Menu Close
Kadambam Page Title
అద్వైత భావనాస్రవంతి
సన్యాసి (గోపాల్ నేమాని)
కాల హరణమాయె వ్యర్ధ చింతల తోడ 
        కాలుడొచ్చి వాకిట కాపు గాచె 
చాలు నాకీ సుఖదుఃఖానుభూతి 
          వ్రాలు నింక నా శరీరమ్ము నేల పైన 
ఏలనింక ధనధాన్య సంపత్తి 
       వ్రేలు పట్టుకొన నొక నూత లేక?
మలత్రయ* సంక్షాళనము కాక 
         ఏలనీ వేద మంత్రోచ్చారణములు?

ప్రవృత్తిలో సుఖము లేదని తెలిసి కూడ 
పరుగులెత్తిన జీవికి కలుగునే సుఖము?
నివృత్తి మార్గమే నిశ్శ్రేయసమటంచు 
నిర్వికారుడవై నిలుపు నీ చూపు. 

"సర్వము తానె యయిన వాని**" నే తలచకుండ 
గుళ్ళు, గోపుర,  తీర్ధాల వెదకుచుంటి 
కస్తూరి తన నాభిలోనె యుండి కూడ 
పొదలు, పొదలు మూర్కొని పరుగిడు లేడి పగిది. ***

వింత, వింతల వ్యాధులెన్నియో జూచినాను 
వింత వింతలగా చచ్చు జనుల గూడ 
ఇంత వింతల మాహేంద్రజాలికుడిని 
ఎంత చిత్రమో కనలేను వెదకి చూడ.

నేను గడియించిన ఆస్తి పాస్తులెల్ల 
         నీవెగాని స్వామి! నావి గాదు 
నేను పొందిన స్తుతి నిందలన్ని గూడ 
       నీకె చెందు గాని నాకు గాదు.
నే జేసిన మనోవాక్కాయ కర్మలన్ని 
     నావి గాదు నీ విధినిహితములె 
నే జూచునట్టి జగన్నాటకమునకంత 
    నిలిచి నడిపించు సూత్రధారివి నీవె 

నా శరీర దేవళమునందె వసియించి
ప్రత్యగాత్మ జ్యోతివై భాసించినావు 
దీప నిర్వాణ సమయామాసన్నమాయె! ****
గుడిని మూసి తాళములు విసరివేతు. 

* మలత్రయం = అవిద్య, కామ, కర్మలు (అద్వైత, విశిష్టాద్వైత పరిభాష )
** పోతన భాగవతం 
*** కబీర్ దాస్ 
**** టాగోర్
Posted in September 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!