Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు

గతసంచిక తరువాయి »

మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం :-

అక్టోబర్ 1966 చివరి నాటికి విశాఖపట్నంలో ఐదవ ఉక్కు కర్మాగారం స్థాపనకై ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అక్టోబర్ 31 1966న ఢిల్లీలో ఐదవ ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రదర్శనలు, ప్రాణ నష్టానికి దారితీస్తున్న కాల్పుల ఘటనల పట్ల సంజీవరెడ్డిగారు ఆందోళన వెలిబుచ్చారు. నవంబర్ 2న విశాఖపట్నంలో పరిస్థితి మహోద్రిక్తంగా తయారయ్యింది. పోలీసు కాల్పుల్లోనూ, దొమ్మీల్లోనూ పది మంది మరణించారు. విజయవాడలో బాష్పవాయువు ప్రయోగించి, గాలిలో తుపాకీ కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలోనే విజయవాడలో ప్రతిష్టించిన సంజీవరెడ్డిగారి కాంస్య విగ్రహం ధ్వంసం చేయబడింది. గుంటూరులో రైల్వే స్టేషన్ కు, పార్సెల్ ఆఫీసుకు, లైబ్రరీకి నిప్పు పెట్టారు. నవంబర్ 3 1966న 20 రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన శ్రీ టి. అమృతరావు దీక్ష విరమించారు. ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, శ్రీ అమృతరావుకు ఒక గ్లాసు నారింజ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

కేంద్ర మంత్రివర్గం విశాఖలో ఉక్కు కర్మాగారం స్థాపనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలుపుతూ, కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కానీ లోక్ సభలో ప్రధాని ప్రకటన నిరాశాజనకంగా ఉంది. ఆ ప్రకటనలో వనరులు లభించినపుడు తగు చర్యలు గైకొనాలని ఉన్నది. దాంతో ఉద్యమం కొనసాగింది. సంజీవరెడ్డి గారు నవంబర్ 19, 1966న హైదరాబాద్ లో మాట్లాడుతూ – విశాఖలో ఉక్కు కర్మాగార స్థాపనకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చగలిగినపుడు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం స్థాపనకు కేంద్రం నిరాకరిస్తే ఆంధ్రులు తమ మిత్రుడైన సంజీవరెడ్డిని మంత్రి పదవిలో చూడబోరని ప్రకటించారు. తనకు పదవిని పట్టుకు వ్రేలాడడం ఎప్పుడూ ఇష్టం లేదని, ఎంత చప్పున తనకు పదవులు వస్తాయో అంత తొందరగానే తానూ వాటిని త్యాగం చేయడానికి సిద్ధపడగలనని, ఈ విషయం చాలా మందికి తెలుసునని అన్నారు. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ సమస్యపై 1964 జూన్ నెల నుంచి సంభవించిన పరిణామాలను గురించి ఆయన వివరిస్తూ విశాఖ ప్రాంతాన్ని గురించి హిందూస్తాన్ స్టీల్ లిమిటెడ్ వారు నిష్పాక్షికమైన నివేదిక పంపలేదన్న భావంతో అప్పుడు తానే ఆంగ్లో-అమెరికన్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశానన్నారు. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు ఆ బృందం ఏకగ్రీవంగా సిఫారసు చేసినదని చెబుతూ… ఇంత జరిగినా తన మీద కొందరు దురుద్దేశంతో రాజకీయ స్వప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని శ్రీ సంజీవరెడ్డి అన్నారు. తనను గురించి తెలిసిన ఆంధ్రులు కూడా తనను అపార్ధం చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల కోసం నాయకులు త్యాగం చేయాలనీ, అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి నాయకులు వెనుక ఉండడం తగదని ఆయన అన్నారు. ఆంగ్లో-అమెరికన్ బృందాన్ని ఏర్పాటు చేయక మునుపు వివిధ కమిటీలు విశాఖపట్నం తగిన స్థలం కాదని పేర్కొన్నవని, ఆ సమయంలో తాను జోక్యం చేసుకుని ఆంగ్లో-అమెరికన్ బృందాన్ని ఏర్పాటే చేయకపోతే విశాఖపట్నం పేరే ప్రస్తావనలో ఉండేది కాదన్నారు. 1965 సెప్టెంబర్ లో మంత్రివర్గంలో ఈ విషయం పరిశీలనకు వచ్చినపుడు ఐదవ ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నంలోను, తరువాత ఫ్యాక్టరీని హొస్పెట్ లోను, మిశ్రమ ఉక్కు కర్మాగారాన్ని సేలంలోను ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనను మంత్రి వర్గంలో ఇంచుమించు తన సహచరులంతా ఆమోదించారని ఆయన అన్నారు. అంతలో పాకిస్తాన్ తో యుద్ధం రావడం వల్ల ఉక్కు ఫ్యాక్టరీల స్థాపన మాట మాత్రమేగాక దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రభుత్వం పరిశీలించే అవకాశం లేకపోయిందన్నారు. పాకిస్తాన్ తో పోరాటం ముగియగానే మన ప్రియతమ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం వల్ల ఇందిరాగాంధీ నాయకత్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో తన మంత్రిత్వ శాఖ మార్చబడినదని అన్నారు. రాజకీయ కారణాలతో ఈ గలాభా అంతా జరుగుతున్నదని కూడా తనకు తెలుసునన్నారు.

చివరకు సంజీవరెడ్డిగారు రాష్ట్ర రాజకీయాలలోకి తిరిగి ప్రవేశించకుండా 1967 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి జి.శ్రీనివాసరెడ్డిపై 42,231 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నాటి నాయకులు ఎంతో కొంత మేరకు వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచించేవారు. ఇప్పటి కాంగ్రెస్ లో అటువంటి నాయకులే కరువయ్యారు.

1967 మార్చ్ లో లోక్ సభ స్పీకర్ గా సంజీవరెడ్డి గారి ఎన్నిక: –

1967 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40.78 శాతం ఓట్లతో 283 లోక్ సభ స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ప్రతిపక్షాలైన స్వతంత్ర పార్టీ, జన సంఘ్, వామ పక్షాల బలం పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆరు స్థానాలు మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ వాదులు కైవసం చేసుకున్నారు.

స్వాతంత్య్రానంతరం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు రాష్ట్రాలను ఆ పార్టీ కోల్పోయింది. మద్రాసులో డి.యం.కె, ఒడిశాలో స్వతంత్ర పార్టీ, కేరళలో సి.పి.యం, కేంద్ర పాలిత ఢిల్లీలో జనసంఘ్ గెలుపొందాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని 287 స్థలాలలో కాంగ్రెస్ 165 స్థానాలు, స్వతంత్ర పార్టీ 29 స్థానాలు, సి.పి.ఐ 10 స్థానాలు, సి.పి.యం 9 స్థానాలు, జనసంఘ్ 3 స్థానాలు, రిపబ్లికన్లు 2 స్థానాలు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఒక స్థానం గెలుచుకుంటే, 68 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అలానే ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం 41 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 35 స్థానాలు, స్వతంత్ర పార్టీ 3 స్థానాలు, సి.పి.ఐ ఒక స్థానం గెలువగా, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం కోసం శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డితో శ్రీ ఏ.సి.సుబ్బారెడ్డి పోటీపడ్డారు. కానీ తరువాత పోటీ విరమించుకుని లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో నాయకుడిగా బ్రహ్మానందరెడ్డి పేరును ప్రతిపాదించి ముఖ్యమంత్రి ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేందుకు సహకరించారు. అయితే పోటీ విరమణ అనేది శ్రీ ఏ.సి.సుబ్బారెడ్డి తనకు తానుగా తీసుకున్న నిర్ణయం కాదని, శ్రీ నీలం సంజీవరెడ్డి గారి ఆదేశం మీదనే శ్రీ ఏ.సి.సుబ్బారెడ్డి పోటీ నుండి తప్పుకున్నారని రాజకీయ పరిశీలకులు అన్నారు. శ్రీ సంజీవరెడ్డి, సుబ్బారెడ్డి గారికి పోటీ వద్దని చెప్పడమే గాక, ఒకవేళ శ్రీ ఏ.సి.సుబ్బారెడ్డి తన మాట మీరి పోటీకి సిద్ధపడితే సహకరించ వద్దని తన అనుయాయులకు చెప్పారని ఈ పరిశీలకులు అన్నారు. సంజీవరెడ్డి గారు పోటీకి ఒప్పుకోకపోవడానికి రాజకీయ కారణాలను విశ్లేషకులు ఈ విధంగా చెప్పారు :- శ్రీ బ్రహ్మానందరెడ్డికి సంఖ్యాబలం చేకూరడం, మరో సారి తన బలహీనతను చాటుకోవడం సంజీవరెడ్డి గారికి ఇష్టం లేకపోవడం, అలానే ఇందిరా గాంధీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి శ్రీ సంజీవరెడ్డి ప్రాబల్యం తగ్గిపోవడమే కాకుండా శ్రీ బ్రహ్మానందరెడ్డికి ఢిల్లీ నుండి మద్దతు లభించడం, తాను ఢిల్లీలో ఉండాలి కాబట్టి ఢిల్లీలో పలుకుబడి సాధించిన శ్రీ బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా ఉండడం మంచిది కాదని సంజీవరెడ్డిగారు భావించడం.

శ్రీ సంజీవరెడ్డి అసమ్మతి వర్గానికి రాష్ట్ర ప్రజల క్షేమాన్ని, కాంగ్రెస్ సంస్థ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కృషి చేయవలసిందిగా సలహా ఇచ్చారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తారుమారైనాయి, రాజకీయ స్థాయిలో చూస్తే దేశంలో చాలా చోట్ల కల్లోలితమైన పరిణామాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి, పార్లమెంట్ లోను, దేశంలోనూ కాంగ్రెస్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చేట్లున్నది. ఈ పరిస్థితులన్నీ పరిశీలిస్తే కలతలు, విభేదాలు అన్నీ పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని కాపాడేటందుకు ఏకతాటిపై నిలిచి కృషి చేయవలసిందిగా కాంగ్రెస్ వాదులకు శ్రీ సంజీవరెడ్డి నచ్చజెప్పారు. దాంతో ముఖ్యమంత్రికి తమ పూర్తి సహకారాన్ని అందజేయాలని అసమ్మతి వర్గం వారు నిశ్చయించుకున్నారు.

ఆపత్కాలంలో ఇటువంటి నిస్వార్ధ రాజకీయాలు పార్టీ మరియు దేశ క్షేమం దృష్ట్యా ఎంత అవసరమో సంజీవరెడ్డి గారు ఆచరించి చూపారు.

మార్చ్ 13 1967న ప్రధాని ఇందిరాగాంధీచే ప్రకటించబడిన కేంద్ర మంత్రివర్గంలో సంజీవరెడ్డి గారికి చోటు దక్కలేదు. సంజీవరెడ్డి విడిచివేత పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వర్గ సభ్యుల జాబితా చూసినప్పుడే ప్రధానికి తన అసంతృప్తి తెలియజేశారు. అయినా కూడా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రి వర్గ సభ్యుల జాబితాను పునః పరిశీలించలేదు. శ్రీ సంజీవరెడ్డిని మినహాయించి, ఆయన స్థానంలో ఆంధ్ర నుంచి మరొకరిని నియమించడం వల్ల శ్రీమతి ఇందిరాగాంధీని బలపరచిన శ్రీ బ్రహ్మానందరెడ్డి ఎక్కువ ప్రయోజనం పొందారని వార్తలు ఆనాడు వచ్చాయి. మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిన శ్రీ బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రివర్గం నుండి శ్రీ సంజీవరెడ్డి మినహాయింపులో తనకెట్టి ప్రమేయం లేదని, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తనకు తానుగా తీసుకున్న నిర్ణయమని చెప్పి కావలసిన ఉప్పదించారు. మీ మంత్రి వర్గంలో చేరవలసిందిగా శ్రీ సంజీవరెడ్డిని ఆహ్వానిస్తారా? అని ఒక విలేకరి అత్యుత్సాహంతో అడగగా, “ఇతరులను అవమానపరిచే ప్రవృత్తి నాది కాదు” అని బ్రహ్మానందరెడ్డి సమాధానపరిచారు. శ్రీ సంజీవరెడ్డి పదవిలో ఉన్నా లేకపోయినా అందరూ గౌరవించదగ్గ వ్యక్తి అని అన్నారు.

అయితే మార్చ్ 15, 1967న లోక్ సభ స్పీకర్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ నీలం సంజీవరెడ్డిని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదించగా పార్లమెంటరీ పార్టీ హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చ్ 16, 1967న సహృద్భావ వాతావరణంలో నాల్గొవ లోక్ సభ ప్రారంభమయ్యింది. శ్రీ సేఠ్ గోవిందదాస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ సంజీవరెడ్డితో సహా ఆంధ్ర సభ్యులు పెక్కుమంది తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. లోక్ సభ స్పీకర్ పదవికి ఇండిపెండెంట్ సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాధంను అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. లోక్ సభ స్పీకర్ పదవికి శ్రీ సంజీవరెడ్డి ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ తెన్నేటి విశ్వనాధంపై 71 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. స్పీకర్ గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్ కు సంజీవరెడ్డి గారు రాజీనామా ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇస్తూ శ్రీ సంజీవరెడ్డి సభలో ప్రకటన చేయగానే, వివిధ పార్టీల సభ్యులు హర్షధ్వానాలు చేశారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత “విడివడని బాధ్యత” విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ “వై” సిరిమల్లెలో, తొలి విమర్శ “పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి” ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం “మునసబు నుండి రాష్ట్రపతి దాకా…” ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in March 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *