Menu Close
Kadambam Page Title

అనుభవయానం

- నాగరాజు రామస్వామి

అనుస్యూత అనుభవపరంపర జీవితం.
అనుభవాల అడుగుజాడలను హత్తుకుంటూ
స్మృతి పథాలు రోజా రేకులై విప్పుకుంటున్న
పూల రాగాల పునశ్చరణంలో రెక్కవిప్పడం
ఒక గొప్ప అనుభవం.

అనుభవయానం
ఘటనాఘటనల జ్ఞాపకాల గతం.
చేతిలో గులాబీ గుచ్ఛం,
అరికాలు పూచిన రుధిర పుష్పం
ఒకే పాట పాడుతున్న
ఎత్తుపల్లాలు ఏకమైన సమతలం మీద
పారాడడం ఓ అపూర్వ అనుభవం.

వేటాడే డేగకంటి వాడి చూపులను
కబళించే సుడిగుండాలను తప్పుకుంటూ
ఎదురొడ్డే సైకతాలను దాటుకుంటూ
ఏటవాలు ఏటినీటి ధారకు
ఎదురెక్కే చేపలా ఎదురీదడం
ఓ అపూర్వ అనుభవం.

పాడే పాదముద్రలను ఏరుకుంటూ
పరిమళించే జ్ఞాపకాలను తవ్వుకుంటూ
గుచ్చుకునే గాయాలను, విచ్చుకునే పక్షాలను,
నిన్నటి అగాధాలను, నేటి శిఖరాలను
సమదృష్టితో సమన్వయించుకోవడం
ఓ అమూల్య అనుభవం.

ఉరవడి మరచిన ఉధృత స్మృతి
పిల్లవాగై మళ్ళీ మళ్ళీ ప్రవహించడం,
కాడ తెగిన కలువ పూవై తేలి పోతూ
అక్షర ధారలో కొట్టుకుపోవడం
ఒక మహానుభవం.

Posted in August 2018, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *