Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

అందని పూలు దేవునికర్పణం

అనకాపల్లిలో అనంతయ్య అనే ఒక వడ్డీవ్యాపారి ఉండేవాడు. అతడు చాలా కఠినుడు. అప్పు తీసుకున్నవారి రక్తం పిండైనా సొమ్ము వసూలు చేసుకునేవాడు. పేదలు వ్యవసాయం కోసమో, అనారోగ్యమో, బిడ్డల పెళ్ళిళ్ళో లాంటి అవసరాలు పడి అనంతయ్య దగ్గర అప్పుచేసేవారు. అసలుమాట అటుంచి వడ్డీనే తీర్చలేక ఇళ్ళు, వాకిళ్ళూ పొలాలూ పోగొట్టుకుని కూలివారిగా మారిపోయేవారు. అనంతయ్యకు మాత్రం ఊరివారి సొమ్మంతా కూడి రోజు రోజుకూ ధనికుడై పోయాడు. అతడికి ఒకే ఒక్క కొడుకు. పేరు రఘురాం. ఊర్లో చదువయ్యాక హైస్కూలుకు రాగానే వాడిని నగరంలోని హాస్టల్ లో ఉంచి చదివించ సాగాడు.

రఘురాం క్లాసులో ఉండే చాలా తెలివైన వినయ్ రోజూ పల్లె నుంచి నగరానికి పాత డొక్కు సైకిల్లో వచ్చేవాడు. మధ్యాహ్నం భోజనం కూడా ఇంటినుంచి తెచ్చుకున్న మజ్జిగన్నమో ఏదో తిని కాలం గడిపేవాడు. వాని తండ్రి పొలం అనంతయ్య అప్పు క్రింద కట్టేసుకోగా, అతడు కూలి పనిచేస్తూ కడుపు కట్టుకుని కొడుకును చదివించ సాగాడు.

ఐతే వినయ్ చదువులో అందరికంటే ఫస్టు లో ఉండేవాడు. అతడి శ్రమ ఫలించి మెరిట్ లో డాక్టర్ కోర్సులో సీటు కూడా వచ్చింది. రఘురాం కూడా డబ్బుకట్టి చేరాడు. అతడిని గమనిస్తున్న రఘురాం ఒక రోజున వినయ్ ని అడిగి విషయమంతా తెల్సుకున్నాడు. ఎలాగైనా తన తండ్రికి బుధ్ధి చెప్పి అందరి ఆస్తులు తిరిగి ఇప్పించేయాలని నిర్ణయించుకున్నాడు.

స్కాలర్ షిప్ లతో చదువు కొనసాగించి వినయ్ ఫస్ట్ క్లాసు లో పాసై ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించాడు. రఘురాం తన స్నేహితులతో ఆలోచించి, తమ ఊరివారి కష్టాలు తీర్చాలనీ ఒక పధకం వేశాడు.  తాను ముందుగా ఊరికి వచ్చి, తండ్రితో ఇన్ కం టాక్స్ వారు వస్తున్నారనీ, తమ ఆస్తుల వివరాలన్నీ చూపించాలని  చెప్పాడు. ఎలా సంపాదించిందీ ఆధారాలు చూపి చెప్పకపోతే, జైలు పాలవుతామనీ చెప్పాడు.

దాంతో భయపడ్డ  అనంతయ్య "ఒరే ఇంత బతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లు' జైలుకి ఎలా పోతాం కానీ ఏదో ఒక ఉపాయం ఆలోచించు. అసలే నాకూ చక్కెరవ్యాధి, రక్తపోటూ, ఉబ్బసమూనూ. ఈ భయంతో  గుండెపోటు కూడా వచ్చేటట్టుంది. నీకోసమే ఇంతకాలం కాచుక్కూచున్నా. ఇహ మన ఆస్తులు కాపాడే పని నీదే. మన సంపద కాపాడి పరువు నిల్పు నాయనా!" అన్నాడు.

"నాన్నా! ఆ అధికారులతో మాట్లాట్టం తప్ప నాకు అసత్యాలు చెప్పను రాదు. నీవే మనం ఇంత ఆస్తి ఎలా సంపాదించిందీ ఆధారాలు ఉంటే ఇవ్వు. చూపి మాట్లాడుతాను.  ఆస్తి వివరాలు, మన బంగారం, పొలాలూ అన్నింటి వివరాలూ చూపాలి" అన్నాడు.

"ఒరే ఇదంతా ఊరివాళ్ళకు అప్పులిచ్చి సంపాదించినదిరా. వడ్డీ, అసలూ కట్టలేని వారి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నాను. ఆధారాలేముంటాయిరా!"అన్నాడు అనంతయ్య.

"ఎంతన్యాయం నాన్నా! సాయం చేయడం పోయి అన్యాయం గా సంపాదించావా? ఈ అన్యాయపు తిండి తిన్నానా ఇంత కాలం? ఇహ నేనిక్కడ ఉండను. వెళ్ళిపోతాను. నీవే ఉంచుకో. నాకీ ఆస్తి అక్కరలేదు. అసత్యాలు చెప్పను" అంటూ వెళ్ళబోయాడు.

ఇంతలో పోలీసుల వేషంలో రఘురాం ఏర్పాటు చేసిన అతడి స్నేహితులు నలుగురు వచ్చారు. వారిని చూసి భయపడ్డ అనంతయ్య, కొడుకుతో 'ఈ ఆపదనుంచి కాపాడరా! ఎవరి ఆస్తులు వారికిచ్చేస్తాను. ఈ పోలీసులను పంపించేయి.' అని బ్రతిమాలాడు.

రఘురాం వారితో ఇంగ్లీషులోమాట్లాడి ఊరివారినంతా పిలిపించి ఎవరి ఆస్తులు వారికి ఇచ్చేశాడు. అంతేకాక ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించాడు. దాన్లో తనతో పాటుగా వినయ్ ను వైద్యునిగా నియమించాడు.

అనంతయ్య "పోనీలేరా ఊరు బాగుచేయించావు. నా ఆస్తంతా ఊరికి ఆస్పత్రి కట్టించను ఇచ్చాను."  అనగా కొడుకు “ఔనులే నాన్నా! ‘అందని పూలు దేవునికే అర్పణం' అన్నట్లు అన్యాయార్జితం పోలీసులను చూసి భయపపడి ఇచ్చి దేవునికి అర్పితం అంటావా! ఇప్పటికైనా మారినందుకు సంతోషం.” అన్నాడు .

ఊరంతా అనంతయ్యనూ రఘురాం నూ పొగిడింది. ఆ పొగడ్తలు విన్న అనంతయ్య మంచి చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో గ్రహించాడు.

Posted in July 2019, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *