Menu Close
Teneloluku Page Title

ఈ సంచిక ‘తేనెలొలుకు’ కొఱకు బెంగళూరు నుండి రాఘవ మాస్టారు స్వదస్తూరి తో వ్రాసి పంపిన మన తెలుగు భాష యొక్క అందాల వర్ణనలు అమ్మ నుడి జిగి (జిగి = వెలుగు, కాంతి)ని యదావిధిగా ముద్రాలేఖనం చేసి మీకందిస్తున్నాను.

మన అమ్మ నుడి (మాతృభాష) అందాల తెలుగు. అనుబంధాల జిలుగు. తేటతేనీయ పలుకుల కులుకులాడు నుడి. అనంత అజంత చిత్రాల భాష. అమర భావాల అమృత ధార. పాలపొంగు నుడుల వలపు. సామెతల విరుపు. నీతి శతకాల మెరుపు. పంచ కావ్యాల ఇంపు సొంపులు. కవన విజయాల కైతల కెంపులు. ఎన్నెన్నో వింత వింత పులకింతల సాహితీ ప్రక్రియలు మన తెలుగు వారికే సొంతం.

ఆ సాహితీ ప్రక్రియలలో ఓ గొప్ప ప్రయోగం మన తెలుగు పద్దెము. పద్దెము తెలుగు వారి ఆస్తి, ఆసక్తి, సూక్తి, ముక్తి, రక్తి, భక్తిదాయకం.

అలాంటి పద్దెము నేడు రచయితల, కవుల నిరాదరణకు లోనయినది. పద్దెము వలన భాషా జ్ఞానం, పఠనా శక్తి, జ్ఞాపక శక్తి  పెరుగుతుంది. భాషపై అభిమానం, భావనా శక్తి పెరుగుతుంది. భాషా సౌందర్యం, కవన వికాసం తెలుస్తుంది.

అయితే గత కవుల పద్యాలలో ఎనభై శాతం సంస్కృత పదాలే ఉన్నాయి. ఒక్క పోతనామాత్యుని రచనలలో మాత్రం ఎనభై శాతం తెలుగు పదాలే ఉన్నాయి.  ఎక్కువ అచ్చ తెలుగు మాటలు వాడిన తొలి కవి శ్రీ పాల్కురికి సోమనాథుడు, ఆ తర్వాత నన్నెచోడుడు. అయితే సంస్కృత పదాలు లేకుండా పద్యం వ్రాయడం కష్టమంటారు చాలామంది. ఎందుకంటే ప్రస్తుతం మనం వ్రాస్తున్న, మాట్లాడుతున్న ప్రతి వంద మాటలలో 50 మాటలు ఆంగ్లం, 30 మాటలు సంస్కృతం, 10 మాటలు ఉర్దూ లేక హిందీ మాటలు. కేవలం పది మాటలు మాత్రమే మన తెలుగు నుడులు ఉంటున్నాయి.

ఉదాహరణకు ఈ దిగువ నుడువు (వాక్యము) చూడండి.

“మమ్మీ, ఈ రోజు మా స్కూలులో క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవం”
అని ఒక పిల్లాడు, వాళ్ళ అమ్మతో అన్నాడనుకుందాం. ఇప్పుడు ఈ వాక్యములోని మాటలను పరిశీలిస్తే –
మమ్మీ, స్కూలు, క్రికెట్ మ్యాచ్  - ఆంగ్ల మాటలు
రోజు – అరబ్బీ పదం
ప్రారంభోత్సవం – సంస్కృత పదం

అంటే అంత పెద్ద నుడువులో మన మాటలు కేవలం ఈ, లో, మా, లు మాత్రమే. ఎంత విచిత్రం. ఎంత దుర్మార్గం. మన మాటలు మనవి కావు. మన సంస్కృతి మనది కాదు. అందరూ ఒకసారి మనసారా ఆలోచించగలరు.

అయితే మనసుపెట్టి ప్రయత్నిస్తే, ప్రతి ఇతర భాషా పదాలకు అచ్చ తెలుగు మాటలు కనుగొనవచ్చు. ఆ పని తమిళులు, కన్నడిగులు, హిబ్రూ, ఫ్రెంచి వారు చేస్తున్నారు. ఆంగ్ల, సంస్కృత పదాలకు సరియగు వారి నుడి మాటలు సృష్టించుకొంటున్నారు. ఆ ప్రయత్నంలో మనం కూడా చేరి పర భాషా పదాలకు సరైన మన తెలుగు పదాలను కనుగొని మన తెలుగును కాపాడుకొనే ప్రయత్నం చేయగలమని తెలుగువాడిగా నా వేడుకోలు.

ఇప్పుడు ఇతర భాషా పదాలు, సంస్కృత పదాలు వాడకుండా, అచ్చ తెలుగ మాటలతో పద్యాలు ప్రయత్నిద్దాం. ఈ క్రింది పద్యాలు చూడండి. మన తెలుగు సౌందర్యాన్ని ఆస్వాదించండి.

ఆటవెలది: తొల్లి పొద్దునుండి తూనీగలవలెను
                  పరుగులెత్తు ఎగులు పాటు పడగ
                  పేదవారి బతుకు బీటలు వారెగ
                  ఇట మనుగడ జూడ ఇడుములాయె
(ఎగులు = ప్రజలు, ఇడుములు = కష్టాలు)

తేటగీతి:  పగలు చీకటేల అనక ఎగులుకోటి
              చేపలుకి తోటి ఎనికెన చేతబట్టి
              నాడు నేడనక ఎగము నాకు వలదు
              అనుచు తాకుపలుకి తోనె అంటుకొనిరి
(ఎగులుకోటి = ప్రజలంతా, చేపలుకి =సెల్ ఫోన్, ఎనికెన =కంప్యూటర్,
ఎగము = ప్రపంచం, తాకుపలుకి = టచ్ ఫోన్)

కందం:  నేడు బుడతడొకడు కదిలె
            వాడె పరుగిడుతు మొదలిడు బడికి అడుగిడెన్
            ఆడక మలిబడి మిడిబడి
            వాడిక చదివెన్ తెలుగును పలుకగలేకన్
(మొదలిడు బడి = కాన్వెంట్, మలిబడి = ప్రైమరీస్కూలు, మిడిబడి = హైస్కూల్)

కందం: తొలిపలుకులు జాడేదీ?
            తెలుగు నుడి చదువుల జాడ తీరేదీ? యే
            ఎలమి కనక కలిమి కొఱకు
            కలలు కనక పలు తలపులు కాసుల కొఱకే !
(తొలిపలుకులు = వేద జ్ఞానం, విజ్ఞానం, ఎలమి = సంతోషం)

Posted in May 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!