-- డా. మధు బుడమగుంట
సంగీతమే తమ జీవితంగా బతికిన మహానుభావులు ఎందఱో ఉన్నారు. వారి జీవన కాలంలో ఎన్నో కృతులకు, రాగాలకు, స్వరకల్పనలకు జీవం పోశారు. కొంతమంది మాతృ భాషలోనే రచనలు చేసి రాగాలను సృష్టిస్తే మరికొంత మంది ఇతర భాషలలో కూడా తమ పాటవాన్ని చూపారు. అటువంటి వారిలో కర్నాటక సంగీతంలో నిష్ణాతుడు, ప్రాకృత, సంస్కృత, కన్నడ, మరియు తెలుగు బహు భాషాకోవిదుడు, మధుర గాయకుడు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ నేటి మన ఆదర్శమూర్తి.
1893 జనవరి 23న, నేటి రాయలసీమ లోని అనంతపురం జిల్లా రాళ్ళపల్లి గ్రామంలో అనంతకృష్ణ శర్మ గారు జన్మించారు. బాల్యం నుండే తల్లి అలివేలు మంగమ్మ వద్దనే కీర్తనలు, జానపదగేయాలను నేర్చుకొని యథాతథంగా పాడేవారు. సంస్కృతం మరియు తెలుగు భాషను తండ్రి కృష్ణమాచార్యులు శిష్యరికంలో అభ్యసించారు. పిమ్మట మైసూర్ లోని శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో చేరి త్రికరణ శుద్ధితో వ్యాకరణం సంస్కృత కావ్యాలను అభ్యసించారు. పిమ్మట కట్టమంచి రామలింగారెడ్డిగారి సాంగత్యంతో ఆంద్ర సాహిత్యం మీద పట్టును సాధించారు. ఆయన ఆశీస్సులతో మైసూరు మహారాజు కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా నియమితులయ్యారు. అదే కళాశాల లో దాదాపు ముప్పై ఏళ్ళు పనిచేసి ఎంతో గుర్తింపు తెచ్చుకొన్నారు.
రాయలసీమలో పుట్టి సాహిత్య రంగంలో అవిరళ కృషి చేసిన శర్మ గారు ఎన్నో ఖండ కావ్యాలను రచించారు. సద్విమర్శకుడిగా ఎంతో పేరును గడించారు. తన సొంత జిల్లా వాడైన వేమనను ఒక మహాకవిగా నిలబెట్టడంలో ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో ప్రశంసలను పొందాయి. రాళ్ల పల్లి కవితా రమణీయానికి ముగ్ధులైన గొప్పవారు ఎందఱో ఉన్నారు. వారిలో ముఖ్యులు కట్టమంచి రామలింగారెడ్డి గారు మరియు విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ గారు శర్మ గారి ‘పెనుగొండ కొండ,’ ‘శమీపూజ’ కవితలు తెలుగులో కలకాలం నిలుస్తాయని సభాముఖంగానే ప్రస్తుతించారు. ఇంతకన్నా గొప్ప పురస్కారం ఏముంటుంది మన శర్మ గారికి.
బాల్యం నుండే తల్లి వద్ద నుండి ఉగ్గుపాలతో పాటు సంగీతంలోని మెళుకువలను అవపోసన పట్టిన అనంతకృష్ణ శర్మ గారు సంగీతాన్ని సాహిత్యంతో మిళితం చేసి ఎన్నో అద్భుతమైన రాగాలకు ప్రాణం పోసి వాటిని స్వయంగా తనే పాడేవారు. బిడారం కృష్ణప్పగారి వద్ద కొంతకాలం శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకొన్నారు. 1927లో అనంతపురంలో జరిగిన ఆంధ్రగాయక మహాసభలో తన గానామృతం తో శ్రోతలను సమ్మోహితులను చేశారు.
మైసూరు మహారాజు ఆస్థానంలో అసమాన ప్రతిభను ప్రదర్శించిన శర్మ గారు తన ఉద్యోగ విరమణ అనంతరం తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యాన్ని చేపట్టి ఎన్నో సంకీర్తనలను వెలుగులోకి తీసుకొని వచ్చారు. వాటిలో ఆయన స్వయంగా స్వరపరచిన కొన్నింటిని నేటికీ మనందరం పాడుకొంటున్నాం.
అనంతకృష్ణ శర్మ గారు సంగీత, సాహిత్య రంగాలలో చేసిన అవిరళ కృషికి తగిన గుర్తింపు లభించిందనే చెప్పాలి. తెలుగునాట, కర్ణాటక దేశంలో కూడా ఆయనకు తగిన గౌరవం వివిధ పురస్కారాల రూపంలో దగ్గింది. ‘రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు’, ‘నిగమశర్మ అక్క’, ‘తిక్కన్న తీర్చిన సీతమ్మ’ వంటి ఎన్నో మహత్తర గ్రంధాలను భావితరాలకు అందించిన మహానుభావుడు మన శర్మ గారు. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసునిగా నియమించిన (1979 మార్చి 11న) అదే రోజు ఆయన ఆ ఏడుకొండల వానిలో ఐక్యమయ్యారు.