Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి

తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోయి మనం అందరం మర్చిపోయిన అనేకానేక పద్య శతకాలలో కృష్ణ శతకం అనేదొకటి. ఈ నెల పద్యం ఎవరు రాసారో తెలియని, తిక్కన రాసాడని అనుకుంటున్న కృష్ణ శతకంలోది. పద్యం ఎంత సులభంగా ద్రాక్షా పాకంలో ఉందో గమనించండి.

అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
నరుపై ద్రౌపదిపైఁ గుచేలునిపయిన్నంద వ్రజ శ్రేణిపై
బరగం గల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాఁడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!

శంతను పుత్రుడు భీష్ముడు కదా? ఎంత ధుర్యోధనుడి వైపు ఉండి యుద్ధం చేసినా భీష్ముడు ధర్మం తప్పనివాడు. రాజు పెట్టిన ఉప్పు తిన్నవాడు కనక ధుర్యోధనుడి వైపు ఉండి యుద్ధం చేయాల్సి వచ్చింది. అదే మాట చాలాసార్లు అటు ధుర్యోధనుడి తోనూ, ఇటు ధర్మరాజు తోనూ కూడా చెప్తాడు ఆయన. కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడని తెలిసినా ధుర్యోధనుణ్ణి ఏమీ చేయలేని అశక్తుడు.  యుద్ధంలో ఒకానొక రోజు భీష్ముడు రెచ్చిపోయి పోరాడుతూంటే, పాండవులు తమ తాతని చంపడానికి ఉపేక్షిస్తున్నారు కనక తానే ఈయన్ని చంపుతానని రథం మీద నుంచి ‘కుప్పించి ఎగసిన గుండలముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ…. గరికి లంఘించు సింహంబుకరణి’ అంటూ చక్రాయుధంతో ఈ గోపాల సింహం కిందకి దిగి నపుడు కూడా అదే చెప్తాడు భీష్ముడు ‘ఇలా కౌరవుల ఉప్పు తిన్నందువల్ల యుద్ధం చేస్తున్నా ఇటు వైపు, కానీ నీమూలాన చావడం కంటే కావాల్సింది లేదు. వచ్చినా ప్రాణాలు తీయి” అంటూ ప్రాథేయపడతాడు. ప్రాణం పోయేటపుడు కృష్ణుడు ఎదురుగా ఉండగానే ఆయన్ని తలుచుకుంటూ పోయిన అదృష్టవంతుడు కూడా భీష్ముడు. రెండోది విదురుడు. ధర్మరూపుడైన యముడు పాపవశంగా విదురుడిగా పుట్టి కృష్ణుడు లీలామానుషవిగ్రహుడైన ఆ మహా విష్ణువే అని సర్వవేళలా గుర్తుంచుకున్నవాడు. మూడోది దుష్టుడైన కంసుడి దగ్గిర కొలువు చేసినా, ధర్మసంస్థాపనకి పుట్టిన కృష్ణుడిమీద అపారమైన భక్తి ఉన్నఅక్రూరుడు. ఈ ముగ్గురిమీదా, భగవంతుడి కృప ఎలా ప్రవహించిందో మనకి తెలిసినదే. వాళ్ళు శత్రువుల వైపు ఉన్నా భగవంతుడి కృప ప్రవహిస్తుంది ఎందుకలా వాళ్లకి? దానికి ఒకటే సమాధానం. యతో ధర్మస్తతో కృష్ణః యతో కృష్ణస్తతో జయః భగవంతుడెప్పుడూ ధర్మం వైపే ఉండేది. అందువల్లే భగవంతుడున్నచోటే విజయం వరిస్తుంది.

నాలుగోది కుబ్జ. తన రూపం చూసుకుని తాను అందరిలా లేననీ, తానెందుకూ పనికిరాని మనిషిని అనుకుంటున్నప్పుడు భగవంతుడు బాహ్య రూపాలకి అంత ప్రాముఖ్యత ఇవ్వడనీ, మనస్సనేదే ఆయనకి మనం ఇవ్వాల్సిన అతి ముఖ్యమైన పుష్పమనీ తెలియజేయడానికా అన్నట్టు కృష్ణుడు పనిగట్టుకుని వెళ్ళి కుబ్జ దగ్గిర లేపనం అడిగి మరీ తీసుకుని అది ఇచ్చినందుకు మరుగుజ్జు వంకర రూపంపోగొట్టి ఆవిడని అద్భుత సౌందర్యరాశిగా చేస్తాడు. తర్వాతది నరుడైన అర్జునుడి మీద కృప గురించి చెప్పడానికేవుంది? మొత్తం మహాభారతంలో తాను పక్కనుండి ఓ చేయి పాండవ మధ్యముడి మీద వేసి ఉండకపోతే అసలు కధే లేదు కదా? అలాగే వస్త్రాపహరణం సమయంలోనూ మరే విషయంలోనైనా సరే అతి రథ మహారథులైన తన స్వంత భర్తలు కూడా చేతకాని వాళ్ళైనపుడు ఆఖరికి ద్రౌపది నమ్ముకున్నది నల్లనయ్యనే. గమనించవల్సినది ఏమిటంటే, ఏ పరిస్థితుల్లోనూ కూడా నల్లనయ్య నమ్ముకున్న ఈ అర్జునుణ్ణీ, ద్రౌపదినీ ‘అబ్బే నేనేం చేయగలను, మీ ఖర్మ మీదే’ అని తప్పించుకోకుండా అడిగిన వెంటనే వచ్చి ఆపన్న హస్తం అందించాడాయన. అందుకే స్వామి వివేకానంద అంటారు, “ప్రపంచంలో నువ్వు నమ్ముకున్న ఎవరైనాసరే నిన్ను వదిలేసి వెన్నుపోటు పొడవ్వచ్చు, కానీ భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదలడు.” ఇదే విషయంలో స్వామిజీ చెప్పిన మరో విషయం, “ఈ ప్రపంచంలో ఎవర్ని ప్రేమించడం? దొంగ అయి ఏదైనా కొల్లగొట్టాలని ఉంటే, రాజు గారి ఖజానాని కొల్లగొట్టడానికి ప్రయత్నించు. వేటగాడివి అవ్వాలనుకుంటే, సింహాలని పులులనీ వేటాడ్డానికి ప్రయత్నించు. అంతే గానీ చీమల్ని వేటాడ్డానికీ, రోడ్డుమీద అడుక్కుతినే భిక్షగాళ్లని కొల్ల గొట్టడానికి ప్రయత్నించడం వ్యర్ధం. అందుకే ప్రేమించాలంటే, ఈ విశ్వంలో అతి గొప్పవాడైన భగవంతుణ్ణి ప్రేమించు.”

ఆ తర్వాత కృష్ణుడి కృప ప్రవహించినది కుచేలుడిమీద. అతి చౌక అయిన రెండు గుప్పిళ్ళ అటుకులు – ఇవ్వడానికి సిగ్గుపడుతుంటే – వాటిని అడిగి మరీ స్నేహితుడి దగ్గిర తీసుకుని అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు ఆయన. ఇంక పోతే నందగోకులంలో ఆయన కృపాప్రవాహంలో పడి కొట్టుకుపోని మనిషిగానీ, జంతువుగానీ మరో ప్రాణి కానీ లేదంటే అతిశయోక్తి కాదు కదా? కవి ఏమంటున్నాడంటే ఈ అందరిమీదా అతి చులాగ్గా ప్రవహించిన నీ కృప ఇలా కొంత నా మీదకి కూడా రానియ్యి ప్రభూ అని. సరే మరి ఎందుకు రావాలిట ఆ కృప? “నీ చరణాబ్జంబులు నమ్మినాఁడ జగదీశా”. నీ పాద పద్మాలని నమ్ముకున్నాను కనకా, నువ్వు భక్త ప్రియుడవి కనకాను.

ఈ పద్యం రెండో పాదంలో “గుచేలునిపయి న్నందవ్రజస్త్రీలపై” అనే సవరణ కూడా కొన్ని చోట్ల చూడవచ్చు. పద్యం అర్ధమే ముఖ్యం కనక ఈ చిన్న మార్పు అంత ముఖ్యం కాదు.

ఇంక పోతే చివరికి కృష్ణుడొచ్చి రాయబారం చేసాక కూడా, ఆ వచ్చినవాడు సాక్షాత్తూ భగవంతుడని తెలిసినా భీష్ముడుతో సహా  ఎవరూ ధుర్యోధనుడికి నచ్చ చెప్పి యుధ్ధం తప్పించలేక పోతారు. అలా కృష్ణుడు చెప్పినా ఆ ధర్మం, అది ఆచరించక పోవడం వల్ల చివరకి అదే యుద్ధంలో పాండవుల చేతిలో, ధర్మానికి తల ఒగ్గి, చావాల్సి వచ్చింది కూడా.

రాయబారిగా వచ్చిన కృష్ణుడు భీష్ముడితో మిగతావారితో సభా మధ్యంలో ధర్మం గురించి ఏం చెప్తాడో వచ్చే నెల పద్యంలో చూద్దాం.

****సశేషం****

Posted in September 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!