Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
పద్యరచన, పఠనము
ఉ. పద్యము నాదు వాక్కునను భావము నందునఁ దోడునీడయౌ,
     హృద్యముగాఁ బఠించు గళమే పరమేశ్వరదత్తవరప్రసాదమై
     యాద్యుల మన్ననల్ వడసె నాంధ్ర మెఱుంగని వారలైన నే
     వాద్యమొ విన్న రీతి విన వచ్చిరి, నా చిననాఁటి నుండియున్ 267

భీష్మైకాదశి
శా. భీష్మైకాదశి నేఁడు విష్ణుభజనన్ వేనోళ్ళఁ జేయంగ నా
     యుష్మంతుల్ భవపాపరోగరహితుల్ యోగ్యుల్ సదా కారె? వా
     రిష్మోద్భాసితవాటికోపమమహాహృష్టాత్ము(1) లౌచున్ దుదన్
     శుష్మాబ్జాక్షకృపాప్తమోక్షపదమున్(2) శోభిల్లుచున్ జెందరే?
          (1) ఇష్మము=వసంతర్తువు. ఈ కాలములో భాసిల్లే ఉద్యానము వలె
              చాలా సంతోషము నొందిన మనస్సు కలవారు
          (2) సూర్యచంద్రులు నేత్రములుగా కలవాని (విష్ణువు యొక్క) కృపచేత
              పొందబడిన మోక్షస్థానమును 268

తెనుఁగు పద్దియము
కం. కనువినికిఱేఁడు(1) పఱుపయి
      కనువిందుగఁ దమ్మికంటి కలుములచెలియే
      అనువుగ నడుగుల నొత్తఁగ
      నొనరెడు ననవిలుతునయ్య(2) కొనరుతు నొరిగల్(3)
           (1) సర్పరాజు (2) సుమశరుని తండ్రి (3) నమస్కారములు
భావము – ఆంధ్రము
          సర్పరాజు శయ్యకాఁగా, నేత్రానందకరముగా కమలలోచన అయిన
          భాగ్యలక్ష్మియే సానుకూలముగా పాదసేవ చేయఁగా ప్రకాశించెడి
          సుమశరజనకునకు నమస్కారములు. 269

తిరుచానూరు – అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు
సీ. ఎండుఫలంబులు మెండుగా రాజిల్లు
            మకుటమాలలు దాల్చు మాత తానె
     మొగలిరేకుతురాయి మొగలిరేకులదండ
            ముగమున నవ్వొల్కు ముగుద తానె
     సాంబ్రాణిధూపంబు చక్కఁగా సోఁకిన
            ద్రాక్షాకిరీటహారమ్ము లెసఁగ
     పసుపుముద్దలనద్ది పసిఁడిముద్దగు తల్లి
            తనువెల్ల స్నానంబుఁ దగ నొనర్చి
తే.గీ. చందనము నద్ది స్నపనమంజనము పిదప
        నూతనాలంకృతులు సేసి, చేత దర్ప
        ణమ్ము నిడి కుందనపుబొమ్మ కిమ్ము గూర్ప
        నిందుముఖి చూచి మనల దీవించుఁ గాత! 270
Posted in March 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *