Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

తోపూరు యుద్ధం

(విజయనగర సామ్రాజ్య అంత్యదశ)

విజయనగర సామ్రాజ్యం అంతరించి పోవడానికి రెండు మహాయుద్ధాలు కారణం. మొదటిది తాళికోట యుద్ధం కాగా రెండవది తోపూరు యుద్ధం. ఏ వ్యక్తి అయితే అష్టకష్టాలు పడి విజయనగర సామ్రాజ్యాన్ని నిలిపాడో అతడే సామ్రాజ్యం అంతరించి పోవడానికి బీజాలు వేశాడు. అతడే వెంకటరాయలు లేదా వేంకటపతి దేవ రాయలు. వెంకటరాయలు చనిపోయేముందు తన అన్న కొడుకైన శ్రీ రంగరాయల్ని చక్రవర్తిగా నియమించాడని ఇంతకు ముందు తెలుసుకున్నాం. చిక్కరాయలు అని పిలవబడే శ్రీరంగ రాయలికి చక్రవర్తి పదవిపై మోజులేదు. తనకు చక్రవర్తి పదవి నిర్వహించే సామర్ధ్యం లేదని అతనికి తెలుసు. అయినా వెంకటరాయలు బలవంతంగా అతనికి రాజముద్రిక నిచ్చాడు. ఈ ఘటనే దక్షిణ భారతదేశ చరిత్రకు కీలక మలుపయ్యింది.

వెంకటరాయలి మరణాంతరం జరిగిన రాజకీయ పరిణామాల గురించి పోర్చుగీసు క్రైస్తవ ఫాదర్ మాన్యువల్ బారడాస్ కొచ్చిన్ నుండి లిస్బన్ కు రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. లిస్బన్ లోని నేషనల్ ఆర్కైవ్స్ లో భద్రపరచబడ్డ ఉత్తరాల గుట్ట నుండి ఆ లేఖ వెలికి తీయబడ్డది. ఆ లేఖ లోని అంశాలను రాబర్ట్ న్యూయల్ క్రీ.శ 1900లో వెలువడ్డ తమ విస్మృత సామ్రాజ్యం పుస్తకంలో వెలువరించారు.

వెంకటరాయలు వెల్లూరు కోటలో చనిపోయాడు. అతనికి ఆరుగురు భార్యలు. వారిలో ముగ్గురు వెంకటరాయలితో పాటు సతీసహగమనం చేశారు. వెంకటరాయలి అంత్యక్రియలు వెల్లూరు కోటలోని అతని తోటలో జరిగాయి. వెంకటరాయలి మిగిలిన ముగ్గురు భార్యల్లో ఒకరైన ఓబాంబ రాజకీయాలు నడపడంలో గడసరి. ఆమె సోదరుడు గొబ్బూరి జగ్గరాయలు. వెంకటరాయలికి మగ సంతానం లేదు. ఓబాంబ తాను గర్భవతి అయ్యానని వెంకటరాయలికి అబద్ధం చెప్పి ఓ బ్రాహ్మణ స్త్రీ కొడుకుని తమకు పుట్టిన కొడుకుగా రాజును నమ్మించే ప్రయత్నం చేసింది. తొలుత ఓబాంబ మాటలు నమ్మిన వెంకటరాయలు తరువాత అసలు విషయం తెలుసుకున్నాడు. అందువల్లే ఓబాంబ తమ కొడుకుగా చెప్పిన వ్యక్తిని కాకుండా తన అన్న కొడుకైన శ్రీరంగరాయలిని చక్రవర్తిగా ఎన్నుకున్నాడు.

అసమర్థుడైన శ్రీరంగరాయలు ఎప్పటినుండో రాజ్యానికి నమ్మకంగా సేవచేస్తున్న కొంతమంది నాయకులను దుర్గం నుండి వెళ్ళగొట్టాడు. తన ఆశ్రితులు కొంతమందికి ముఖ్యమైన పదవులనిచ్చాడు. దీంతో వ్యతిరేకత ప్రబలింది.

బరడాస్ కథనం :-

ఆరు లక్షల క్రూజడోల ఆదాయంతో, ఇరవై వేల మందిని యుద్ధానికి పంపగల జగ్గరాయలు, నాలుగు లక్షల క్రూజడోల ఆదాయంతో, పన్నెండు వేల మందిని యుద్ధానికి పంపగల తిమ్మనాయకుడు, రెండు లక్షల ఆదాయంతో, ఆరు వేల మందిని యుద్ధానికి పంపగల మాచ రాయలు చక్రవర్తికి విధేయత చూపకుండా వెంకటరాయలి గోళక సంతానమైన జగ్గరాయలి మేనల్లుడికి మద్దతిచ్చారు. వీరంతా వెంకటరాయలి కొడుకుగా పేరుపొందిన వ్యక్తిని చక్రవర్తిగా నిలబెడతామని శపథం చేశారు. వీరికి మరో ముగ్గురు జతకలిశారు. శ్రీరంగరాయలి ఆదేశాల వలన కలత జెందినవారు వీరు. వీరిలో మొదటివాడు దళవాయి అంటే సైన్యాధికారి. ఐదు వేల క్రూజడోల కప్పం చెల్లించేవాడు. తన కొడుకులకు ఇవ్వాలని చక్రవర్తి అతడిని మూడు దుర్గాలు అప్పగించమన్నాడు. దాంతో అతడు చక్రవర్తి పట్ల కినుక వహించాడు. అలానే మంత్రిని కూడా శ్రీ రంగరాయలు తనకు వ్యతిరేకం చేసుకున్నాడు. తన పిన తండ్రి నుండి అతడు లక్ష క్రూజడోలు కాజేశాడని అది తనకు చెల్లించాలని బలవంతబెట్టాడు. మూడో వ్యక్తి పేరు నర్సారాయలు. తనకు అక్క అయిన పాతరాజు భార్య నర్సారాయలికి ఇచ్చిన నగలను తిరిగిమ్మని చక్రవర్తి అడిగాడు. వీరంతా చక్రవర్తిని దించడానికి జగ్గరాయలితో రహస్య మంతనాలు జరిపారు. శ్రీ రంగరాయలిని చక్రవర్తి పదవి నుండి దింపడానికి పథకరచన జేశారు. జగ్గరాయలు, తిమ్మనాయకుడు, మాచరాయలు వెల్లూరు కోటలో ఉన్న చక్రవర్తికి గౌరవాభినందనలు తెలపడానికి అనుమతి కోరారు. రాజు వారిని తమ సముఖానికి అనుమతించారు.

జగ్గరాయలు పది వేల మందిని ఎంపిక చేసుకుని, మిగతావారిని నగరం బయట విడిచి, తన అనుచరులతో దుర్గంలోకి వచ్చాడు. మిగతా ఇద్దరూ తమతోపాటు ఎంపిక చేసిన రెండు వేలమంది మనుషులను తీసుకువచ్చారు. జగ్గరాయలు కోట యొక్క మొదటి ద్వారం వద్ద వెయ్యి మంది మనుషులను, రెండవ ద్వారం వద్ద మరో వెయ్యి మంది మనుషులను వదిలి మిగతావారితో కోట లోనికి ప్రవేశించాడు. దళవాయి దుర్గపు మరో రెండు ద్వారాలను వశపరచుకున్నాడు. అపుడు కొంత గోల జరిగింది. రాజ ద్రోహపు కేకలు వినిపించడంతో రాజు రాజభవనపు ద్వారాలను మూసివేయాల్సిందిగా ఆదేశించాడు. కానీ కుట్రదారులు అంతలోనే రాజభవనపు విరగగొట్టడం మొదలుపెట్టారు. మాచరాయలు ఆ పనిలో విజయం సాధించి, రాజు కనుక లొంగిపోతే అతనికెలాంటి హాని జరగదని తాను మాట ఇస్తున్నట్లు, జగ్గ రాయలి మేనల్లుడు, చనిపోయిన రాజు కొడుకు కనుక అతను రాజవుతాడని రాజుకు వర్తమానం పంపాడు. అనుచర వర్గం లేని శ్రీరంగరాయలు మరో మార్గం లేక లొంగిపోయాడు. సైనికుల మధ్య నుంచి వచ్చిన శ్రీరంగరాయలికి ఎవరూ నమస్కరించ లేదు. రాజును బందీ చేసి జగ్గరాయలు తన మేనల్లుడికి పట్టాభిషేకం చేశాడు. అతడు రాజభవనంలోకి ప్రవేశించి అక్కడున్న సంపదను వశం చేసుకున్నాడు.

శ్రీ రంగరాయలికి ఏ నాయకుడూ అండగా నిలబడలేదు ఒక్క వెలుగోటి యాచమనాయుడు తప్ప. తన మేనల్లుడి పట్ల విశ్వాసం వ్యక్తపరచవలసిందని, లేకపోయినట్లయితే నీ అంతు చూడడం జరుగుతుందని జగ్గరాయలు యాచమనాయుడికి వర్తమానం పంపాడు. అతను ఎవరో, ఎవరి కొడుకో, అతని కులమేమిటో కూడా తెలియని ఓ కుర్రకుంకకు గౌరవాభిమానాలు వ్యక్తపరిచే మనిషి తాను కాదని యాచమనాయుడు సమాధానం ఇచ్చాడు. ఇంక తన అంతుచూసే విషయానికి తాను తనకున్న బలగంతో నిరీక్షిస్తూ ఉంటానని తెలిపాడు. తరువాత జగ్గరాయలు యాచమనాయుడికి ప్రలోభాలు చూపెట్టాడు. తమకు మద్దతిస్తే ఎంతో  డబ్బు ముడుతుందని, పెద్ద గౌరవాలు లభిస్తాయని ఆశ చూపాడు. కానీ యాచమనాయుడు లొంగిపోలేదు. మహావీరులందరూ నీ పక్షాన ఉన్నారు కాబట్టి చేతనైతే వచ్చి నాతో యుద్ధం చెయ్యి, నన్ను అడ్డు తొలగించుకుంటే నీ మేనల్లుడు వ్యతిరేకత ఏమీ లేకుండా రాజవుతాడు అని యాచమనాయుడు జగ్గరాయలికి సమాధానం చెప్పాడు.

యాచమనాయుడిని తన వైపుకు తిప్పుకోవడంలో విఫలమైనప్పటికీ జగ్గరాయలు మిగతా సర్దార్లను కానుకలిచ్చి, వాగ్దానాలిచ్చి తన వైపుకు తిప్పుకోసాగాడు. అలా జగ్గరాయలు తన వ్యవహారాల్లో మునిగితేలుతూ ఉంటే యాచమనాయుడు బాధిత రాజుతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నాలు సాగించాడు. అది సాధ్యం కాకపోయేసరికి రాజు కొడుకులలో ఒకరిని తన దగ్గరకు తెచ్చుకునే సాధనానికై వెతికాడు. కారాగృహంలోని రాజు బట్టలను ఉతికే చాకలిని తన వైపుకు తిప్పుకున్నాడు. రాజు కొడుకులలో ఒకరిని తన దగ్గరకు తీసుకు రావలసిందిగా కోరాడు. అనుకున్న రోజున అలవాటు ప్రకారం ఉతికిన బట్టలను చాకలి రాజు వద్దకు తీసుకు వెళ్ళాడు. వాటితో పాటు యాచమనాయుడు రాజుకు తాటియాకు మీద రాసిన ఉత్తరం కూడా తీసుకు వెళ్ళాడు. ఆ ఉత్తరంలో నాయకుడు రాజు కొడుకులతో ఏ ఒకరినైనా పంపవలసిందిగా అర్థిస్తూ, చాకలి పిల్లవాడు బందీ గృహం నుండి తప్పించుకోవడంలో సాయపడతాడని చెప్పాడు. పద్దెనిమిదేళ్ల పెద్ద కొడుకుని చాకలి తీసుకువెళ్లలేనడంతో రాజు తన రెండవ కొడుకుని తనతో పంపాడు. ఆ పిల్లవాడిని చాకలి మురికి గుడ్డల మధ్య దాచి, భయపడవలసిన పని లేదని, ఏ బాధ కలిగిన అరవవద్దని చెప్పాడు. కాపలావాళ్ళని మభ్యపెట్టడానికి, పైన మరిన్ని మురికి గుడ్డలను - జనం కంపు భరించలేక తొలగిపోయేటటువంటి బట్టలను వేసుకుని "తాళు! తాళు!" అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అందరూ అతనికి తోవనిచ్చారు. దుర్గం దాటి అతను తన ఇంటికి వెళ్ళాడు. మూడు రోజులపాటు రాజకుమారుడిని తన ఇంటిలో దాచి ఉంచాడు. తరువాత నగరానికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న యాచమనాయుడి శిబిరం వద్దకు తీసుకెళ్లి వారికి అప్పగించాడు. యాచమనాయుడు, అతని అనుచరవర్గము ఎంతో సంతోషంతో పిల్లవాడిని ఆహ్వానించారు.

ఈ వార్త బయటకి పొక్కి జగ్గరాయలి చెవికి చేరింది. అతను కారాగృహాన్ని వెతికించాడు. వార్త నిజమని తెలుసుకున్నాడు. దాంతో అతనికెంతో మనస్థాపం కలిగింది. బందీలపై నిఘా పెంచాడు. ద్వారాలను మూసివేయించాడు. అన్నం, చెడిపోయిన కూరలు తప్ప రాజుకు తినడానికేమీ పంపకూడదని ఆదేశించాడు.

యాచమనాయుడి వద్ద రాకుమారుడు ఉన్నాడన్న సంగతి తెలియగానే నలుగురు నాయకులు ఎనిమిది వేల మంది బలగంతో జగ్గరాయలి వైపు నుండి యాచమానాయుడి పక్షంలో చేరిపోయారు. ఇప్పుడు తన దగ్గర పదహారు వేల మంది బలగం ఉండడంతో రాజును రక్షించగలనన్న నమ్మకం కలిగింది యాచమనాయుడికి.

దాంతో రాజును తప్పించే మార్గం కోసం వెతకసాగాడు. తన సైనికులలో నుండి ఇరవై మందిని ఎంపిక చేసుకున్నాడు. కారాగార వాసంలో ఉన్న రాజును చేరేట్లు సొరంగ మార్గం తవ్వి తద్వారా రాజును తప్పించేట్లు పన్నాగం పన్నారు. వీరందరూ కోటకు వెళ్ళి జీతాలకు సైన్యంలో చేరారు. కొంతకాలమయ్యాక కారాగార వాసం లోని రాజును చేరుకునేలా సొరంగమార్గం తవ్వసాగారు. సొరంగమార్గం ద్వారా తన గదిలోకి ప్రవేశించిన సైనికులను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సైనికులు రాజుకు సాగిలపడి మ్రొక్కి రాజుకు యాచమనాయుడు పంపిన తాటియాకు ఉత్తరం అందించారు. అందులో రాజు ఆ సైనికులను నమ్మవచ్చని, వాళ్ళు తనను కోట బయటకు తీసుకువెళ్తారని రాశాడు. రాజు అంగీకరించి తాను వేసుకున్న బట్టలను విడిచి ఒక ఉత్తరీయం కప్పుకున్నాడు. తన భార్య, కొడుకు, కూతుళ్ళకు వీడ్కోలు పలుకుతూ, భయపడవద్దని, తాను బయట పడగానే వారినందరినీ కాపాడుతానని చెప్పాడు. అయితే ఇదే సమయంలో రాజ భవనాన్ని కాగడాలతో కాపలాకాసే ఓ కాపలాదారు ఓ గోతిలో పడ్డాడు. అతని అరుపులతో మిగతావారు కూడా అక్కడకు పరుగెత్తుకు వచ్చారు. వారికి ఆ గోతిలో సొరంగ మార్గం కనిపించింది. వారు దానిలో ప్రవేశించి రాజభవనంలోకి వెళ్లారు. పారిపోయేందుకు ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించిన రాజు వారికి దొరికిపోయాడు. జరిగిన విషయం జగ్గరాయలికి విన్నవించడంతో రాజును మరో ప్రదేశంలో బంధించి కాపలావారిని అధికం చేశాడు.

ఈ వ్యూహం సఫలం కాకపోవడంతో యాచమనాయుడు కోటలోని ఐదు వందలమంది సైనికుల అధికారి అయిన ఓ సైన్యాధికారి అవకాశం దొరకగానే రాజును కాపాడమని లంచమిచ్చి తనవైపుకు తిప్పుకున్నాడు. (అతని పేరు "ఇతియోబ్లేజా" అని బారడాస్ రాశాడు.అది ఓబలేశ్వరుడు అయ్యి ఉండొచ్చునని చరిత్రకారుల అభిప్రాయం) ఒకనాడు తనకు లొంగిపోతానన్న ఓ నాయకుడి దగ్గరకు బయలుదేరాడు జగ్గరాయలు. ఈ అవకాశాన్ని చూసుకుని కాపలావారిని మట్టుబెట్టాడు సైనికాధికారి. మూడు ద్వారాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని వెంటనే వచ్చి దుర్గాన్ని ఆక్రమించవలసిందిగా యాచమనాయకుడికి కబురుపెట్టాడు. అయితే, జగ్గరాయలు మరింత వేగంగా తన మొత్తం బలగంతో వెనుకవైపు ద్వారం గుండా తిరిగివచ్చాడు. అసలు అలాంటి ద్వారం ఉందని సైనికాధికారికి తెలియదు. జగ్గరాయలు సైనికాధికారిని, అతని ఐదు వందల మంది అనుచరులను మట్టుబెట్టాడు.

ఈ ప్రయత్నంతో ఆగ్రహించిన జగ్గరాయలు రాచకుటుంబాన్ని చంపి వేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే తన మేనల్లుడి స్థాయి భద్రంగా ఉంటుందని భావించాడు. ఆ పనిని తన సోదరుడైన చినోబరాయలికి అప్పగించాడు. చినోబరాయలు రాజు తనంతట తాను ప్రాణాలు తీసుకోవాలని లేదంటే తానే పిడిబాకుతో ప్రాణాలు తీస్తానని కబురు పంపాడు. జరిగిన తిరుగుబాటుతో తనకేమీ సంబంధం లేదని రాజు చెప్పినా చినోబరాయలు వినలేదు. తనంతట తానే చావడమో లేక ఇతరులచేత చంపబడటమో తేల్చుకోవాల్సిన స్థితి వచ్చింది రాజుకు. రాజు ముందుగా తన భార్య శిరస్సు ఖండించి, తన పెద్ద కూతురిని చంపాడు. తన కొడుకుని పిలిచి అతని భార్యను చంప వలసిందిగా ఆదేశించాడు. అతను తండ్రి ఆదేశాన్ని పాటించాడు. తన చిన్న కూతురిని చంపడానికి రాజుకు చేతులు రాలేదు. ఆమెను వదిలేసి రాజు వెడల్పాటి కత్తి పై పడి ప్రాణాలు వదిలాడు. అతని కొడుకూ తండ్రిని అనుసరించాడు. రాచ రక్తం కల వాళ్లెవరు బ్రతికి ఉన్నా ప్రమాదమేనని చినోబరాయలు ఆమెను చంపివేశాడు. ఈ భయంకర భీభత్స కృత్యం గురించి విన్న నాయకులు కొందరు ఆగ్రహొద్రగ్దులయ్యారు. తీవ్ర ఆగ్రహంతో యాచమనాయుడి వర్గంతో చేరిపోయారు. రాచ కుటుంబంలో మిగిలిన ఏకైక వారసుడిని కాపాడడానికి కంకణబద్ధులయ్యారు.

Southern-Political-Map-1616
(క్రీ.శ 1616 నాటికి దక్షిణాపథ రాజకీయ చిత్రపటం)

బారడాస్ కథనం ఇక్కడితో ముగించి కడప రఘోత్తమరావుగారు తోపూరు యుద్ధం గురించి ఇచ్చిన వ్యాఖ్యానం చూద్దాం:-

చాకలి ద్వారా తప్పించుకున్న శ్రీ రంగరాయలి రెండవ కొడుకే రామదేవరాయలు. తనకున్న మద్దతు తగ్గిపోతుండటంతో జగ్గరాయలు తన మేనల్లుడిని తీసుకుని వెల్లూరు కోట నుండి పారిపోయాడు. యాచమనాయుడు రామదేవరాయలిని చక్రవర్తిగా ప్రకటించాడు. తంజావూరు రఘునాథ నాయకుడు యాచమనాయుడికి మద్దతు ప్రకటించాడు. జగ్గరాయలు మదురై వీరప్ప, జింజి కృష్ణప్పల మద్దతు కూడగట్టాడు. రఘునాథనాయకుడు శ్రీ రంగరాయలికి బాల్య స్నేహితుడు. బాల్య స్నేహితుడిని చంపిన జగ్గరాయలు తన శత్రువైన మదురై వీరప్పతో చేతులు కలపడంతో రఘునాథనాయకుడు రగిలిపోయాడు. జగ్గరాయలు సన్నాహాల గురించి తెలుసుకున్న యాచమ నాయుడు ఎనిమిది వేల మంది సైన్యంతో తంజావూరు బయలుదేరాడు. రామదేవరాయలిని కావేరి తీరంలోని కుంభకోణంలో దాచి ఉంచాడు యాచమ. అక్కడే అతనికి పట్టాభిషేకం చేయాలని తలపోశాడు. శ్రీ రంగరాయలు చక్రవర్తి అయ్యే నాటికి పాలెగాండ్లు, అమరనాయకులు కాకుండా మైసూరు, మదురై, జింజీ, తంజావూరు, కెళది సంస్థానాలు సామంతులుగా ఉండేవారు. వేంకటపతిదేవరాయలి చివరి రోజుల్లోనే మౌనంగా స్వతంత్రించి మైసూరు వడయర్లు ఈ వారసత్వ పోరులో తటస్థంగా ఉండిపోయారు. కెళది నాయకులు ఈ వారసత్వ పోరులో పాలుపంచుకోలేదు. అయినప్పటికీ వీరు చిట్ట చివరి విజయనగర చక్రవర్తి మూడవ శ్రీ రంగరాయలికి కూడా విధేయులుగానే ఉన్నారు.

రామదేవరాయలు కుంభకోణంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న జగ్గరాయలు తన సైన్యంతో బయలుదేరి శ్రీరంగం వద్ద విడిది చేశాడు. తంజావూరు సైన్యాలు బయలుదేరాయని తెలియగానే మదురై నాయకుడు కావేరి నదిపై ఉన్న ఆనకట్టలను బద్దలు కొట్టించాడు. రఘునాథనాయకుడు మధురై వైపుకు కాకుండా తిరుచురాపల్లి వైపుకు కదిలాడు. అక్కడ నుండి శ్రీరంగం వెళ్ళి జగ్గరాయలిని ముట్టడించాలనేది అతని ఆలోచన. జగ్గరాయలు ఇది తెలుసుకుని తోపూరుకు చేరుకున్నాడు. రఘునాథుడు పడమానేరిని తన విడిదిగా చేసుకున్నాడు. మధురై సైన్యం కూడా తోపూరుకు చేరుకుంది. యుద్ధం తొలుత మధురై నాయకుడికి, రఘునాథనాయకుడికి జరిగింది. రఘునాథనాయకుడు అర్ధచంద్రాకార వ్యూహం పన్నాడు. తంజావూరు సైన్యం దాటికి మధురై సైన్యం కకలవికలయ్యింది. తంజావూరు సైన్యం పూర్ణ చంద్రాకారంలోకి మారింది. మధురై సైన్యం వెనకడుగు వేయగానే జగ్గరాయలి సైన్యం ముందుకు వచ్చింది. వెనుకనే జింజీ సైన్యం ఉంది. యాచమనాయుడి సైన్యం జగ్గరాయలి సైన్యాన్ని ఎదుర్కొంది. జగ్గరాయలిని చూడగానే రఘునాథ నాయకుడి గుండె మండింది. తన బాల్య స్నేహితుడిని, అతడి కుటుంబాన్ని చంపిన వాడి తల నరికిగానీ తాను తంజావూరు తిరిగి వెళ్లనని శపథం చేశాడు. యాచమ నాయుడి సైన్యం తత్తర పడుతున్నపుడు తంజావూరు సైన్యం ముందుకు దూకింది. తంజావూరు సైన్యం ముందు జగ్గరాయలి సైన్యం నిలువలేకపోయింది. తంజావూరు సైన్యాధికారి ఒకరికి జగ్గరాయలు కంటబడ్డాడు. బల్లెం తీసుకుని జగ్గరాయలిపై విసిరి అతడిని చంపాడు. తన ప్రభువు ప్రతిజ్ఞ నెరవేర్చాడు. వెనుకనుండి అంతా గమనిస్తున్న జింజీ కృష్ణప్ప బ్రతుకుజీవుడా అంటూ పారిపోయాడు. ఈ లోపున మధురై నాయకుడు యుద్ధభూమికి మళ్ళీ వచ్చాడు. కానీ నిలువలేక పలాయనం చిత్తగించాడు. తంజావూరు సైన్యం వెంటబడి మధురై నాయకుడిని పట్టుకుంది. తన ముందు తల వంచుకుని నిలబడ్డ సాటి నాయక రాజుని క్షమించి వదిలేశాడు రఘునాథనాయకుడు.

ఈ విధంగా తోపూరు యుద్ధం విజయనగర సామ్రాజ్యరక్షకులకు విజయం చేకూర్చినా సామ్రాజ్య పతనాన్ని వేగవంతం చేసింది.

బాలాంత్రపు వెంకటరాయకవి రామదేవరాయలిని కాపాడే వృత్తాంతాన్ని వేంకటగిరి రాజావారి వంశావళి నుండి గైకొని నాటకం రూపంలో రాశారు. ఈ నాటకం పేరు శ్రీ యాచసూరేంద్ర విజయము లేదా శ్రీరంగరాయ పట్టాభిషేకము. రామదేవరాయలిని గ్రంథకర్త శ్రీరంగరాయలు అని పొరపాటు పడినట్లు ఉన్నారు. ఈ గ్రంథము 1909 ఆగస్టు 14వ తేదీన మొదలుపెట్టబడి 1909 అక్టోబర్ 11న పూర్తిచేయబడ్డది. అప్పటి వేంకటగిరి రాజా శ్రీ రాజగోపాలకృష్ణ యాచేంద్ర ధన సహాయంతో ఈ నాటకం ముద్రింపబడ్డది.

***ఓం తత్ సత్***

Posted in March 2026, సాహిత్యం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *