Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

గతసంచిక తరువాయి »

ఆ రోజు స్మరణతో మాట్లాడడానికి అవకాశం లభించలేదు సంధ్యకి. స్మరణ వస్తూనే ఫ్రెష్ అయి, “మమ్మీ కాఫీ ఇవ్వు” అంటూ అరిచి లాప్టాప్ తీసుకుని కూర్చుంది. సంధ్య కాఫీ కప్పుతో వచ్చి స్మరణకి ఇచ్చి పక్కనే కూర్చుని “ఇప్పటిదాకా దాంతోటే గా గడిపావు..ఇంటికి వచ్చాక అయినా అది పక్కన పెట్టచ్చుగా” అంది.

తల అడ్డంగా ఆడిస్తూ సంధ్య వైపు కూడా చూడకుండా “చాలా వర్క్ ఉంది..ఇవాళ నేను పడుకునే సరికి కూడా బాగా లేట్ అవుతుంది..” అంది స్మరణ.

సంధ్య రిమోట్ చేతిలో పట్టుకుని టి వి స్క్రీన్ మీద నుంచి చూపులు తిప్పకుండా తనకేమి సంబంధం లేనట్టు కూర్చున్న దీపక్ వైపు చూసింది. ఆమె తన వైపు చూస్తున్నట్టు గ్రహించిన దీపక్ ఇప్పుడు తల్లి, కూతుళ్ళ విషయాల్లో తను కలగచేసుకోడం ఉచితం కాదు అన్నట్టు మౌనంగా ఉండిపోవడంతో సంధ్యకి ఒళ్ళు మండింది.

అక్కడి నుంచి కొంచెం విసురుగా లేచి వంట గదిలోకి వెళ్ళిపోయింది డిన్నర్ రెడీ చేయడానికి.

“కానీ, కానీ ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తుంది... చూస్తా .. రేపు సాయంత్రం లోగా అది మాట్లాడకపోతే మావయ్యగారితో చెప్పిస్తా” అనుకుంటూ చపాతీ పిండి తడపసాగింది.

మరునాడు ఉదయం సంధ్య రోజూలాగే తన టైం కి లేచి స్నానం, పూజ చేసుకుని వంట పూర్తీ చేసి ఇడ్లి స్టాండ్ తీస్తుండగా స్మరణ నిద్రలేచి నేరుగా బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయి పది నిమిషాల్లో స్నానం చేసి గదిలోకి వెళ్ళిపోయింది. సంధ్య మనసులోనే స్మరణ తో మాట్లాడే విధానం రిహార్సల్స్ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చూపుల ప్రసక్తి తీసుకువస్తే స్మరణ చేసే రభస ఆవిడకి తెలుసు. నాకిప్పుడే పెళ్ళేంటి? నేను లైఫ్ ఎంజాయ్ చేయద్డా .. అయినా పెళ్లి చూపులేంటి అదేంటి? ఇదేంటి అంటూ గయ్యిమంటుంది. అలా అని ఎప్పటికీ ఆ ప్రసక్తి తేకుండా ఉండడం సాధ్యం అవుతుందా. ఈ పాటికి పెళ్లి అయి ఉంటె కనీసం ఒక పిల్ల తల్లి అయేది. ఇన్నాళ్ళు పెట్టిన వంకలు ఇప్పుడు పెట్టడానికి లేదు.. మంచి ఉద్యోగం వచ్చింది. చదువు అయిపొయింది.. ఇంకా ఏముంటుంది వంకలకి! అయినా ఇంత ఆలోచించడం ఏమిటి నోరుమూసుకుని పెళ్లి చూపులకి సిద్దంగా ఉండు అని చెప్పకుండా.. దీని ఇండివిడ్యువాలిటీ కాదుగానీ తల్లి, తండ్రులు కూతురుతో మాట్లాడడానికి భయపడడం ఏంటి? చిరాకు వచ్చింది సంధ్యకి.

టాపిక్ ఎలా తీసుకురావడమా అని ఆలోచిస్తూనే కుక్కర్ విజిల్ రావడంతో స్టవ్ ఆఫ్ చేసింది. పచ్చడిలో పోపువేసి ఇడ్లి కుక్కర్ మీద మూత తీసి స్టాండ్స్ బయటకి తీసి చిన్న స్పూన్ తో ఇడ్లిలన్ని తీసి హాట్ ప్యాక్ లో వేసింది. నేయి కరగబెట్టి, పచ్చడి బౌల్, కారప్పొడి హాట్ ప్యాక్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ప్లేట్లు, మంచినీళ్ళు సర్దుతూ మరో పది నిమిషాలు గడిపింది. ఓ సారి స్మరణ గదివైపు తొంగిచూసి దీపక్ ని పిలిచినట్టు కొంచెం గట్టిగా పిలిచింది “బ్రేక్ ఫాస్ట్ రెడీ వస్తున్నారా!”

“ఎస్ కమింగ్” అంటూ సమాధానం ఇచ్చాడు దీపక్.

టైం చూసింది సంధ్య. ఎనిమిది నలభై అవుతోంది. చూస్తూ, చూస్తుండగానే సమయం గడిచిపోతోంది. అందరికీ ఆఫీస్ లకి టైం అయిపోతోంది. ఈ మహాతల్లి ఇంకా ఏం చేస్తోందో అనుకుంటూ “స్మరణా! అయిందా టైం అవుతోంది” అంది గట్టిగా.

“వస్తున్నా మమ్మీ” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీ జరుపుకుని కూర్చుంది స్మరణ.

ఆమె ఒంటి మీద చల్లుకున్న బాడీ స్ప్రే  మైల్డ్ గా సువాసనలు వెదజల్లుతోంది. భుజాలదాకా ఉన్న జుట్టు ట్రిమ్ చేసి వదిలేసింది. సన్నగా తీర్చి దిద్దుకున్న కాటుకతో అందమైన సోగ కళ్ళు ఇంకా అందంగా ఉన్నాయి. కనుబొమల మధ్య చిన్న నల్ల స్టిక్కర్, లేత రంగు లిప్స్టిక్, తెల్లటి షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, ఆధునిక యువతికి చిరునామాలా ఉంది.

ఇడ్లి ప్లేట్ లో వేస్తూ అంది సంధ్య.. “ తాతయ్య ఫ్రెండ్ డాక్టర్ సూర్యప్రకాష్ గారని ఆయన, ఆయన భార్య, వాళ్లబ్బాయి రేపు మనింటికి వస్తున్నారట..”

స్మరణ ఇడ్లి తుంచి చట్నీ నంచుకుంటూ “ఓహో” అంది.

“ఓహో కాదు.. రేపు నువ్వు సెలవు పెట్టు.”

“వాళ్ళెవరో వస్తుంటే నేనెందుకు సెలవు పెట్టాలి?” ఆశ్చర్యంగా అడిగింది స్మరణ.

వెధవ తెలివితేటలు ప్రదర్శిస్తోంది.. అర్థం కాకనా! మనసులోనే పళ్ళు నూరుతూ ప్రశాంతంగా అంది “వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తున్నారు.. రేపు వీలవకపోతే శనివారం రమ్మంటావా!”

“వాళ్ళెవరు? నన్నెందుకు చూడాలి?”

సంధ్య ఇంక దాచడం అనవసరం అన్నట్టు చెప్పింది “ఎందుకేంటే వాళ్ళబ్బాయి అమెరికాలో మంచి పొజిషన్ లో ఉన్నాట్ట.. అతను ఇండియా వచ్చాడు.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారుట.. మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్తాట్ట.. అందుకని తాతగారు నీ విషయం చెప్పారు.. ఓసారి పెళ్లి చూపులకి పిలవమని నాన్నకి చెప్పారు.. నాన్న వాళ్లకి ఫోన్ చేసాడు.. సరేనా... చెప్పు ఎప్పుడు రమ్మంటావు?”

“నాకు పెళ్లి చూపులేంటమ్మా...”

“నీక్కాక నాకా!” చిరాగ్గా అంటున్న సంధ్య అప్పుడే వచ్చిన దీపక్ తో అంది “మీ భాషలో మీ కూతురుకి చెప్పండి.. పెళ్లి చూపులు అంటే తెలియదుట ..”

దీపక్ కూతురు పక్క ఉన్న కుర్చీలో కూర్చుని భార్య అందించిన ఇడ్లి ప్లేట్ అందుకుని అన్నాడు “ఏంటిరా తల్లి ఏంటి నీ డౌటు?”

“నాకు పెళ్లి చూపులు అంటుంది అమ్మ. నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా!”

“నీకు కాక ఎవరికి చేస్తాను పెళ్లి?”

“ఇప్పుడు నాకు పెళ్ళేంటి డాడీ నాకింకా మంచి జాబు లేదు.. పాడులేదు.. ఎన్నిసార్లు చెప్పాలి నాకు సంబంధాలు చూడద్దని.. అయినా ఈ పెళ్లి చూపులు ఏంటి అసహ్యంగా” అసహనంగా అంది స్మరణ.

“ఇప్పటికే పాతికేళ్ళు వస్తున్నాయి.. ఇంకా ఎప్పుడే ... ఇంకేం జాబు.. యాభై వేలు వస్తున్నాయిగా నెల తిరిగేసరికి.” మండిపడింది సంధ్య.

“సంధ్యా! నువ్వుండు నేను మాట్లాడతాను”  సంధ్యను వారించి అన్నాడు దీపక్. “వాళ్ళు తాతయ్యకి స్నేహితులుట..  చాలా మంచి కుటుంబం.. ఎద్యుకేటేడ్ ఫ్యామిలీ.. ఆ అబ్బాయి ఎం ఎస్ చేసి అక్కడే మంచి జాబు చేస్తున్నాట్ట ..తాతయ్య చెప్పారని ఓసారి చూడడానికి వస్తాము అన్నారు..చూడగానే అయిపోతుందా.. ఆ అబ్బాయికి నువ్వు నచ్చాక కదా పెళ్లి దాకా వచ్చేది”

స్మరణ చర్రుమంది.. “చూసారా మీ ఆటిట్యూడ్ మారదు ...అబ్బాయికి నేను నచ్చితే చాలా.. నాకు అబ్బాయి నచ్చద్దా  ... అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడతాము..అంటారు..కానీ అబ్బాయి నచ్చితే అనరేంటి? తాతయ్యనే అడుగుతానుండు.”  ఎడం చేతిలో ఉన్న మొబైల్ ఆన్ చేయబోతుంటే సంధ్య గబుక్కున లాక్కుని “ ఉద్దరించావులే నోరుమూసుకుని తిను..” అంది.

అలా అందేకాని కూతురి మాటలకి విస్తుబోయింది. స్మరణ పెంకితనం, నాగరికత పేరుతొ పోయే వింతపోకడలు నచ్చక కానీ, లేకపోతె ఆ పిల్ల మాటల్లోని లాజిక్ కి ముచ్చట పడేది. దీనికేనా లేక ఈ కాలం ఆడపిల్లలంతా ఇలాగే ఆలోచిస్తారా అనుకుంటూ భర్త ఏం అంటాడో అని కుతూహలంగా చూసింది.

“ఏదో మాటవరసకి అలా వాళ్ళతో అంటారు కానీ, అబ్బాయి నీకు నచ్చాడా లేదా అని అడక్కుండా ముహూర్తాలు పెట్టించేస్తారా  స్మరణ.. అమ్మ చెప్పినట్టు శనివారం రమ్మంటే అదే చెప్తాను ఫోన్ చేసి,,” అన్నాడు.

“ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడే పెళ్లి చేయాలనుకోడం తప్పు.. రెండు, పెళ్లి చూపులు అరేంజ్ చేయడం మరో తప్పు.. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఇప్పుడే పెళ్లి చేసుకోను...” స్మరణ టిఫిన్ తినడం ముగించి కుర్చీలోంచి లేచింది.

“ఏంటే పెద్ద తప్పులెన్నుతున్నావు పాతికేళ్ళు వస్తున్నాయి.. ఇంకా ఎప్పుడు చేసుకుంటావు?”

“మాటి, మాటికీ పాతికేళ్ళు వస్తున్నాయి.. పాతికేళ్ళు వస్తున్నాయి అంటావేంటి? ఇంకా రాలేదు.. వచ్చాక చేసుకుంటాను.” నాప్ కిన్ తో మూతి తుడుచుకుని మంచినీళ్ళ గ్లాస్ అందుకుని గగట, గటా తాగేసింది.

“నీకు చేసుకోవాలని అనిపించినప్పుడు మంచి సంబంధం దొరుకుతుందా?”

“దొరక్కపోతే పోనీ అయినా నేను అరెంజేడ్ మారేజ్ చేసుకోను ..”

సంధ్య గుండెల్లో రాయి పడింది.. అయింది అనుకున్నంత అయింది.. ఎప్పుడో కొంప ముంచుతుంది అనుకుంది. అది ఇప్పుడే జరిగింది.. ఎవరినో ప్రేమించింది వాడే కులమో.. ఏం చదువుకున్నాడో, ఏం చేస్తున్నాడో...” ఆ ఆలోచన రాగానే మీదపడి కొట్టినంత పని చేసింది... “చంపేస్తాను ప్రేమ, గీమా అంటే ..”

ఆవిడ వైపు చిత్రంగా చూసి తండ్రి వైపు చూసి “ఏంటి డాడీ ఈవిడ.. నేను ప్రేమించానని చెప్పకముందే ఎందుకలా ఆవేశపడుతోంది” అంది స్మరణ.

సంధ్య స్మరణ వైపు చుర,చుర చూస్తూ దీపక్ తో అంది “ఇదిగో చూడండి మీ కూతురికి మీరు చెప్పి ఒప్పిస్తారో, ఏం చేస్తారో, మీ నాన్నగారు ఫోన్ చేయమన్నారు చేయండి నాకు తెలియదు మిగతా విషయాలు” అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.

సంధ్య ఆవేశం చూడగానే దీపక్ కి కొంచెం భయం వేసింది ఇప్పుడు తల్లి, కూతుళ్ళు ఇద్దరూ ఏం గొడవ పడతారో అనుకుంటూ స్మరణని మృదువుగా అడిగాడు “ఇంతకీ నువ్వు చెప్పేదేంటి మేము చూసిన సంబంధం చేసుకోవు అంతేనా”.

“అంతే..” నిర్లక్ష్యంగా అంది స్మరణ.

“అంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావనమాట..”

“డాడీ!” ఒక రకమైన విసుగుతో చూసింది స్మరణ. “ప్రేమిస్తే చెప్పనా దాచుకోడం ఎందుకు? ఇంకా ప్రేమించలేదు..”

“ఓ మొత్తానికి ప్రేమించాలనుకుంటున్నావన్నమాట.. సరే పోనీ ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు.”

కూతురలా నిర్లక్ష్యంగా, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతుంటే భర్త దాన్ని మందలించకుండా వాదనేసుకోడం చూస్తుంటే చికాకొచ్చేస్తోంది సంధ్యకి. కాఫీ కప్పులతో వచ్చి ఏదో అనబోతుంటే మాట్లాడద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేసాడు దీపక్.

“చెప్పమ్మ ఇంతకీ ఎప్పుడు ప్రేమిస్తావు” స్మరణ వైపు చూస్తూ అన్నాడు.

“నాకేం  తెలుసు డాడీ నాకు నచ్చిన వాడు ఎప్పుడు దొరికితే అప్పుడు ... తిధి , వారం, నక్షత్రం చూసుకుని ప్రేమించాలా ఏంటి?” కాఫీ కప్పు అందుకుంది స్మరణ.

సంధ్య కసిగా అంది “అయితే నీకు పెళ్ళయినట్టే.”

“ఏం ఎందుకు కాదు?”

“నీకు నచ్చినవాడు పుట్టాలిగా”

“మమ్మీ నాతో జోకులొద్దు .. నాకు ఇంతకన్నా మంచి జాబు రావాలి. మంచి జీతం అందుకోవాలి.. కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని నా సంసారానికి కావాల్సినవన్నీ నేనే కొనేసుకుని అప్పడు పెళ్లి చేసుకుంటాను.”

“సరే... రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకుని చేసుకో..”

“అలాగే” నవ్వింది స్మరణ... “ఇవాళ నాకు మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నన్ను విష్ చేసి పంపించు.. పెళ్లి వంకపెట్టి తిట్టకు..”, సోఫా దగ్గరకు నడిచి ల్యాప్ టాప్ తీసి బ్యాక్ పాక్ లో  సర్దుకుని అది వీపుకి తగిలించుకుని ఇద్దరికీ బై  చెప్పి వెళ్లి పోతున్న స్మరణ వైపు చేష్టలుడిగి చూస్తున్న సంధ్య దగ్గరకు నడిచి ఆమె భుజం మీద చేయి వేసాడు దీపక్.

****సశేషం****

Posted in May 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!