోట కాపరి కామయ్య వచ్చి "బాబులూ! ఇవిగోండి మల్గోవా మామిడి ముక్కలు, బాగా కడిగి కోసి తెచ్చాను" అంటూ రెండు ఆకుల్లో అందించాడు. ఇద్దరూ అందుకుని ఒక్కోముక్కా కొరికి తినసాగారు.
వారిని చూసి నవ్వి తాతగారు
"అనగా అనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆయన రాణి కూడా చాలా మంచిది. ఇద్దరూ ప్రజల కష్టాలు తెల్సుకుంటూ వారిని ఎంతోప్రేమగా చూసుకోసాగారు. కాలం గడుస్తున్నది.
ఒక రోజున మహారాణి రాజుగారికి తలంటు స్నానం చేయిస్తూ ఆయన జుత్తులోని తెల్ల వెంట్రుకలు చూసింది. బాధేసి దుఃఖం వచ్చింది. ఆమె కళ్ళవెంట నీరు కారడం ఎదురుగా వున్న అద్దంలోంచి మహారాజు చూశాడు. "ఎందుకు మహారాణీ! ఈ అకారణ దుఃఖం" అని అడిగిందానికి ఆమె "ప్రభూ తమ జుత్తు తెల్లబడుతున్నది. భగవంతుడు మానవులకు ఇచ్చే మొదటి హెచ్చరిక చేశాడు, రెండవహెచ్చరికగా కళ్ళుమసకలు కమ్మడం, మూడవ హెచ్చరికగా పళ్ళు ఊడటం, నాల్గవ హెచ్చరికగా చర్మం ముడతలు పడటం సహజం, మీకు భగవంతుని నుంచీ మొదటి పిలుపు వచ్చింది, మీవంటి రాజు ఈ దేశప్రజలకు పదికాలాల పాటు వుండకపోతే వారిని మీలాగా చూసే వారెవరుంటారు అని బాధగా వుంది" అనింది మహారాణి.
రాజుగారు వెంటనే "నిజం మహారాణీ! నేను ఇంతకాలం ప్రజల బాగోగులు తీర్చడం, రాజ్యపాలన చేయడం చేశాను కానీ, భగవంతుని గూర్చి చింతించనే లేదు. నేను అరణ్యాలకు వెళ్ళి భగవంతుని గూర్చి తపస్సు చేస్తాను. నీవు రాజ్యపాలన చూసుకో" అని చెప్పి వెంటనే అరణ్యాలకు వెళ్ళి గాఢ తపస్సు చేసుకోసాగాడు.
ఆయన భక్తికి మెచ్చి నారాయణుడు దర్శన ఇచ్చాడు.
"రాజా! నీ కోరిక ఏమి?" అని అడిగాడు.
మహారాజు తనకు చావు లేకుండా చేయమని కోరలేదు. అతడు చాలా ఉత్తముడు. "స్వామీ! నా రాజ్య ప్రజలకు నిండు నూరేళ్ళ ఆయుష్షు, పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ పెద్ద పెద్ద భవంతులు, ధనధాన్యాలూ ప్రసాదించండి" అని కోరాడు.
దానికి నారాయణుడు "రాజా! నీ కోరిక మంచిదే! కానీ సృష్టిలో అంతా సమానం కావటానికి వీలులేదు. దానివలన చాలా ఇబ్బందులు కలుగుతాయి"అని చెప్పాడు.
ఐనా మహారాజు "ప్రభూ! నాదేశ ప్రజలంతా సమానంగా వుండాలి. ఈ నా కోరిక తీర్చండి" అని అడిగాక భగవంతుడు కాదనలేక 'తధాస్తు' అని మాయమయ్యాడు.
మహారాజు ఎంతో సంతోషంగా రాజ్యంలో ప్రవేశించాడు.
రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఎవ్వరూ నడిచి పోవడం లేదు, అంతా వాహనాల్లో పోతున్నారు. ఇంతకు ముందు వున్న చిన్న ఇళ్ళే కనిపించ లేదు. అన్నీ పెద్దపెద్ద భవంతులే. రాజమార్గాలన్నీ చెత్తా చెదారంతో నిండి వున్నాయి. ఎవ్వరూ ఊడ్చేవారే కనిపించలేదు.
ఆశ్చర్యంగా నడుచుకుంటూ రాజమందిరం చేరాడు మహారాజు.
వెనకటిలా కాపలా వారు లేరు. అంతఃపురం అంతా నిర్మానుష్యంగా వుంది. దాసదాసీలు ఎవ్వరూ మహారాజును స్వాగతించలేదు. రాజభవనం అంతా చాలా దుమ్ము ధూళితో నిండివుంది.
రాజు మహారాణిని చూసి "రాణీ! ఏమి ఇలా మన భవనం బోసిగా వుంది? రాజ వీధులన్నీ చెత్తా చెదారంతో వున్నాయి? మీరేం చేస్తున్నారు? ఊడ్చేవారిని పిలిపించలేదా! శుభ్రం చేయించలేదెందుకనీ?" అని అడిగాడు.
అందుకు మహారాణి "ప్రభూ! కొద్దికాలంగా పనివారెవ్వరూ రావడంలేదు. చాకలి వచ్చి బట్టలు తీసుకెళ్ళడం లేదు, ఊడ్చేవారెవ్వరూ రావడం లేదు. ఏ ఒక్కరూ వారి పనులకు రావడంలేదు. కాపలావారు, వంటవాళ్ళు కూడా రావడంలేదు ఎలాగో నేనే వండుకు తింటున్నాను. వస్తువులు, కూరలూ, పండ్లూ కూడా తెచ్చేవారు లేరు. భగవంతుని దర్శనం ఐందా! ఆయన్ని మీరేం కోరారు ప్రభూ!" అని అడిగింది. రాజుగారు కోరిన కోరిక గురించి ఆమెకు ఏదో అనుమానం వచ్చింది.
"భగవంతుడు కనిపించాడు, కోరిన వరం కూడా ఇచ్చాడు" అంటూ తాను కోరిందీ, భగవంతుడు చెప్పిందీ, ఐనా తాను ఆయన మాట వినక మళ్ళీ అదే వరం కోరిందీ అన్నీ చెప్పాడు మహారాజు.
భగవంతుడు నీకోరిక సరికాదు అని ఎందుకన్నాడో దాని ఫలితమేంటో మహారాజు తన రాజ్యానికి వచ్చాక తెలిసింది.
అంతా విన్నాక మహారాణి "రాజా! నేనూ వెళ్ళి తపస్సుచేసి నారాయణుని దర్శించి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి ఆమె అరణ్యానికి వెళ్ళి చాలా భక్తితో నారాయణుని గురించి తపస్సు చేసింది.
భగవంతుడు ప్రత్యక్షమై "ఏమీ నీ కోరిక తల్లీ!, దేనికోసం నా గురించీ తపస్సు చేశావు?"అని అడిగాడు.
"మహాదేవా! మీరు నా భర్తకు ఇచ్చిన వరమేంటి స్వామీ!"అని అడిగింది మహారాణి.
"తన రాజ్యంలో ప్రజలంతా నిండునూరేళ్ళు జీవించాలనీ, తనలాగా భోగభాగ్యాలతో వుండాలనీ కోరాడు. నేను సరే అన్నాను." అన్నాడు భగవంతుడు.
"స్వామీ! మంచి ప్రభువు లేకుండా ప్రజలు నూరేళ్ళు జీవించి ప్రయోజనమేమి? స్వామీ! మహారాజుకు కూడా నూరేళ్ళ ఆయుష్షు ప్రసాదించండి." అని కోరిందామె.
భగవంతుడు "అలాగే తల్లీ! నీకోరిక నేరవేరుతుంది, నీ రాజ్య ప్రజలకూ, నీ భర్తకేకాక మంచి మనసున్న నీకూ నూరేళ్ళ ఆయుష్షు ఇస్తున్నాను" అని అదృశ్యమయ్యాడు.
మహారాణి నగరం చేరింది. మహారాజుకు భగవంతుడు తనకు ఇచ్చిన కోరిక గురించీ చెప్పింది.
ఐతే నగరం అలాగే దుమ్మూ ధూళితో వుంది. ఎవరూ ఎవరినీ పట్టించుకోకుండా తమ వాహనాల్లో పోతున్నారు. మహారాజుకు వంట చేసి పెట్టే వారు కూడా లేరు, బట్టలు ఉతికేవారూ, రాజమహలు ఊడ్చేవారూ కూడా లేరు. మహలు ముందు కాపలా ఎవ్వరూలేరు.
మహారాజుకు తన తప్పిదం అర్ధమైంది. వెంటనే మహారాణికి చెప్పి మరలా అరణ్యానికెళ్ళాడు. ఎంతో భక్తితో నారాయణుని గురించీ తపస్సు చేశాడు. మరలా నారాయణుడు కనిపించాడు. "రాజా! మరలా ఎందు కోసం వచ్చావు? దేనికోసం తపస్సు చేశావు?" అని అడిగాడు.
మహారాజు "ప్రభూ తమరి సూచన కాదని నేను కోరిన వరం తప్పేనని తెలిసింది. తమరి మాట వినకపోడం నా పొరపాటు. తప్పిదాన్ని మన్నించి నా రాజ్య ప్రజలకు వారి యదార్ధ స్థితిని వారికి కలిగించండి." అని కోరాడు.
భగవంతుడు "రాజా! నేను ముందే చెప్పాను. సృష్టిలో ఎక్కువ తక్కువలు అనే ద్వైతం వుంటేనే అంతా సవ్యంగా సాగుతుంది. ఎవరు చేసుకున్న కర్మ ఫలితాన్ని వారు అనుభవించి తీరాల్సిందే. వారి పనిని వారు చేయాల్సిందే. అప్పుడే అంతా సక్రమంగా ఉంటుంది. సరే నీ కోరిక ప్రకారం నీ దేశప్రజలకు వారి యదార్ధ స్థితిని కలిగిస్తున్నాను, వెళ్ళు" అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు.
మహారాజు తిరిగి వచ్చేసరికి నగరంలో ఎవరిపని వారు చేసుకుంటున్నారు. వీధులు ఊడుస్తున్నారు. పెద్దపెద్ద భవంతులన్నీ మాయమై పూర్వ స్థితిలో ఎవరి ఇళ్ళలో వారు నివసిస్తున్నారు. రాజభవనం ముందు కాపలా వారున్నారు. మహారాజును ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళారు.
మహారాజుకు భగవంతుని లీల బాగా అర్ధమైంది. దేవుడు కష్టాన్నిచ్చినా, సుఖాన్నిచ్చినా మానవుల మంచికే. అన్నీ వారు చేసుకున్న పూర్వ కర్మ ల ఫలితం ఆధారంగా లభిస్తాయని అర్ధమైంది.
“కనుక బంగార్లూ! ఎవరి పని వారు చేయాల్సిందే. మన కామయ్య కాయలుకోసి కడిగి ముక్కలు చేసి తెచ్చిస్తే మీరు తిన్నారు. మీరు ఎక్కి కాయలుకోసుకుని ఇదంతా చేయగలరా! కామయ్య కాపలాకాస్తేనే మన తోట సరిగా వుంటున్నది. ఆ పని నేను చేయగలనా? నేను మొన్నటిదాకా పాఠశాలకెళ్ళి చదువు చెప్పాను. అది కామయ్య చేయగలడా! కనుక ఎవరి పని వారు చేయాలిసిందే. మీసందేహం తీరిందా!" అన్న తాతతో "బాగా అర్ధమైంది తాతగారూ!"అన్నారు మనవళ్ళు ఇద్దరూ.
"సరే పదండి వెళదాం బామ్మ ఎదురుచూస్తుంటుంది." అని తాత గారు అనగా ఇంటికి బయల్దేరారు ముగ్గురూనూ.
నీతి: ఎవరి కర్మఫలితాన్ని బట్టి వారి స్థితి గతులుంటాయి.
బావుంది అండీ కథ