ప్రపంచంలో ఉన్న అతి చెడ్డ గుణాలలో అసూయ అనేదాన్ని జయించడం చాలా సులభం అంటారు సాయి బాబా. ఎందుకంటే అవతలి వారికున్న ధనం, పేరూ ప్రతిష్టా వారి కష్టం, కర్మ అనుసరించి వచ్చాయి. వాళ్ళేమీ మన సొమ్ము లాక్కోలేదు కదా. అయినా మొన్న మొన్నటి వరకూ అవతలి వారు ఎవరో మనకి తెలియదు. వాళ్ళు (మనం కూడా) ఎంత కాలం జీవిస్తామో కూడా తెలియదు. మనం పోగానే మనతో కూడా తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఈ మాత్రం దానికే అవతలి వారి సిరి సంపదలు చూసి అసూయ దేనికీ అంటారు. నిజమే కదా? ఈ అసూయ అనేదానివల్ల వచ్చే కష్టాలు వర్ణనాతీతం. మనసులో ఏడుస్తూ పైకి చెప్పుకోలేరు. లోపల ఉంచుకోనూలేరు. అయితే కొంతమందికి ఈ ఏడుపు వినడానికి ఎవరో ఉంటారు కూడా. వాళ్ళతో చెప్పుకుని ఏడవడం ఓ సరదా ఈ అసూయాపరులకి. వీళ్ళలో కొంతమందికి సహాయం చేయడానికి, వెనకనుంచి పన్నాగాలు పన్ని అవతలవాళ్ళని నాశనం చేయడానికి హితులో స్నేహితులో ఉంటారు. వీళ్ళవల్ల వీరితో పాటు, వీళ్ళ బంధుకోటీ అంతా అనుభవించవల్సిందే. ఇదే దుర్యోధనుడి కధ మొత్తం - జీవితాంతం పాండవులని చూసి ఏడవడం, చివరకి అధోగతి, తనకీ తన తోటివారికీ.
నన్నయ రాసిన ఆంధ్రమహాభారతం సభాపర్వం ద్వితీయాశ్వాసం పద్యంలో ఈ అసూయ గురించే దుర్యోధనుడు తన మామ అయిన శకునితో చెప్పుకుని ఏడుస్తున్నాడు. రాజసూయం అయింది. అక్కడకి వెళ్ళాక అందులో శిశుపాలుణ్ణి కృష్ణుడు చంపాడు. అందరి ముందూ. ఒక్క రాజు కానీ లేచి నుంచుని కృష్ణుణ్ణి ఎదిరించడానికి సాహసం చేయలేకపోయాడు. అటువంటి కృష్ణుడు అండగా ఉండగా ఈ పాండవులు రోజు రోజుకీ తమ పరాక్రమంతో పైపైకి పెరుగుతున్నారు. ఈ రోజు రాజసూయం చేసారు. రేపు మరోటి చేయవచ్చు. శకునితో ఏమంటున్నాడో చూడండి.
చ.
న్నతమగు చున్న పాండునరనాథ తనూజుల లక్ష్మి నా కస
మ్మతమయి సూ వెలింగె విను మాతుల! మానధనాఢ్యుఁ డైన భూ
పతి సహియింపనోపునె సపత్నులవృద్ధియు నాత్మహానియున్.
[నన్నయ, ఆంధ్రమహాభారతం సభాపర్వం ద్వితీయాశ్వాసం 98]
రోజురోజుకీ పెరుగుతున్నారు పరాక్రమంతో, ధనంతో (పరాక్రమార్జితములైన ధనంబులపేర్మి జేసి యున్నతమగుచున్న) పాండవులు. వినవయ్యా మామా ఇది నాకు నచ్చడం లేదు. అసలే నేను గొప్ప మానధనాఢ్యుడిని, అంటే నా మనసు ముట్టుకుంటే గాయపడుతుంది. నా దాయాయుదులు (సపత్నులు) వృద్ది చెందుతూ ఉంటే నాకు ఆత్మ హాని జరుగుతోంది. ఇదీ ఏడుపు. ఎందుకయ్యా ఏడుపు అంటే ఒకటే కారణం. ధర్మరాజు తన కంటే పెద్దవాడు. ఆయన బతికి ఉండగా తనకి ఏనాటికీ రాజ్యం రాదు. భీముడు తనకన్నా బలవంతుడు. కౌరవులని చిన్నప్పట్నుంచీ ఏడిపించడం భీముడికి అలవాటే. అది సరదాకి ఏడిపించడం అయినా ఒకసారి భీముడికి విషం పెట్టి చంపుదామనుకోవడం నుంచి దుర్యోధనుడి బుద్ధి బయటకి తెలుస్తూనే ఉంది. ఇంకపోతే అర్జునుడికి సాటి దుర్యోధనుడి వైపు ఒక్కడు లేదు. కర్ణుడు ఉన్నా కబుర్లకి తప్ప పెద్దగా రాణించింది లేదు. ఈ దారిలో చూస్తే దుర్యోధనుడు పాండవులు ఉన్నంతకాలం చేతకానివాడే. వీళ్ళని ఎలాగో ఒకలాగ వదిలించుకుందాం అంటే కుదరడం లేదు. ఇవి కాక మరో విషయం ఉంది. అది ద్రౌపదికి సంబంధించినది.
దుర్యోధనుడు, కర్ణుడు కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్ళారు కానీ అక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నారు తప్ప పెద్దగా సాధించింది ఏమీ లేదు. కర్ణుడు మత్స్యయంత్రం కొట్టలేకపోయాడు, గురి దగ్గిరలోకి వచ్చినా. ద్రౌపది పాండవులని ఐదుగురినీ పెళ్ళి చేసుకున్నా వాళ్ళు కలతలు రాకుండా ఉన్నారు. అది ఈయన గారి ఏడుపుకి మరో కారణం. ఇది చాలనట్టూ రాజసూయంలో మయసభ చూస్తున్నప్పుడు నీళ్ళు లేనిచోట ఉన్నట్టూ, ఉన్నచోట లేనట్టూ దుర్యోధనుడు భ్రమపడి కిందపడితే అందరూ నవ్వారు. అందులో ద్రౌపది ఎక్కువగా నవ్వింది. ధర్మరాజు వారించాడు అలా నవ్వ కూడదని. కానీ వీళ్ళు నవ్వడం మానినా కృష్ణుడు తన ఉత్తరీయం నోటికి అడ్డుపెట్టుకుని మరీ గట్టిగా నవ్వాడు. అలా నవ్వే కృష్ణుణ్ణి చూసి మిగతా పాండవులు ధర్మరాజు వారిస్తున్నా మరోసారి నవ్వేసరికి దుర్యోధనుడికి తల తీసేసినట్టైంది. అలా చిన్నప్పట్నుంచీ ఉన్న అసూయ పెరుగుతూ వస్తోందే తప్ప ఏనాడూ తగ్గింది లేదు. ఏదో విధంగా వాళ్ళకి ఉన్నవి తాను అపహరిస్తే ఆదో పైశాచిక ఆనందం. దీనికి ముందు ఎవరితోనో చెప్పుకోవాలి తన ఏడుపు. కర్ణుడితో చెప్తే ఏమంటాడో తెలియదు. తమ్ముళ్లతో చెప్తే వాళ్లలో ఎవరైనా అమ్మతోనో నాన్నతోనే చెప్పేస్తే? అందువల్ల తన మామ శకునితో చెప్తున్నాడు ఈ ఏడుపంతా. ఇదంతా ఎందుకయ్యా, ధైర్యంగా ధర్మరాజు దగ్గిరకెళ్ళి స్నేహంగా ఉంటే పోలే? కానీ మన ‘మాన ధనాఢ్యుడికి’ అది చేతకాదు. బుద్దిః కర్మానుసారిణీ అన్నట్టూ, రాబోయే మహా యుద్ధానికి ఎవరో ఒకరు బీజం వెయ్యాలి కదా? అలా ఈయన అసూయ యుద్ధానికి దారి తీసింది.
ఈ యుద్ధంలో ఒక్కడి అసూయ వల్ల మొత్తం పోయినది పద్ధెనిమిది అక్షౌహిణిల సేన, గుర్రాలు, ఏనుగులు, అనేకానేక రథాలు, అస్త్రాలు, వగైరా. చివరకి మిగిలినది మాత్రం “అతుల పరాక్రమార్జితములైన ధనంబులపేర్మిజేసిన” వారే. దానిక్కారణం కూడా ధర్మరాజు అవలంబించిన ధర్మమే కానీ మరోటి కాదు. అందుకే కృష్ణుడు కౌరవ సభలో అంటాడు “సారపు ధర్మమున్ విమల సత్యము…” అనేది చెప్తూ. ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటే తనకి పట్టనట్టూ చూస్తూ కూర్చునేవాళ్ళకి హాని జరిగి తీరుతుంది కానీ ధర్మం మంట కలిసిపోదు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కృష్ణుడు ఇంత చెప్పినా ఎవరికీ పట్టక చూస్తూ ఊరుకున్నప్పుడు కృష్ణుడు ముందు వారించినట్టే చివరకి సర్వనాశనం జరుగుతుంది.