సైన్స్ ఫిక్షన్ కథలు చదవడం నాకు చాల ఇష్టం. అందులోనూ ఐజక్ అజుమోవ్ కథలు మరీ ఇష్టం. ఈ కథలు వినూత్నంగా ఉండటమే కాక, వైజ్ఞానిక విషయాలు కథలలో అంతర్భాగంగా పాఠకులకు అందజేస్తాయి. ఈ ప్రయత్నం కథావస్తువు, శిల్పం రెండిటిని మరింత రాణింప చేస్తాయి. కానీ అజుమోవ్ లాంటి వారు వ్రాసే కథలు, భవిష్యత్తులో సైన్స్ ప్రగతి వల్ల వచ్చే మార్పుల నేపథ్యంతో అల్లడం వల్ల, ఆ ఊహించిన మార్పులే కొన్నిసార్లు సైన్స్ కు దిక్సూచిగా, ప్రమాణాలుగా నిలుస్తాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృతిమ మేధ) గత కొద్ది సంవత్సరాలు శరవేగంతో అభివృద్ధి చెందడం జరిగింది. పారిశ్రామిక విప్లవం మానవుల జీవితాలపై తెచ్చిన తీవ్రమైన మార్పులకు అనేక రెట్లు ఎక్కువైన మార్పులు మన జీవితాలలో ప్రతిరోజూ జరుగుతున్నాయి, జరుగబోతాయి. ఇప్పటికే ఇలాన్ మస్క్ లాంటి వారు ఇంకా కొన్ని ఏళ్లలో మానవులకు పని చేసే అవసరం ఉండదని, అన్ని పనులు కృతిమ మేధ సహాయంతో మానవులు నిర్మించిన రోబోలు చేస్తాయి అంటున్నారు. అందరికీ యూనివర్సల్ ఇన్కమ్ అని పనిచేయకుండానే ప్రభుత్వాలు డబ్బు పంచి పెట్టవచ్చు అని ప్రతిపాదిస్తున్నారు.
దానికి తగ్గట్టు, మానవులు తమ సమయం వెచ్చించడానికి అనేక సాంఘిక మాధ్యమాలు తయారు అయ్యాయి. మనుష్యులు మరో మనిషి సహవాసం కంటే ఫోన్, టీ వీ స్క్రీన్ లను గంటల తరబడి చూస్తూ గడిపేయడానికి ఇష్ట పడుతున్నారు. ఇది మనిషి నైజాంలో శర వేగంతో పాతుకు పోతున్నది. ఈ మార్పుల పరాకాష్ట చూడాలన్న ప్రయత్నమే, ఈ కథ.
యక్ష ప్రశ్నలలో ‘ప్రపంచంలో అన్నిటి కంటే గొప్ప అద్భుతమేది?’ అన్న ప్రశ్న, దానికి ధర్మరాజు చెప్పిన సమాధానం రెండూ గొప్పవే. ఆ సంఘటన కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగితే, అదే ప్రశ్న మరో వేయి ఏళ్ల తరువాత అడిగితే, సమాధానం ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో వ్రాసిన కథ ఇది.
సైన్స్ ఫిక్షన్ కథనే అయినప్పటికీ, ఈ కథ రేకెత్తే ఆలోచనలు మానవ ఉనికి, ఈ విశ్వంలో ఆ మానవుని పాత్రకు సంబంధించినవి. ఈ కథ చదివిన తరువాత మీకూ అలాంటి ఆలోచనలు వస్తే ఈ కథ సఫలమైనట్లే.
'అ-మర' లోకం
“నాతో వస్తే చావు ఖాయం. రానంటే నువ్వు ఓ అమరుడిలా ఎప్పటికి చావు లేకుండా బ్రతికి పోవచ్చు. మనకు అంతగా టైం లేదు. నీ నిర్ణయం వెంటనే చెప్పు,” అంది ఓ అపరిచిత.
“ఇలాంటి మెదడు ఉపయోగించనవసరం లేని ‘నో బ్రైనెర్’ ప్రశ్న వేసి జవాబు అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నేనెక్కడ ఉన్నాను? ఇవ్వాళ ఏమి రోజు?,” అడిగాను నేను.
ఓ పది అడుగుల క్రింద సముద్రం నీలంగా కనిపిస్తున్నది. పైన నీలాకాశంలో, తెల్లటి పిల్ల మేఘాలు తిరుగుతున్నాయి. అపరిచిత, నేను ఓ నీటి బుడగ లాంటి వాహనం లో శర వేగంగా ప్రయాణిస్తున్నాము. నేనేదో ఆనుకుని కూర్చున్నట్టు ఉంది, కాని సోఫా లాంటిదేమి కనపడటం లేదు. ఎటు వైపు వాలిన మెత్తగా, హాయిగా శరీరానికి ఏదో తగిలి అడ్డుకుంటున్నది. పూర్తిగా వాలిపోయి చూసాను, ఏదో అదృశ్య పడక మీద పడుకున్నట్టనిపించింది. లక్జరీ రిక్రియేషన్ వెహికిల్ లో కూర్చిని గాలిలో వేగంగా ముందుకు వెళ్ళుతున్నట్లుంది. కానీ ఆర్.వి. కనపడటం లేదు. ఉన్నది ఓ బుడగలోనే.
“అవును నో బ్రైనెర్ ప్రశ్ననే. నీకు ముందు, నీలాంటి వారే, అందరూ జవాబు చెప్పారు. నీలా ఎదురు ప్రశ్నలు వేయలేదు,” అంది అపరిచిత.
“ఇంకా బ్రతకాలనే కోరికతో, నన్ను వేయి ఏళ్లకు ఫ్రీజ్ చేయమని ఓ క్రయో లాబ్ కు 2050లో డబ్బు కట్టాను. నాకున్న జబ్బుకు చావు తధ్యమన్నారు. ఓ వేయి ఏళ్లకు నా రోగానికి విరుగుడు కనుక్కోక పోతారన్న ఆశ. మరి నాలాంటి వారిని నువ్వు మళ్లీ లేపితే, అమరత్వమే కావాలనుకుంటారు,” అన్నాను నేను.
“మరి నీది కూడా అదే నిర్ణయమా? అలా అయితే, నిన్ను వదిలేసి మరో క్రయో లాబ్ అందులో ఫ్రీజ్ చేసిన మనుష్యులను వెతుకడానికి పోతాను,” అన్నది.
“నీవేదో టూంబ్ రైడర్ లాగా పురాతన సమాధులు, అక్కడున్న శరీరాల వేటలో పడినట్లు ఉన్నావు. అయినా నీవు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడే లేచాను. నా నిర్ణయం ముందు, నా పరిస్థితి అర్ధం చేసుకోనీ,” అన్నాను నేను.
“నువ్వన్నది కరెక్టే. నేను, నాలాంటి వారు మరి కొందరు ఇలా క్రయో లాబ్ లు వెదికి, మీలాంటి వారిని తిరిగి బ్రతికించి ఈ లోకంలోకి తీసుకొస్తాము. ఇక నా గురించి నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. నన్ను ఓ అపరిచిత లాగానే ఉండనీయి. నువ్వు నివసించిన నగరమే కాదు, మీ ఫ్లోరిడా ప్రాంతం మొత్తం సముద్రం క్రింద ఉంది. నిన్ను, నేను సముద్రంలోకి దుంకి వెదికి పట్టుకున్నాను. ఇక నీ కాలమానం ప్రకారం మనం 2550లో ఉన్నాము,” అంది అపరిచిత.
“ఫ్లోరిడా మొత్తం సముద్ర పాలు కావడం ఆశ్చర్యంగా ఉంది. బాధగా కూడా ఉంది. నేను వేయి ఏళ్ల తరువాత కదా లేపమన్నది ఓ 500 ఏళ్ళు ముందే లేపేసావు. నా రోగం నయం చేసినట్లే ఉన్నావు. నీతో వస్తే చావు తప్పదు అంటున్నావు. బ్రతకాలని ఏళ్లకొద్ది ఫ్రీజ్ అయ్యిన నాలాంటి వారు నీతో రావాలని ఎందుకనుకుంటారు?,” అన్నాను నేను.
“నువ్వు గమనించే ఉంటావు. ఇప్పుడు భూమి మీద మనవంటి మనుష్యులు ఎక్కువ మంది లేరు. ఒకప్పటి నగరాలను కూడా చెట్లు, మొక్కలు, పచ్చటి ఆచ్ఛాదనతో కప్పివేసాయి. నువ్వు 50/500 రూలు గురించి విన్నావా. ఏ జాతి జంతువులైనా ఈ భూమి మీద అంతరించకుండా ఉండాలంటే వాటి సంఖ్య 50 ఉంటే చాలు. కానీ 50 మందే ఉంటే వాళ్లలో వారే కలవడం వల్ల పుట్టే పిల్లలు బలంగా ఉండరు. కనీసం 500 ఉంటే అలాంటి జెనెటిక్ సమస్యలు రాకుండా బ్రతికి పోవచ్చు. ఇప్పుడు భూమి మీద దాదాపు 500 మానవులే జీవిస్తున్నారు. అందులో నేను ఒకతి,” అంది అపరిచిత.
“మరి మిగతా జనం ఎక్కడికి వెళ్లారు. నా లెక్క ప్రకారం జనాభా 1400 కోట్ల కు పై చిలుకే ఉండాలే. అరే ఈ నంబర్లు నాకు ఎలా వెంట, వెంటనే తోస్తున్నాయి,” ఆశ్చర్యంతో అన్నాను.
“నిన్ను బ్రతికిచ్చే ప్రయత్నంలో నీకిచ్చిన మందులు, నీ కున్న రోగాలను నయంచేయడం మాత్రమే కాక, నీ మెదడును కూడా పదునుగా చేసాయి. మీ కాలానికి, ఇప్పటికి బాగా మార్పులు వచ్చాయి. నువ్వన్నది కరెక్టే. ఇప్పుడు మానవ జనాభా దాదాపు 1350 కోట్లు. కానీ వీరందరూ నీకు కనపడరు. భూమిలోపల పెద్ద నగరాలు రెండు, ఒకటి అమెరికాలో, మరోటి చైనాలో కట్టారు. అక్కడే జనమంతా ఉన్నారు. వాళ్లకు మరణం లేదు,” అంది అపరిచిత.
“అంత మంది జనం ఓ రెండు నగరాలలోనే ఎలా ఇమడగలిగారు?” ఆశ్చర్యంగా మరో ప్రశ్న వేసాను నేను.
“మంచి ప్రశ్నలు వేస్తున్నావు. అమరత్వం కోరకుండా, నాతో వస్తావేమోనని ఓ చిన్న ఆశ పుట్టింది. అవును అంత మంది రెండు నగరాలలో ఇమడడం కష్టమే. అందుకే నగరంలో చేరే ముందు శరీరాలని క్రెమటోరియం లో కాల్చేస్తారు,” అంది అపరిచిత.
“ఏమంటున్నావు? ఒక పక్క అమరత్వం అంటూనే, అది కావాలంటే నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలంటున్నావు. అమరత్వం కోరి నేను నా శరీరాన్ని 500 ఏళ్ళు ఫ్రీజ్ చేసి, ఆ శరీరంతోనే ఇప్పుడు మళ్లీ జీవిస్తున్నాను. వాట్ ఆమ్ ఐ మిస్సింగ్?,” కొంచెం ఫ్రస్ట్రేషన్ తోనే అడిగాను నేను.
“నీ ఉద్దేశ్యం లో అమరత్వం అంటే ఏమిటి?” అడిగింది అపరిచిత.
“మనిషి మెదడు పనిచేసినంత వరకు బ్రతికి ఉన్నట్లే. మా కాలంలో కూడా డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ఖరారు చేసిన తరువాతే మనిషి చనిపోయాడని దృఢ పరిచే వాళ్ళు. ఆ విధంగా మనిషి మెదడు పని చేసినంత కాలం, ఆ మనిషి అమరుడే,” అన్నాను కొంచెం లోతుగా ఆలోచించి.
“గత 500 ఏళ్లలో చాలా మార్పులే వచ్చాయి. కిడ్నీలు పనిచేయకపోతే, కిడ్నీలు, గుండె పనిచేయకపోతే గుండె ట్రాన్సప్లాంట్ చేయడం మీ రోజులలోనే ఉండేది. అవన్నీ చేయడం మెదడు సక్రమంగా పనిచేయడం కోసమే. మెదడుకు ఈ అవయవాలన్నీ పని ముట్లే. నీకు తెలియని విషయం, ఈ రోజులలో మెదడు బ్రతక డానికి, అవయవాల అవసరం లేదు,” అంది అపరిచిత.
“అంటే నా శరీరం నుంచి, నా మెదడు వేరు చేసి దాన్ని మాత్రం బ్రతికిస్తారా?” అన్నాను. నా మాటలు నాకే గగుర్పాటు కలిగిస్తున్నాయి.
“నీ సమాధానం నిజానికి దగ్గరగానే ఉంది. ఓ రెండు వందల ఏళ్ల క్రితం అలానే మెదడు మాత్రం బ్రతికించే వారు. కానీ మెదడుకు కావాల్సిన రక్త ప్రసరణ ఏ మాత్రం అవాంతరాలు లేకుండా చేయడం సాధ్యం కాలేదు. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ప్రపంచంలో కోటికొక్కరో, ఇద్దరో అప్పుడప్పుడు రక్త ప్రసరణ లేనందు వల్ల చనిపోయే వారు,” అంది అపరిచిత.
“కోటికొక్కరు చనిపోయినా, అది అమరత్వం ఎలా అవ్వుతుంది?” అన్నాను నేను.
“అందుకే అటు తరువాత, మెదడులను స్కాన్ చేసి అలాంటి మెదడే ఓ సర్క్యూట్ చిప్ లాగా మలచ గలిగారు. ఇవి పనిచేయడానికి, సూపర్ కండక్టర్ బ్యాటరీలు అమర్చారు. ఈ బ్యాటరీలు ఎప్పటికి పని చేస్తూనే ఉంటాయి. ఫెయిల్ అయ్యే ప్రశ్నే లేదు,” అంది అపరిచిత.
“అంటే ముందు నా మెదడును స్కాన్ చేసి నన్ను మరో సారి సృష్టించిన తరువాత, నా మెదడును కూడా, శరీరంతో పాటు కాల్చేస్తారా. నేను అలా ఎలా బ్రతకాలనుకుంటావు,” అన్నాను నేను. ఇదంతా ఏదో తికమకగా ఉంది.
“నీకు నీ శరీరం కోల్పోయిన అనుభవం ఏమాత్రం ఉండదు. మెదడుకు నీ అవయవాలన్నీ ఉన్నట్లే సిగ్నల్స్ అందుతుంటాయి, నీ జ్ఞాపకాలు కూడా, నీ అవయవాలు ఉన్నట్లే నిక్షిప్తం అయ్యి ఉంటాయి,” అంది అపరిచిత.
“ఒక వేళ నీవు చెప్పింది నిజమే అయ్యినా, ఎక్కడా కదలలేని, ఎలాంటి అనుభూతులు లేని అలాంటి జీవితం నేనెందుకు కోరుకుంటాను. అచలనం అమరత్వం కాదు కదా,” అన్నాను.
“కదల లేవని ఎందుకనుకుంటున్నావు. నీ వెక్కడ పోవాలనుకుంటే అక్కడ పోయి పని చేయడానికి డ్రోన్ రోబోలు బోలెడన్ని ఉన్నాయి. అవి చూసిన దృశ్యాలు, పొందిన అనుభవాలు నీకు నువ్వు అక్కడ ఉన్నట్టే, ప్రత్యక్ష మౌతాయి. ఓ అడవిలో చందనం చెట్టు దగ్గర తిరుగుతుంటే నీవు ఆ చందనం సువాసన ఆగ్రాణించగలవు, అక్కడి దృశ్యాలు అక్కడున్నట్లే అన్ని దిక్కుల చూడ గలవు, పళ్ళు కోసి, తిని రుచి చూడ గలవు, పక్షుల కిల కిలలు, విన గలవు. నీవు అక్కడ ఉన్నట్లే అనుభూతి కలుగుతుంది”.
“రోబోల సాయంతో జీవితం ఎలా గడుపుతాను. తోటి మనుష్యులు కావాలి కదా. నాకు సహచరి కావాలి కదా…,” అన్నాను నేను.
“నీ ఆలోచనలు ఎక్కడకు పోతున్నాయో నాకర్ధం అయ్యింది. నువ్వు కావాలనుకుంటే, డేటింగ్, రొమాన్స్, లవ్, సెక్స్ అన్నీ సాధ్యమే. మార్పు చెందిన తరువాత ఎలాంటి అనుభవాలైన, మీ కాలంలో నెట్ఫ్లిక్స్ లాగా నువ్వు ప్లే చేసి అనుభవించవచ్చు. 2100 సంవత్సరం తర్వాత మనుష్యుల అనుభవాలు పంచుకోవడానికి సదుపాయాలు ఏర్పాటు చేసారు. చనిపోయే ముందు మానవులు తమ బ్రెయిన్ డంప్ చేయ వచ్చు. అమరత్వం ఎన్నుకున్న వారికి ఈ బ్రెయిన్ డంప్ లు వాళ్లు అనుభవించడానికి కన్టెంట్ అయ్యిపోయింది. అలా రకరకాల జీవితాలు అనుభవించడం, కొత్త జీవన మార్గం అయ్యిపోయింది,” అంది అపరిచిత.
“అంటే నేను కావాలనుకుంటే బిల్ గేట్స్ లా బ్రతకాగలనా?” అన్నాను నేను.
“బిల్ గేట్స్ మీ తరం వాడు. ఆయన మెదడు డంప్ లేదు. కానీ నీవు కావాలనుకుంటే బిల్ గేట్స్ కు మించి జీవితంలో పైకెదిగిన మనుష్యుల జీవితాలున్నాయి. వారిలా నీవు జీవించి చూడ వచ్చు,” అంది అపరిచిత.
“అంటే ఎలాంటి జీవితమైన నేను అనుభవించ వచ్చా,” అన్నాను నేను.
“తప్పకుండా. కావాలంటే ఓ సీరియల్ కిల్లర్ జీవితం కూడా, ఏ మాత్రం పర్యవసానాలు లేకుండా అనుభవించవచ్చు,” అంది అపరిచిత.
“చా…అలాంటి అనుభూతి, నేను ఎందుకు కోరుకుంటాను,” అన్నాను కొంచెం జుగుప్సతో.
“మీ కాలంలో హార్రర్ సినిమాలు చూడలేదా. ఇదీ అంతే. సినిమా చూడడానికి నేరస్తుడు కానవసరం లేదు. ఇక్కడా అంతే,” అంది అపరిచిత.
“అమరత్వం తో పాటు అన్ని కోరికలు తీర్చేసుకోవచ్చు అంటావు. బుద్ధుడన్నట్లు కోరికలు మానవ జీవనంలో ఉన్న బాధలకు కారణం అయ్యితే, అన్నీ కోరికలు తీరే ఈ కొత్త ప్రపంచంలో మనుష్యులు ఎల్ల కాలం సుఖంగా బ్రతికేయవచ్చు అంటావు” అన్నాను నేను.
“అవును ఒక్క కోరిక తప్పితే, మిగతా అన్ని కోరికలు ఆలోకంలో వారు తీర్చుకోవచ్చు. కానీ దాని గురించి చెప్పే ముందు నేను ఎంచుకున్న లోకం గురించి నీకు చెప్పాలి,” అంది అపరిచిత.
“థట్ మేక్స్ సెన్స్. నాకు రెండు ప్రంపంచాల గురించి తెలిసిన తరువాతే కదా నా నిర్ణయం చెప్ప గలను,” అన్నాను నేను.
“అందరూ అమరత్వం కోరుకుంటే మానవ జెనెటిక్ ప్రింట్ పోతుందని ఓ 500 మందికి మాత్రం అమరత్వం ఇవ్వకుండా మానవులగా బ్రతకమని ఈ కొత్త ప్రపంచంలో నిర్దేశించారు. బిజినెస్ కంటిన్యూటీ లాగా మానవ లైఫ్ కంటిన్యూటీ పథకంలో ఇది ఒక భాగమనుకుంటా. మా జీవన విధానాని కి మీ కాలంలో జీవించిన దానికి పెద్ద తేడా లేదు. కాదంటే ఇప్పుడు మనుష్యులు 150 ఏండ్ల దాకా బ్రతక గలుగుతున్నారు. నీకు చనిపోయినప్పుడు 50 ఏళ్ళు కాబట్టి మరో వంద ఏళ్ళు సరదాగా గడిపేయవచ్చు. నీకున్న జబ్బులన్నీ ఈ పాటికి సమసిపోయి ఉండాలి. నిన్ను నీ క్రయోజెనిక్ నిద్ర నుండి లేపే ప్రయత్నంలో, కావలసిన మెడిసిన్స్, వాక్సిన్ నీ ముక్కులో స్ప్రే చేసాను. ఇప్పుడు నీ ఆయస్సు మా లాగానే 150 ఏళ్ళు. యు అర్ సెంట్ ఆర్ సెంట్ హెల్తీ. కానీ మా లోకంలో నీకు ముసలితనం నుంచి, మరణం నుంచి విముక్తి లేదు. 130 నుంచి 150 ఏళ్లలో ఎప్పుడైనా చనిపోవచ్చు,” అంది అపరిచిత.
“మరి మీ లోకంలో వారు కూడా అమరత్వం కోసం ప్రయత్నించవచ్చు కదా,”అడిగాను నేను.
“మంచి ప్రశ్న. మా లోకంలో నుంచి అమర లోకానికి పోవడానికి రిటైర్ అయ్యిన తరువాతే సాధ్యం. మా లోకంలో అది 120 ఏళ్లకు కానీ రాదు. అలా 120 ఏళ్ల తరువాత అమరత్వం పొందాలనుకుంటే ముందు తమ బ్రెయిన్ డంప్ చేయాలి. లేక పోతే అమరత్వం దొరకదు, ఆ లోకంలోకి ప్రవేశం లేదు. తరువాత బ్రెయిన్ స్కాన్ చేసి ఆ మర లోకంలో నిక్షిప్తం చేస్తారు. దానితో అమరత్వం వచ్చినట్లే”, అంది అపరిచిత.
“నేను మరింత సూటిగా అడిగి ఉండవలసింది. నీవు ఎందుకోసం అమరత్వం కోరుకోవటం లేదు,” అన్నాను.
“నేను మానవ జీవితం పూర్తిగా గడపాలనుకుంటున్నాను. చావుతో సహా. నా జీవితానుభావాలు నావే. అవి నాకు ఇతరులతో పంచుకువడం ఇష్టం లేదు,” అంది అపరిచిత.
“అలాంటి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండడం మంచిదే. కానీ నీవు, నాకు ఇంకా ఏదో చెప్పలేదనిపిస్తోంది,” అన్నాను కొంచెం ఇబ్బందిగా కదులుతూ.
“ఇంకో ఐదు నిముషాలలో నేను ప్రస్తుతం నివసిస్తున్న మావి ద్వీపానికి చేరిపోతాం. నీ నిర్ణయం ఆ లోపు చెప్పాల్సిందే. నీవు గతం లోనుంచి వస్తున్నావు కాబట్టి, నీకు ఇట్టే అమరత్వం ఇవ్వడానికి ఒప్పుకుంటారు. నీ మెదడులో ఉన్న నీ అనుభవాలు పురాతన వస్తువుల వంటివి. మంచి డిమాండ్ ఉంటుంది. ఇక నీ ఇబ్బంది నేను అర్ధాంతములో వదిలేసిన ప్రశ్న వల్ల కావచ్చు,” అంది అపరిచిత.
“అమర లోకంలో వారికి ఒక కోరిక మిగిలి పోయింది అన్నావు,” నన్ను కలవర పెడుతున్న ప్రశ్న గుర్తుకు వచ్చింది.
“అవును. దానికే వస్తున్నాను. అమరత్వం పొందిన వారందరు అది స్వర్గం లా ఉందనే అంటున్నారు. ఆ లోకం సృష్టించి ఇప్పటికి దాదాపు 300 ఏళ్ళు అయ్యింది. ఇటీవల కొందరు ఏ మాత్రం చలనం లేకుండా ఉన్నారని కొన్ని పుకార్లు విన్నాను. వాకబు చేస్తే, వీరికి చావు అనుభూతి ఎలా ఉంటుందో అని అనుభవించాలి అని ఆశ అట” అంది అపరిచిత.
నవ్వు ఆపుకోలేక పోయాను నేను. “కేచ్ 22 లా ఉంది కదూ. చనిపోయిన వాడు, బ్రెయిన్ డంప్ చేయలేడు. ఆ అనుభవం కావాలంటే అమరత్వం కోరుకోకూడదు,” అన్నాను నేను.
“నేను దిగాల్సిన ప్రదేశం వచ్చేసింది. ఇక నీ నిర్ణయమే బాకీ. నాతో పాటు దిగిపోయి మరణం కోరుకుంటావా? కాదు అమరత్వం కావాలంటే నీవు ఇలానే ప్రయాణిస్తే ఆ లోకానికి చేరిపోతావు. నీ వాహనానికి ఆ దారి తెలుసు,” అంది అపరిచిత.
“ముందు నన్ను వెదికి పట్టి, నన్ను మళ్లీ ఈ లోకంలోకి తెచ్చినందుకు థాంక్స్. ఓపిగ్గా నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చావు. నేనో నిర్ణయానికి రావడానికి వీలైంది,” అన్నాను నేను.
“విచిత్రం ఏమిటంటే, అన్ని విషయాలు తెలిసినా, మీ వంటి వారి నుంచి ఎప్పుడూ ఒకటే జవాబు రాలేదు. మరి నీ నిర్ణయం చెప్పు,” అంది అపరిచిత, సూటిగా నా కళ్ళలో చూస్తూ.
***
మధురవాణి త్రైమాసిక వెబ్ పత్రిక