Menu Close
Page Title

5. నన్నయ రచనకు ముగింపు-నన్నెచోడుని రచనకు నాంది:

నన్నయ విస్తరించవలసిన చోట విస్తరించి కొన్ని చోట్ల మూలంలో లేనివి చేర్చాడు. ఇలా చెయ్యడానికి కారణం రాజ రాజ నరేంద్రుదు ఇచ్చిన ఆదేశం, అబ్యర్ధన. రాజ రాజు “భారత నిరూపితార్థ మేర్పడ చెప్పుమని” అన్నది మనసులో ఉంచుకొని నన్నయ మూలం చెడకుండా స్వేచ్ఛానువాదం చేశాడు. నన్నయ అనువాద విధానాన్ని గూర్చి దివాకర్ల వెంకటావధాని గారి అభిప్రాయం.

“ప్రధానముగా... వ్యాసభారతము నందలి కథనే యనుసరించినను, నెడ నెడ తనకు బూర్వముండిన సంస్కృత, కర్ణాటక కవుల కావ్యముల నుండి కూడా కొన్ని భావములు గ్రహించియు...ఆంధ్రభారతమును సర్వాంగ సుందరముగా వెలయించెను. అందుచేతనే అనువాదమన్న పేరున్ననూ అతి స్వతంత్ర గ్రంధము వలెనే సోభిల్లుచు నన్నయ ప్రతిభా విశేషములను వేయి విధముల వెల్లడి చేయుచున్నది”

“‘నన్నయ భారతం’ అనే తన రచనలో వెంకటావధాని గారు నన్నయ తన అనువాదంలో ఎక్కడ తగ్గించారో, ఎక్కడ పెంచారో మూలాన్ని ఎక్కడ వదిలేసారో మొదలైనవి విపులంగా ఉదాహరణలతో చూపారు” అని ఆరుద్ర తెల్పారు (స.ఆం.సా. 137 – 138).

నారాయణ భట్టు

చాళుక్యులతో సంధి చేసుకోవడం, కొత్త రాజధానికి మారడం క్రీ.శ.1061 లో జరిగింది. అపుడే నారాయణ భట్టుకు రాజ రాజు ‘కోరుమిల్లి’ అగ్రహారాన్ని దానమిచ్చాడు. ఈ దాన శాసనాన్ని నన్నయే స్వయంగా వ్రాశాడు. “నారాయణ భట్టు వాఙ్మయ దురంధరుడు...నారాయణ భట్టుకు కవీభవజ్రాంకుశ అనే బిరుదు ఉన్నది...ఈయన తెలుగు దేశానికి రావడం మేలైంది. యితడు భాషాయుద్ధాలలో ‘పాయక పాకశాసనుకి’ భారత ఘోర రణంలో నారాయుణిని లాగా నన్నయ గారికి అభిమతంగా తోడ్పడ్డారు.” అని ఆరుద్ర తెల్పినది అక్షరాలా నిజం. రాజధాని మార్పులో, భారత రచనలో నన్నయకు నారాయణ భట్టు అండగా నిలిచాడు (స.ఆం.సా. పేజీ 130).

శబ్ద శాసన బిరుదు

“నన్నయకు శబ్ద శాసనత్వమును గలిగించిన ప్రధాన కారణములలో అతడు, అవ్యవస్థితమైన తెలుగు శబ్దములకొక వ్యవస్థను ఏర్పరిచి, దానికి రూప స్థైర్యము నొసగుట యోకటని నిస్సందేహముగా చెప్పవచ్చును” అని పండితులు చెప్పనది ప్రధాన కారణము కాదు అనడానికి ఆరుద్ర చాలా వివరణ ఇచ్చారు. అదిక్లుప్తంగా:-

  • నన్నయ కన్నా ముందే 110 సం|| క్రిందట మల్లియ రేచన ‘కవిజనాశ్రయము’ (క్రీ.శ. 940) అనే ఛందోగ్రంథం వ్రాశాడు.
  • నన్నయకు ముందే తెలుగులో కనీసం పది ఛందో భేదాలున్నాయి.
  • క్రీ.శ. 1060 దాకా బస్తరును పాలించిన చోళుల శాసనాలలో భాష, ప్రాజ్ఞన్నయ కాలంలో అలాగే నన్నయ కాలంలో ఉన్న తెలుగు భాషాస్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయనకు ‘శబ్ద శాసనుడు’ అనే బిరుదు తెలుగు శబ్దాలకు ఒక వ్యవస్థను ఏర్పరచినందుకు వచ్చి ఉండదు” అని చెప్పిన ఆరుద్ర ‘నన్నయ భారతాంద్రీకరణానికి ముందే విపుల శబ్ద శాసనుడు’ అని గుర్తు చేశారు.

పదసంపద – సజీవభాష      

తన కాలంలో ఉన్న తెలుగు మాటలు ఉత్తమ కావ్యరచనకు సరిపోవని నన్నయ, సంస్కృత శబ్దాలను తెలుగులోకి తెచ్చాడని కొందరి మాట. పంపన, పొన్నమయ్య, రన్నడు మొ||వారు సంస్కృత శబ్దాలను ఎలా కన్నడించారో అలాగే తెలుగు కవులు తత్సమాలను తెలుగు చేశారు. నన్నయ కూడా ఇలానే చేశారు. దీనివల్ల పద సంపద పెరిగినప్పటికీ కొన్ని తెలుగు పదాలు మాయమైనాయి. ఉదా: సముద్రము అనే దానిని గూర్చి ఆరుద్ర “సముద్రమునకు తెలుగు పేరు ఏదో వాడుకలో ఉండే ఉంటుంది. కాని అది ఇప్పుడు వాడుకలో కనపడదు. దీని వికృతి సంద్రము అని తెల్పారు. “సజీవ భాష చంపినా చావదు’ అని ఆరుద్ర తెలుగు భాష యొక్క వైశిష్ట్యాన్ని పేరు ద్వారా సూచించారు.

“ఎన్ని తత్సమపదాలు వచ్చినా, ఎంత సంస్కృత కారక చ్చాయలనీ దింపినా నన్నయ గారు తమ కాలంనాటి సజీవ భాషలోనే గ్రంథ రచన చేశారు” అని ‘ఆనాటి సామెతలను, పలుకుబళ్ళను మనం ఈనాటికీ వాడుతున్నాం’ అని గుర్తుచేశారు. అవి:

  • కుంతి కడుపున చల్లగా పుట్టిన ఘనభుజుండు (ఆం.భా. ఆది6 – 19)
  • రోయు తీగె కాళ్ళం బెనగెందా ననుచు
  • అర్జునిని వలని భయము సెడి ఱొమ్మున జేయుడి నిద్రవోయె (ఆం.భా. ఆది.156)

ఒక పాత్రను గూర్చి చెప్పేటప్పుడు నన్నయ ఆ పాత్రకు తగిన విశేషణాలు వాడి ఆ పాత్ర యొక్క రూపురేఖలను, గుణగణాలను తెలపడంలో సిద్ధహస్తుడు. అర్జునునికి అగ్నిదేవుడు గాండీవం అనే ధనుస్సు బహుమతిగా ఇచ్చే సందర్భంలో నన్నయ అర్జునుని “ఘనభుజుండు’ అంటాడు. ధనుస్సును మోసేది భుజమే గదా! (స.ఆం.సా. పేజీ 135-136).

బ్రాహ్మణభక్తి :

నన్నయ గారికి, రాజ రాజుకు గూడా బ్రాహ్మణులపై భక్తి అపారం. గరుత్మంతునికి ఆకలివేసినప్పుడు, అతని తల్లి -అదితి ఇలా చెప్తుంది; సముద్రంలో నిషాదులున్నారు. వారిని తిను. కాని బ్రాహ్మణులను మాత్రం తినవద్దు.  కాని గరుడుడు నిషాదులతో పాటు ఒక బ్రాహ్మణుని కూడా తిని తర్వాత తెలుసుకొని, బయటికి అతన్ని రమ్మంటాడు. కాని అతను నేనొక నిషాద కన్యను వివాహం చేసుకొన్నాను. ఆమెను గూడా తీసుకొని వస్తాను అన్నప్పుడు గరుడుడు అంగీకరిస్తాడు. దీనినిబట్టి బ్రాహ్మణుడు భ్రష్టుడైనా నన్నయ దృష్టిలో క్షమార్హుడే.

ఆంద్ర శబ్ద చింతామణి:

“నన్నయ గారు విపుల శబ్ద శాసనుడు అని తనను గూర్చి చెప్పుకొన్నారు. దీని సరియైన అర్థం ఇవాళ మనం చెప్పలేము. వ్యాకరణం వ్రాయడం వల్ల బిరుదులాంటి ఈ విశేషణం చెప్పుకొన్నాడని పండితులు ఊహిస్తున్నారు.” అని తెల్పిన ఆరుద్ర గారు మరలా ఇలా అన్నారు. “ఎవరో ఔదార్యవంతులు తాము వ్రాసిన వ్యాకరణ ప్రశస్తి కోసం, ప్రామాణిక బలం కోసం నన్నయ గారికి అంటగట్టారని నమ్మకంగా చెప్పవచ్చు” (స.ఆం.సా. పేజీ 143).

నన్నయ కారణ జన్ముడు. సంస్కృత భాషా మైకంలో ఉన్న తెలుగు కవుల మత్తు వదిలించడానికి వచ్చిన ఒక దివ్యశక్తి వంటి వాడు నన్నయ. ఆదికావ్యమైనా, భారతాన్ని సర్వలక్షణ సంపన్నంగా తీర్చిదిద్ది తరువాతి కవులకు మార్గదర్శకుడైనాడు. ‘ఆదికవి’ గా స్తుతింపబడ్డాడు.

####

నన్నెచోడుడు – కుమారసంభవం

నన్నయ తరువాత చాళుక్య యుగంలో ఒక విప్లవానికి కారకుడైనవాడు, నన్నెచోడుడు.

నన్నయ ‘ఆదికవి’ అని క్రీ.శ.1910 దాకా కీర్తింపబడ్డాడు. 1910 లో ‘ఆదికవి’ బిరుదును నన్నెచోడునికి కట్టబెట్టాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఈ విప్లవం చివరకు లాభమే చేకూర్చింది. ఆరుద్ర మాటల్లో “ఈ పితూరి చివరకు లాభమే చేకూర్చింది. అప్పటిదాకా తెలియని ఒక సరికొత్త పాతకవిని దేశానికి పరిచయం చేసింది.” (స.ఆం.సా. పేజీ -160).

దీనంతటికీ మూలకారకులు, మానవల్లి రామకృష్ణ కవి గారు. వీరు సంస్కృతాది అనేక భాషల్లో గొప్ప ప్రవేశం ఉన్నవారు. “ప్రాచీన గ్రంధాలను సంపాదించడం, పరిష్కరించి ప్రకటించడం వీరి జీవితాశయం. ఎందరెందరో విస్మృత కవులకు వీరు మళ్ళీ ప్రాణం పోశారు...”అన్నారు ఆరుద్ర. మానవల్లి రామకృష్ణ గారు పూనుకుని ఉండక పోతే ఎన్నో గ్రంథాలు మనకు దక్కకుండా పోయేవని గన్నవరపు సుబ్బరామయ్య గారు అన్నమాటలు అక్షర సత్యం అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.

రామకృష్ణ కవి గారు నన్నెచోడుని కుమారసంభవం లో మొదటి 7 ఆశ్వాసాలను ఒక సంపుటిగా 1909 లో ప్రకటించారు. అందులో నన్నెచోడుని కాలాన్ని గూర్చి క్రీ.శ.940 కి చెందినవాడు నన్నెచోడుడు అని వ్రాశారు. (స.ఆం.సా. పేజీ -160-161).   ఇది నన్నయ గారిని ఒక శతాబ్దం అర్వాచీనునిగా చేసింది. అందుకే అంత సంచలనం కల్గింది. ఇది పెద్ద సంచలన వార్త కాబట్టి కాకలు తీరిన పండితులు నన్నెచోడుని కాలనిర్ణయం కోసం పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రింది పట్టికలో వివిధ పండితులు వారు చెప్పిన నన్నెచోడుని కాలం వివరాలు చూడవచ్చు.

మానవల్లి రామకృష్ణ కవి గారు
నెలటూరి వెంకట రమణయ్య గారు
నడకుదిటీ వీరరాజు గారు
క్రీ.శ. 940
చిలకూరి వీరభద్రరావు గారు
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు
జయంతి రామయ్య గారు
క్రీ.శ. 1120
వీరేశలింగం గారు
బుర్రా శేషగిరి రావు గారు
కోరాడ రామకృష్ణయ్య గారు
క్రీ.శ. 1170
శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి గారు క్రీ.శ. 1325
వేదం వెంకటరాయ శాస్త్రి గారు క్రీ.శ. 1300
చాగంటి శేషయ్య గారు క్రీ.శ. 1028-78

ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి లెక్కల ఆధారంగా నన్నెచోడుని కాలాన్ని ఊహించారు. దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి గారు కుమారసంభవం కావ్యంలోనే గుంభనంగా కవి కాలముందని లెక్కలు గట్టి చెప్పారు. వారి లెక్క ప్రకారం కుమారసంభవం క్రీ.శ.1053 మార్చి10 వ తేదీకి సరియైన విక్రమార్క శకం; విజయనామ సంవత్సర చైత్రశుద్ధ, అష్టమి, జయవారం. నిడదవోలు వెంకట రావు గారు మొదలైన చాలామంది వీరేశలింగం పంతుల వాదాన్ని స్వీకరించారు. నన్నెచోడుని కాలం గూర్చి చెబుతూ ఆరుద్ర “అదొక పద్మవ్యూహం. తారీకుల అడవిలో శాసనాల సముద్రంలో...కాలనిర్ణయాన్ని గూర్చి ఒక పుస్తకమే వ్రాయవచ్చు” అని అన్నారు (స.ఆం.సా. పేజీలు 160-162).

**** సశేషం ****

Posted in May 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!