18
నేథన్, లహరీల తల్లితండ్రులు పరమేశ్వరి కుటుంబం పట్ల ఎంతో ఆప్యాయతతో మెలిగారు. నిర్మాణంలో ఉన్న వారి ఫిలిం మరియు రికార్డింగ్ స్టూడియోకి తీసుకువెళ్లారు. ఇరవై ఎకరాల స్థలంలో హైదరాబాదు స్టూడియోలని మించిన ఆధునిక ఏర్పాట్లు, మెషినరీతో దేదీప్యమానంగా రూపు దిద్దుకుంటుంది ఆ స్టూడియో. వారికి అభినందనలు తెలిపారు పారూ కుటుంబం.
అత్యంత విజయవంతంగా ముగిసిన మూడువారాల పర్యటన తరువాత వీడ్కోలు విందులో భావోద్వేగానికి గురయిన మ్యూజిక్ గ్రూపుల కార్యకర్తలు ఎందరో.
పారూతోనూ, ఆమె తల్లితండ్రులతోనూ పదినిముషాలు మాట్లాడాలని కోరి తమ టెర్రస్ మీదకి ఆహ్వానించాడు... నేథన్. చెల్లెలు లహరిని కూడా వెంట రమ్మన్నాడు.
అక్కడ సిటౌట్ లో, పెర్త్ లో జరిగిన 'మ్యూజికల్ నైట్' కి ఆత్మీయ అతిధిగా వచ్చిన 'మేరీ మీనన్ ' అనే లండన్ వాస్తవ్యురాలు, ఆమె భర్త విశ్వా మీనన్ కూర్చునున్నారు.
పారూని చూడగానే మేరీ ఆప్యాయంగా ఎదురు వచ్చి పలకిరించింది. విశ్వా మీనన్ చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించాడు.
అందరూ ఆశీనులయ్యాక, "మేము మిమ్మల్ని లండన్ ఆర్ట్స్ కౌన్సిల్' తరఫున సంగీత కార్యక్రమాలు చేసేందుకు ఆహ్వానించాలని అనుకుంటున్నాము. ప్రపంచంలోని వివిధ సాంప్రదాయ సంగీత, నృత్య కళలకి ప్రోత్సాహాలని, కళాకారులకి ప్రదర్శనల అవకాశాలని కల్పించి, గౌరవించడము మా ముఖ్య లక్ష్యం.
మీ ప్రదర్శన మాకు చాలా నచ్చింది. మీ కర్ణాటక కచేరీ, లలిత సంగీతం, పాపులర్ సాంగ్స్... ఒకే కార్యక్రమంలో ఉండేలా కార్యక్రమం కూర్చి నిర్వహిస్తే బాగుంటుందని మా అభిప్రాయం." అని భార్య వంక చూసాడు విశ్వా .
'ఆసియన్ ఆర్ట్స్ సొసైటీ ఆఫ్ లండన్' కి నా భార్య డైరెక్టర్. మీకు తెలుసునా? ఆమె కర్నాటక సంగీతం అభ్యసించింది. కూచిపూడి నృత్యం నేర్చుకుంది. భారతీయ కళలతో పాటుగా భారతీయుడిని కనుక నన్ను కూడా ప్రేమించింది మరి!"అంటూ నవ్వాడు విశ్వా.
"సరే, విశ్వా! నువ్వు కూడా నన్ను ప్రేమించానన్నావుగా!" అంది తానూ నవ్వుతూ మేరీ.
తాము ప్రతి యేడూ విశ్వా వాళ్ళ కుటుంబాన్ని చూసేందుకు ఇక్కడికి వస్తుంటామని, విశ్వా , నేథన్ లు బాల్యమిత్రులని తెలిపింది మేరీ.
"ఇకపోతే పరమేశ్వరీ గారు, నేను 'లండన్ ఆర్ట్స్ కౌన్సిల్' కార్యదర్శుల్లో ఒకడిని. మా సభ్యుల్లో భారతీయులు, కళాప్రియులు వేల సంఖ్యలో ఉన్నారు. మా ప్రతిపాదన పట్ల మీకు ఆసక్తి ఉంటే, మీకు అధికారిక ఆహ్వానం పంపగలము. పది నగరాల పర్యటన ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంటాము. మీకు సంగీత శిక్షణ ఇచ్చే ఆసక్తి ఉంటే 'విజిటింగ్ ప్రొఫెసర్' గా అపాయింట్ చేయగలము కూడా" అంటూ ముగించాడు విశ్వా మీనన్.
రామ్ వెంటనే స్పందిస్తూ, "విశ్వా గారు, మేరీ గారు... మీకు మా పరమేశ్వరి గానం నచ్చి ఇలా ఆహ్వానం పలికినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రతిపాదనని మా అదృష్టంగా భావించి 'లండన్ ఆర్ట్స్ కౌన్సిల్' నుండి ఆహ్వానం కొరకు వేచి ఉంటాము. వెంటనే స్పందించి మీతో చర్చించగలము." అంటూ పారూ వంక చూసాడు రామ్.
"ఔను విశ్వా గారు! మాకు మీ ప్రతిపాదన సమ్మతమే. మీతో పని చేసేందుకు ఎదురు చూస్తుంటాము" అంటూ తన అంగీకారాన్ని తెలిపింది పారూ.
**
లహరి, పారూలని టెర్రస్ మీద ఉండమని సూచించి... మిగతా వారిని కిందకి తీసుకుని వెళ్ళాడు నేథన్ .
"అయితే మీరు రేపు సాయంత్రం ఫ్లైట్ కి వెళ్లిపోతున్నారు. నీ తరువాయి కార్యక్రమం ఏమిటి పారూ! అని అడిగిన లహరికి తన టెలీ-ఫిలిం ప్రాజెక్ట్ గురించి చెబుతుండగా వచ్చి కూర్చున్నాడు నేథన్.
అంతా విని, "అభినందనలు పారూ! థట్స్ గ్రేట్. ఇప్పుడు నా నుండి ఓ ముఖ్యమైన ప్రపోజల్ నీ ముందుంచుతాను. మా తల్లితండ్రుల అంగీకారంతోనే ఇది. నీవంటే నాకు చాలా గౌరవం. నాకు మనస్పూర్తిగా నచ్చిన మొదటి యువతివి కూడా.
నాగురించి చెప్పాలంటే నేను సైకాలజీలో మాస్టర్స్ చేసాను. వయసు ఇరవైయేడు సంవత్సరాలు. మ్యూజిక్ నా ప్రాణం. బాల్యం నుండి తర్ఫీదు పొంది మ్యూజిక్ లోనూ డిగ్రీ పొందాను. నా సొంత స్టూడియో తయారవుతుంది. నీకు ఇష్టమైతే, అభ్యంతరాలు లేకపోతే నీకు కరెక్ట్ అనిపించినప్పుడే నీతో వివాహానికి నేను తయారు. నాకేమీ తొందర లేదు. మా పేరెంట్స్ ద్వారా కాంటాక్ట్ లో ఉండగలం." అంటూ ముగించాడు.
అతని ప్రపోజల్ విన్న పారూ నోటమాట లేక ఉగ్వేదానికి గురయింది. తానూహించని సంఘటనకి కలవర పడింది. అసలెలా స్పందించాలో, ఏమనాలో తోచక తత్తరపడుతున్న పారూ చేతిలోని సెల్ రింగవ్వడంతో, ఉలిక్కిపడింది. మరో మారు కూడా సెల్ రింగయి ఆగిపోయింది.
"అది మీ ఫాదర్ అయిఉండచ్చు. పారూ! నీవు ఊహించని ఈ సంభాషణకి ఆశ్చర్యంలో ఉన్నావు కదూ! పర్వాలేదు. సమయం తీసుకొని ఆలోచించుకో. నీవేమి జవాబిచ్చినా నాకు సమ్మతమే. నీవు ఔనన్నా, కాదన్నా నీ పట్ల నా మనసులో ప్రేమ, ఆరాధన తొలిగిపోయేది మాత్రం కాదు. సమయం తీసుకునే మళ్ళీ మాట్లాడుదాము. ఇక పదండి." అంటూ అక్కడి నుండి కదిలాడు నేథన్ .
**
కిరణ్ బావని ఒప్పించండి...
పొద్దుటే, పేపర్ చదువుతూ, కాఫీ సేవిస్తున్న తల్లితండ్రుల వద్దకు తెచ్చుకుని పక్కనే కూర్చుంది మీనాక్షి.
"ఏమిటి డాడీ ఇద్దరూ, కల్చర్ రౌండ్-అప్’ సెక్షన్ లో ఉన్నారు! పారూ ఆస్ట్రేలియా నుండి మొన్ననే కాకినాడ వచ్చేసింది. ఇక ఇప్పట్లో.. కొద్ధి రోజులు వరకు... ఆమె న్యూస్ కనబడక పోవచ్చు. లక్కీ గర్ల్ మొత్తానికి." అన్న మీనాక్షితో...
"చిన్నతనం నుండీ సంగీత సాధనలో ఉంది. పైగా నీవన్నట్టు అదృష్టం కూడా ఉంది. అలా అందరికీ ప్రాప్తించదు." అన్నారు శ్రీనివాస్.
ఛాయ్ సిప్ చేస్తూ, "అమ్మా, నీకు చెప్పలేదు గానీ... నా ఫ్రెండ్ రాధిక పెళ్లి సమయంలో నేను జ్యువెలరీ తీసుకోడానికి బాలాజీకి వెళ్లినప్పుడు పారూ, కిరణ్ షాప్ నుండి బయటికి వెళుతున్నారు. పెళ్లి హదావిడి తో...తో బిజీగా ఉండిపోడంతో అప్పట్లో నీకు చెప్పడం మర్చిపోయాను.
ఇకపోతే, ఇప్పుడు మీకు కొన్ని పెళ్లి కబుర్లు చెబుతాను. పెళ్ళికి మీరు రానందుకు నిరంజన్ అంకుల్ చాలా ఫీలయ్యారు. ఆయన తన కూతురు కోరిన వరుణ్ణి తేవడానికి చాలా కష్టపడ్డారని తెలుసా? పెళ్ళికొడుకు పేరు రాజ్. అతన్ని ఎక్కడో టెన్నిస్ టోర్నమెంట్ లో చూసి... అతను తనకి చాలా నచ్చాడని వాళ్ళ డాడీకి చెబితే... ఇక రంగంలోకి దిగారట అంకుల్.
పెళ్ళికి రెడీగా లేనని అతగాడు చెప్పినా రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి ఒప్పించారట. అదీ స్టోరీ." అంటూ ఛాయ్ పూర్తి చేసి వెనక్కి వాలి కూర్చుంది.
"బంగారం... నీక్కూడా అలాటి హీరోని వరుడిగా తెస్తామురా. మన పార్టనర్ విక్రమ్ మదురై కొడుకు 'రిషి' గురించి నీకూ తెలుసును. ఐదేళ్ల పాటు మోడలింగ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఫిలిం డైరెక్టర్ గా కూడా మారాడు. రెండు కన్నడ ఫిలిమ్స్ కి అప్పుడే అవార్డ్స్ అందుకున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్న యువ డైరెక్టర్.
మొన్ననే నేను విక్రమ్ గారితో మాట్లాడితే మన సంబంధానికి సుముఖంగా ఉన్నారు. చెప్పు. నువ్వు 'సరే' అంటే ఆ పని మీదే ఉంటాను. నా బంగారు తల్లిని పెళ్లికూతురుగా చూడ్డానికి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నామురా." అన్నాడా తండ్రి.
"అవునమ్మా మీనా! నీకు గుర్తుందా? రెండేళ్ల క్రితం 'రిషి మదురై’ వంటి వరుడైతే ఏ అమ్మాయైనా పెళ్ళికి ఒప్పుకుంటుంది అని అన్నావుగా!" అని గుర్తు చేసింది విమల.
కాసేపు మౌనం వహించి... తల్లితండ్రుల వైపు చూసింది వారి గారాల పట్టి మీనాక్షి. “అమ్మా, డాడీ! మరెన్ని విధాలుగా చెబితే మీకర్ధమవుతుంది? నాకు కిరణ్ తప్ప మరెవరూ నచ్చరు. మీకు తెలుసును. బావతో పెళ్లి కాకపోతే ... ఇలాగే బతికేస్తానేమో తెలీదు. నన్ను ఇబ్బంది పెట్టి...ఇలా వేరే సంబంధాల గురించి నాకు చెప్పకండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను." అంది మీనాక్షి.
తల్లితండ్రులిరువురూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
"నేను అన్నాళ్ళ క్రితమే ఆ మాట ఎత్తితే.. కిరణ్ ఏమ్మన్నాడో విన్నావు కదా తల్లీ! అతన్ని పెళ్ళికి బలవంతపెట్టలేము కదా మీనా!" అంది విమల వాపోతూ.
"చిన్నప్పటి నుండీ మీ ఇద్దరూ కలిసి పెరిగారు. నీ పట్ల అటువంటి భావన లేదని స్పష్టంగా చెప్పాడమ్మా కిరణ్!" అన్నారు బాధపడుతూ శ్రీనివాస్ గారు.
కోపంగా వారి వంక చూసింది మీనాక్షి.
"చూడమ్మా! చిన్నప్పటి నుండి కిరణ్ ని మేము ఎత్తుకుని పెంచాము. మాకు నీవెంతో కిరణ్ కూడా అంతే. పెళ్లి విషయంలో బలవంత పెడితే లొంగుతాడా? మన కిరణ్ నేటి తరం యువకుడు. నీ జీవితం మాత్రమే కాదు, కిరణ్ జీవితం కూడా బాగోవాలనే మా ఆశ. కనుక నీవు మనసుపెట్టి అలోచించి మొండితనం వీడరా బంగారం!" అన్నాడు తండ్రి వేడుకుంటున్న ధోరణిలో.
మీనాక్షి ముఖం కోపంతో ఎర్రగా మారింది. "డాడీ! నా మనసు మాటేమిటి? నేను నా మనసులోని మాటే చెబుతున్నా. నాకు కిరణంటే మాత్రమే ఇష్టం. నాకు ఏమి తక్కువయిందని నన్ను కాదనడానికి? నాకైతే అర్ధం కాదు. ఈ ఇష్టాయిష్టాలు, భావాలు, ఉద్దేశాలు... నా డిక్షనరీలో లేవు డాడీ! నేను నమ్మను. నేను ఇష్టపడిన వాడితో సంబంధం కుదిర్చే బాధ్యత మీదే. చెప్తున్నాగా... చేతనైతే బావని ఒప్పించండి." అంటూ అక్కడినుండి దిగ్గున లేచి వెళ్ళిపోయింది.
అలివికాని కూతురి మొండితనానికి నివ్వెరపోయారు అమ్మానాన్నలు. విమల కన్నీళ్లు పెట్టుకుని నిస్సహాయంగా భర్త వంక చూసింది. తలపట్టుకుని దుఃఖిస్తూ కనపడ్డ భర్తని చూసి కంగారు పడింది విమల.
**
ఆస్ట్రేలియా పర్యటన ముగిసి రామ్ కుటుంబం ఇల్లు చేరాక, విశ్రాంతిగా ఉంటున్నారు పెద్దవాళ్ళు. పిన్నల రోజూవారీ జీవనం మాత్రం స్కూల్, స్పోర్ట్స్, రాబోయే పరీక్షలకి చదువుకోడాలతో సాగిపోతుంది.
రెండు నెలల సమయం గడిచాక, అమ్మా, అమ్మమ్మని ఓ రోజు పొద్దుటే జాలీ గదిలో కూర్చోబెట్టి, పెర్త్ నుండి బయలుదేరే ముందురోజు తనకీ, నేథన్ కి నడుమ జరిగిన సంభాషణ, అతని పెళ్ళి ప్రతిపాదన గురించి ప్రస్తావించింది పారూ. అమ్మమ్మ, అమ్మా కూడా నిర్ఘాంతపోయారు.
అమ్మమ్మ ఏదో అనే లోగా... "అమ్మమ్మా, నేథన్ నన్ను ఒత్తిడి చేయలేదు... నాకూ ఇష్టమైతేనే, అలోచించే జవాబివ్వమన్నాడు. తొందర కూడా లేదని, నా జవాబు ఏదైనా, నాపట్ల తనకున్న గౌరవాభిమానాలు చెదరవనీ కూడా హుందాగా, సున్నితంగా తెలియజేశాడు. నేథన్ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడు." అంది.
"అది సరేనమ్మా.. అతని ప్రవర్తన నచ్చని వారుంటారని మేమూ అనుకోలేదు. నీ వేమన్నావు? జవాబిచ్చావా?" అనడిగారు అమ్మమ్మ.
"మీతో విషయం చెప్పాక, ఇవాళ జవాబు ఇవ్వబోతున్నాను అమ్మమ్మా. నేను మాత్రం హృదయపూర్వకంగా నా విషయం తెలియబరుస్తాను." అంది పారూ.
**
‘ఆలయనాదాలు’ టెలీఫిల్మ్ పాటల రికార్డింగ్, షూటింగ్ తేదీలు, స్క్రిప్ట్ పంపారు చంద్రలేఖ ప్రొడక్షన్స్ వారు. ఆలయనాదాలు' ఓ కుటుంబ కధనం. కుటుంబం కోసం తన జీవితాన్ని, అక్క కోసం తన ప్రేమని త్యాగం చేసే కళ్యాణి పాత్ర పారూ పోషిస్తుంది. మొత్తం ఐదు పాటలు. షూటింగ్ జనవరి 2వ తేదీన మొదలయ్యి మార్చి ఆఖరి వరకు జరుగుతుందని అంచనా.
ఈ టెలీఫిల్మ్ కి ముఖ్యమైన పెట్టుబడిదారులు 'శ్రీ క్రియేషన్స్' అధినేత శ్రీనివాస్ గారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు రామ్ వాళ్ళు.
**
కంప్యూటర్ ఆన్ చేయగానే, నేథన్ నుండి తిరుగు టపా ఇమెయిల్ చూసి పారూ గుండె దడదడ లాడింది. తాను పంపిన మెసేజీకి జవాబన్నమాట. తెరిచి చూస్తే అనూహ్యంగా చిన్న సందేశమే అనుకుంది.
"డియర్ పరమేశ్వరి, మొత్తానికి ఇన్నాళ్ళకి విషయానికి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. నిన్ను, కిరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మంచి ఛాయిస్. మన స్టూడియో ప్రారంభోత్సవానికి మీ ఇద్దరూ కలిసి రావాలి.
కానీ ఒకటి గుర్తుంచుకో పారూ! ఓ స్నేహితుడిగా, ఓ శ్రేయోభిలాషిగా నాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు. వృత్తిపరమైనా, వ్యక్తిగత విషయాలైనా ఎటువంటి సహకారం అవసరమైనా అడుగు. సరేనా? - శ్రేయోభిలాషి నేథన్.”
నవ్వుకుంది పారూ. 'నిన్నెలా మరువగలను నేథన్! నీదొక గొప్ప వ్యక్తిత్వం. నీ స్నేహం ఒక అదృష్టం.' అనుకుని హాయిగా ఊపిరి తీసుకుంది.
**
తన రాక గురించి ముందుగానే తెలియజేసి కిరణ్ కాకినాడకి వచ్చాడు. ఉన్న రెండు రోజులూ మాలిని, జోసెఫ్ లు కూడా రామ్ ఇంటనే ఎక్కువ సమయం గడిపారు.
"కిరణ్ అందరి మనసులు దోచుకోగలడు. మంచి వాడు, మాటకారి కిరణ్ తో ఉంటే నేను కుర్రాడిలా ఫీల్ అవుతాను." అంటూ జోసెఫ్ హాస్యమాడినప్పుడు...
"జోసెఫ్ అంకుల్, నాకు ఇరవైయేడేళ్లు. టీనేజర్ కాదు." అంటూ నవ్వేసాడు.
"వధువుని చూడమంటావా? అనడిగింది మాలిని.
"చూడండి ఆంటీ! మరో రెండేళ్లు టైం పెట్టుకున్నాను లెండి. ఈ లోగా ఎం.టెక్ పూర్తి చేసి, ఎం.బీ.ఏ చేస్తాను." అన్నాడు పారూ వంక చూస్తూ.
"నీకు శుభాకాంక్షలు కిరణ్!" అంది మాలిని.
"థాంక్యూ ఆంటీ! ఇకపోతే.. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒక ఆహ్వానం, ఒక విన్నపం... అందుకోసమే నేను వచ్చింది కూడా. డిసెంబర్ 31న తాత గారి 75వ పుట్టినరోజుని హైదరాబాదులోని జయ గార్డెన్స్ లో గ్రాండ్ గా జరిపించబోతున్నాము. క్రిస్మస్ సెలవలు కూడా కనుక మీరంతా డిసెంబర్ 25కి విచ్చేసి.. తలా ఒక చేయి వేస్తే... నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించేందుకే నేను ఈ ట్రిప్ వేసుకున్నాను. పారూకి, పునీత్ కి ఈ ఈవెంట్ గురించి ముందే తెలుసును." అన్నాడు కిరణ్.
తప్పక వస్తామని రామ్ కుటుంబం అంటే... చర్చిలో పండుగ అయ్యాక, 26న వస్తామని మాలిని మాటిచ్చింది.
మరికాసేపయ్యాక, భోజనానంతరం.. ఆ రోజు కిరణ్ పుట్టినరోజు కూడా అవడంతో కేక్ కటింగ్, అంతాక్షరి కార్యక్రమంతో సరదాగా గడిచింది. పునీత్, జననీలు కూడా పాల్గొని చక్కగా పాడడం కొసమెరుపు. కిరణ్, పారూలు కలిసి పాత హిందీ పాటలు ఆలపించారు. కిరణ్ రాసిన ఇంగ్లీష్ లిరిక్స్ పాడి కిరణ్ ని ఆశ్చర్య పరిచింది పారూ. "కిరణ్ బావా... నీ పుట్టిన రోజున ఇదే నా బహుమానం" అంది కిరణ్ కి గులాబీల గుచ్ఛం అందిస్తూ.
**
డిసెంబర్ 31న రామనాధం గారి 75వ పుట్టిన రోజు వేడుక శ్రీనాధం, వకుళా ఆధ్వర్యంలో రామనాధం గారింట సందడిగా మొదలైంది. ఆయన సమకాలీనులు, ప్రాణస్నేహితులు కొందరు వేంచేయడం ఆయనకి ఓ మరువలేని విషయమే. అతిధులకు ఆహ్వానాలు, తాతగారి స్నిహితులకి గిఫ్టుల పంపిణీ చేయడం మీనాక్షి చూసుకుంటే, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తలా ఒక బాధ్యత తీసుకుని మూడుగంటల వేడుకని చాలా చక్కగా నిర్వహించారు.
పరమేశ్వరి గానానికి, వేదిక పై కిరణ్ తో స్టెప్స్ వేస్తూ పాడిన హిందీ, తెలుగు పాపులర్ సాంగ్స్ కి అతిధుల స్పందన ఆకాశమంతైతే... షడ్రుచుల విందుకి, సరదాల ఆటలకి ఆనందాలు అంబరాన్నంటాయి.
ఆఖరి అంశంగా తాతగారి చిన్నపాటి ప్రసంగం తరువాత కిరణ్ అతిధులకు ధన్యవాదాలు తెలపడంతో రామనాధం గారి పుట్టినరోజు పండుగ వేడుక విజయవంతంగా ముగిసింది.
**
ఆ మరునాడు చర్చ్ లో జరపవలసిన నూతన సంవత్సర కార్యక్రమాల నిమిత్తం, మాలిని జోసెఫ్ లు తిరిగి కాకినాడకి వెళ్లిపోయారు. రామ్, శాంత, పిల్లలు కూడా వారితో పాటే ప్రయాణమయ్యారు.
మొదలవనున్న టెలీ-ఫిలిం షూటింగ్ నిమిత్తం పరమేశ్వరి, సీతమ్మ గారు విశ్రాంతిగా హైదరాబాదులోనే ఉండిపోయారు.
**
రెండో రోజు మధ్యాహ్నం, కిరణ్ కూడా కాలేజీకి వెళ్ళిపోయాక, రామనాధం గారు కొడుకుని, కోడలిని సమావేశ పరిచారు. "చూడండి... నా స్నేహితులు, సమకాలీనులు ఎందరో పరమపదించారు. కొందరు అనారోగ్యంతో ఉన్నారు. బహుకొద్ది మంది మాత్రమే నా లాగా హుందాగా జీవనం గడుపుతున్నారు. అందుకే నేనింకా ఇలా బాగున్నప్పుడే నా ఒక్కగానొక్క మనవడి వివాహం చూడాలని ఉంది. ఇక జాప్యం వద్దు.
వాడి మనసులో ఏముందో గాని అసలు మీ ఆలోచన ఏమిటి? మన మీనాక్షి విషయం ఏమయినట్టు?" అని నిలదీశారాయన.
మీనాక్షి విషయంగా కిరణ్ అభిప్రాయాన్ని మరోమారు గుర్తు చేసుకుని పెద్దాయన రామనాధం గారితో ప్రస్తావించారు కిరణ్ తల్లితండ్రులు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్