Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
అద్దం అబద్ధం ఆడుతుందా?

సుమతి స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. చిన్నతనం నుంచీ వాళ్ళ బామ్మతో కలసి తిరగటాన మొక్కలన్నా, పూలన్నా, కూరగాయల పాదులన్నా సుమతికి చాలా ఇష్టం. కాస్త పెద్దయ్యాక బామ్మ సలహాప్రకారం ఇటు ఇంట్లోనూ, అటు పాఠశాలలోనూ మొక్కలు నాటసాగింది. రోజూ కొంతసేపు వాటి మధ్య గడపడం సుమతికి చాలా ఇష్టం.

ఒకమారు బామ్మతో కలసి మొక్కలు పెంచి అమ్మే నర్సరీకి వెళ్ళింది. అక్కడ అరచేయంత పెద్ద ఎర్రగులాబీలు చూసి చాలా ముచ్చటపడింది. అది గమనించిన బామ్మ వెంటనే రెండు గులాబీ మొక్కలు ధరచేసి కొని ఒకటి ఇంటిముందు ఒక తొట్లో వేయించింది. మరొకటి స్కూల్ కు తీసుకెళ్ళి సుమతి తన తరగతి గదికి సమీపాన తాను కూర్చుంటే  కనిపించేలా కిటికీ పక్కనే నాటింది. ఇంట్లో పెట్టినట్లే సొర విత్తనాలు కూడా నాటింది. రోజూ ఖాళీ ఉన్నప్పుడల్లా వాటిని చూసుకుంటూ, వాటితో కబుర్లు చెప్పుకుంటూ, ఇంట్లో మొక్కలకు ఎరువు వేసినట్లే స్కూల్లో మొక్కలకూ వేస్తూ పసిపిల్లల్లా పోషించ సాగింది. సుమతి ఆసక్తిని గమనించిన తరగతి టీచర్ త్రిలోచన, హెడ్ మాస్టర్ హేమలత కూడా సుమతిని అభినందించారు. సొరమొక్కలూ, గులాబీ పోటాపోటీగా పెరగసాగాయి.

ఇంట్లోమొక్కలనూ, పాఠశాలలో మొక్కలనూ సుమతి అమితప్రేమగా చూసుకునేది. ఆరోజు సైన్స్  క్లాసులో మొక్కల్లో ప్రాణముందని, మానవుల్లాగే అవీ కష్ట సుఖాలకు చలిస్తాయని తన పరిశోధనల ద్వారా లోకానికి చాటి చెప్పిన జగదీశ చంద్రబోసు పాఠం విన్నాక సుమతికి మొక్కలమీద ఇంకా మమకారం పెరిగింది.

రోజూ వాటి దగ్గర కూర్చుని "మీరెంతో మంచివారు. మీ పూలు చాలా అందంగా, పెద్దవిగా సువాసనతో పూస్తాయి. మీరంటే నాకు చాలా ఇష్టం" అని మాట్లాడుతూ వాటిని సున్నితంగా తాకుతూ ఉండేది. సుమతి తరగతి పిల్లలు ఆమెను హేళన చేసినా పట్టించుకునేదే కాదు. క్రమేపీ ఇంట్లోనూ, స్కూల్లోనూ గులబీలు మొగ్గలేసి ఎదగసాగాయి.

సొరమొక్కలూ తెల్లని పిందె పూలేసి కళాకళాలాడసాగాయి. సుమతికి మహదానందంగా ఉంది. ఇంట్లోనూ, స్కూల్లోనూ మొక్కలను చూసుకుంటూ మురిసిపోసాగింది.

ఒక ఉదయాన, సుమతి ముందుగా లేచి ఇంట్లో అరచేయంత పెద్దగా పూసిన నాలుగు ఎర్రగులాబీలను చూసి తెగమురిసి పోయింది. అలాగే జానెడు పొడుగెదిగిన సొరకాయలనూ చూసి  స్కూల్లోనూ పూలు పూసి ఉంటాయని రోజూకంటే ముందే స్కూల్ కు బయల్దేరింది. గబగబా వెళ్ళి చూసేసరికి అక్కడా అరచేయంత నాలుగు ఎర్రగులాబీలు కమ్మని వాసనతో నవ్వుతూ పలకరించినట్లై ఆనందంగా మొక్క చుట్టూ తిరుగుతూ ఎగిరి గంతులేసింది.

పక్కనే ఉన్న సొరకాయలూ, ఇంట్లోలాగానే జానెడు పొడుగ్గా ఉండటం గమనించింది. ప్రార్ధన సమయం వరకూ వాటితోనే కబుర్లు చెప్తూ గడిపింది. తన క్లాసు మొదలు కాగానే మొదటి పీరియడ్ తెలుగు ఉపాధ్యాయినికి కిటికీలోంచీ తన ఎర్రగులాబీలను, సొరపిందెలనూ చూపింది.

ఉపాధ్యాయిని సుమతిని మెచ్చుకుని "పిల్లలూ! మీరంతా కూడా సుమతిలా పూలమొక్కలూ, కూరమొక్కలూ ఇంట్లోనూ, స్కూల్లోనూ కూడా పెంచుకోండి. చాలా ఆనందమే కాక ఉత్సాహం కూడా కలుగుతుంది. మన చేతులతో వేసినమొక్క పూలూ, కాయలు కాస్తే ఎంత సంతోషం! వెరీగుడ్ సుమతీ!" అని మెచ్చుకున్నారు ఆమె.

సుమతంటే ఉత్తపుణ్యానికే పడని కుమారి, సుమతిని అంతా అలా మెచ్చుకోవడం సహించలేకపోయింది. సుమతిమీద అసూయ పెంచుకుంది. మరునాడు సుమతి వచ్చేందుకు ముందే వచ్చి, గబగబా ఎవ్వరూ చూడకుండా ఐదు సొర పసి పిందెలనూ, నాలుగు రోజా పూలనూ కోసేసి తన బ్యాగులో పోలీధీన్ కవర్లో ఉంచేసుకుని, ఏమీ ఎరగనట్లు చదువుతున్నట్లు నటిస్తూ కూర్చుంది. ఐతే రోజామొక్క కున్న ముళ్ళు కుమారి చేతులకు తగిలి రక్తం కారసాగింది. తన చేతిరుమాలు తడుపుకుని చుట్టుకుంది.

సుమతి గబగబా వచ్చి చూస్తే ఒక్కపూవూలేదు. ఒక్కపిందాలేదు. దుఃఖంతో సుమతి చాలా బాధపడుతూ "కుమారీ! ఎవరైనా రోజాపూలనూ, సొరపిందెలనూ కోయడం చూశావా!  వారంపాటు చూపరులకు ఆనందం కలిగించే పూలూ, బాగా బారెడంత పెరిగి అందరికీ ఇవ్వాలనుకున్న సొరపిందెలనూ కోయడం ఎంత దుర్మార్గం?" అంటూ వాటి ముందు కూర్చుని దుఃఖపడసాగింది.

ఇంతలో ఉపాధ్యాయులు వచ్చి బాధపడుతున్న సుమతిని అడిగి విషయం తెల్సుకుని పరీక్షగా అందరినీ గమనించారు. కుమారి చేతికి రక్తం కారడం, ఆమె చేతినుంచీ కసుగాయల వాసన రావడం గమనించి సంచీలో వెతగ్గా పూలూ, కసుగాయలూ కూడా కనిపించాయి.

"కుమారీ కాయలుకోశావా?"

"లేదు నేను కాదు. కోయలేదు" కంగారుగా అంది కుమారి.

"బుకాయించకు. చూడూ! అద్దం అబధ్ధమాడుతుందా అని నీ చేతులే చెప్తున్నాయి. కుమారీ! ఉత్తిపుణ్యానికి వీటిని కోశావు. అన్నీ పెరిగాక సొరకాయలను అందరికీ ఇవ్వాలనుకున్నది సుమతి. అంతేకాక చెట్టుకు ఉంటే పూలు వారం పైన ఉంటాయి. ఎందుకుకోసినట్లు?" అని నిలదీశారు.

కుమారి ఏడుస్తూ "అంతా సుమతిని పొగుడుతుంటే భరించలేకపోయాను. దాన్ని ఎలాగైనా ఏడిపించాలని కోశానంతే" అని చెప్పింది.

ఉపాధ్యాయులు "మనిషి మీద ఉండే అసూయను కసుగాయలు కోసి తీర్చుకున్నావా!

కోయకుమీ కసుగాయలు
దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మీ!
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ!

- అనే నీతిపద్యం నిన్నేగా చెప్పాను. ఐనా నీ బుర్రకెక్కలేదన్నమాట. నీవూ సుమతిలా చాలా పూలమొక్కలూ, కూరపాదులూ పెట్టి, పెంచి ఆమెలాగా అందరిచేతా మెప్పులు పొందాలి కానీ ఇలా చేయడం తప్పు కదూ!"అని కోప్పడ్డాక, తన తప్పు తెల్సుకున్నది కుమారి.

"సారీ సుమతీ! మరెన్నడూ ఇలా చేయను. మన్నించు," అంది. సుమతి కూడా కుమారి మారినందుకు సంతోషించింది.

"సాయంకాలం నాతో మా ఇంటికిరా నీకు చాలా పూల, కూరల విత్తనాలు మా బామ్మ నడిగి ఇస్తాను. సరా!" అంటూ చేతులు కలిపింది సుమతి.

Posted in May 2021, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!