విధి -- లలితా భాస్కర దేవ్
శూన్యపు ఆకాశం అంచును చూస్తున్నా
నిశ్శబ్ద నిరవధిలో వున్న
అంతరిక్షం యానం చేస్తున్నా
ముందో వెనకో జతగా జలతారుగా మెరిసేది తలరాతో విధిరాతో..
కనిపించని నిధో, పెన్నిధో
దేవుని సన్నిధో
చేయాల్సిన విధో
విరించి చేతిరాతో
పుణ్యఫలమో,కర్మఫలమో
ఆజన్మ సేతుబంధమో
తోడు నీడగా మాటున నడిచేది
దృష్టాంతాలకు అందనిది
జ్యోతిషానికి అంతుపట్టనిది
మమతో మాయో
మరులు గొలుపు పరువుల
నడమ బిగువుల
బ్రతుకు చక్రంలో ఇరుసై నడిపేను
ప్రారబ్ధపు తిరగలికి మంచి చెయ్యివేసి తిప్పేవో
విసిరే ధాన్యం అంతా మెరిసే రవ్వే,
సంచితాన్ని రగిలించే తారాజువ్వే
బతుకు జీవుడా ! -- పి.లక్ష్మణ్ రావ్
వర్షం హర్షమే కానీ
బీభత్స రూపం
దాల్చినప్పుడల్లా
మిగిల్చిన నష్టాలే ఎక్కువ!
చేతికొచ్చే పంటను
నిండా ముంచేసినప్పుడు
రైతన్న కన్నీరు
అశ్రుజలపాతమౌతుంది!
వర్షానికి తోడైన హోరుగాలి
అరటి, మామిడి
జీడి, బొప్పాయి వంటి
పంటల నడ్డి విరిచినప్పుడు
నిస్సహాయ స్థితిలో
రైతన్న హృదయ ఘోష
అరణ్య రోదనవుతుంది !
నీటి కోతకు గురైన
మట్టి గోడలు
గుడిసె బతుకుల్ని
కుప్ప కూలుస్తాయి !
రోజువారీ బతుకీడుస్తున్న
రోడ్డు ప్రక్క చిరు వ్యాపారులు
దుకాణాలు తెరవలేక
ఖాళీ గల్లా పెట్టె వెక్కిరిస్తూ
దుఃఖాన్ని మిగులుస్తుంది!
ఒక్క పూట గడవడానికి
రోజంతా కష్టపడే
దినసరి కూలీలు
పనులు దొరక్క
ఆరుబయట చూరు క్రింద
ఆకలితో ముడుచుకుపోతారు!
ఏదేమైనప్పటికీ
బీభత్స వర్షాలతో
పేదల బతుకులు
చిందరవందరే !
అతివృష్టి నష్టదాయకమే !
కనీసం.. -- డి.నాగజ్యోతిశేఖర్
నవ్వే నదుల్ని నర్మదల్ని చేయడం
నరమేధం చేయడం ఆపమని
ఫత్వా జారీ చేయి
ఎగిరే పావురాళ్ల గుండెల్ని గురి చూసి కొట్టే
ఉండేళ్లను అవతల పడేయమని
నెత్తుటి బొట్లని లెక్కించడం మానేయమని
లేలేత చెట్లను నరకొద్దని ఆజ్ఞ ఇవ్వు!
ఆరేసింది అమ్మ చీరని...
పడిపోయింది లోకం తెలీని
పాలపీకని చెప్పు!
పీకలు కోయడం
నిషేదించబడింది అని శాసనం చెయ్యి!
ఒంటరిగా వెళ్లే రాదారిని అడ్డగించొద్దని
చీకట్లో
చిక్కుకున్న
వెన్నెల జోలికొస్తే
జాలి చూపనని మరణపు జరిమానా విధించు!
వీలుకాకుంటే...
సిగ్గు పడ్డం ఎలానో వారికి నేర్పించు
వాళ్లొచ్చిన జన్మ స్థానం ...
పాలిచ్చిన స్తనం
ఎప్పుడైనా...
ఎక్కడైనా...
అమ్మదే అని చెప్పు!
నాన్నతనాన్ని
నడి వీధిలో స్ఖలించడానికి
కాస్త సిగ్గు పడమని చెప్పు!
కవిత్వం -- డా. రవూఫ్
వాచ్యం నినాదం
హోరెత్తే పదాల వాద్యం
ఔతుందా పద్యం?
అనిబద్ధం కానీ ఛందోబద్ధం అవనీ
హృదయంతో పన్లేని వాక్యాల దొంతర
ఔతుందా పద్యం?
కవిత్వమంటే,
తాలు అక్షరాల వూక దంపుడు
మాటల జాతరేనా?
అంతే కామోసు!
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నా కవిత ప్రచురించినందుకు. ఇతర కవితలూ, శీర్షిక లు ఎప్పటివలెనే పరిమళించాయి. ధన్యవాదాలు–నాగజ్యోతిశేఖర్