Menu Close

Alayasiri-pagetitle

రామనారాయణం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్

Rama Narayanam

మనిషి జీవితం అన్ని వర్ణాలలో ఆద్యంతం అగుపిస్తూ, జీవిత సార్థకతను సిద్ధింపజేయాలంటే అందుకు మన పురాణ ఇతిహాసాల సారాశం, ధర్మాలు, సూత్రాలు తెలుసుకొని వాటిని ఆచరించవలసిన అవసరం ఎంతో ఉంది. వాటిని మనకు అందించిన మహానుభావులు, ఊరికే కూర్చుని ఉబుసుపోక ఆ గ్రంథాలను రచింపలేదు. తమ మేథోసంపత్తిని, అనుభవాన్ని రంగరించి, అమూల్యమైన విషయాలను మనకు అందించారు. ప్రతి గ్రంథం, పురాణం వెనుక నిగూఢంగా మన మార్గనిర్దేశం ఉంది. మరి ఆ నిర్దేశాలను సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంచెం కష్టంతో కూడుకొన్న కార్యమే. అయితే మనిషి సృజనాత్మకత ఆ కష్టాన్ని తగ్గించి కొంచెం సులభతరం అయ్యేట్లు చేసింది. అందులో ముఖ్యమైనది దృశ్య శ్రవణ ప్రక్రియ. మన రామాయణ, మహాభారత, భాగవతాలను బొమ్మల రూపంలో విశదీకరిస్తే ఆ ఇతిహాసాలలోని ధర్మాలను మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు వీలౌతుంది. అటువంటి బృహత్కార్యాన్నిచేపట్టి అందుకొరకు ఒక సువిశాల ప్రాంగణాన్ని నిర్మించి అందరికీ ఆ ఆలయాన్ని దర్శించేందుకు వెసులుబాటు కల్పించిన నారాయణం నరసింహమూర్తి గారి  ‘శ్రీ రామ నారాయణం-శ్రీమద్రామాయణ ప్రాంగణం’ యొక్క ఆలయ విశేషాలే నేటి ఆలయసిరి.

Rama Narayanamఎదురులేనిది, తిరుగులేనిది రామ బాణం. ఆ రామబాణం మనందరిలోని చెడును తొలగించి మంచి నడవడికను నేర్పే ఆయుధం కూడా అవుతుంది. కనుకనే ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని రామ ధనుస్సు ఆకృతిలో నిర్మించారు. నిర్మాణాత్మక పరంగా కూడా ఈ ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకొంది.

Rama Narayanamపదిహేను ఎకరాల సువిశాల ప్రాంగణంలో సనాతన హిందూ సంప్రదాయ రీతిలో నిర్మితమై అత్యాధునిక వసతులతో ఎంతో పరిశుభ్రతతో విలసిల్లుతున్న ఈ రామనారాయణం ఎంతో మంది భక్తులను, భక్తి భావం లేని వారిని కూడా తన శిల్పకళా కౌశల్యంతో ఆకర్షిస్తున్నది. ఇక్కడ నిర్మించిన సహజ ప్రకృతి వనాలు, ఎంతో మనోల్లాసాన్ని కలిగిస్తున్నాయంటే అది అతిశయోక్తి కాదు.

Rama Narayanam

ఈ ప్రాంగణంలో ఉన్న చెట్ల ఆధారంగా ఇక్కడి వనాలు నక్షత్ర వనం, నవగ్రహ వనం, రాశి వనం, పంచభూత వనం ..ఇలా వివిధ పేర్లతో పిలువబడుతున్నాయి. ఈ పేర్లు అన్నీ కొంచెం కొత్తగానే ఉన్నాయి కదూ? ఈ ఆలయాన్ని సాయంత్ర సమయంలో లేక రాత్రి సందర్శించిన రంగు రంగుల కాంతితో ఎంతో మెరిసిపోతూ చాలా అందంగా ఉంటుంది. అంతే కాదు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చూడవచ్చు.

Rama Narayanam

వాల్మీకి రామాయణం లో ప్రతి ఘట్టము ఎంతో విలువైనది. అయితే బాల కాండ మొదలు యుద్ధ కాండ వరకు, ప్రధానమైన డెబ్బైరెండు ప్రధాన ఘట్టాలను తీసుకొని, అందులోని సన్నివేశాల లోని పాత్రలకు ఆకృతులు కల్పించి దృశ్య రూపంలో ఆ ఘట్టాలను వివరిస్తుంటే, రామాయణం చూసినట్టే ఉంటుంది. అంతటి గొప్ప కార్యాన్ని ఈ NCS చారిటబుల్ ట్రస్ట్ వారు చేపట్టి రెండు అంతస్తులలో ఈ ప్రతిమలను ఆవిష్కరించి, పండితులకు, పామరులకు, చదువురాని వారికి, చదువుకున్న వారికి, పిల్లలకు, పెద్దలకు.. అన్ని వర్గాల వారికి మన రామాయణం లోని మధుర సన్నివేశాలను కనులకు సాత్కాక్షరింపజేశారు. ప్రతి సన్నివేశానికి సంబంధించిన విషయాలను తెగులులో మరియు ఆంగ్లంలో కూడా చక్కగా ఇత్తడి ఫలకాలపైన ముద్రించారు. అంతేకాదు, చదువురాని వారికి ఆ ఘట్టాలను వినే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇంతకన్నా నిజమైన సమాజ సేవ ఇంకేముంటుంది.

Rama Narayanamఅరవై  అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ఈ ఆధ్యాత్మిక కళా సృష్టికి కాపలాదారునివలె నిశ్చలంగా నిలిచి దూరంనుంచి కూడా ఎంతో అద్భుతమైన ఆకృతితో కనులకు విందు చేస్తుంది. అంతే కాకుండా ఎందఱో దేవతామూర్తులు ఈ ప్రాగణం లోనే కొలువై ఉన్నారు. ఈ ప్రాంగణం లోనే ఒక మంచి గ్రంధాలయం, ప్రశాంతమైన ధ్యానమందిరం మరియు వేదం పాఠశాల కూడా ఉన్నాయి.అందరూ తప్పక చూడవలసిన ఒక వినూత్న కాళాత్మక ఆధ్యాత్మిక కావ్యం ఈ రామనారాయణం.

Posted in May 2019, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!