Menu Close
sravanthi_plain
Hanumath Prarthana
పంచచామరము సమీరణాంజనాతనూజ! సర్వశాస్త్రకోవిదా!
సమస్తఖేదభూతదుష్టశక్తిభీతిభంజనా!
తమోఽపహారిపుత్రికేశ(1)! తార్క్ష్యభీమదర్పహా(2)!
నమో ధరాత్మజాహృదీశనామగానశేఖరా(3)!                            1

(1) సూర్ర్యుని కూతురైన సువర్చలకు భర్త
(2) గరుత్మంతునకు, భీమునకు గర్వభంగము చేసినవాడు
(3) సీతాహృదయేశ్వరుని (రాముని) నామగానము చేయుటలో శ్రేష్ఠుడు

సీ. సీతామహాసాధ్వి క్షేమంబు రామున
కందజేసిన ఘనసుందరుడవు
లంకిణిన్ మర్దించి లంకేశు దర్పంబు
నుక్కడంచిన వీర! యో కపీశ!
భానుశిష్యా! నవవ్యాకరణోద్దండ
పండితా! లక్ష్మణప్రాణదాత!
భూతప్రేతపిశాచభీతులెల్ల హరించి
రక్షగా నుండెడు రామదూత!
తే.గీ. అమితవిక్రమ! విజయసఖా! అజేయ!
కల్పకల్పాంతచిరజీవి! కార్యశూర!
మన్మనోవాస! హనుమంత! మారుతసుత!
అంజలి ఘటింతు కొను మిదే ఆంజనేయ!                            2
ద్విప్రాసకందము కనుమా వినుమా మనుమా
అనుదినమును నాదు స్వాంతమందున; దానన్
చను మా వెత లెల్లను;
చేకొనుమా వందనము చేదికొనుమా హనుమా!                        3
రవికాంతము హనుమద్దర్శనభాగ్యము గల్గ మహాబలబుద్ధివిశేషయశః
ఘనవాగ్వైభవధైర్యము లబ్బి యఖండభయంబులు జాడ్యములున్
తనురోగంబులు వీడి నశింపవె? తథ్యము చేకురు మంగళముల్
మన మానందము నొందు; తరించును మానవజన్మము తత్కృపచే        4
ఉ. శ్రీకర మాశ్రితావనప్రసిద్ధము రావణగర్వఖండన
వ్యాకులకారణంబు దురితౌఘలతాకరవాల(1) మగ్నికీ
లాకరశీతలీకరవరాప్తము(2) వాలము(3) వానరాప్తమే(4)
మా కగు నిత్యరక్ష హనుమానుకటాక్షకృపాలవాలమై                    5

(1) పాపములు అనే లతలకు కత్తి వంటిది
(2) అగ్నికీలలను చల్లబఱచు వరమును పొందినది
(3) వా (అద్భుతమును) లమ్ (సృష్టించునది) – తోక
(4) వానరులకు ప్రీతిపాత్రమైనది

Posted in May 2019, సాహిత్యం

2 Comments

  1. ASN Murthy

    శ్రీ పి.డి.రావు గారు,

    మీ స్పందనకు వందనాలు, కృతఙ్ఞతలు. మీ రెక్కడ ఉన్నారు? Contact details ఇస్తే సంతోషిస్తాను.

    అయ్యగారి సూర్యనారాయణమూర్తి

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!