ఈ దేహత్రయమ్ము నాది, నేను కాదు
దేహత్రయాతీతుండ నెపుడు తరచి చూడ
అవస్ధాత్రయమంతా నాదియయి యుండ
అవస్ధాత్రయాతీతుండనై నుంటి నేను
కాలత్రయమంత నా స్వానుభవమై యుండ
కాలత్రయాతీతుండ నెట్లు కాను?
త్రిగుణాత్మకమయుడ కాదు సర్వదా
త్రిగుణాతీతుండగా మసలుచుందు
ఈ మూర్తిత్రయమ్ము నా భావనలె సుమ్ము
నేనె ప్రణవ మూర్తిత్రయాత్మకుండ
తాపత్రయ భూత సంసారమంత
తాపత్రయాతీతుండనై చూచు చుందు
దోషత్రయపంకిలమ్ము శుద్ధ
జ్ఞానైక మూర్తి కెటుల నంటు?
త్రిపుటి యంతయు నాకు భాసించుచుండ
త్రిపురాంతకుడనయి నుండగలను
త్రిపుటి సంపుటీకృతమైన యపుడె
సర్వాత్మగా నేను విశదమౌదు
సూచిక:
దేహత్రయం= స్ధూల, సూఖ్మ్మ , కారణ శరీరాలు
అవస్ధాత్రయం= జాగ్రత్, స్వప్న, సుషుప్తులు
కాలత్రయం= భూత, భవిష్యత్, వర్తమానాలు
త్రిగుణాలు= సత్వ, రజ, తమో గుణాలు
మూర్తి త్రయం= బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
ప్రణవ మూర్తిత్రయం= అ+ఉ+మ
తాపత్రయం= ఆధిభౌతిక,ఆధిదైవిక, ఆధ్యాత్మిక , తాపాలు
దోషత్రయం= అవిద్య్య కామ, కర్మలు
త్రిపుటి= జీవ, జగదీశ్వరులు.