Menu Close

గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

ఈ ప్రశ్నలకు మా “సిరికోన” లో గంగిశెట్టి గారు చక్కటి సమాధానాలను అందించారు.

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

భావసాంద్రత, విమర్శతో సహా, అన్ని సాహిత్య ప్రక్రియలకూ సమానమే. దీంట్లో లఘు..అనుభూతి కవితల్లో లా కాస్త ఎక్కువ. జానపద ప్రక్రియల లోని ‘దంతకథ’, ఆధునిక శైలి లోని ‘ఉదంత కథ’ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో ఈ ‘గల్పికలు’ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం మాధ్యమ పరిమితీ, వేగంగా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది కనుక.

మనవాళ్ళు - చుక్కా శ్రీనివాస్

ఆదివారం మధ్యాహ్నం.

రాజు కోపంగా I -75  హైవే మీద వాన్ వేగంగా నడుపుతూ,

"నా జీవిత సగకాలం కంటే ఎక్కువ ఇక్కడే గడిపాను నాన్న, నా చదువు కోసం అమెరికాకు వచ్చినప్పటినుండి.

ఈ ఊరు నా ఊరు, ఈ దేశం నా దేశం అ నుకొంటూ తిరిగాను నాన్న. ... పగలు, రాత్రి అనకుండా కంపెనీని పైకి తీసుకురావటానికి కష్టపడ్డాను, నలుగురికి వ్యాపకం కల్పించాను. ఎటువంటి బేధభావాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నాను.  చూశారా నాన్న!! ఆవిడ ఎట్లా మనం ఆ ఇల్లు కొనకుండా ఆపడానికి ఎంత  ప్రయత్నిస్తుందో.. చూశారా, మీకు కొనే స్థోమత ఉందా, మీ ఆఫీసుకు చాలా దూరం కదా, మీ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు కదా అని ఎన్ని సాకులు చూపుతోందో?..." ఆవేదనగా అంటూ.

"పొనీలేరా!! అయినా, అంతా పెద్ద ఇల్లు మీకెందుకురా, ఉన్నది మీరిద్దరూ, ఆ ఇద్దరు చంటి వాళ్ళు. చుట్టు బాగా ఉన్నవాళ్లు కూడా ఉన్నట్టున్నారు కూడ..." అని రావు గారు పక్కనుంచి.

మధు ఏదో చెప్పబోతూంటే, వెనక నుండి వాళ్ళ అమ్మ రామలక్ష్మి, "మీరు ఏ మాట అయినా చెప్పండి... కానీ ఇల్లు చాలా విశాలంగా, పెద్దగా ఉందిరా!! ఏ రూము చూసినా ఎంత వెలుతురూ,  ఎన్ని వసతులు, ఆ బాత్రూమే మన ముందు రూమ్ అంతా ఉంది.  పెద్ద వరండా, వెనుక గార్డెన్...

ఆమ్మో!! చుట్టూ పక్క కూడా బయటి నుంచి ఎంత పెద్ద, పెద్ద ఇండ్లో....అయినా ఏమయిందిరా? అంత కోపం ఎందుకు? మీరు ఏదో మాట్లాడుకోవటం కనపడుతున్నది గాని, నాకు ఏమో ఇంగ్లిష్ అర్థం కాదాయే ..".  ప్రక్కనే కూర్చున్నలలిత అంది...

"అత్తయ్య!! మీకు వీళ్ళు మాట్లాడే పద్ధతి తెలవాలి. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్, అదే ఇండ్ల బ్రోకర్, అంటున్నది అర్థం కావాలంటే. మధుకేమో, మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ కు చాలా దూరంగా ఉన్న, ఈ హైలాండ్స్ ఏరియాలో ఉండాలి అని, ముఖ్యంగా వాళ్ళ కంపెనీ పబ్లిక్ వెళ్ళి కొంత డబ్బు వచ్చినప్పట్టి నుండి. ఇక్కడ అంతా బాగా డబ్బున్న తెల్లవాళ్లు.

వాళ్లకు ఇక్కడ మన లాంటి వాళ్ళు ఇల్లు తీసుకోవటం ఇష్టం ఉండదు. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కు మనకు అమ్మటం ఇష్టం లేదు.. మీరు చూశారా, మనతో ఐదు నిముషాలు అయినా ఉండలేదు, కానీ  ఆ తెల్లవాళ్ళతో ఎంత సేపు నవ్వుతూ మాట్లాడుతూ, ఇల్లంతా తిప్పి ఎంత శ్రద్ధ గా చూపెడుతోందో..."

రావు గారు ముందటి నుంచి, "అవునమ్మ, నువ్వు అంటుంటే అనిపిస్తోంది, మనం కాకుండా ఇల్లు చూడటానికి వచ్చిన వాళ్ళంతా తెల్లవాళ్లే...మనం విశాల మనస్సుతో అందరూ మనవాళ్ళే అని అనుకుంటాం కానీ, వీళ్ళు మన ఇండియన్స్ ని వాళ్ళు ఉండే కాలనీలోకి రానీయరమ్మ.. ఇవ్వేం బుద్ధులో..." అని అన్నారు.

వెంటనే రామలక్ష్మి ఒక క్షణమైనా తడుముకోకుండా

"ఆ!!! చెప్పకండి, మీరు మరీను!! మీరూ, మీ ఫ్రేండ్ ఆ రెడ్డి గారు, ఆ హోసింగ్ సొసైటీ వాళ్ళు ఎన్ని కారణాలు చూపెట్టలేదు, ఏం చేయలేదు... మీ ఆఫీసులో పని చేసే గఫూర్, అదేనండి ఆ తురకాయన, మనింటి పక్క ఇల్లు, మన గేటెడ్ కమ్మూనిటీలో ఇల్లు కొనకుండా చేయడానికి. ..

వాళ్ళు మనవాళ్ళు కాదన్నారు, ఎద్దు మాంసం తింటారన్నారు, వాళ్ళ వాళ్ళంతా వచ్చి చేరితే ఎంత మంది పిల్లలను కంటారో, మనం మన ధర్మం ఏమయిపోతుందో, మన ఇండ్ల ధరలు పడిపోతాయని నానా  గొడవ చేసి పాపం ఆ పెద్ద మనిషిని రాకుండా చేసి ఆ రెడ్డి గారి తోడల్లుడిని తొందరపెట్టి ఆ ఇల్లును కొన్నిచ్చారు గదా మీరందరు కలిసి..." అంది.

రావుగారు, లలిత, మధు అవాక్కు అయి, ఆశ్చరంగా రామలక్ష్మి దిక్కు చూస్తూ ఉండిపోయారు.

*****

రెక్కలెక్కడ - గంగిశెట్టి ల.నా.

"హేయ్, యూ ఎగైన్" చిరాగ్గా వస్తున్న పోలీసాఫీసర్ సాం ను చూసి, నిర్లిప్తంగా తలదించుకొని బాగ్ ను మెల్లగా ఎత్తుకొని వీపుకి తగిలించుకొన్నాడు మైషెల్. అతనికున్న ఆస్తి అంతా, ఆ వీపు సంచీ, ఆ పాత గిటార్ మాత్రమే!

ఆ గిటార్ ను చూసే, సామ్ కి అతని పట్ల కాస్త మెత్తదనం... అందుకే కటువుదనం లేని చిరాకుతో అన్నాడు..

“ఎన్ని మార్లు చెప్పాలి నీకు, పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా తిష్టవేయొద్దని!... గెట్ లాస్ట్... తొందరగా నడు.. మరోసారి కనిపించావంటే కచ్చితంగా లోన పడేసి, హోమ్ కు పంపించేస్తాను..." కాస్త గట్టిగానే అన్నాడు... అతను, చెవులనే ఇంద్రియాలు లేనట్లుగా మళ్లీ లైబ్రరీ వేపు సాగిపోతున్నాడు, ఇందాకా అక్కడే, ఉదయ కార్యక్రమాలు తీర్చుకొని ఇటుగా వచ్చాడు... ఇప్పుడు మళ్లీ వెళ్లి ఆ కారిడార్లో తిష్టవేయాలి... అలాటి హోమ్ లెస్ ద్రిమ్మరులెందరికో లైబ్రరీ విశాల భవనమే, కాస్సేపు ఆరామ మందిరం. లోన అలమారుల్లోని పెద్ద బౌండు పుస్తకాలెంతో, బయట తనవారంటూ ఎవరూ లేని, ఈ బౌండ్ లెస్ ద్రిమ్మరులూ అంతే!

వెళ్తున్న వాడికేసే చూస్తున్న సామ్ చేతిలో ఫోన్ మోగింది. పేరు చూసి,  "హాయ్ శారా, హౌ ఆర్యూ? ఏవైనా వివరాలు తెలిశాయా?" హుషారుగా అడిగాడు... "ఇందాకా వస్తూ చూశా.. ఇక్కడే పిల్లల పార్క్ వద్ద, కారాపాను, చెబుతా రా!" అంది శారా... రెండు నిమిషాల్లో చేరుకున్నాడక్కడికి...

"ఎన్ని మార్లు చెప్పాను, ఒట్టి చేతుల్తో వ్యక్తుల కేసి అలా వెళ్ళొద్దని... ఎంత ప్రమాదం.. నీ పద్ధతి అంటే గౌరవం లేని  నీకెవరిచ్చారయ్యా ఈ పోలీసుద్యోగం" చనువుగా అంటూనే నేరుగా విషయంలోకి వచ్చేసింది, శారా..."వివరాలు కనుక్కొన్నాను... ఈ నీ వీధి నేస్తం, మైషెల్ కు తల్లి ఇంకా సజీవంగా ఉన్నారు.. ప్రస్తుతం పైన్నే మౌంటానాలో  ఉన్నారు...ఇతను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే, ఇతని తండ్రికి ఇతన్ని అప్పగించేసి, ఆవిడ రెండో పెళ్లి చేసుకొని, కెంటకీకి వెళ్లిపోయిందట... అతనితో ఓ పదేళ్లు కాపురం చేసి విడిపోయాక, అప్పట్లో ఇతని కోసం వెదికిందట.. కానీ తండ్రి పోయాక, సవతి తల్లి వద్ద వివక్షకు గురై, ఇతను వీధులపాలు కావడంతో, ఆచూకీ తెలియక, బాధతో వెనుతిరిగి పోయిందట.... ఇంతకీ, ఇతనికి గుర్తుండి పోయిన తన తండ్రి ఇంటి పేరొక్కటే తన్నిప్పుడు బయటకు పడేసింది... మూడో భర్తవల్ల కలిగిన సంతానంతో పాటు ఉన్నా నిత్యం, ఈ మొదటి కొడుకు 'ఎక్కడున్నాడో, ఎలాగున్నాడో' అనే ఆవేదన, ఆరాటం ఆమెను వెంటాడుతూనే ఉన్నాయట... నువ్వు పంపిన వివరాలు, ముఖ్యంగా ఆ తండ్రి ఇంటి పేరు, స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా తెలియగానే, వెంటనే కాంటాక్ట్ చేసిందట.. వాళ్లు మా సేవాసంస్థకి తెలిపారు... డిఎన్ఏ వివరాలు కూడా మ్యాచ్ కావడంతో,  దాదాపు ఏభై ఏళ్ల తర్వాత తన కొడుకుని కలుసుకోటానికి ఆ తల్లి ఎంత ఆరాట పడుతోoదో కదా!" సంతృప్తిగా మిలమిల లాడే కళ్ళతో చెబుతోంది శారా..  సంఘసేవావృత్తిలోకి దిగినప్పటినుంచి, ఇంత సంతృప్తికరమైన సమయం ఆమె జీవితంలో రాలేదు...

సామ్ కు కూడా అంతే, పోలీసాఫీసరుగా చేరిన ఈ నాలుగేళ్లలోనూ, ఇంత సంతోషకరమైన రోజు మరొహటి రాలేదు... మొదట్లో మైషెల్ వాలకం చూసి అనుమానించాడు.. రెండు మూడు సార్లు స్టేషన్ కు కూడా పట్టు కెళ్లాడు.. అయితే అతనికి ఒక జీవితమంటూ లేకపోవడమటుంచి, తన జీవితం గూర్చే ఏమీ తెలియదని తెలిసినప్పటినుంచి, గత ముప్ఫయిదేళ్ల నుంచి అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో, కేవలం మతిలేని ద్రిమ్మరిగా తిరుగుతున్నాడని తెలిసినప్పటినుంచి, ఎక్కడో దొరికిన ఆ గిటార్ తీగల్లోనే, తన జీవన స్వరాలను మేళవించుకొని, శూన్యమైన ఊరట పొందుతున్నాడని తెలిసినప్పటి నుంచి, ఏదో తెలియని ఆర్ద్రత అతని పట్ల కలిగింది. అతను తన తల్లి పేరు గుర్తు పెట్టుకొని చెప్పడంతో, అతని అప్పటి ఇంటిపేరు ఆధారంతోనే, ఆ తల్లి ఆచూకీ కోసం వెదుకులాట ప్రారంభించాడు. సంఘ సేవిక శారా ను కలిశాడు. అన్ని స్టేషన్లకి ఆన్ లైన్లో సమాచారం పంపాడు. అందరూ అదే మానవీయ దృక్పథంతో స్పందించారు.. ఫలితంగా ఈ సంతోష సంఘటన...

"శారా! ఈ క్రిస్మస్ కు ఇతన్ని వాళ్ళమ్మ వద్దకు చేరుద్దాం. అక్కడే, అలా, మనం క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకొందాం. నువ్వు అంగీకరిస్తే, ఇవ్వాళే టికెట్స్ బుక్ చేస్తాను" అన్నాడు, సామ్... రెట్టింపు సంతోషంతో తలూపింది,శారా, ఆ తల్లీతనయుల్ని కలుపుతున్న సన్నివేశాన్ని ఊహించుకొంటూ...

*********

కన్నీళ్లలో తడిసిపోతూ దాదాపు ఏభై ఏళ్ల తర్వాత, ఆ అరవై ఏళ్ల కుమారుడి చెంపల్ని నిమిరి నిమిరి ముద్దు పెట్టుకొంది, ఆ డెబ్భై ఎనిమిదేళ్ల తల్లి...తెలిసీ తెలియని చిన్న వయసులో ప్రేమ, రెండో ఏడు కొడుకు, ఆ తర్వాత అతి కష్టంగా మరో ఎనిమిదేళ్లు అతనితో నెట్టుకు రావడం, చివరికి విడిపోవడం, కొడుకు తనకే కావాలని అతను పట్టుబట్టడం... అన్నీ నెమరేసుకొని చెబుతూ, కన్నీళ్లు తుడుచుకొంటూ, పసిబిడ్డలా అతన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దాడింది ఆ తల్లి. ఆమె మరో సంతానం జాన్, మేరీలు కూడా ఆనందంగా, అబ్బురంగా, సామ్, శారాలతో పాటు వారిని చూస్తూండిపోయారు.... అంతకంటే అబ్బురం, తన్మయత్వం మైషెల్ కు... ఇన్నేళ్లు నిలువ నీడ లేకుండా బ్రతికిన తనకు... ఈ వయసులో అమ్మ ప్రేమ... ఓ సోదరుడు, సోదరి... ఒక ఫ్యామిలీ.. ఫ్యామిలీ...! అలవాటైన నిరామయతలో ఏం తోచని ఆనందం!!

నెమ్మదిగా సామ్ వైపు చూసి అడిగింది ఆ తల్లి " ఏదీ, వెనక్కి తిరుగు"అని.. "ఎందుకు?" సామ్ అడిగాడు...

"తిరుగు" అంది ఆ మాతృమూర్తి... తిరక్క తప్పలేదు...

"రెక్కలెక్కడ?" అడిగిందామె. అతనికే కాదు,ఎవరికీ అర్థంకాలేదు...

" దేవదూతలు, ఏంజెల్స్ కు వీపున రెక్కలుంటాయట కదా! మరి మీకేవీ"... ప్రేమ, కృతజ్ఞత ఉట్టిపడుతున్న గొంతుకతో ఇద్దరి కేసీ చూస్తూ ఆవిడడిగింది... సామ్, శారా ల కళ్ళంచుల్లో, భాష లేని బాష్పం తొంగి చూసింది...

"మెర్రీ క్రిస్మస్ మై ఏంజెల్స్" కంపిస్తూ ఆమె గొంతు...

 

***ఒక వాస్తవిక సంఘటన ఆధారంగా!***

శుభవార్త - అత్తలూరి విజయలక్ష్మి

ఆరోజు ఉదయాన్నే మాధవి ఫోన్ చేసి శుభవార్త చెప్పింది.

అది వినగానే హమ్మయ్య అని ఒక నిట్టూర్పు విడిచాను.

మాధవి పెళ్లి చేసుకుంది...

ఇరవై ఏళ్ల వయసులో ప్రదీప్ అనే తన డిగ్రీ క్లాసు మేట్ ని వెర్రిగా  ప్రేమించింది. అతనికోసం సర్వస్వం త్యాగం చేసింది. చదువు మధ్యలోనే ఆపేసి అతనే లోకంగా బతికింది. ప్రదీప్ తన అందంతో, మాటకారి తనంతో మాధవిని మేస్మరైస్ చేసాడు.. దాని మనసుతో, జీవితంతో ఆడుకున్నాడు. ఆ మాయలో పడి తల్లి,తండ్రులని, తోబుట్టువులని, బంధు, మిత్రులని అందరినీ వదిలేసి ఇతను చాలు నాకు నూరేళ్ళు నిశ్చింతగా బతికేస్తాను అంది. దాని అమాయకత్వాన్ని, వెర్రి ప్రేమను అర్ధం చేసుకుని, ఏ క్షణంలో మోసపోతుందో ఈ పిచ్చిది నిస్సహాయంగా, వంటరిగా నిలబడిపోయిన రోజు దీన్ని ఆదుకునేదేవరు అని నేను మాత్రమే దాన్ని వదలకుండా అప్పటినుంచి ఇప్పటి వరకు అంటిపెట్టుకుని ఉన్నాను. మేమిద్దరం ఇరుగు, పొరుగు ఇళ్ళల్లో ఉండడమే కాదు, ఇద్దరం నాలుగో తరగతి నుంచి కలిసే చదువుకున్నాం... కలిసే ఉన్నాం. మాధవి అంటే నాకు చాలా ఇష్టం... దాని అందమైన కళ్ళు నాకు ఇష్టం... దాని కళ్ళు మాట్లాడేవి.. ఎన్నో కధలు చెప్పేవి.... కబుర్లు చెప్పేవి.. అది తక్కువ మాట్లాడేది... నేను వసపిట్టను. నా మాటలు అందమైన చిరునవ్వుతో వింటూ, కళ్ళతో సమాధానాలు చెబుతూ ఉండేది.

అలాంటి మాధవిని సున్నితమైన మనసున్న మాధవిని, మోసం చేసాడు ప్రదీప్...దుర్మార్గుడు...

ఆ దెబ్బతో మాధవి మనసు విరిగిపోయింది.. పిచ్చిదైంది ... అటు చదువు పూర్తిచేయక, ఇటు అయిన వాళ్ళందరికీ దూరమై ఈ ప్రపంచంతో సంబంధం లేని దానిలా శూన్యంలో బతుకుతున్న మాధవిని మామూలు మనిషిని చేయడానికి రెండేళ్ళు పట్టింది.

ఆపేసిన చదువు తిరిగి కొనసాగించమని నచ్చచెప్పి కాలేజిలో చేర్పించాను. ఈ లోగా నా పెళ్లి అవడంతో మాధవి పట్ల శ్రద్ధ వహించలేకపోయాను. మాధవి నెమ్మదిగా కోలుకుని ఎం ఏ చేసి ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ళ మీద తను బతకడం మొదలుపెట్టింది. కానీ పెళ్లి చేసుకోమని ఎంత బతిమాలినా చేసుకోలేదు.. ఇంక ఈ జీవితానికి  ప్రేమ, పెళ్లి అనేవి లేవు సునీతా... నా డిక్షనరీ లో నుంచి ఆ రెండు పదాలు తీసేశాను అంది.  ఇప్పుడు మాధవి వయసు ముప్ఫై దాటింది..

“ఇప్పుడు తను పెళ్లి చేసుకున్నాను సునీ... ఒకసారి ఇంటికి రా” అని ఫోన్ చేసి పిలవడం నాకు శుభవార్త కాక మరేంటి?

మధ్యాహ్నం కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న మాధవి ఇంటికి వెళ్లాను.

మూసి ఉన్న తలుపులు కొట్టడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది.. కొత్తగా పెళ్ళైన జంట కదా.. డిస్టర్బ్ చేయడం సబబు కాదేమో అని సందేహిస్తూ కాలింగ్ బెల్ నొక్కాను.  వెంటనే తలుపు తీసింది మాధవి.. అదే చిరునవ్వు.. అవే కళ్ళు...” నీకోసమే ఎదురుచూస్తున్నా” అంది.

“కంగ్రాట్స్ మధూ” అన్నాను దాన్ని దగ్గరకు తీసుకుని నుదుట ముద్దుపెట్టుకుని.

“ధాంక్ యు” నవ్వింది. ఇల్లంతా నిశ్సబ్దంగా ఉంది. అతను కనిపించలేదు..

“ఏడి నీ మనోహరుడు?” అడిగాను.

మాధవి అలవాటుగా నవ్వి ఫ్రిడ్జ్ లో నుంచి జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి ఇచ్చింది. రా అంటూ ఓరగా వేసి ఉన్న తలుపులు తెరిచి  గదిలోకి తీసుకు వెళ్ళింది. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి నిశ్చేష్టురాలిలా చూశాను.

నా చూపులకి మెత్తగా నవ్వి వీల్ చెయిర్ లో కూర్చుని టి వి చూస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి సాగర్ అని పిలిచింది మృదువుగా .. అతను ఆమె వైపు చూపులు తిప్పాడు. “నా ఫ్రెండ్ సునీత” అంది నా వైపు చూపిస్తూ. అతను నావైపు తదేకంగా చూసాడు. అతని చూపులు నిర్వికారంగా ఉన్నాయి. ఆ చూపుల్లో ఎలాంటి భావం లేదు. మళ్ళి చెప్పింది మాధవి “తను సునీత“  మెల్లగా అతని పెదవులు విచ్చుకున్నాయి.  “హాయ్ చెప్పు”  అంది మాధవి.

“హాయ్” అన్నాడు అస్పష్టంగా.. నేను సమాధానం చెప్పకుండా అలాగే బొమ్మలా చూస్తూ ఉండిపోయాను.

మాధవి అతని తల మీద చేయి వేసి మెల్లగా నిమిరి “ఓకే కారి ఆన్”  అంటూ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని వేరే గదిలోకి తీసుకువెళ్ళింది.

“ఏంటే ఇది” అన్నాను ..

“జీవితం ...” నవ్వింది.

“ఇదేం జీవితం?” ఆవేశంగా అన్నాను.

“ఏం జీవితానికి పారామీటర్లు ఉన్నాయా... ఎందుకంత టెన్షన్ పడుతున్నావు. నేను చాలా హాపీగా ఉన్నాను. అవును సునీ! నేను చాలా సుఖంగా, ఆనందంగా ఉన్నాను. సాగర్ కి నేనంటే ప్రాణం ... నేను కనిపించకపోతే అల్లాడిపోతాడు.  ప్రతి చిన్న దానికీ నేనుండాలి. నాక్కూడా .... ఒక్క క్షణం ఆగి అంది అతనంటే ఇష్టం ...”

“సిగ్గులేకపోతే సరి..” కోపంగా అన్నాను.

మాధవి మృదుమధురంగా నవ్వుతూ “ఎందుకే అంత కోపం! నీకు తెలుసా... ఈ ప్రపంచంలో అందరు ఆడవాళ్లకన్నా నేను అదృష్టవంతురాలిని... నా ప్రేమలో ఉన్న భద్రత మీ ప్రేమలో ఉందా? ఏ మగవాడన్నా ఒక్క అమ్మాయి ప్రేమతో జీవితాంతం బతుకుతాడా.. ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ప్రేమలు కావాలి.. కొత్త, కొత్త రుచులు కావాలి..  భర్త అయినా, ప్రేమికుడు అయినా వాడి ప్రేమలో సిన్సియారిటీ ఉంటుందా.. మనం ప్రతిక్షణం వీడు ఏ అమ్మాయి వెంట పడతాడో, ఏ  క్షణం మనల్ని వదిలేస్తాడో అని భయపడుతూ కుక్క కాపలా కాస్తూ బతకాలి.. కానీ నాకు సాగర్ విషయంలో ఆ భయం లేదు, బాధ లేదు, అభద్రతాభావం లేదు.. I am the happiest woman in this world… ఎందుకంటే తను ఇంకో అమ్మాయిని చూసే అవకాశం లేదు నేను చూపిస్తే తప్ప.  ఎవరితో మాట్లాడే అవకాశం లేదు స్పష్టంగా మాట్లాడలేడు కనక.. అతనికి ఈ ప్రపంచంలో ఇద్దరే తెలుసు. వాళ్ళ అమ్మ... ఆవిడ పోతూ, పోతూ నాకు అతన్ని అప్పచెప్పి వెళ్ళింది కాబట్టి నేను ...నేను ఎవరికీ అప్పచెప్పను.. నాతో తీసుకు వెళ్ళిపోతాను.. ఎవరినీ కష్టపెట్టడం నా తత్వం కాదుకదా... “

ప్రాబ్లెమ్ ఏంటి? నీరసంగా అడిగాను.

“Multiple sclerosis…. నరాల బలహీనత...” ..మాధవి కళ్ళల్లో నిండిన నీళ్ళు ఆమె నవ్వుతో విచ్చుకుంటున్న పెదవుల చివరకు వచ్చి ఆగిపోయాయి.

*******

 

Posted in February 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!