Menu Close
SirikonaKavithalu_pagetitle
తెలుగు వెలుగులు -- డా.కోడూరు ప్రభాకరరెడ్డి (రచనాకాలం - 1975-76)
శివునిచే ఆడించి భవునిచే
పాడించి మురిపించె మనసీమ
'పుట్టపర్తి'/శివభారతగ్రంథ
నవసౌరభమ్ములు చిలికించె 
'వేంకటశేషశాస్త్రి'/వేయిపడగ లెత్తి విక్రమించిన మూర్తి విజ్ఞాన
ఖనియైన 'విశ్వనాథ'/జాతీయ
ముల సొంపు జాలువారగ గుండెకరగించె 'జాషువా' 
కవివరుండు

తెలుగుతల్లికి వీరెల్ల తిలక 
           మిడగ
మూడుపూలారుకాయలై
           మురిపెమొలక
భారతదేశ సాహిత్య ప్రపంచ
           మందు
వెలుగుచున్నది తెలుగుల
           జిలుగు వెలుగు!

తెలుగు వీరుల కీర్తిచంద్రిక
నాల్గు దిక్కుల నాట్యమాడగ
పొంగిపొరలెడి పౌరుషమ్మున
తరలిరమ్ముర తమ్ముడా! 
            ౹౹తెలుగు౹౹

వెలమ వీరుల ప్రథిత తేజము
రగులజేసిన బాలచంద్రుడు
కాకతీయుల ఘనత పెంచిన
కదనచండిక రుద్రమాంబిక
జాతిశౌర్యము ప్రజ్జ్వలింపగ
కత్తి దూసిన కాటవేముడు
తెల్లదొరలను ధిక్కరించిన
రెడ్డివీరుడు నారసింహుడు
శౌర్యమూర్తులు తమ్ముడా!
            ౹౹తెలుగు౹౹

వేంకటేశుని భక్తిభావన
పరవశించిన అన్నమార్యుడు
రామనామమె రక్షణంబని
రాజు నెంచని రామదాసుడు
మువ్వగోపుని ముగ్ధలీలల
తేలియాడిన సుకవి క్షేత్రయ
రామభద్రుడు పులకరింపగ
పాట పాడిన త్యాగరాయలు
   పుణ్యమూర్తులు తమ్ముడా!
               ౹౹తెలుగు౹౹

తీరు తెన్నులు లేని బాసకు
నడక నేర్పిన నన్నయార్యుడు
భాగవతమున భక్తి సుధలను
పంచిపెట్టిన పోతనార్యుడు
దేశభాషల తెలుగు లెస్సని
చాటి చెప్పిన కృష్ణరాయలు
కరుడుగట్టిన ఛాందసాలను
చీల్చి చెండిన యోగివేమన
    కవనమూర్తులు తమ్ముడా!
సీమకు సీమంతం కావట్లేదు -- అభిరామ్

సమాదులపై నీళ్ళేసిన
రాళ్ళు రప్పలకు జలాభిషేకాలు చేసిన
గాడిదలకు పూజలు చేసిన
కప్పలకు పెళ్ళిళ్ళు చేసిన
సీమ భూమాతకు పచ్చనిచీరతో సీమంతం కావడంలేదు
ఎందుకంటే
మేఘాలు నేలతో సరసమాడటం మరిచిపోయాయి
వాటికి వైరాగ్యం వచ్చిందేమో
సన్యాసం తీసుకున్న వాళ్ళలా ఓ చోట నిలవక పరుగెడుతూనే ఉన్నాయి
రైతుల ఆశల ఆయువును దినదినం దొంగిలిస్తూ.

పల్లమున్న వైపె ప్రవహించు -- అరుణ నారదభట్ల

పల్లమున్న వైపె ప్రవహించునీరము
కాంక్షయున్నవైపె గదులుసిరులు
కలలుగన్నవాడె కాంక్షించియెదురీదు
లక్ష్యమున్నవాడె లాభపడును!!

ఒంటివిత్తునాట నోర్పుతో చూడంగ
అడవినందుబడగనదియెబెరుగు
తోటిసోపతెట్లు తోవజూపించునో
విత్తుమనకుదెల్పు విశ్వనీతి!!

తల్లడిల్లుటెట్లు తల్లిజూడదనుచు
తలపుగట్టిదైన తరలివచ్చు
తామరాకు మీద తాజారుజలబిందు
వెటులవంచిజూడనటులెదారి!!

తల్లి ప్రేమ మీర తనయులగనిపెట్టు
తగినదారిజూపి తలుపుదట్టు
తమకమున్నమనిషి తరచిచూడగలేడు
తరలిపోగవగచు తాకిరాగ!!

జగతినంతగెలువ సంపదగొలువుండె
కర్మవెంటరాగగాచమదియు
అమ్మకరుణ జూపి యాశీర్వదించగా
తరలిపొరలివచ్చు ధనముబలము!!

అమ్మకరుణ జూప అక్షరములుబారు
ఆగకుండధార లల్లుకవిత
అర్బకుడికిగూడ నగుపించు తనశక్తి
అమ్మలీలజూడ యనితరమ్ము!!

నేను .... -- విశ్వర్షి వాసిలి
•
నేను విశ్వ రచనను.
••
కృష్ణబిల గర్భకోశ
     చీకటి అణువున 
     స్వపరిణామంగా కాంతికణం
     శూన్యతన 
           పుట్టుకొచ్చిన కాంతికిరణం.
చీకటి వెలుగుల సంయోగాన
           ఆద్యంత రహితంగా
               విస్తరిల్లిన వాయుగగనం
           ఆకాశిక ప్రకృతిగా
               వాయువలయం.
ఘనీభవించిన వాయుసాంద్రతన
     ఇబ్బడిముబ్బడైన కాంతికణాలు
     పాలపుంతలైన నక్షత్రవెలుగులు 
     సృష్టిప్రవృత్తికి 
          సందడించిన తారాతోరణం.
గ్రహమండలాలుగా సౌరకుటుంబం
     ఆదానప్రదాన సంబరంలో
          గ్రహశక్తులు
     సమీకరణల మార్పులో
          గ్రహప్రకృతులు
     విస్తరణకు సిద్ధమైన వాయుగగనం.
ఖగోళ ధూళిధూసరిత సాంద్రతలంగా
     రూపుదాల్చిన భూగ్రహ గోళం
     వాయుసాంద్రతనుండి
            సరళీకృతమైన గాలి
     కాంతి నుండి ఉద్భవించిన అగ్ని
     జీవానికి ఆలవాలమైన
            పృథ్వీప్రకృతి.
•••
పంచభూతాల సమీకృతంగా ఇహం
     పాంచభౌతికంగా మానవ మనుగడ 
     నేలను పొదువుకుని 
            పాదచారిగా మనిషి 
     ఇరు నయనాలతో 
            భ్రాంతిమంత జీవితం
     తాపం తపన తపస్సుల 
           ఇహ పర ప్రయాణం 
     నిలువెత్తు ప్రతీకగా 
           ఫాలనేత్ర ఆజ్ఞావర్తనం
     సహస్రార వికసిత 
           పూర్ణేందు గురుజీవనం
     సచేష్టిత తపనతో 
           సుచేష్టిత సాధనాజీవితం 
     తపస్సు మహస్సంపన్నం కావటం
     మానవ ఆత్మ పరిణామ రహస్యం. 
     (ఆచార్య రాణి సదాశివమూర్తి గారి
                    వివరణల స్ఫూర్తితూ ...)
తలపన్ చీకటి వెల్గులన్ -- బులుసువేంకటేశ్వర్లు
తలపన్ చీకటి వెల్గులన్ పగటు సం
        ధ్యల్ తీర్చు వర్ణాధికం 
 బుల చీరల్ మెయి చుట్టు  కాలయువతీ 
        మోహాతి రేకమ్ము లో 
 పల దాగున్నదివంచనమ్ము, తడవో
         పన్ లేము  మా సాత్వికో 
జ్జ్వల వేషమ్ముల గారవించ తగదే 
        స్వామీ, కృపామూర్తివై !!
Posted in May 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!