Menu Close
Kadambam Page Title
ఆ వెలితి…!!
సముద్రాల హరికృష్ణ

ఇరుగుపొరుగు వారొచ్చారు
ఆయన నోదార్చారు
పిల్లలకు ధైర్యం చెప్పారు
ఎంతో మంచి మనిషన్నారు
పుణ్యవతి అన్నారు
కాస్సేపు కూచున్నారు
తరలి వెళ్ళిపోయారు!

ఇటు అటు బంధువులొచ్చారు
శోకపు బరువులతో
ఇంటివారి భారం పెంచేశారు
ఇల్లంతా ఓదార్పుల మాటలే
ఎవ్వరి దుఃఖం తరగటమే లేదు!
**
ఆయనకు–
కాలాడలేదు చేయాడలేదు
ఏమైందో తెలియటంలేదు
ఏదో అర్థం కానంత వెలితి
శూన్యంలో అడుగులు వేస్తునట్టు
మహా నీరవంలో తప్పిపోయినట్టు
తెలియని తీరంలో ఏకాకైపోయినట్టు
తనకు తానే కొత్త అయిపోయినట్టు!

తప్పిపోయిన బాలుడైపోయాడు
మౌనంగా మిగిలిపోయాడు!

కొడుకులు కూతుళ్ళందరూ
అమ్మ పలుకుకై తచ్చాడారు
అమ్మ ఇక లేదు కదూ
వాపోయారు, ఓదార్చుకున్నారు
కోడళ్ళు, అల్లుళ్ళందరూ
ఉస్సురన్నారు, కళ పోయిందన్నారు
ఇల్లు బోసిపోయిందన్నారు!
**
కానీ దుఃఖమంతా గూడుకట్టుకొన్నట్టు
ఇంకెక్కడో మూలుగు వినవస్తోంది!

బీరువాలో ఆమె కట్టిన చీరలు
ఆ కలనేతల పొందికలు
ఆ పట్టుల జరీ నగిషీలు
అన్నీ చిన్నబోయాయి
వన్నె తగ్గినట్టనిపించాయి
ఆమె కట్టిన తీరును మెచ్చుకుంటూ
ఆ వ్యక్తి శుభ్రత తలుచుకుంటూ
ఎంత ఇష్టపడి కొన్నదంటూ
ఎంత మురిపెంగా కట్టుకొన్నదంటూ
ఆ ఎంపిక కళాత్మక మంటూ
అటువంటి తల్లి ఇక దొరకదంటూ!

ఆమె గదిలో మెరుపుటద్దం
నిలువున వెలవెలబోయింది
ఆ పక్కనె కుంకుమ భరిణె
వి వర్ణమై తలదించుకుంది!

వంటింట్లో పోపుల పెట్టె
ఓపలేకపోతోంది ఆమె లేని శూన్యాన్ని
ఆమె మనసు తెలిసిన ప్రతి దినుసూ
ఉసూరుమని నిట్టూర్చింది!

ఆ దేవుడి మందిరం
దీపం లేక వెలవెలబోయింది
ఏవీ ఆ భక్తితన్మయ స్తోత్రాలు
ఆ మృదుకంఠపు మేల్కొల్పులు
ఆ నిష్ఠగ పాడే పవ్వళింపులు?!
ఆ దైవమే చోటు విడిచి వెళ్ళినట్టైంది!

పెరటిలోని తులసి గట్టు
ఆమె చేసే అలంకరణకై వేచి చూస్తోంది
ఆ పక్కనే ఉన్న మందారం మొగ్గ వేసి
విరిసి ఫలమేమిటని వ్రృథాగ వెతుకుతోంది
ఆ బాదం చెట్టు పైన కాకి అరిచిఅరిచి
అమ్మగారి చేతి ముద్ద కనరాక,అలసిపోతోంది!
వేళ కింత నీరు పెట్టే తల్లి లేక
ఆ మల్లె పాదు మొదలంతా ఎండిపోతోంది!
**
ఆమె పోయిందట
ఆ ఇల్లే చందమామ లేని ఆకసమైంది
ఆ వాడ వాడె ఆశ పోయి నీరసించింది
బొట్టు, కాటుక మానేసిన మ్లాన అయింది!
ఆమెను కోల్పోయి పరిదీన అయింది!

ఏ ఇల్లాలు పోయినా ఇంతే
ఆ ఇంటి మనసు చితికిపోతుంది
ఇంటివారి కలత కడలియై ఎగుస్తుంది!
వాత్సల్యహస్తం కనుమరుగైనట్లుంటుంది!
ఊరడించే గళం మూగవోయినట్లౌతుంది

అది అసంభవం అని తెలిసినా
పొదువుకుని కాపాడే ఆ శక్తి
మళ్ళీ తిరిగొస్తే ఎంత బాగుండనిపిస్తుంది!

********

Posted in March 2026, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *