ఆ రోజు ఆదివారం, సెలవు రోజు. సాయంకాలం నాలుగయ్యేసరికి భార్యాభర్త లిద్దరూ తయారయ్యి, బైక్ ఎక్కి షికారుకు బయలుదేరారు. రాజీవ్ హుషారుగా బైక్ నడుపుతూంటే అతని నడుము చుట్టూ తన చేతులు చుట్టి, బుజంపై తల వాల్చి కాలేజీ రోజులను గుర్తుచేస్తూ అతని చెవిలో గుసగుసగా ముచ్చట్లు చెపుతోంది వల్లరి. "లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్" కోసం బైక్ హైవే ఎక్కింది. రాజీవ్ స్పీడు పెంచాడు. అలా వాళ్ళు సుమారుగా ఒక గంట సేపు ప్రయాణం చేశారు. ఇక వెనక్కి తిరుగుదామనుకుంటూండగా తనకు కనిపించిన దృశ్యం రాజీవ్ ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది.
ఆ హైవే మీద ఒక బస్సు వాళ్లకు ఎదురుగా వస్తూ దూరంగా కనిపించింది. ఆ బస్సు ఇంజన్లోనుండి పొగలు వస్తున్నాయి. డ్రైవర్ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నదానికి గుర్తుగా బస్సు వంకర టింకరగా నడుస్తోంది. బండి చోదకుడి వశం తప్పిందని అర్థమయ్యింది రాజీవ్ కి. అంతలో బస్సు కొద్దిగా స్లో అయ్యింది. తన పక్కనున్న తలుపు తెరుచుకుని డ్రైవర్ కిందకు దూకి, రోడ్డు పక్కనున్న జొన్నచేలలోకి పారిపోవడం కనిపించింది రాజీవ్ కి. ఆ తరవాత రెండవ పక్కనున్న తలుపు తెరుచుకుని కండక్టరు, సమర్థులైన పాసింజర్లు కూడా క్రిందకు దూకి, దూరంగా పారిపోసాగారు. ఇంకా బస్సులో మిగిలివున్న జనం - కదిలే బస్సులోంచి దూకడానికి తెగించలేని మగవారు, స్త్రీలు, బాలలు, వృద్ధులు మాత్రమే. వాళ్ళు అసహాయంగా చేస్తున్న హాహాకారాలు హృదయ విదారకంగా ఉన్నాయి. స్టీరింగ్ తిప్పే నాధుడు లేకపోయినా బస్సు దానంతట అదిగా సూటిగా ఉన్న రోడ్డుపైన ముందుకి వస్తోంది.
క్రమంగా ఇంజన్లో నుండి పొగలు రావడం ఎక్కువయ్యింది. పొగ బస్సులోకి ప్రవేశించడంతో ఉక్కిరిబిక్కిరౌతూ బస్సులోని జనం చేస్తున్న హాహాకారాలు మిన్ను ముట్టాయి. దూరమునుండి ఇదంతా గమనిస్తున్న రాజీవ్ వెంటనే స్పందించాడు. ఆపదలో ఉన్న ప్రజలను రక్షించడమే తన తత్క్షణ కర్తవ్యమ్ - అనుకున్నాడు.
నిస్సహాయులైన ఆ బస్సులోని జనాలకు సాయపడి, వారిని ఆ ఆపదనుండి రక్షించాలనుకున్న రాజీవ్ వెంటనే బైకుని రోడ్డుపక్కనున్న పల్లంలోకి దింపి, ఆపి; భార్యను దిగమని, అక్కడ దానికి స్టాన్దు వేశాడు. ఆమెను అక్కడే ఉండమని చెప్పి, తాను ముందుకు పరుగెత్తాడు.
అప్పటికి ఆ బస్సు వాళ్లకి మరికొంత దగ్గరగా వచ్చింది. రాజీవ్ ఒక్క పరుగున వెళ్లి, తెరిచివున్న తలుపుగుండా, లాఘవంగా బస్సులోకి దూకి, స్టీరింగుని అందుకున్నాడు. పక్కనున్న పల్లంలోకి పడిపోడానికి సిద్ధంగా ఉన్న ఆ బస్సుని రోడ్డు పైకి మళ్లించాడు. బ్రేకులు వెయ్యబోతే అవి పనిచేయలేదు.
గట్టిగా విజిల్ వేసి, బస్సులోని జనాన్ని ఉద్దేశించి కేకపెట్టాడు రాజీవ్, “బస్సులోని ప్రజలారా! శ్రద్ధగా వినండి, ఈ పొగలు మంటలవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆపై ఆ మంటలు పెట్రోల్ ట్యాంక్ కి చేరడానికి క్షణం పట్టదు. అప్పుడు బస్సు పేలిపోతుంది. దయయుంచి నా మాట విని మీరంతా త్వరపడండి. తొక్కిసలాటవద్దు. బస్సుని “స్లో” చేస్తున్నాను. “క్యూ”కట్టి, ఒకరొకరుగా అందరూ బస్సులోంచి దూకేసి దూరంగా వెళ్లిపోండి. దెబ్బలు తగిలినా ఫరవాలేదు. మానిపోతాయి. ప్రాణాలు నిలబడతే చాలు. హర్రీయప్!” బస్సును స్లో చేసి, వాళ్ళని తొందరపెట్టాడు.
బస్సు ఆగే పరిస్థితిలో లేకపోవడంతో తప్పనిసరియై, రాజీవ్ ఇచ్చిన ప్రోత్సాహంతో బస్సులోని జనం ఒకరొకరుగా క్రిందకు దూకసాగారు. పిల్లల నెత్తుకుని తల్లులు కూడా బస్సునుండి దూకేశారు. దెబ్బలు తగిలినా ఫరవాలేదు, ప్రాణాలు పోవు కదా - అన్న ధైర్యంతో. బస్సు ఖాళీ అయిపోయింది. ఒక్క ముసలమ్మ మాత్రం, మోకాళ్ళ నెప్పులతో ధైర్యంచేసి కిందకు దూకలేకపోవడంతో, బస్సులో మిగిలిపోయింది.
రాజీవ్, రోడ్డువారనున్న ఒక పెద్ద రావిచెట్టు మానువైపుకి బస్సు వెళ్ళేలా స్టీరింగును తిప్పి, వెంటనే స్టీరింగును వదలి వచ్చి, బస్సులో మిగిలిపోయిన ముసలమ్మను బుజానవేసుకుని బస్సునుండి కిందకు దూకి, దూరంగా పరుగెత్తాడు.
బస్సు వెళ్లి చెట్టుమానుకు గుద్దుకుంది. ఇంజన్ లోనుండి పెద్ద పెట్టున మంటలు లేచాయి. మరుక్షణంలో భయంకరమైన శబ్దంతో బస్సు పేలిపోయింది. రావిచెట్టు కొమ్మలు కూడా కొన్ని విరిగి బస్సు శకలాలతోపాటుగా చెదిరిపడ్డాయి. బస్సు ఆనిన ప్రదేశంలో రావిచెట్టు మానుకి నల్లగా మచ్చ పడింది. అంతవరకూ దూరంగా చేష్టలుదక్కి నిలబడి చూస్తూ ఉన్న జనం “అమ్మయ్య” అని తమ తమ తల్లి తండ్రుల కడుపు చలవను గుర్తుచేసుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.
ముసలమ్మను వాళ్ళ వాళ్ళదగ్గరకు చేర్చి, మాటాడకుండా తన బైక్ దగ్గరకు వెళ్ళిపోయాడు రాజీవ్.
దిగ్భ్రాంతితో ఆ "హైడ్రామా"ని చూస్తూ, చేష్టలు దక్కి బైక్ పక్కన నిలబడివున్న వల్లరి తనవైపుగా వస్తున్న భర్తను చూసి తెప్పరిల్లి, ఆనందంగా ఊపిరి పీల్చుకుని, గాఢంగా నిట్టూర్చి మనసును తేలికపరుచుకుంది. బైకుని రోడ్డుమీదకు నడిపిస్తున్న భర్త వెంట నడిచింది ఆమె.
భార్యను ఎక్కించుకుని బైక్ స్టార్టు చెయ్యబోతూండగా, తమను ఆపదనుండి కాపాడిన వానికి కృతజ్ఞతలు చెప్పుకోడానికి జనం పరుగు పరుగున వచ్చారు.
ఆ జనంలో ఒకడు ముందుకువచ్చి బైకుకి ఎదురుగా నిలిచి చేతులుజో డించి నమస్కరిస్తూ, “అబ్బాయిగారూ! తమరు ఎవరో మాకు తెలియదు, కాని సరైన సమయానికి వచ్చి మా ప్రాణాలను కాపాడిన ఆపద్భాందవులు మీరు! మాకు మీరు చేసిన ఈ మేలు మేము ఎన్నటికీ మరచిపోలేము. దిక్కుతోచని దీన స్థితిలోనున్న మమ్మల్ని కాపాడిన “ఆపద్భాంధవుడు” గా మిమ్మల్ని మా జన్మంతా గుర్తుపెట్టుకుంటాము” అన్నాడు అతడు, భావోద్వేగంతో ఎలుగురాసిన కంఠ స్వరంతో.
జనం చుట్టుముట్టడంవల్ల రాజీవ్ కి బైకుకి స్టాండు వెయ్యక తప్పలేదు. వల్లరి బైకు దిగి వచ్చి భర్త పక్కన నిలబడింది. రాజీవ్ జనాన్ని ఉద్దేశించి, "మీ అందరికీ వందనాలు! మీరు నన్నంతగా పొగడవలసిన పనిలేదు. ప్రత్యేకంగా మీకని నేను చేసింది ఏమీ లేదు. నేను నా డ్యూటీ చేశాను, అంతేకదా” అన్నాడు చిరునవ్వుతో.
“ఏం జాబు చేస్తున్నారు మీరు? తమరి పేరేమిటి బాబూ!” అక్కడి జనంలో ఒకతను అడిగాడు.
“నేను రక్షక భటుణ్ణి. దేశ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ప్రాణాలకు తెగించి ముందుండి వారిని ఆ ఆపదనుండి తప్పించవలసిన వాడిని. నన్ను పోలీసు అని కూడా అంటారు” అన్నాడు రాజీవ్; ఆపై అతడు పక్కకు. తిరిగి, వల్లరి చేయి అందుకుని, “ఇదిగో ఈమె నా భార్య, పేరు వల్లరి, నా పేరు రాజీవ్. సెలవుకదాని కాసేపు సరదాగా తిరిగి రావడం కోసం ఇలా వచ్చాము" అన్నాడు.
అతని మాట ఇంకా పూర్తి కాకముందే ఎన్నో గొంతుకలు ఏకగ్రీవంగా కోరస్ లా, “దండాలండి అమ్మాయిగారూ” అంటూ ఆమెను పలుకరించాయి.
వారిలో ఒకామె ముందుకువచ్చి, “అమ్మాయిగారూ! మేము ఇలా బ్రతికి బయటపడ్డామంటే అది నీ పెనిమిటి దయవల్లనే నమ్మా! ఈ రోజు మీరు ఇటు వచ్చి మా ప్రాణాలు నిలబెట్టారు. మీ ఋణం జన్మలో తీర్చుకోలేము” అంటూ చేతులు జోడించి నమస్కరించింది.
చివరగా రాజీవ్ బస్సునుండి బయటకు తెచ్చిన ముసలమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వచ్చింది. ఆమె వల్లరితో, “అమ్మా! నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా! నీ పెనిమిటి ఆ రాములవారంతటి గొప్ప మనసున్న వాడు. ఆయనని ఎంత పొగిడినా అది కొంచెమే ఔతుంది. మా కుటుంబంలో వాళ్ళు నన్ను వదలి, బస్సు దిగి వెళ్లిపోయారు. కానీ ఈ బాబు నన్ను వదలలేదు. నా కింకా ఈ భూమిమీద నూకలు మిగిలి ఉండబట్టి, ఆయనని సమయానికి ఇక్కడకు పంపించాడు ఆ భగవంతుడు. లేకపోతే ఆ బస్సుతో పాటుగా నేనూ పేలిపోవలసిన దాన్నే కదా” అంది చెమర్చిన కళ్ళను కొంగుతో తుడుచుకుంటూ.
అక్కడున్న జనంలోని ఒక భూకామందులా కనిపిస్తున్న బుర్రమీసాల ఆసామీ అందుకున్నాడు, “పనికిరాని పాత బస్సుల్ని, జంకుయార్డుల్లో పడి ఉన్న వాటిని చవగ్గా కొనుగోలు చేసి, రిపేర్ చేయించి, రంగులువేసి ముస్తాబుచేసి, ఆఫీసర్లకు లంచమిచ్చి లైసెన్సు సంపాదించి, మారుమూలనున్న పల్లెటూర్ల రూట్లలో వాటిని నడుపుతూ, కోట్లు గడిస్తున్నారు కొందరు. ఇంజన్లోని పార్టులన్నీ సాధారణంగా అరిగిపోయి ఉంటాయి. టైర్ల పరిస్థితీ అంతంత మాత్రమే. ఆ డొక్కు బస్సులు ఈ పల్లెటూరి గతుకుల రోడ్లపై నడవలేక, చీటికీ మాటికీ చిన్నో, పెద్దో - ఏదో ఒక ట్రబుల్ ఇస్తూనే ఉంటాయి. ఇటువంటి బస్సులు ఫీల్డులోకి రాకుండా కంట్రోల్ చెయ్యడానికి ఉన్న ఆఫీసర్లు డబ్బుమీది ఆశతో వీటికి లైసెన్సులు ఇచ్చి, ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. “ఉన్న కర్మకు ఉపాకర్మ కూడా తోడయ్యింది” - అన్నట్లు, ఈ డొక్కు బస్సులకు ఓవర్లోడింగ్ ముప్పు కూడా తోడు అవుతోంది. రెండు బస్సుల్లో ఎక్కవలసిన జనాన్ని ఒక్క బస్సులోనే కుక్కుతారు” అంటూ ఉక్రోష పడ్డాడు ఆయన.
వెంటనే రాజీవ్ అన్నాడు, “మనచేతుల్లో లేని విషయాలకు మనం ఏమీ చేయలేము. కానీ, మనకు అందుబాటైనది మనం చెయ్యొచ్చుకదా! ఓవర్లోడింగ్ ఔతోందనిపించినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మీరా బస్సు ఎక్కకూడదు" అంటూ చనువుగా సలహా చెప్పాడు.
ఆ ఆసామీ జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. మరో వ్యక్తి జవాబు చెప్పాడు, “ఏమి చెయ్యమంటారు స్వామీ! నాలుగు బస్సులు నడిపినా చాలని రూటులో రెండే రెండు బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఒక బస్సు పట్నానికి వెళ్ళుతూ ఉంటే, మరొకటి పట్నం నుండి వస్తూ ఉంటుంది. ఎవరిమట్టుకు వారు పనితొందరలో ఉండి, బస్సు ఎక్కడానికి వస్తారు. తప్పనిసరి పరిస్థితివల్ల, తప్పని తెలిసికూడా తప్పించుకోలేక తప్పు పనులు చేస్తూంటాము! కొద్దిసేపు ఎలాగో ఓపిక పడితే వేళకి పట్నం చేరుకోవచ్చునని, మనసు సరిపెట్టుకుని బస్సు ఎక్కేస్తాము. అంతకంటే పరిష్కారమార్గం ఇంకేముంది చెప్పండి. ఈ వేళ వద్దు, రేపు వెడదాములే - అనుకున్నా, మళ్ళీ అదే పరిస్థితి, మార్పేమీ ఉండదు కదా!”
ఇక రాజీవ్ కి ఏమి మాట్లాడాలో తెలియలేదు. క్షణం మౌనంగా గడిచింది.
మోతుబరి రైతులా కనిపిస్తున్న ఆసామీ రెండడుగులు ముందుకు వేసి, “అయ్యా! ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఇల్లు, నాలుగడుగులు ముందుకు వేస్తే వస్తుంది. కొద్ధి దూరంలో వచ్చే బస్సుస్టాప్ పక్క వీధే మాది. మీ దంపతులు మా ఆతిధ్యం తీసుకుని వెళ్ళాలి. లేకపోతే నా మనసుకు తృప్తి ఉండదు” అంటూ రాజీవ్ ని బలవంత పెట్టేడు.
“క్షమించాలి!” చేతులు జోడించాడు రాజీవ్ , “ఇంటిదగ్గర మాకొక చిన్న బాబు ఉన్నాడు. వాడిని మా అమ్మా నాన్నల దగ్గర వదలి వచ్చాము. ఈ సరికి వాళ్ళు మా కోసం ఎదురుచూస్తూ ఉండి వుంటారు. మేము వెళ్ళాలి. మీరు మీ తోటి ప్రయాణీకుల్ని ఇళ్లకు చేర్చే పని చూసుకోండి. నేను వెళ్లి, మీకు సహాయం అందేలా చూస్తాను. మమ్మల్ని వెళ్లనివ్వండి” అన్నాడు.
అక్కడున్న అందరిదగ్గరా సెలవు తీసుకుని బైక్ స్టార్టు చేశాడు రాజీవ్. వాళ్ళను సెలవడిగి బైక్ ఎక్కింది వల్లరి. బైక్ తిరిగి హైదరాబాదు వైపుగా సాగిపోయింది.
వెంపటి హేమ గారు చాలా చక్కని కథ రాశారు. మంచి సందేశం, చక్కటి సలహాలు ఉన్న ఈ కథ పల్లెటూరి వారికి చేరడమే కొద్ది సందేహం. అయితే మన దేశంలో దాదాపు 99 శాతం బస్సులను జాతీయం చేయడం జరిగింది. ప్రైవేటు బస్సులు టూరిస్ట్ ముసుగులో నడిపినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలు ప్రైవేటు బస్సులు ఎక్కేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.