Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం -108 వ సమావేశం
వరూధిని
vikshanam-108

వీక్షణం-108 వ ఆన్ లైన్ సమావేశం ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఆగస్టు 8, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో తెలుగుతల్లి కెనడా మాస పత్రిక ఎడిటర్, రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాయవరపు (ఎన్నెల) గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, సాహితీ క్విజ్ జరిగాయి. ముందుగా లక్ష్మీ రాయవరపు గారు తెలంగాణా మాండలికంలో రాసిన "ఓ పాలబుగ్గలా జీతగాడా" కథని చదివి వినిపించారు.

పసితనం వదలని పాల బుగ్గల వయసులో రాజాలు తండ్రి చనిపోవడం, తల్లి అనారోగ్యం...దాంతో తానే అన్నీ అయ్యి చదువు ఆపి కూలికి వెళ్ళడంతో మొదలవుతుంది కథ. తల్లికి ఆసరా అని చిన్న వయసులోనే వివాహం, వెనువెంటనే సంతానం. స్నేహితులు వెళుతున్నారని, గుడిసె తనఖా పెట్టి విదేశీ యానం. నిండా పదహారేళ్ళు లేవు.. వయసు ఎక్కువ వేయించడం.. కానీ అదేమంత పెద్ద విషయం కాదుగా!!

ఆ దేశంలో కొంత కాలం బానే ఉంది. స్నేహితులు అందరూ కలిసి ఇళ్ళకి వడ్డీలు ఖర్చులకి పంపడమూ, అప్పుడప్పుడు పెద్దమేస్త్రి సహాయంతో ఫోన్ చేసి ఇంటి దగ్గర జాగ్రత్తలు చెప్పడం చేస్తూ, రోజులు నడుస్తున్న తరుణంలో రాజాలు మూడవ అంతస్తు నించి జారి పడడంతో జీవితానికి కోలుకోలేని దెబ్బ. కొద్దికొద్దిగా కోలుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటికి అంతో ఇంతో పంపిస్తూ ఉండగా తల్లి చనిపోయిన వార్త. ఉన్న ఊరిని, కన్న తల్లిని, భార్యా బిడ్డలను వదిలి వెళ్ళినందుకు ప్రయోజనముందా అని దుఃఖం. వెళితే అక్కడ ఏం చెయ్యాలో తెలియని అయోమయం. తీరా తల్లి చావుకి వెళ్ళినా, తిరిగి రావడమవుతుందా అని అనుమానం. అప్పు తీరిందా అని ఆందోళన. తల్లి అంత్యక్రియలకి డబ్బు సర్దుబాటు కాదని భయాల మధ్య... ప్రయాణం ఖర్చు పంపితే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి.. తను వెళ్ళకుండా ఉండడమే సరియైనదనే కఠినమైన నిర్ణయం. పదహారేళ్ళ పిల్లల మీద ఊహించని బాధ్యతల సారాంశమే "ఓ పాలబుగ్గలా జీతగాడా".

తరువాత జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీ శ్రీధర్ రెడ్డి , డా|| కె.గీత, శ్రీమతి ఉదయలక్ష్మి ముప్పలనేని, శ్రీమతి శారదా కాశీవఝల, శ్రీమతి భవాని ముప్పల, శ్రీ ప్రసాదరావు గోగినేని,  శ్రీ సాయి నిజాంపట్నం, శ్రీ రాజశేఖర్, శ్రీ ప్రసాద్ నల్లమోతు మొ.న వారు పాల్గొన్నారు. ఆశువుగా చెప్పినట్లున్న కథా సంవిధానం చాలా చక్కగా కుదిరిందని, కథని స్వగతంగా, మాండలికంలో చెప్పడం కథకి బలాన్నిచ్చిందని అన్నారు. అలాగే కథలో అరుదైన మాండలిక పదాలు ఎన్నో ఉన్నాయని కొనియాడారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీమతి శారదా కాశీవఝల "తిరిగిరావా నేస్తం" కవితని, శ్రీ శ్రీధర్ రెడ్డి "త్రాసు" కవితని , డా|| కె.గీత "అసింట" అన్న కవితని చదివి వినిపించారు. ఆ తర్వాత శ్రీమతి శారదా కాశీవఝల ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ కార్యక్రమం అందరినీ అత్యంత అలరించింది.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు పాల్గొని సభను జయప్రదం చేశారు. వీక్షణం-108 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/TkFKjoWP8T4

Posted in September 2021, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *