Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

లోకములోన దుర్జనుల | లోఁతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుఁడు జేరినం గవయ | జూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁగన్న చోట గుమి | గూడి యసహ్యపుగూత లార్చుచుం
గాకులు తన్నవే తఱిమి  | కాయము తల్లడమంద భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! లోకము నందు చెడ్డవారి మనసులోని అభిప్రాయము తెలిసికొనకుండా మంచివాడు వారి దగ్గరకు చేరరాదు. అట్లు చేరిన ఎడల మీద బడి కొట్టుటకు ప్రయత్నింతురు. కోకిలను చూచిన కాకులు గుంపుగాఁజేరి వినరాని అరుపులు అరుచుచు ఆ కోకిల దేహము తల్లడిల్లునట్లుగా చుట్టుముట్టి గుంపుగా గూడి తన్నును.

వలవదు క్రూరసంగతి య | వశ్యమొకప్పుడు సేయఁపడ్డచోఁ
గొలఁదియెకాని యెక్కువలు | గూడవు, తమ్ముల పాకులోపలం
గలిసిన నున్నమించుకయ | కాక మఱించుక ఎక్కువైనచో
నలుగడఁ జుఱ్ఱుజుఱ్ఱుమని  | నాలుక పొక్కకయున్నె భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! తమలపాకులో సున్నము కొంచెము రాచు కొనినచో నాలుకంతయును ఎర్రగా యుండును. సున్నమెక్కువైనచో, చుఱ్ఱుచుఱ్ఱుమని నాలుక పొక్కును. అట్లే చెడ్డ వారితో స్నేహము చేయరాదు. ఒకవేళ తటస్థించి ననూ పరిమితముగా చేయాలి. పరిమితము మించినచో అపాయము కల్గునని భావము.

సిరిగలవాని కెయ్యడల | జేసిన మేలది నిష్ఫలంబగున్
నెఱిగుఱిగాదు పేదలకు | నేర్పునఁజేసిన సత్పలంబగున్
వఱపున వచ్చి మేఘుఁడొక | వర్షము వాడిన చేలమీఁదటం
గురిసినఁగాక యంబుధులఁ | గుర్వఁగనేమి ఫలంపు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మేఘుడు యెండిపోవుచున్న పైరులు గల పంట పొలముల మీద వర్షించినచో మంచి ఫలితము కలుగును గాని సముద్రములో కురిసినచో లాభమేమియునూ ఉండదు గదా! అట్లే బీదవారికి సరిగా ఉపకారము చేయుట మంచిది గాని, ధనవంతులకు మేలు చేయుట చేత ఫలితము ఏమాత్రమును ఉండదు.

సకలజన ప్రియత్వము ని | జంబుగ గల్గిన పుణ్యశాలి కొ
క్కొక యెడ నాపదైనఁదడ | వుండదు వేగమె పాసిపోవుగా,
యకలుషమూర్తియైన యమృ | తాంశుడు రాహువు తన్నుమ్రింగినన్
డకటకమాని యుండడె? దృ | ఢస్థితి నెప్పటియట్ల భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! సకల జనుల యొక్క ఆదరమునకు పాత్రుడైన పుణ్యాత్మునికి ఒకప్పుడు కీడు కలిగినను, ఆ కీడు చాలా కాలము ఉండకుండా త్వరలోనే తొలగిపోగలదు. అది ఎట్లనగా నిర్మలమైన కాంతి కలిగిన చంద్రుడు రాహు గ్రహము తనను మ్రింగినను, ఆందోళన పడక, తొందరపాటును వదలి తట్టుకొని ఎప్పటి మాదిరిగానే ఉండును.

సరసగుణ ప్రపూర్ణునకు | సన్నపు దుర్గుణ మొక్కవేళయం
దొరసిన నిట్లు నీకుఁదగు | నోయని చెప్పిన మాననేర్చుదా
బురద యొకించుకంత తము | బొందిన వేళలఁజిల్లవిత్తుపై
నొరసిన నిర్ములత్వమున | నుండవె నీరములెల్ల భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! స్వభావము చేత నిర్మలమైన నీరు ఒకప్పుడు బురదగలదై యుండిననూ దానిలో చిల్లగింజ గంధమును వేసినచో స్వచ్ఛమైన నీరగును. అట్లే మంచి గుణములు గల యోగ్యునకు ఎప్పుడైననూ ఒక దుర్గుణము అబ్బినను, ఇది నీకు తగునా అని అధిక్షేపించిన మాత్రముననే అతడు ఆ చెడు గుణమును వదలివేయును.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in December 2018, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *