బంగారం కొద్దీ సింగారం-1
“బంగారం కొద్దీ సింగారం” — ఎంత బంగారం పెరిగితే, అంత సింగారం పెరుగుతుందన్న ఈ సామెత ఆభరణాలకే కాదు, మనుషుల గౌరవానికి కూడా వర్తిస్తుంది. నేడు అమెరికా సమాజంలో భారతీయ అమెరికన్లు సంపాదిస్తున్న గౌరవం ఈ సామెతకు సజీవ ఉదాహరణ. సాంకేతిక రంగం నుంచి వైద్యానికి, ఆర్థిక వ్యవస్థ నుంచి విద్యా రంగానికి — భారతీయుల ప్రతిభ, కృషి, నైతిక విలువలు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీల సి.ఇ.ఓలు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రొఫెసర్లు, వైద్యులు — ఎక్కడ చూసినా భారతీయుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నెల రచ్చబండ చర్చకు “బంగారం కొద్దీ సింగారం” అనే శీర్షిక పెట్టడానికి కారణం మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి. ఈ సందర్భంలో, భారతీయుల పట్ల అమెరికన్లలో పెరుగుతున్న గౌరవాన్ని ప్రతిబింబించే ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రచ్చబండ అంటే అనుభవాలు, నవ్వులు, విమర్శలు — అన్నీ కలగలిపిన చర్చ కదా!
ఒక చిన్న సంఘటన – పెద్ద భావం: మా ఇంట్లో 20 ఏళ్ల పాత ఏసీ యూనిట్ పాడైపోవడంతో కొత్తది కొందామని అనుకుంటే ఒక సేల్స్‌మన్ వచ్చాడు. ధర, మోడళ్లు, వారంటీలు అన్నీ విపులంగా చర్చించి, చివరకు అతడితో ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రం పై సంతకం చేసిన వెంటనే — ఆశ్చర్యంగా — ఆ వ్యక్తి భారతీయ అమెరికన్ల గురించి ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. సంతకానికి "ముందు" పొగిడితే, “సేల్ కోసం చేస్తున్న ముఖస్తుతి” అనుకునేవాడిని. వీడెవడో భట్రాజులా ఉన్నాడేంటి - అతిశయోక్తిగా పొగుడుతున్నాడేంటి! చెప్మా అని. కానీ సంతకం "తర్వాత" కూడా రెండు నిమిషాల పాటు ఆపకుండా పొగిడాడంటే — అది అతను మనపై చూపించిన నిజమైన గౌరవంతో కూడిన అభిమానమే అని అర్థమైంది. భారతీయుల కష్టపడి పనిచేసే తీరు, నిజాయితీ, కుటుంబ విలువలు, విద్యపై ఉన్న నిబద్ధత — ఇవన్నీ అమెరికన్లలో మన గూర్చి మంచి అభిప్రాయాన్ని పెంచుతున్నాయి అని అర్థమయింది.
భారతీయ ఆతిథ్యం – మన సంప్రదాయం: అంతగా పొగిడిన అతనిని ఖాళీ చేతులతో పంపడం మన సంస్కృతికి సరిపోదు కదా! వెంటనే ఇంట్లో తాజాగా చేసిన రాయలసీమ ఉగ్గాణిని ఒక బాక్సులో పెట్టి అతనికి ఇచ్చాను. అతను ఎంతో ఆనందంగా స్వీకరించాడు. అతడి మాటల్లో భారతీయుల గొప్పతనం, మన చేతల్లో భారతీయ ఆతిథ్యం — రెండు కలిసినప్పుడు ఆ చిన్న సంఘటనకు ఒక స్నేహపూర్వకమైన అందమైన ముగింపు వచ్చింది అని నాకు అప్పుడు అనిపించింది. అక్కడే నాకు మరో ఆలోచన వచ్చింది — బంగారం ఎంత పెరిగితే సింగారం అంత పెరుగుతుందన్నట్లే, అమెరికాలో భారతీయుల ప్రభావం ఎంత పెరుగుతుందో, అంతర్జాతీయ వేదికపై భారత్‌కు లభించే గౌరవం కూడా అంతే పెరుగుతోంది. అదే సమయంలో, దాదాపు ఎనిమిది నెలలుగా సాగుతున్న అమెరికా–భారత్ సుంకాల అనిశ్చితి కూడా ఇటీవల తొలగింది. ఈ నెల రచ్చబండలో ఇదే మన ప్రధానాంశం.
భారత్‌పై అమెరికా సుంకాల అనిశ్చితి తెరపడింది: గత కొన్నేళ్లుగా అమెరికా–భారత్ వాణిజ్య సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రమంగా సర్దుమణుగుతున్నాయి. ఇది కేవలం సుంకాల కథ కాదు — గ్లోబల్ జియోపాలిటిక్స్, సరఫరా గొలుసులు, చైనా తరువాతి ప్రత్యామ్నాయాల కోసం అమెరికా చేసే ప్రయత్నాలు, భారత్ పెరుగుతున్న ఆర్థిక శక్తి — ఇవన్నీ ఈ పరిణామంలో భాగం.
సుంకాల నేపథ్యం – ఆర్థికం నుంచి రాజకీయానికి: అమెరికా గతంలో జాతీయ భద్రత, ట్రేడ్ డెఫిసిట్ వంటి కారణాలు చూపుతూ అనేక దేశాలపై అదనపు సుంకాలు విధించింది. భారత్ కూడా ఈ జాబితాలో ఉండటంతో: ఉక్కు, అల్యూమినియం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టెక్స్టైల్, ఆటో భాగాలు వంటి రంగాలు నేరుగా ప్రభావితమయ్యాయి. భారత్ ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరగడంతో భారత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం తగ్గింది. చిన్న, మధ్య తరహా ఎగుమతిదారులు నష్టపోయారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు — అమెరికా ప్రపంచానికి పంపిన ఒక రాజకీయ సంకేతం కూడా. అమెరికాతో భారత వాణిజ్యంలో, 2024 నాటికి భారత్‌కు సుమారు $46 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే అమెరికా భారత్‌కు అమ్మినదానికంటే, భారత్ అమెరికాకు అమ్మింది ఎక్కువ. భారత్ చైనాతో చేసే దిగుమతులు, ఎగుమతుల కంటే దాదాపు $100 బిలియన్ ఎక్కువ. మరి భారత్ కూడా అమెరికా వలె చైనా పై ఆధారపడడం తగ్గించుకోవాలి కదా! బహుశా భారత్ ఈ దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి.
అమెరికా 50% సుంకాల పెంపుపై భారత్ తగ్గలేదు. “సహనం ఉంది, కానీ మౌనం కాదు” అనే ధోరణితో - నిమ్మకునీరెత్తే శైలిని అవలంబించి, భారత్:
- ముందుగా ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద తన అభ్యంతరాలు నమోదు చేసింది
- కొన్ని అమెరికా ఉత్పత్తులపై ప్రతిస్పందన సుంకాలు విధించింది
- కానీ సంబంధాలు దెబ్బతినకుండా నేర్పుగా దౌత్య చర్చలు కొనసాగించింది
చివరకు అమెరికా 50% సుంకాల బెదిరింపుతో మొదలుపెట్టి, 18% వద్ద సర్దుకుందని తెలుస్తోంది. సుంకాలు బంగ్లాదేశ్‌పై 19% సుంకాలు ఉండగా, భారత్‌పై 18% ఉండటం — భారత టెక్స్టైల్ రంగానికి ఇది కొత్త అవకాశాలు తెరిచింది. ఇంతకు మునుపు బంగ్లా నుండి తయారైన టీ షర్ట్ కు అమెరికాలో సున్నా శాతం సుంకం ఉండగా ఇప్పుడు అది 19 శాతానికి చేరుకుంది. మరి భారత్ పై విధించిన 18 శాతం సుంకంతో పోలిస్తే భారత్ పోటీ సామర్థ్యం పెరిగినట్లే కదా! ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఎదో పది డాలర్ల టీ షర్ట్ కదా, దీంతో పెద్దగా ప్రభావం ఉండదు అని మీరు అనుకొంటున్నారా? మీరు పప్పులో కాలు వేసినట్లే! బంగ్లాదేశ్ 2025 జనవరి నుండి నవంబర్ వరకు అమెరికాకు $7.6 బిలియన్ల విలువైన దుస్తులను ఎగుమతి చేసింది. సీన్ కట్ చేస్తే - గత రెండు ఏళ్లుగా బంగ్లాదేశ్‌లో హిందువులు తరచూ లక్ష్యంగా మారుతున్నారని, ప్రభుత్వం రక్షణలో, దర్యాప్తులో, న్యాయంలో బంగ్లా విఫలమవుతోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, అమెరికా విదేశాంగ శాఖ, ఐరాస మానవ హక్కుల కమిషన్ ఈ మూడు సంస్థలూ స్పష్టంగా చెబుతున్నాయి. దాడులు చేసినవారిపై ఉత్తుత్తి కేసులు నమోదు చెయ్యడం, వారికి శిక్ష లేకపోవడంతో హింసకు పాల్పడేవారు మరింత రెచ్చిపోతున్నారు - దాంతో హింస మరింత పెరిగి - మైనారిటీల పని ఇంకా దుర్భరం అవుతుంది. అయితే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అని బంగ్లా ప్రపంచానికి ఇచ్చే కవరింగ్ తక్కువేమీ కాదు. హిందూ మైనారిటీల పై బంగ్లాదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలకు ఇప్పుడు భారత్ కు అమెరికా టారిఫ్ ల తగ్గింపుతో బదులు చెప్పే అవకాశం వచ్చింది. ఏతావాతా బంగ్లాదేశ్ టెక్స్టైల్ రంగాన్ని భారత్ ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలు మెరుగయ్యాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకంటారా? మరి బంగ్లాదేశ్ చెప్పిన మాట వింటే కదా! వాపును చూసి బలుపని మిడిసిపడుతున్న బంగ్లా పై ఆమాత్రం వత్తిడి లేకపోతే మున్ముందు హిందూ మైనారిటీల పై అత్యాచారాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
తాజా పరిణామాలు – టారిఫ్ స్పష్టత ఎలా వచ్చింది? ద్వైపాక్షిక చర్చల ఫలితంగా — కొన్ని రంగాల్లో సుంకాలు తగ్గించబడ్డాయి, కొన్ని చోట్ల మినహాయింపులు ఇచ్చారు, మరికొన్ని రంగాల్లో దశలవారీ సడలింపులు చర్చించారు. సుంకాల తగ్గింపు తో భారత ఎగుమతిదారులు “రేపు ఏమవుతుందో?” అనే అనిశ్చితి నుంచి బయటపడుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: సుంకాల అనిశ్చితి తగ్గడం వల్ల — భారత్ కు ఎగుమతుల ప్లానింగ్ సులభం అవుతుంది. అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది, భారత్ లో ఉద్యోగావకాశాలు, ఉత్పత్తి స్థాయిలు కుదురుకుంటాయి. విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది.
ప్రత్యేకంగా లాభపడే రంగాలు: భారత్ ఉక్కు & ఇంజనీరింగ్ రంగానికి పెద్ద ఎగుమతి కాంట్రాక్టులకు పోటీ పడే అవకాశం ఉంది. టెక్స్టైల్ & గార్మెంట్స్ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం, చైనా తో పోటీలో నిలబడే అవకాశం. ఫార్మా & హై–వాల్యూ మాన్యుఫాక్చరింగ్ లో భారత్ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో అదనపు మార్కెటింగ్ అవకాశం ఉంది.
అమెరికా దృష్టిలో భారత్ – చైనా తర్వాతి కీలక భాగస్వామి: అమెరికా దృష్టి ఇప్పుడు — చైనా మీద ఆధారాన్ని తగ్గించుకోవాలి, సరఫరా గొలుసులను వైవిధ్యపరచాలి, ప్రజాస్వామ్య దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యం పెంచుకోవాలి పై ఉందని తెలుస్తుంది. అందుకే సుంకాల సడలింపులు కూడా ఒక వ్యూహాత్మక చర్యగా చూడాలి.
రాజకీయ కోణం – వాణిజ్యం కంటే వ్యూహం పెద్దది: భారత్–అమెరికా సంబంధాలు ఇప్పుడు — రక్షణ, టెక్నాలజీ, ఇండో–పసిఫిక్ వ్యూహం, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో విస్తరిస్తున్నాయి. అయితే రక్షణ రంగంలో “కిల్ స్విచ్” సమస్య ఉన్నంతకాలం భారత్ అమెరికా ఆయుధాలపై పూర్తిగా ఆధారపడదు — ఇది ఆపరేషన్ సిందూర్ వంటి సందర్భాల్లో స్పష్టమైంది. అంటే అమెరికా విమానాలను భారత్ కొని, యుద్ధంలో ఉపయోగించే సందర్భాలలో అమెరికా కిల్ స్విచ్ నొక్కితే ఇంకేమవుతుంది - అంతే సంగతి. అమెరికా ఆయుధాలు యుద్ధ రంగంలో పడకేస్తాయి - మనకు ఇక తూర్పుకు తిరిగి దండం పెట్టడమే తక్కువ - అదీ యుద్ధ సమయంలో! అది మిత్రులారా అమెరికా ఆయుధాల్లో ఉన్న “కిల్ స్విచ్” సంగతి.
ఈ నెల రచ్చబండ చర్చను ఇక్కడ ముగిద్దాం. ముగింపు ముచ్చట మంచిదైయుండాలి కాబట్టి — వచ్చే సంచికలో మరింత లోతైన విశ్లేషణతో కలుద్దాం. ఆ సంచికలో — సుంకాల అనిశ్చితి తర్వాత ఇంకా ఎలాంటి సవాళ్లు మిగిలి ఉన్నాయి, అమెరికా–భారత్ టారిఫ్ ఒప్పందం భారత్‌కు నేర్పిన కొత్త పాఠాలు ఏమిటి, రష్యా నుండి చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో కొత్త రక్షణ కొనుగోళ్ల దిశ ఎలా ఉండాలి, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా అంచనా వేయాలి — అన్న అంశాలను వివరంగా చర్చిద్దాం. ఈ సందర్భంగా సిరిమల్లె పాఠకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాలను తప్పక పంచుకోండి. వచ్చే నెల ఈ రచ్చబండ చర్చ కొనసాగింపుతో మళ్లీ కలుద్దాం మిత్రులారా.
నమస్కారములతో, మీ వెంకట్ నాగం