Menu Close
వీక్షణం-161వ సాహితీ సమావేశం
– అమృతవల్లి అవధానం –
vikshanam-162

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 162 వ అంతర్జాల సమావేశం ఫిబ్రవరి 20, 2026 నాడు సంస్థ అధ్యక్షులు డా. గీతామాధవి గారి ఆధ్వర్యంలో, వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు, డా.రాధాకుసుమ గార్ల సమన్వయంలో ఆద్యంతం అద్భుతంగా నిర్వహించారు.

ప్రధాన వక్తగా శ్రీ వి డి రాజగోపాల్, సైంటిస్ట్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్, వాల్మీకి కళా సంస్థ నిర్వాహకులు విచ్చేసి “నేటి కవిత్వంలో సామాజిక స్పృహ” అనే అంశం పై అద్భుతమైన ప్రసంగం చేశారు.

పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కవిత్వం అంటే భావాలను, అనుభూతులను, ఆలోచనలను, అందమైన, లయబద్ధమైన, హృదయానికి హత్తుకునే భాషలో వ్యక్తీకరించే ఒక అద్భుతమైన సాహితీ కళాత్మక ప్రక్రియ అని అభివర్ణించారు. నాటి ఆదికవి నన్నయ నుండి నేటి నిఖిలేశ్వర్ దాకా కవిత్వం లో మార్పులను వివరిస్తూ వివరించారు. నాటి కవులు సంస్థానాలలో రాచరిక పాలనలో ఉండటం మూలాన కవిత్వం వ్యక్తిస్తుతిగానో, ప్రకృతి వర్ణన, స్త్రీ వర్ణనతోనో కొనసాగేవని చెపుతూ రాజా రామ్మోహన్ గారితో సంస్కరణలు మొదలై ఆ నాటి సామాజిక స్పృహను వ్యక్త పరిచే రచనలు మొదలయ్యాయని స్పష్టం చేశారు.

వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు, గుర్రం జాషువా, శ్రీ శ్రీ, బంకిం చంద్ర చటర్జీ, ఠాగూర్ వీరందరూ నాటి ఉద్యమ స్ఫూర్తి రగిలించడంలో సాహిత్యం ద్వారా అమోఘమైన కృషిచేసారని తెలిపారు. దాశరథి, గద్దర్, అందెశ్రీ మొదలైన వారి సాహిత్యం అంతా సామాజిక స్పృహతో నిండి ఉన్నాయని, కొలకలూరి ఇనాక్ గారి ఊటబావి కులం ధనం కవితా సంపుటి నుండి కవితలని ఈ సందర్బంగా వినిపించారు. వారు స్వయంగా రచించిన ఏడు పదుల రాజ్యాంగం కవిత వినిపించి ఆలోచింపజేశారు. “ఏడబోయె తల్లి ఎర్ర సింధూరం” నాటకాన్ని ప్రదర్శింపజేసి బహుప్రసంశలు పొందారని తెలిపారు. పలు సినీ రచయితలు సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించే రచనలు చేశారని తెలుపుతూ సందర్భోచితంగా ఆ పాటలను పాడి వినిపించి, కార్యక్రమాన్ని అలరింపజేశారు.

వీరి ప్రసంగంపై డా.గీత గారు స్పందిస్తూ డా.రాజగోపాల్ గారు సాహిత్య విలువలను, అవి సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉండాల్సిన అవసరాన్ని చక్కగా తెలిపారని కొనియాడారు. కవులు కొత్తూరు వెంకట్, చీదెళ్ల సీతాలక్ష్మి, అయ్యల సోమయాజులు ప్రసాద్, లలితా చండీ, రాజేంద్రప్రసాద్ గార్లు తమ స్పందనలు తెలుపుతూ ప్రసంగం ఆసాంతం ఆకట్టుకున్నదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యువకవులకే కాక పరిశోధనకు కూడా ఉపయోగపడే లాగా ఒక క్రమ పద్ధతిలో కొనసాగిందని అభినందనలు తెలిపారు.

తదుపరి ప్రవాస భారతీయుడు, యువకవి ఇంగువ శశి (ఇంగువ మల్లికార్జున గారి కుమారుడు) రచించిన త్రిభాషా కవితా సంపుటి “లవ్, దేశం, జిందగీ” ని డా.గీతామాధవి గారు ఆవిష్కరించి శశి గారికి అభినందనలు తెలిపారు. వారి నుండి మరిన్ని విలువైన సాహిత్య సంపుటాలు రావాలని కోరుతున్నట్లు తెలిపారు. శశి గారు పరిచయం చేసుకుంటూ కాలేజ్ లో ఉన్నప్పుడే ఏమీ తోచక వ్రాయడం మొదలు పెట్టానని, అది అలవాటుగా మారిందని సందర్భం, సంఘర్షణ ఉన్నప్పుడు ఏ భాషలో స్ఫురిస్తే ఆ భాషలో వ్రాసేవాడినని చెప్పారు.

తర్వాత కవిసమ్మేళనం రాజేంద్రప్రసాద్, రాధా కుసుమ గార్ల నిర్వహణలో కొనసాగింది.

తొలుత గీతామాధవి గారు “అమ్మే అలిగిన వేళ” అను కవితను ఆవేదన భరితంగా హృద్యంగా చదివారు. బిటవరం శ్రీమన్నారాయణ గారు సరళ నీతి, అయ్యల సోమయాజులు గారు మాతృత్వాన్ని మరిచావెందుకు అంటూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంఘటనపై ఆవేదనతో వ్రాసిన కవిత వినిపించారు. పిమ్మట పొత్తూరి వెంకటేష్ గారు తొలితరపు భారతి – ప్రధమ ప్రవాసి కవితను వినిపించారు. యువ కవి శశి ఇంగువ గారు “దేశం” అనే కవితలో దేశం ఉత్తుత్తి దేశం అంటూ విలువలు కోల్పోయిన దేశ స్థితిగతుల పై ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనం ఆశ్రితారెడ్డి గారు “అసలు దేనికీ ఆలోచనలు” అంటూ మనసులో మెదిలే ప్రశ్నలను చిరుకవితలో వినిపించారు. ఉండవల్లి సుజాతా మూర్తి గారు అవినీతిపై అక్షరాయుధం అంటూ అ నుండి అః దాకా అకారాది క్రమంలో రచించిన చిరు కవితను వినిపించారు. బత్తిన గీతాకుమారి గారు “మనసు లోగిళ్ళలో పీటవేద్దామా” అంటూ మలి సంధ్యలో బతుకు వెళ్లదీస్తున్న వృద్ధుల పక్షాన తమ ఆవేదన గళాన్ని విప్పారు. గంటా మనోహర్ రెడ్డి గారు తెలుగు తేజం అంటూ మాతృ భాష గొప్పదనాన్ని మహారాణి తెలుగంటా అంటూ కొనియాడారు. తదుపరి రామ కృష్ణ చంద్రమౌళి గారు వర్ణశోభితంగా ఊరించి “వంకాయ” ఆంధ్రుల అన్నిసందర్భాల్లో ఆదుకునే కూరగాయగా అభివర్ణించారు. శోభాదేశ్ పాండే తెలుగు భాష చాలా అందమైన భాషని, మరాఠీ మాతృభాష అయిన తాను తెలుగు ఇష్టంగా నేర్చుకుని కవితలు వ్రాస్తున్నానని చెప్పారు.

మోటూరి నారాయణ రావు గారు “శివనామ స్మరణం-కైవల్యం” అంటూ శివరాత్రి సందర్బంగా శివ శివ అంటూ భక్తుల స్మరణతో అంతటా లయమయ్యిందని కవితా రూపంలో దృశ్యమానం చేశారు. కోదాటి అరుణ గారు తేనెలొలుకు తెలుగు అంటూ తెలుగు భాష వారధిగా నిలిచిందని చెప్పారు. లలితా చండి గారు “ఊపిరికోసం” అనే కవితలో భాష ఉనికి కై పాటు పడాలని సూచించారు. అమృతవల్లి అవధానం “పెను సవాలు” అనే కవితలో సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల మనిషి నిర్లక్ష్యాన్ని ఆవేదనా భరితంగా వినిపించారు.

పిమ్మట డా.రాధా కుసుమ గారి నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. బుక్కపట్నం రమాదేవి గారు మనిషంటే కవితలో మానవత్వం పరిమళించాలని తెలిపారు. డా.చీదెళ్ల సీతాలక్ష్మి గారు అప్రమత్తత కవితలో మనిషి ఏ ఏ సందర్భాలలో అప్రమత్తంగా మెలాగాలో సూచించారు. భోగెల ఉమామహేశ్వరరావు గారు మాతృభాష అను కవితలో భాష సౌందర్యం తెలిపారు. డా.ఎం.ఎన్ బృంద గారు తియ్యని తోరణాలు కట్టింది తెలుగు అంటూ జానపద బాణీ లో పాడి వినిపించారు. బలసాని వనజ గారు తెలుగు కన్న తియ్యనైన భాష ఏదిరా అమ్మపాడే జోలపాట తెలుగే కదా అంటూ శ్రావ్యంగా స్వీయ గీతం పాడి వినిపించారు. కందుకూరి శ్రీరాములు గారు అక్షరబ్రహ్మలం అనే కవితలో ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలని సూచించారు.

ఉప్పలపాటి వెంకటరత్నం గారు “తెరిచిన కిటికీ” కవిత ద్వారా సమాజాన్ని దర్శింప జేశారు. రవీంద్ర అరవ గారు అక్షరంబు లోక రక్షితంబు అనే కవితలో భాషను కొనియాడారు. చిట్టా బత్తుల వీర రాఘవులు గారు తెలుగు భాష మధుర భాష కవితలో భాషను స్తుతించారు. క్రిష్ణవేణి పరాంకుశం గారు సంసిద్ధత కవిత వినిపించారు. రాధకుసుమ గారు వృక్షం కవితలో పుష్పవిలాపాన్ని ఆవిష్కరించారు, ప్రకృతిని వర్ణించారు. రాజేంద్రప్రసాద్ గారు మాతృభాష ముచ్చట్లు కవితను అద్భుతంగా, ఆవేశంగా పాడి అందరీని అలరించారు, చప్పట్లు కొట్టించారు. మువ్వన్నెల జెండా అంటూ డాక్టర్ వి డి రాజగోపాల్ గారు రచించిన గజల్ ను కవి గాయకుడు అర్వా రవీంద్రబాబు హృద్యంగా ఆలపించారు.

డాక్టర్ గీతామాధవి గారు డా. వి.డి రాజగోపాల్ గారికి తమ ఆహ్వానం మన్నించి అతిధిగా వచ్చినందుకు, చక్కని ప్రసంగం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న కవులందరికీ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. తరువాతి సమావేశానికి అందరికీ ఆహ్వానం పలుకుతూ సభను ముగించారు. ఆద్యంతం సభను ఉల్లాసభరితంగా నిర్వహించినందుకు కవులు సంతోషం వ్యక్తపరిచారు. వచ్చేనెల సమావేశం కొరకు ఆశతో ఎదురు చూస్తుంటామని చెప్పారు.

అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

********

Posted in March 2026, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *