Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

వ్యర్థమైన శాస్త్ర పరిజ్ఞానం

Panchatantram

అనగనగా ఒక చిన్న గ్రామంలో నలుగురు బ్రాహ్మణ యువకులు ఉండేవారు. వారి మధ్య గాఢమైన  స్నేహం ఉండేది. అందులో ముగ్గురు మాత్రం అన్ని శాస్త్రాలూ నేర్చుకుంటే ఒక్కడికి మాత్రం పెద్దగా చదువువేమీ అబ్బలేదు. అయినప్పటికీ ఆ నాలుగోవాడికి చదువుకున్న మిగిలిన ముగ్గురు స్నేహితులకంటే లోకజ్ఞానం ఎక్కువ.

ఒకరోజు నలుగురూ కూడబలుక్కుని రాజధానికి వెళ్ళి మంచి ఉద్యోగాలు వెతుక్కుని బాగా ధనం సంపాదించి సుఖంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా దారిలో ప్రయాణానికి కావలసినవన్నీ వెంటబెట్టుకుని బయలుదేరారు.

అలా కొంతదూరం వెళ్ళాక ఆ నలుగురిలో ఒక చదువుకున్నవాడు తన తోటివారితో ‘మిత్రులారా మన ముగ్గురము విద్యలు బాగా నేర్చినవాళ్ళము. కనుక ఏదైనా పని సులువుగా దొరికించుకుని ధనార్జన చెయ్యగలము. కానీ, చదువురాని మన ఈ మిత్రుడికి మాత్రం అది అంత తేలికైన పని కాదు. అలాగని మనం కష్టపడి సంపాదించుకున్న ధనంలో అతడికి వాటా ఇవ్వడం నాకే మాత్రమూ ఇష్టం లేదు. కనుక అతడిని ఇక్కడినుండే వెనక్కి పంపించివేద్దాము’ అన్నాడు.

తన మిత్రుడి మాటలకి చదువురాని వాడు బాధ పడ్డాడు.

అది గమనించిన మరొక చదువుకున్నవాడు ‘అందుకు నేనెంత మాత్రమూ ఒప్పుకోను. మన నలుగురమూ చిన్నతనం నుంచీ కలిసి పెరిగాము. మన మిత్రుడిని ఇలా అర్థాంతరంగా  వదిలిపెట్టడం భావ్యం కాదు. అతడు మనతోపాటే ఉంటాడు. మనం సంపాదించుకున్న దానిలో అతడికి తప్పనిసరిగా భాగం ఇవ్వాల్సిందే’ అన్నాడు.

అందుకు మిగిలిన ఇద్దరూ కూడ అంగీకారం తెలపడంతో, నలుగురూ కలిసి ఉండడానికే ఒప్పందం చేసుకుని, ఆ చర్చ అక్కడితో ఆపేసి, ప్రయాణం కొనసాగించారు.

నలుగురూ ఒక అడవిగుండా వెళుతుండగా దారిలో ఒక జంతువు మృత కళేబరం కనిపించింది.

దానిని చూడగానే ఆ నలుగురిలో ఒకడు ‘ఇది ఒక సింహం అస్థిపంజరం’ అని ‘మిత్రులారా మన పాండిత్య ప్రతిభను నిరూపించుకునే చక్కటి అవకాశం ఇది. ఈ అస్థిపంజరాన్ని ఎలా కూర్చి జంతు ఆకారంలో అమర్చాలో నాకు తెలుసు’ అన్నాడు.

‘అస్థిపంజరానికి చర్మం, రక్త మాంసాలూ నేను అమర్చగలను’ అన్నాడు మరొకడు.

‘అయితే అప్పుడు నేను దీనికి ప్రాణం పోస్తాను’ అన్నాడు మూడవవాడు.

అంతే వెంటనే మొదటివాడు అస్థిపంజరాన్ని కూర్చగా రెండవవాడు రక్తమాంసాలు, చర్మం అమర్చాడు. ఇక మూడవవాడు దానికి ప్రాణం పోయడమే మిగిలింది.

అప్పుడు నాలుగవవాడు కలుగ చేసుకుని ‘మిత్రులారా ఇది సింహం అని మీరే చెప్పారు. సింహం క్రూర జంతువు. దీనిని బ్రతికిస్తే అది మనందరినీ చంపేస్తుంది’ అన్నాడు హెచ్చరికగా.

‘మిగిలిన మిత్రులిద్దరూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. నా పాండిత్యం వృధా పోవడం నేను సహించను. కనుక ఈ సింహానికి నేను ప్రాణం పోసి నా ప్రతిభను నిరూపించుకుని తీరతాను’ అన్నాడు మూడోవాడు.

చదువురాని నాలుగోవాడు తన మిత్రుడికి శతవిధాలా చెప్పి చూసాడు. అయినా లాభం లేక పోయేటప్పటికి ‘సరే అయితే, అదిగో నేను ఆ కనిపించే మహావృక్షం ఎక్కేదాకా కొంచెం ఆగు’ అని గబ గబా పరుగెత్తి వెళ్ళి బిర బిరా చెట్టు పైకి ఎగబ్రాకి చిటారు కొమ్మపై కూర్చున్నాడు.

తమ స్నేహితుడి భయం చూసి హేళనగా నవ్వారు మిగిలిన ముగ్గురూ!

ముందు చెప్పిన ప్రకారం మూడోవాడు రక్తమాంసాలూ చర్మం అమర్చిన సింహం కళేబరంలోకి, తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రాణాలు ఊదాడు.

ఆ వెనువెంటనే సింహం గర్జిస్తూ లేచి ముగ్గురు స్నేహితులనూ బలి తీసుకుని తన ఆకలిని తీర్చుకుని అడవిలోకి వెళ్ళిపోయింది.

నాలుగోవాడు ‘బ్రతుకుజీవుడా’ అనుకుని నెమ్మదిగా చెట్టుదిగి వచ్చి తన మిత్రుల దుస్థితికి విలపించి తన స్వగ్రామం వైపుగా సాగిపోయాడు.

నీతి: శాస్త్ర పరిజ్ఞానం కన్నా లోకజ్ఞానం మిన్న అనగా....ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారైనా లోకజ్ఞానం లేకపోతే నవ్వులపాలై నష్టపోతారు.

Posted in March 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!