Menu Close
నూరబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి
- వెంపటి హేమ (కలికి)

పదవ్వకముందే లంఛ్ బాక్సు తీసుకుని బ్యాంకుకి వెళ్ళిపోయాడు రామేశం రోజూలాగే. బల్ల మీద ఉన్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు ప్రిన్సు. ఫ్రంట్ పేజిలో ప్రస్ఫుటంగా ఉన్న వార్త అతని దృష్టిని ఆకర్షించింది. "వకుళా ఇది విన్నావా! ఈ ఊరికి త్వరలోనే గొప్ప గుర్తింఫు రాబోతోంది. ఇక్కడ నుండి చూస్తే దూరంగా కనిపించే గుట్టమీదున్న దేవాలయాన్ని పునరుద్ధరిస్తారుట. ఆ గుడిమీది శిల్పాలు చాలా బాగుంటాయిట. ఆ గుడిని ఎప్పుడు ఎవరు కట్టారు అన్నది ఆర్కియాలజిష్టుల పరిశోధనలో ఉందిట. త్వరలోనే ధృవీకరిస్తారుట. ఈ గుడిమీది శిల్పాలు చాలా అందమైనవిట! రేపు మనమిద్దరం బైక్ మీద పోయి చూసి వద్దామా" చెల్లెల్ని అడిగాడు ప్రిన్సు.

"ఇంక రెండురోజుల్లోకి వచ్చింది నీ ప్రయాణం! అమ్మ నీ కోసం ఏవేవో చెయ్యాలనుకుంటోంది. నేను అమ్మకు సాయం చెయ్యలి" సున్నితంగా రానని చెప్పేసింది వకుళ.

"సరే నీ ఇష్టం. రేపు నేనొక్కడినీ వెడతా. ఆ దేవాలయం మీదున్న శిల్పాలను ఫొటోలు తీసి నాతో పట్టుకెళ్ళాలని ఉంది. నాఫ్రెండ్ సురేశ్, "హోంలాండ్ వెడుతున్నావు కదా అక్కడి వింతలు విశేషాలు ఫొటోలు తీసి పట్టుకురా" అని అడిగాడు. నేను తీసుకెళ్ళిన ఫొటోలు చూసి వాళ్ళు ఫ్లాటైపోవాలి."

వకుళ అన్నగారి ఉత్సాహం చూసి చిన్నగా నవ్వి అంది. "రేపు నువ్వెళ్ళు, నాకు రావడం కుదరదు. ఈమాటు సెలవులకు వచ్చినప్పుడు చూద్దాంలే ..."

"సరే, అలాగే చేద్దాం. అప్పటికి రినొవేషన్ కూడా పూర్తవ్వచ్చు. అప్పుడు ఇద్దరం కలిసి వెడదాం. ఐతే రేపు నేనొక్కడ్నే పోయివస్తా. మంచి మంచి సీనరీల ఫొటోలు తీసి తెస్తా. రేపు నేను గుడి శిల్పాల్ని ఫొటోలు తీసి, తీసుకెడితే మావాళ్ళందరూ చూసి సంతోషిస్తారు."

"రేపవి తొందరగా డెవలప్ చేయించి నాక్కూడా చూపించాలి. అప్పుడే నీకు నేను గుట్టమీది గుడికి ఒంటరిగా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేది" అంది వకుళ కొంటెగా నవ్వుతూ.

"ఓస్! అంతేనా, తప్పకుండా" అన్నాడు ప్రిన్సు, చెల్లెలి వైపు గారాబంగా చూస్తూ. ఆ తరవాత "నా జన్మ భూమి కన్న అందమైన దేశము" అంటూ ఉషారుగా ఈలతో పాడసాగాడు.

గుమ్మం పక్కన నిలబడి, వాళ్ళ మాటల్ని వింటున్న కామాక్షి ఎందుకనో గిరుక్కున వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అది చూసిన వకుళ ఆశ్చర్య పోయింది. "ఇంతవరకు వచ్చిన మనిషి లోపలకు రాకుండా వెళ్ళిపోయిందెదుకనో?” అని అనుకుంది.

##########

ప్రిన్సు చాలా హుషారుగా ఉన్నాడు. మధ్యాహ్నం టీ టైంకి రెడీ అయ్యాడు. కెమేరా, ఒక అరడజను స్పేర్ రీళ్ళు సిద్దం చేసుకున్నాడు. ఉదయమే పేపర్ బోయ్ ని అడిగి, దారి తెలుసుకున్నాడు. టాంక్ నిండా పెట్రోలు పోయించి, టైర్ల నిండా గాలి కొట్టించి బైక్ ని ప్రయాణానికి సిద్ధంగా ఉంచుకున్నాడు. తల్లి దగ్గర అనుమతి తీసుకోడం కూడా ఎప్పుడో అయ్యింది. "అమ్మా! నాన్నకు నువ్వు చెప్పమ్మా" అంటూ తల్లికి చెల్లికి వీడ్కోలు చెప్పి బైక్ ష్టార్టు చేశాడు ప్రిన్సు.

దూరం నుండి చూస్తే ఆ కొండ గుట్ట ఒక మోకరించిన ఏనుగులా కనిపిస్తుంది. అందుకే దానిని కరిగిరి గుట్ట అంటారు. ఆ గుడిలో దేవుని పేరుమీదనే ఆ ఊరికి కేశవ్వరం అనే పేరు వచ్చింది. ఒకప్పుడది అంగరంగ వైభోగంగా పూజలందుకున్న గుడి ఐనా ఇప్పుడది శిథిలాలయం. గుడిలోని విగ్రహాన్ని ఏ పాపాత్ముడో కాజేయడంతో దాని దశ మారిపోయింది. భక్తుల రాకపోకలు లేకపోడం వల్ల ఆ సుందర దేవాలయానికి వెళ్ళే  దారి కూడా పిచ్చిమొక్కలు ఆక్రమించేశాయి.

"అది ఒక అపురూప శిల్పారామం" అన్న పేపర్లో వచ్చిన వార్త ఇచ్చిన స్ఫూర్తితో, దారికడ్డంగా పెరిగి ఉన్న మొక్కల్ని తప్పించుకుంటూ ముందుకు సాగుతున్నాడు ప్రిన్సు. ఆ చిక్కుదారిలో ఒక మలుపు తిరిగేసరికి  "కామాక్షి ఆ దారివెంట వెడుతూ కనిపించింది. ఆమె ఉస్సురస్సురని ఆపసోపాలు పడుతూ గుడివైపుగా వెడుతోంది. ఆమె చేతిలో పూజా సామగ్రితో నిండి ఉన్న ఒక వెండి పూలసజ్జ ఉంది. ఆమె ఒంటరిగా వెడుతూండడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఇదివరకే పరిచయం ఉండడంతో బైక్ ఆపి ఆమెను పలకరించాడు. "ఇలా వెడుతున్నారు ఎక్కడికి" అని అడిగాడు.

పూలసజ్జ చూపించింది కామాక్షి. "మొక్కుండి నేను అత్తయ్య గుడికని బయలుదేరాము. ఏ ఆటోవాడూ రాననడంతో, ఇద్దరం నడిచే బయలుదేరవలసి వచ్చింది. ఇద్దరం కొద్దిదూరం వచ్చేసరికి అత్తయ్యకు కాలు బెణికి నడవలేక వెనక్కి వెళ్ళిపోయింది. నేను పట్టుదలగా మొక్కు తీర్చుకోవాలని ఇలా నడుస్తున్నా" అంది.

"నేనూ ఆ గుడికే వెడుతున్నా, బైక్ ఎక్కండి. గుడిదగ్గర దింపుతా" అన్నాడు ప్రిన్సు జాలితో. లిఫ్టివ్వడం అతనికేం కొత్తకాదు. ముంబాయిలో ఉండగా అవసరపడిన వాళ్ళందరికీ, అడిగితే కాదనకుండా అతడు లిఫ్టు ఇచ్చేవాడు. అదికూడా ఒకరకమైన పరోపకారమే కదా!

ఆ మాటకోసమే కనిపెట్టుకుని ఉన్నదానిలా వెంటనే బైక్ ఎక్కింది కామాక్షి.

 ##########

వాలు తక్కువ ఉందడంతో బైక్ కొండదిగునను ఆపెయ్యవలసి వచ్చింది. వెలుగు తగ్గిపోతుందన్న తొందరలో ఉన్న ప్రిన్సు, కామాక్షిని అక్కడ వదిలి, వెనకాల రమ్మని తాను పరుగుపరుగున కొండపైకి వెళ్ళిపోయాడు.

దేవాలయం పరిస్థితి చాలా హృదయవిదారకంగా ఉంది. ఎటు చూసినా చెత్తా చెదారం, రాలిన ఆకులు వగైరా నానా గలీజుతో నిండి ఉంది ప్రాంగణమంతా. అక్కడ ఒక పూజారే కాదు, మానవమాత్రుడెవడూ లేడక్కడ. దూరంగా కొండ వాలున పశువులను మేపుతున్న కుర్రాళ్ళు నలుగురైదుగురు కనిపిస్తున్నారు. ఇటువంటిచోటికి కామాక్షి ఒంటరిగా రావడమేమిటి - అనుకున్నాడు ప్రిన్సు. కాని ఆ విషయం మీద ఎక్కువగా ఆలోచించేందుకు అతనికి మనసు రాలేదు. అతని మనసంతా తీయబోయే ఫొటోలు మీద నిలిచి ఉంది. ఇంక అతడు చీదరగా ఉన్న పరిసరాలను పట్టించుకోకుండా గుడిచుట్టూ తిరుగుతూ గుడి గోడలమీది శిల్పాలను, గుడి చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రకృతినీ, అస్తమిస్తున్న సూర్యుణ్ణీ, అక్కడ నివసించే రకరకాల పిట్టల్నీ ఫొటోలు తీస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్నాడు. రీలు మార్చి రీలు వేస్తూ, గుడి గోడలమీదున్న అపురూఫ శిల్పాలను వివిధ భంగిమలలో తనివితీర ఫొటోలు తీశాడు. క్రమంగా వెలుగు తగ్గింది. ఇంక ఫొటోలు తియ్యడం కుదరదని అనిపించాక అతడు కొండదిగి, బైక్ దగ్గరకి వచ్చాడు.

బైక్ మీద చెయ్యేసుకుని బైక్ పక్కనే నిలబడి ఉంది కామాక్షి. వెండి సజ్జ ఖాళీగా ఉంది. ఆమెను మళ్ళీ బైక్ ఎక్కించుకోడమన్నది ప్రిన్సుకి ఇష్టంగా లేదు. లిఫ్టు ఇచ్చినప్పుడు, ఇంతవరకు ఇలా మీద వాలిపోయి ప్రయాణం చేసిన వారెవరూ లేరు. అవసరానికి బైక్ ఎక్కినా, ఒబ్బిడిగా ఒదిగికూచుని గమ్యం చేరాక దిగి, థాంక్సు చెప్పి వెళ్ళిన వాళ్ళే తప్ప ఈమెలా ప్రవర్తించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈమె దారిపొడుగునా తన వీపుపైన అసహ్యంగా వాలిపోతూ... ఆపై అనుకోడానికి అతనికి మనస్కరించలేదు.

అతనికి ఆమెను మళ్ళీ బైక్ మీద ఎక్కించుకోవాలని లేదు. కాని ఒక ఆడపిల్లని, చీకటి పడుతున్న వేళ ఈ నిర్జన ప్రదేశంలో ఒంటిరిగా విడిచి పోవాలన్నా అతనికి మనసొప్పలేదు. "ఈ ఒక్కసారికి తప్పదు. ఆ తరవాత ఈమెకు దూరంగా వెళ్లి బ్రతుకుతాను" అని తనకి తాను నచ్చచెప్పుకుని కామాక్షిని బైక్ ఎక్కించుకుని తిరుగు ప్రయాణ మయ్యాడు.

కొద్దిదూరం వెళ్ళెసరికి బైక్ కుదపడం మొదలుపెట్టింది. యధాప్రకారం బైక్ కుదిపినప్పుడల్లా కామాక్షి ప్రిన్సుమీదకు వాలిపోతూనే ఉంది. మరి కొంత దూరం వెళ్ళేసరికి కుదుపులు దుర్భరమనిపించి బైక్ ఆపాడు ప్రిన్సు. కామాక్షి బైక్ దిగింది. టైర్లు పరీక్షించి చూసి నిర్ఘాంతపోయాడు ప్రిన్సు. రెండింటిలోనూ ఒకేసారి గాలి బాగా తగ్గిపోయినందుకు తెల్లబోయాడు. రెండు టైర్లూ కూడబలుక్కున్నట్లు ఒకేసారి ఎలా పంక్చరయ్యయో అతనికి అర్ధం కాలేదు. ఇంక ఏం చెయ్యడానికీ తోచక, "టైర్లు రెండూ పంక్చర్ అయ్యాయి, ఇంక బైక్ నడవదు" అని కామాక్షికి చెప్పేశాడు.

"గొడ్లను మేపే వాళ్ళెవరైనా కొంటెతనానికి ఏ ముల్లో గుచ్చి ఉంటారు! అయ్యో, ఇప్పుడు ఇల్లు చేరే దారేదీ" అంది ఏడుపుమొహం పెట్టి దీనంగా.

"ఇంకేముంది దారి? చక్కగా లెఫ్ట్, రైట్ కొట్టుకుంటూ, ఇంటిదాకా నడవడమే, పద" అంటూ బైక్ తోసుకుంటూ నడవడం మొదలుపెట్టాడు ప్రిన్సు.

కామాక్షికూడా అతని వెంట నడవసాగింది. బైక్ తోసుకుంటూ కామాక్షితో సమంగా నడవడం ప్రిన్సుకి చాలా కష్టంగా ఊంది. నడవలేనట్లు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తోంది కామాక్షి. బైక్ బరువు మోసుకుంటూ ఆమెతో సమంగా నడవక తప్పలేదు ప్రిన్సుకి కూడా. కామాక్షి వాళ్ళ ఇల్లు ముందుగా వచ్చింది. కామాక్షి అతని చెయ్యి పట్టుకుని "థాంక్స్" అని చెప్పి బై బై అంటూ సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంతవరకు అక్కడ ఆగి, ఆమె లోపలకు వెళ్ళేవరకు చూసి, "అమ్మయ్య" అనుకుని  బైక్ ముందుకు తోశాడు. కాని అది కదలలేదు.

అంతవరకూ దారి చూపించిన సూర్యుడు అస్తమించడంతో పరిసరాలను చీకటి ఆవరించింది. నక్షత్రాల చిరు వెలుగులో రూపమే గాని వైనం తెలియడంలేదు ఏవస్తువూ కూడా. తన బైకుని కదలనీకుండా ఆపినది ఏమిటో చూడాలని వెనక్కి తిరిగిన ప్రిన్సు దిగ్భ్రాంతుడయ్యాడు. ఆ కనువెలుగులో ఒక తెల్లని ఆకారం తన బైక్ వెనుక నిలబడి రెండుచేతులతోనూ దాన్ని గట్టిగా పట్టుకుని ఉండడం కనిపించింది.

మొదట భయమనిపించినా, మరుక్షణం అతడు ఆమెను పోల్చుకున్నాడు.

"ఏమిటిది సుబ్బులమ్మగారూ! ఏం చేస్తున్నారు మీరు" అని అడిగాడు. బరువైన బైకుని మూడు మైళ్ళు ఏకబిగిని తోసుకురావడంవల్ల అతనికి చాలా అలసటగా ఉంది. ఎప్పుడు ఇంటికి చేరి, అమ్మ వండిన కమ్మని భోజనం చేసి, చెల్లెలు సర్ది ఉంచిన మెత్తని పక్కమీద చేరి, నాన్నకు "గుడ్ నైట్" చెప్పి హాయిగా ఎప్పుడు కళ్ళుమూసుకుని నిద్రపోదామా - అన్న తహతహలో ఉన్నాడు ప్రిన్సు.

సుబ్బులమ్మ కావాలని రెచ్చిపోయింది. గొంతుకు బాగా పెంచి మాటాడసాగింది. "ఔరవురా! అసలు ఏమనుకుంటున్నావు బాబూ నువ్వు? ఐనింటి ఆడపిల్లని అర్థరాత్రిదాకా నీ వెంట తిప్పుకుని, గుట్టుచప్పుడు కాకుండా ఇంటిదగ్గ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ బాధ్యత తీరిపోతుందనుకుంటున్నావా ఏమిటి? దీనికి నువ్వు సమాధానం చెప్పితీరాలి" అంటూ అరవసాగింది.

ఒక్కసారిగా తెల్లబోయాడు ప్రిన్సు, సుబ్బులమ్మ తనపై మోపిన అభియోగాన్ని విని. క్రమంగా సుబ్బులమ్మ కేకలకి ఇంకా నిద్రపోకుండా ఉన్న ఇరుగు పొరుగు జనం ఒకరొకరూ నెమ్మదిగా బయటికి రావడం మొదలుపెట్టారు. కొడుకు రాకకోసం ఎదురుచూస్తున్న రామేశంగారి కుటుంబం, కూతురేమయ్యిందో నన్న ఆదుర్దాతో ఉన్న సుబ్బరామయ్య కుటుంబం ఇంకా నిద్రపోకుండా ఉన్నారేమో, సుబ్బులమ్మ అరుపులకు వాళ్ళు ముందే ఇవతలకి వచ్చారు. అంతవరకూ ఆరిపోయి ఉన్న వీధి దీపాలు కరెంట్ రావడంతో ఒక్కసారిగా వెలిగాయి.

అక్కడజేరిన జనం పెరిగినకొద్దీ సుబ్బులమ్మ గొంతుకూడా పెరగసాగింది. ఒక్కొక్కరినీ పేరుపేరునా పిలుస్తూ, చూశారా, చూశారా - అంటూ తప్పంతా ప్రిన్సుదే ఐనట్లు అరిచి అరిచి చెపుతోంది. కొంతసేపటికి అందరూ అదే ఉద్దేశానికి వచ్చేసి, ప్రిన్సునే తప్పుపట్టసాగారు. అందరూ తలోమాటా మాటాడుతూండడంతో అక్కడంతా గోలగోలగా తయారయ్యింది.

జనం మధ్య బైక్ పట్టుకుని నిలబడ్డ కొడుకు కనిపించగానే రామేశం మతి పోయింది. ఒక్క ఉదుటున కొడుకు దగ్గరకు వెళ్ళాడు. "ఏమిటిరా ప్రిన్సు? ఏమిటిది? అసలు ఏం జరిగిందిట"అంటూ అడిగాడు.

ప్రిన్సుకి ఏం మాటాడడానికీ తోచలేదు. బేలగా చూశాడు తండ్రివైపు.

రామేశం ప్రశ్నకు అక్కడున్నవారిలో ఒకడు జవాబు చెప్పాడు, "ఆ, ఏముంది, అంతా కావరం! వయసు కావరం!! కన్నెపిల్లను బేలుపుచ్చి, అర్థరాత్రివరకూ వెంటతిప్పుకుని, ఏమీ ఎరగనట్లు ఇంటిదగ్గర వదిలి వెళ్ళిపోతే... ఊరు ఊరుకుంటుందనుకోకండి. కన్నంలో దొంగలా పట్టుబడిపోయాడు మీ అబ్బాయి! దీనికి మీ తండ్రీ కొడుకులు జవాబు చెప్పితీరాలి" అన్నాడు. "చెప్పితీరాలి, చెప్పితీరాలి" అంటూ పక్కనున్నవారిలో చాలామంది అతనికి వంతపాడారు.

వెంటనే మరొకాయన అందుకున్నాడు, "ఇలాంటి తక్కిరిబిక్కిరి పనుల్ని మీ పట్నం వాళ్ళు పట్టించుకోరేమోగాని మా ఊరివాళ్ళు ఊరుకోరు. ఈ వూరికి కొన్ని నియమాలూ, కట్టుబాట్లూ ఉన్నాయి. ఎలాపడితే అలా సాగనియ్యం. జరిగినదానికి మీరు జవాబు చెప్పితీరాలి, తప్పదు."

ఒక పెద్దాయన పూనుకుని తునితగవుగా "జరిగిందేదో జరిగిపోయింది. దానికి తగిన పరిష్కారం వాళ్ళిద్దరికీ ముడెట్టెయ్యడమే! ఈ శతభిషలు ఎందుకుట! ఇంక ఉభయ పక్షాలవాళ్ళూ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి" అని మెరిసే కళ్ళతో గొప్పగా అందరివైపు చూశాడు.

"మంచి సలహా!", "మంచి సలహా" అంటూ అందరూ కేరింతలు కొట్టారు.

…. సశేషం ....

Posted in May 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!