Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

స్త్రీ పాత్రలకు ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు
"వేదాంతం సత్యనారాయణ శర్మ"

Vedantham Satyanarayana Sharma

మహిళలను సైతం సమ్మోహనపరిచే విధంగా స్త్రీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన విశిష్టతను చాటుకున్న జగమెరిగిన నాట్యస్రష్ఠ. ప్రపంచవ్యాప్తంగా నాట్యప్రియుల మదిని దోచి మహిళలను సైతం మంత్రముగ్ధులను చేయగల వారి కళాప్రావీణం అనన్య సామాన్యం. నవరసాలు రంగస్థలంపై ఆలవోకగా పండించగల దిట్ట. ఆయనే ఆంధ్ర కూచిపూడి నాట్యాచార్యుడు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ. ఉషాకన్యగా పేరుగాంచిన వేదాంతం సత్యనారాయణ శర్మ గారు 1934 సెప్టెంబరు 9న వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మలకు మూడో సంతానంగా కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. ఈయన సోదరులు వేదాంతం ప్రహ్లాదశర్మ, వీరరాఘవయ్య, సత్యనారాయణ శర్మ చిన్ననాటనే జావళీలు, రామదాసు, త్యాగరాజు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ఔపోసన పట్టారు. యక్షగానాల్లో చెలికత్తెగా అభినయించారు. సత్యనారాయణ శర్మకు 18వ ఏట 1952లో పసుమర్తి కొండలరాయుడు కనిష్ట పుత్రిక లక్ష్మీనరసమ్మతో వివాహమైంది.

కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు వేదాంతం ప్రహ్లదశర్మ నాట్యంలో అరంగేట్రం చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు, భామా కలాపాలు, నాటకాలు, భరత కళా ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద నాట్యంలో తర్ఫీదు పొందారు. కూచిపూడి సంగీతాన్ని, వయోలిన్‌ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. కూచిపూడి నాట్యాన్ని రక్తికట్టించేందుకు మచిలీపట్నానికి చెందిన వారణాసి బ్రహ్మయ్య వద్ద వయోలిన్ విద్యను, సంగీత కళానిధి ఏలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. చిన్ననాటనే ప్రహ్లాదునిగా, లోహితాస్యునిగా, శ్రీరాముడిగా, ధర్మాంగజుడిగా, బాల నర్తకుడిగా పలువురిని అలరింపచేశారు. తన 18వ యేటనే అనగా 1953లో ఢిల్లీలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో ఉషాపరిణయం నాటకంలో పార్వతి పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి స్త్రీ పాత్రలలో రాణించారు.

అభినవ సత్యభామగా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పద్మశ్రీ పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్‌ సన్మాన అవార్డులను అందుకున్నారు. భామా కలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య బోధకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే.

సత్యనారాయణశర్మ గారి భార్య లక్ష్మీ నరసమ్మ. వారికి ఇద్దరు కుమార్తెలు నాగలక్ష్మి, రాధ, కుమారుడు నాగ ప్రసాద్‌ ఉన్నారు.

పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ. ఆయన చీరకట్టు విధానం పలువురి ప్రశంసలందుకుంది. ఉషాకన్యగా ఆయన ప్రదర్శించిన నటనను తిలకించిన విదేశీయులు ఆయనను మహిళగానే భావించి మేకప్ రూము వద్ద పడిగాపులు కాసిన సంఘటనలు నేటికీ తలపులోకి వస్తాయని ఇటీవల ఒక సందర్భంలో వేదాంతం గుర్తు చేసుకున్నారు.

పార్వతీదేవిగా నటనను ప్రారంభించిన వేదాంతం ఉషాపరిణయంలో పార్వతి, ఉషాకన్య, భామాకలాపంలో సత్యభామ, మోహిని రుక్మాంగదలో మోహినిగా, క్షీరసాగరమథనంలో విశ్వమోహినిగా, విప్రనారాయణలో దేవదేవిగా వేలాది ప్రదర్శనలిచ్చారు. లవకుశ సినిమాలో బి సరోజాదేవితో కలిసి నటించారు. కూచిపూడి నాట్యాన్ని భావితరాల వారికి అందించేందుకు నర్తనశాలను రూపొందించి పలువురికి శిక్షణ ఇచ్చారు. కూచిపూడి నాట్యక్షేత్రం స్థాపనకు దివంగత చింతా కృష్ణమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, పద్మభూషణ్ వెంపటి చినసత్యంతో కలిసి కృషిచేసి ప్రధానాచార్యులుగా కొనసాగారు.

సత్యనారాయణశర్మ చిన్న వయస్సులోనే కేంద్ర సంగీత నాటక అవార్డును, పద్మశ్రీ అవార్డును అందుకుని పలువురు నాట్యాచార్యులకు ఆదర్శంగా నిలిచారు. కూచిపూడి నాట్యంలోని యక్ష నృత్యాంశాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. కూచిపూడి నాట్య ప్రదర్శనల ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్టప్రతులు వివి గిరి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డా. శంకర్‌దయాళ్ శర్మ, డా. జకీర్ హెస్సేన్, డా. ఆర్‌కె నారాయణన్‌ల ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనను తిలకించి అభినందించారు.

1967లో వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వములో విడుదలైన రహస్యం సినిమా లో గిరిజ కళ్యాణం అనే నృత్య నాటిక లో పురుష నృత్యకారుడిగా నటించారు. తన స్వగ్రామము కూచిపూడిలో వెంకట్రామ నాట్య మండలిని స్థాపించి చాల మందికి కూచిపూడి నాట్య రీతులలో తర్ఫీదు ఇచ్చారు. అంతే కాకుండా నృత్యము గురించి నాట్య శాస్త్ర, అభినవ దర్పణం, తాండవ లక్ష్మణం, అలంకార శాస్త్రము వంటి గ్రంధాలను రచించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళిదాస్ సమ్మాన్ అవార్డుతో సత్కరించింది. 2005లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హంస అవార్డును అందచేసింది. సిద్ధేంద్రయోగి నర్తన అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం భరతముని అవార్డుతో సత్కరించింది.

కూచిపూడి అనే చిన్న గ్రామము నుండి వచ్చి స్త్రీ పాత్రలలో అంతర్జాతీయ ఖ్యాతి గడించి సుమారు ఆరు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన వేదాంతం సత్యనారాయణ శర్మ గారు నవంబర్ 16, 2012 లో 77 ఏళ్ల వయస్సులో శ్వాసకోశ ఇబ్బందుల వల్ల విజయవాడలో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించారు.

********

Posted in March 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *